కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కమ్యూనికేషన్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్ కార్యాలయం అభివృద్ధి చేసిన ‘సంపన్ పెన్షన్ పోర్టల్’


డిజిలాకర్‌తో అనుసంధానం.. పెన్షనర్ల ఈ-పీపీఓలు, గ్రాట్యుటీ మంజూరు ఉత్తర్వులు, ఇతర ముఖ్యమైన పత్రాలను డిజిలాకర్ ఖాతాల ద్వారా ఎప్పుడైనా పొందే వెసులుబాటు

డిజిటల్ ఇండియాకు ఊతం: పెన్షనర్లందరికీ సురక్షితమైన, కాగిత రహిత పెన్షన్ పత్రాలకు సంపన్-డిజిలాకర్ అనుసంధానం

प्रविष्टि तिथि: 21 JAN 2026 11:02AM by PIB Hyderabad

భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ‘సంపన్ పెన్షన్ పోర్టల్‌’ను డిజిలాకర్ వేదికతో అనుసంధానించినట్లు టెలికాం పెన్షనర్లకు ఢిల్లీలోని ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ (పీఆర్ సీసీఏ) కార్యాలయం తెలిపింది.

ఈ అనుసంధానం ద్వారా పెన్షనర్ల సంపన్ ఖాతాలోని పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు (ఈ పీపీఓలు), గ్రాట్యూటీ మంజూరు ఉత్తర్వులు, కమ్యూనికేషన్ పత్రాలు, ఫారం-16 వంటి పత్రాలను డిజిలాకర్‌తో సులభంగా పొందవచ్చు. ఈ సౌకర్యంతో స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా పత్రాలను పొందే వీలు కలుగుతుంది. సురక్షితమైన, కాగిత రహిత సేవలను అందిస్తుంది. బ్యాంకింగ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి కీలక సేవల్లో పారదర్శకతను పెంచటమే కాక, పెన్షనర్లకు సౌకర్యాన్ని, వెసులుబాటును కలిగిస్తుంది.

 

ఢిల్లీ ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ శ్రీ ఆశిష్ జోషి మాట్లాడుతూ.. ఈ నూతన విధానం వల్ల భౌతికంగా పత్రాల వినియోగం తగ్గుతుందని, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఇతర ప్రాంతాల పెన్షనర్లకు సమయం, వనరులు ఆదా అవుతాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పెన్షనర్లకు డిజిటల్ సాధికారత కలగటమే కాక, ప్రభుత్వ లక్ష్యమైన కాగితరహిత డిజిటల్ గవర్నెన్స్ విజన్‌కు అనుగుణంగా ఉంటుంది.

పెన్షనర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు https://digilocker.gov.in  వెబ్‌సైట్లో ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అయి, పీపీఓ నంబర్ ను డిజిలాకర్‌తో అనుసంధానం చేసిన తర్వాత కావాల్సిన పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సహాయం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు, సంపన్ పోర్టల్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. పోర్టల్‌కు సంబంధించిన ఎఫ్ఏక్యులను ఈ ఆర్టికల్ చివర్లో పొందుపరిచారు.

సంపన్ గురించి

సంపన్ ( సిస్టమ్ ఫర్ అకౌంటింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పెన్షన్) అనేది కమ్యూనికేషన్ల విభాగానికి చెందిన ప్రతిష్ఠాత్మక డిజిటల్ వేదిక. పెన్షన్ పరిపాలన, అనుబంధ ఆర్థిక నిర్వహణకు కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ దీన్ని రూపొందించి, నిర్వహిస్తుంది. 29 డిసెంబర్ 2018న ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ దీనిని జాతికి అంకితం చేశారు. ఇది వ్యవస్థీకృత పాలన నుంచి పెన్షనర్ల సౌకర్యమే లక్ష్యంగా సాగే పాలన వైపు జరిగిన మార్పును సూచిస్తుంది. దీనివల్ల పదవీ విరమణ పొందిన వ్యక్తులు, వారి కుటుంబసభ్యులకు రావాల్సిన ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

పెన్షన్ ప్రక్రియ మొత్తాన్ని సంపన్ వ్యవస్థ డిజిటలైజ్ చేసింది. పెన్షన్ ప్రక్రియ ప్రారంభం నుంచి సమస్యల ప్రాసెసింగ్, ఈ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ల జారీ, చెల్లింపులు, అకౌంటింగ్, సరిపోల్చుకోవటం, ఆర్థిక నివేదికలు, ఆడిట్ సౌలభ్యం, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలన్నీ ఇప్పడు డిజిటల్ పద్ధతిలో అందుబాటులో ఉన్నాయి. పెన్షనర్లు ఇప్పుడు నేరుగా వారి ఖాతాల్లోకి పెన్షన్ నగదును పొందటం వల్ల బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. పెన్షనర్ల ఇంటి వద్ద నుంచే పేమెంట్ స్టేటస్ ను తనిఖీ చేయటం, లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించటం, ఈ-పీపీఓ పొందటం, మొబైల్ నంబర్, చిరునామా వంటి మార్పులకు అభ్యర్థన, ఫిర్యాదును నమోదు చేయటం వంటివి సులభంగా చేయవచ్చు. వయోవృద్ధులకు మరింత సహాయం అందించేందుకు సంబంధిత శాఖ ఉచిత హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది.

 సంపన్ సేవలను పొందే డిజిలాకర్ గురించి వివరాలు...

 

1. డిజిలాకర్ అంటే ఏమిటి?

డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం రూపొందించిన సురక్షితమైన క్లౌడ్ ప్లాట్‌ఫామ్ డిజిలాకర్. డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, విద్యా ధ్రువీకరణ పత్రాల వంటి వాటిని డిజిటల్ రూపంలో భద్రపరచుకోవటానికి, వినియోగించుకోవటానికి, ఇతరులతో పంచుకోవటానికి ఇది సహాయపడుతుంది. డిజిటల్ వాలెట్ లా పనిచేసే దీనిద్వారా భౌతికంగా పత్రాల అవసరం తగ్గటమే కాక, బ్యాంకింగ్, ఉపాధి, విద్యా సంబంధిత సేవలకు సులభంగా ధ్రువీకరించుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

2. డిజిలాకర్ ను ఎలా యాక్సెస్ చేయవచ్చు?

a. వెబ్ పోర్టల్ ద్వారా

1. అధికారిక పోర్టల్:  https://digilocker.gov.in/

2. పైన ఉన్న లాగిన్ లేదా రిజిస్టర్ ను క్లిక్ చేయండి.

b. మొబైల్ యాప్ ద్వారా

1. గూగుల్ ప్లే స్టోర్ (ఆండ్రాయిడ్) లేదా ఆపిల్ స్టోర్ (ఐఓఎస్) నుంచి డిజిలాకర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

2. యాప్ ఓపెన్ చేసి, భాషను ఎంచుకోవాలి.

3. అవసరమైన అనుమతులను ఇవ్వాలి (వినియోగదారులకు మెరుగైన అనుభవం కోసం).

3. ఎలా లాగిన్, రిజిస్టర్ చేసుకోవాలి?

రిజిస్టర్

1. యాప్ లేదా పోర్టల్ ఓపెన్ చేసి, రిజిస్టర్ ను ఎంచుకోవాలి.

2. మొబైల్ లేదా ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి.

3. మీకు ఓటీపీ (వన్ టైమ్ పాస్ వర్డ్) వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి నంబర్ ను ధ్రువీకరించుకోవాలి.

సెట్ ఎంపిన్

1. ఓటీపీని ధ్రువీకరించుకున్నాక, మీరు ఎంపిన్ ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ లాగిన్ ను సురక్షితంగా ఉంచుతుంది.

2. భవిష్యత్తులో లాగిన్ కోసం ఎంపిన్ ను సేవ్ చేసుకోవాలి.

లాగిన్

మీరు వీటి ద్వారా లాగిన్ కావచ్చు:

·   ఎంపిన్

·   ఓటీపీ

4. డిజిలాకర్ లో సేవలను ఎలా వెతకాలి?

సేవలను కనుగొని, ఉపయోగించుకోవటం

1. మీరు లాగిన్ అయ్యాక, డిజిలాకర్ డాష్ బోర్డు కనిపిస్తుంది.

2. సెర్చ్ డాక్యుమెంట్స్ ఆప్షన్ ద్వారా వినియోగదారులు సేవలను కనుగొనవచ్చు.

3. డిజిలాకర్ పోర్టల్ లో సంపన్ సేవలను శోధించేందుకు.. సంపన్, కంట్రోలర్, కమ్యూనికేషన్, డీఓటీ, పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి పదాలను ఉపయోగించవచ్చు.

5. ఉమాంగ్ లో సంపన్ సేవలను ఎలా ఉపయోగించాలి?

ప్రస్తుతం సంపన్ కు సంబంధించి ఈ నాలుగు రకాల సేవల పత్రాలు డిజిలాకర్ లో అందుబాటులో ఉన్నాయి:

a) ఈ-పీపీఓ

b) గ్రాట్యూటీ పేమెంట్ ఆర్డర్

c) కమ్యూటేషన్ పేమెంట్ ఆర్డర్

d) ఫారం-16

సంపన్ వినియోగాదరులు కావాల్సిన సేవా విభాగాన్ని ఎంచుకుని, పీపీఓ నంబర్ ను నమోదు చేసి, గెట్ డాక్యుమెంట్ పై క్లిక్ చేయాలి. వినియోగదారుడు అడిగిన వివరాలకు అనుగుణంగా పెన్షన్ సర్టిఫికెట్, గ్రాట్యూటీ చెల్లింపు ఉత్తర్వు, కమ్యూటేషన్ చెల్లింపు ఉత్తర్వు లేదా ఫారం-16 ను పొందవచ్చు.

 

***


(रिलीज़ आईडी: 2216957) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Kannada