రాజ్యసభ సచివాలయం
లక్నోలో జరిగిన 86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో (ఏఐపీవోసీ)లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ శ్రీ హరివంశ్ ప్రసంగం: ఏఐను సమర్థంగా వినియోగించుకోవడానికి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల మధ్య సమన్వయానికి పిలుపు
కచ్చితమైన ఏఐ వ్యవస్థల కోసం సంస్థాగత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్రాలను కోరిన శ్రీ హరివంశ్
చట్టాలు, పద్దులపై జరిగిన చర్చలతో సహా అధికారిక విధాన పత్రాలకు చట్టసభలే సంరక్షకులు: శ్రీ హరివంశ్
‘‘పార్లమెంటుకు తగిన విధంగా ఏఐను మార్చేది అల్గారిథం కాదు.. దానికి శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించిన విజ్ఞానం’’
प्रविष्टि तिथि:
20 JAN 2026 4:39PM by PIB Hyderabad
మంగళవారం లక్నోలో జరిగిన 86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సు (ఏఐపీవోసీ) లో జరిగిన ప్లీనరీ సమావేశంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రసంగించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రిసైడింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శాసన వ్యవస్థలను మరింత సమర్థంగా తయారుచేయడంలో ఏఐ పాత్ర గురించి వివరించారు. అలాగే సాంకేతికతను కచ్చితత్వంతో కూడినదిగా, విశ్వసనీయంగా మార్చడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యల గురించి కూడా తెలియజేశారు. పార్లమెంటులో ఏఐను ప్రయోగాత్మకంగా అమలు చేసిన సందర్భాలు, మార్గాలను తెలియజేశారు. అలాగే ఈ అంశంలో రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు మధ్య మరింత సమన్వయం ఉండాలని పిలుపునిచ్చారు. ఇది పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు రెండూ సంస్థాగత పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించుకొనేలా వీలు కల్పిస్తుంది.
విధానాలకు సంబంధించిన సమాచార సమన్వయానికి, దానిని పొందడానికి అవసరమైన దార్శనికతను వివరిస్తూ.. ‘‘అన్ని అధికారిక పత్రాలు, చట్టాలు, పద్దులతో సహా వివిధ అంశాలపై జరిగిన చర్చలకు చట్టసభలే సంరక్షకులు. వాటిని ప్రవేశపెట్టినప్పుడే ఆ పత్రాలు సభలో భాగంగా మారతాయి. సాధారణంగా ఈ సమాచారం వివిధ మంత్రిత్వ శాఖల వద్ద ఉంటుంది. వీటిని అందరికీ సులభంగా అందుబాటులో ఉంచే వేదికను రూపొందించడానికి ఏఐను పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు వినియోగించుకోవాలి. ఇది సంస్థను విజ్ఞాన కేంద్రంగా మారుస్తుంది. శాసన సభ చర్చల్లో ఉపయోగించే భాష, పదజాలం కోసం ‘డేటా లేక్’ రూపొందించాలి. భారతీయ పరిస్థితులకు తగినట్టుగా సాంకేతికతకు శిక్షణ ఇవ్వడానికి దేశవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంట్లను ఉపయోగించుకోవాలి’’ అని అన్నారు.
ఏఐ అందిస్తున్న శిక్షణ, అది ఇస్తున్న ఫలితాలను మానవులే పర్యవేక్షించే హైబ్రిడ్ వ్యవస్థకు హరివంశ్ పిలుపునిచ్చారు. ‘‘పార్లమెంటుకు తగిన విధంగా ఏఐను ఉపయోగించుకోవడానికి కారణం దాని అల్గారిథంకున్న సామర్థ్యం కాదు. విజ్ఞానం ద్వారా ఆ సాంకేతికత పొందిన శిక్షణే. జాగ్రత్తగా ఎంపిక చేసిన పార్లమెంట్ సమాచారంతో.. పార్లమెంటరీ ఏఐకు పార్లమెంటులోనే శిక్షణ ఇవ్వాలి. నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. వాటిని ఇతరులకు అందించవచ్చు. అవుట్ సోర్స్ చేయవచ్చు. కానీ జ్ఞానం సందర్భానికి తగినట్టుగా ఉంటుంది. సంస్థలో ఇమిడి ఉంటుంది. పార్లమెంట్ విజ్ఞానం ప్రత్యేకమైనది. చర్చలు, తీర్పులు, సదస్సులు, రాజ్యాంగ పద్ధతుల ద్వారా దశాబ్దాలుగా అది నిర్మితమైంది’’ అని ఆయన తెలిపారు.
ఏఐ-ఆధారిత ట్రాన్స్క్రిప్షన్, ఒకే సమయంలో వివిధ భాషల్లో అనువాద సేవలను పార్లమెంట్ ఎలా పరీక్షించిందో తన ప్రసంగంలో ఆయన వివరించారు. ప్రస్తుతం.. తమకు నచ్చిన భాషలో సభకు సంబంధించిన, ఇతర పరిపాలనాపరమైన డాక్యుమెంట్లను పార్లమెంటు సభ్యులు పొందవచ్చు. దీనిని ఏఐ సాయంతో అందిస్తున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో అడిగే ప్రశ్నల స్వీకార యోగ్యతను పరిశీలించడం, పూర్వోత్తరాలను, తీర్పులను ఏఐ ద్వారా శోధించవచ్చు. అలాగే సిబ్బంది, చట్ట సభల సభ్యులు తమ పాత్రలను సమర్థంగా పోషించడానికి అవగాహన, మార్గనిర్దేశక కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.
డిజిటల్ టూల్స్‌ను ఉపయోగించడంతో పాటుగా.. జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం, శాసనసభ్యుల సామర్థ్యాలను బలోపేతం చేయడం గురించి కూడా వివరించారు. జనవరి 19న గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
***
(रिलीज़ आईडी: 2216739)
आगंतुक पटल : 57