మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై వివిధ దేశాల రాయబారులు, హై కమిషనర్లతో 21 జనవరి 2026న మత్స్య శాఖ రౌండ్ టేబుల్ సమావేశం


ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయటం, అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానతపై చర్చ

प्रविष्टि तिथि: 20 JAN 2026 11:16AM by PIB Hyderabad

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు సీఫుడ్ ఎగుమతుల ప్రోత్సాహంపై రాయబారులు, హై కమిషనర్లతో న్యూఢిల్లీలో 21 జనవరి 2026న రౌండ్ టేబుల్ సమావేశాన్ని కేంద్ర మత్స్య విభాగం, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ (ఎంఓఎఫ్ఏహెచ్‌డీ), పంచాయతీ రాజ్ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ఎంఓఎఫ్ఏహెచ్‌డీ, మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ జార్జ్ కురియన్, ఎంఓఎఫ్ఏహెచ్‌డీ, పంచాయతీ రాజ్ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్ గౌరవ అతిథులుగా పాల్గొంటారు.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారుగా, చేపలు, ఇతర జలాహార ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. కొన్నేళ్లుగా ఈ రంగం జీవనాధార కార్యకలాపాల స్థాయి నుంచి సాగు, దాణా, ప్రాసెసింగ్, కోల్డ్ చైన్స్, లాజిస్టిక్స్, విలువ ఆధారిత ఉత్పత్తుల వంటి విభాగాలతో బలమైన, ఎగుమతి ఆధారిత వాణిజ్య వ్యవస్థగా మారింది. అంతేకాక, లక్షలాది మంది చిన్న, స్వల్ప, సంప్రదాయ మత్స్యకారులు, రైతులకు నిరంతరం అండగా నిలుస్తుంది. నిర్దేశిత పథకాలు, పటిష్ఠమైన విధానాలతో చేపలు, మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 16.98 మెట్రిక్ టన్నులు కాగా, వాటి విలువ సుమారు రూ.62.408 కోట్లు (7.45 బిలియన్ డాలర్లు). భారతదేశ మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో ఈ రంగం వాటా దాదాపు 18%.

ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, ఓషియానియా, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతానికి చెందిన 83 దేశాల రాయబారులు, హై కమిషనర్ల భాగస్వామ్యంతో భారత ప్రభుత్వం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మత్స్య శాఖ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ), ఎగుమతి తనిఖీ మండలి (ఈఐసీ), వాణిజ్య విభాగం, ఫారిన్ ట్రేడ్ డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్‌టీ), ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఓఎఫ్‌పీఐ)ల సీనియర్ అధికారులు.. అంతర్జాతీయ సంస్థలైన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ), ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏఎఫ్ డీ), జర్మన్ కార్పొరేషన్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (జీఐజడ్), బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ (బీఓబీపీ), ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ (ఐఎఫ్ఏడీ) ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సముద్ర ఆహార వాణిజ్యం, మార్కెట్ లభ్యత, నియంత్రణ సహకారం, నూతన అవకాశాలపై చర్చలకు ఈ సదస్సు కీలకమైన దౌత్య, సాంకేతిక వేదిక కానుంది.

సుస్థిర, పారదర్శక, విలువ ఆధారిత సముద్ర ఆహార వాణిజ్యాన్ని ప్రోత్సహించటంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. పెట్టుబడులు, ఉమ్మడి భాగస్వామ్యాలు, సాంకేతిక బదిలీ, సామర్థ్య పెంపుదల వంటి అంశాల్లోని అవకాశాలను గుర్తిస్తాయి. వాతావరణ మార్పులు, మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకుని సముద్ర ఆహార సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేసే మార్గాలపైనా చర్చలు జరుగుతాయి. ప్రపంచ సీఫుడ్ వాణిజ్య పోకడలు, మార్కెట్ వైవిధ్యం; ప్రమాణాలు, దృవీకరణ, నియంత్రణ సహకారం; ట్రేసబిలిటీ, డిజిటల్ రిపోర్టింగ్, నిబంధనల వ్యవస్థ; సుస్థిరత, బాధ్యతాయుతమైన సేకరణ; విలువను జోడించటం, ప్రాసెసింగ్, ఉత్పత్తి ఆవిష్కరణ; కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, ఓడరేవుల అనుసంధానం; బ్లూ వాల్యూచైన్‌లో ఆర్థిక సహాయం, భాగస్వామ్యాలు, ప్రైవేట్ భాగస్వామ్యాల ప్రోత్సాహం; మత్స్య, ఆక్వాకల్చర్ రంగంలో డిజిటల్, సాంకేతిక మార్పులు వంటి ముఖ్యమైన ఇతివృత్తాలపై చర్చలు జరుగుతాయి.

ఈ చర్చలు అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ మార్కెట్ పోకడలను స్పష్టం చేస్తాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికా, యూరప్, తూర్పు ఆసియా దేశాల్లో అధిక నాణ్యత గల సర్టిఫైడ్, స్థిరమైన పద్ధతుల్లో లబించే సముద్ర ఆహారానికి పెరుగుతున్న డిమాండ్‌ను, ఆక్వాకల్చర్ ఆధారిత ప్రోటీన్ల వినియోగం పెరగటాన్ని తెలియజేస్తాయి. వీటితో పాటు రెడీ టు కుక్, రెడీ టు ఈట్, న్యూట్రాస్యూటికల్ గ్రేడ్ గల ప్రీమియం ఉత్పత్తుల విస్తరణపై కూడా చర్చలు జరుగుతాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుదల, విలువ ఆధారిత ప్రాసెసింగ్‌పై దృష్టి సారించటం, సాగు రకాల వైవిధ్యం ద్వారా భారత మార్కెట్ వాటాను పెంచుకోవటానికి ఈ తరహా కార్యక్రమాలు గొప్ప అవకాశాలను కల్పిస్తాయి. ఆక్వాకల్చర్ రంగాల్లో భారత్ బలాలు, మెరుగైన ప్రాసెసింగ్ సామర్థ్యం, పటిష్ఠమైన ఎగుమతిదారుల వ్యవస్థ ద్వారా ఈ లక్ష్యాలను సాధించవచ్చు.

ఆహార భద్రతను బలోపేతం చేయటానికి, మత్స్య పరిశ్రమ విలువ ఆధారిత వ్యవస్థలో జీవనోపాధిని మెరుగుపరచటానికి సుస్థిరత, స్థితిస్థాపకత, సమగ్రాభివృద్ధి వంటి ఉమ్మడి లక్ష్యాలను సాధించటానికి ఈ సమావేశం ఫలితాలు దోహదపడనున్నాయి.

 

***


(रिलीज़ आईडी: 2216445) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil