ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

గాంధేయ ఆదర్శాలైన నిరాడంబరత, సేవాభావం, సామాజిక బాధ్యతలను గురించి న్యూఢిల్లీలో హరిజన్ సేవక్ సంఘ్‌లో ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి


గాంధీ ఆశ్రమంలో మహాదేవ్ దేశాయి గ్రంథాలయంలో విస్తరించిన విభాగాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
వ్యక్తి ఎటువంటి వారనేది ఆ వ్యక్తి పుట్టుక కాదు, శీలం చెబుతుంది: ఉపరాష్ట్రపతి

గ్రంథాలయాలు సమాజంలో మార్పును తీసుకురాగల సాధనాలని గాంధీ ఆశ్రమంలో చాటిచెప్పిన ఉపరాష్ట్రపతి
సమాజానికి హరిజన్ సేవక్ సంఘ్ చేస్తున్న సేవలను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి

प्रविष्टि तिथि: 20 JAN 2026 2:45PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ న్యూఢిల్లీలోని చరిత్రాత్మక గాంధీ ఆశ్రమంలో గల హరిజన్ సేవక్ సంఘ్‌ను ఈ రోజు సందర్శించారు. అక్కడ మహాదేవ్ దేశాయి గ్రంథాలయంలో విస్తరించిన విభాగాన్ని ఆయన ప్రారంభించారు.
ఆశ్రమంలో ఉన్న కస్తూర్బా మ్యూజియాన్ని కూడా ఉపరాష్ట్రపతి సందర్శించారు. మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ 1930, 1940 దశాబ్దాల్లో  ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ ఆశ్రమంలోనే బస చేసే వారు. ఈ సందర్శన తనను ఎంతో భావోద్వేగానికి లోను చేసిందని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆశ్రమాన్ని చుట్టి వచ్చినప్పుడు, కస్తూర్బా గారు ఉన్న మామూలు ఇంటినీ, ఆ ఇంటిలోని వంటగదినీ చూసినప్పుడూ దేశ నేతలు ఎంత సాధారణ జీవనాన్ని గడిపారో తేటతెల్లమైందని ఉపరాష్ట్రపతి అన్నారు. సీదాసాదాతనం, త్యాగం, తిరుగులేని దృఢ సంకల్పం వారి జీవనంలో ఉట్టిపడ్దాయని ఆయన అన్నారు.  
శ్రోతలను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ, మహాదేవ్ దేశాయి గ్రంథాలయంలో విస్తరించిన విభాగాన్ని ప్రారంభించడమంటే అది ఇప్పటికే ఉన్న వసతిని విస్తరించడమొక్కటే కాదన్నారు. ఇది సమాజంలో మార్పును తీసుకురావడంలో జ్ఞ‌ానం, అత్యంత శక్తిమంతమైన, మన్నికైన పాత్రను పోషిస్తుందన్న నమ్మకాన్ని బలపరిచే సూచిక అని ఆయన వివరించారు.
మహాత్మాగాంధీలో వ్యక్తిగత పరివర్తన చోటుచేసుకోవడాన్ని గురించి ఉపరాష్ట్రపతి చెబుతూ, పశ్చిమ దేశాల వస్త్రధారణను విడనాడాలని ఆయన నిర్ణయించుకోవడానికీ, ధోతీని మాత్రమే ధరించాలని మదురై రైల్వే స్టేషన్లో ఆయన సంకల్పించుకోవడానికీ భారతీయ రైతుల పేదరికాన్ని గాంధీజీ అర్థం చేసుకున్న తీరే దారితీసిందన్నారు. సామాన్య ప్రజలతో గాంధీ గారు మమేకం కావడానికీ, వారి అభ్యుదయానికి పాటుపడటానికి ఆయన జీవన పర్యంతం దీక్షాబద్ధుడు కావడానికీ ఈ మార్పు ఒక ప్రతీకగా నిలిచిందని ఉపరాష్ట్రపతి అన్నారు. స్వదేశీ వస్తువుల్నే ఉపయోగించాలని గాంధీజీ సమర్ధించిన సంగతిని కూడా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. భారత్‌లో పండించిన పత్తిని మాంచెస్టర్‌లో దుస్తులుగా మార్చి, ఆ దుస్తుల్ని మళ్లీ భారతీయులకు విక్రయించడాన్ని గాంధీజీ వ్యతిరేకించిన తీరును ఉపరాష్ట్రపతి వివరిస్తూ, దీనికి బదులుగా స్వదేశీ ఉత్పాదనల్నే కొనుగోలు చేయాలని ప్రజలకు ఆయన చెప్పారన్నారు.
హరిజన్ సేవక్ సంఘ్ మహాత్మాగాంధీ నాటిన విత్తనం అని ఉపరాష్ట్రపతి వర్ణించారు. విద్య, చైతన్యం, సేవల ద్వారా అంటరానితనం వంటి సాంఘిక దురాచారాల్ని మన దేశం తోసిరాజనడంలో హరిజన్ సేవక్ సంఘ్ సాయపడి, శాశ్వత ప్రయోజనాన్ని అందించిందన్నారు. ఒక వ్యక్తి మంచివారా, లేక చెడ్డవారా అనేది నిర్ణయించేంది పుట్టుక కాదనీ, ఆ వ్యక్తి నడవడికే దీనిని నిర్వచిస్తుందని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు.
పూర్వ రాష్ట్రపతి శ్రీ కె.ఆర్. నారాయణన్ జీవితాన్ని ఉపరాష్ట్రపతి గుర్తు చేస్తూ, ఆయన చదువుకోడానికి, తన జీవన యాత్రను మలచుకోవడానికి హరిజన్ సేవక్ సంఘ్ కీలక పాత్రను పోషించిందని తెలిపారు. రాబోయే కాలంలో కూడా అలాంటి మరెంతో మంది మార్గదర్శక వ్యక్తులను సంఘ్ పెంచి పోషిస్తూనే ఉంటుందన్న విశ్వాసాన్ని ఉపరాష్ట్రపతి వ్యక్తం చేశారు. తద్వారా  సమాజానికి నిజాయతీతో సేవ చేస్తే సచ్ఛీలత, వివేకం కలిగిన
 వ్యక్తులు మన మధ్యకు వస్తారని కూడా ఆయన అన్నారు.
వ్యక్తికీ, సమాజానికీ మధ్య పరస్పరం ఇచ్చి పుచ్చుకొనే సంబంధం ఉందని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. వ్యక్తులు తమను తీర్చిదిద్దుకోవడంలో సమాజం పోషించే పాత్రను తరచుగా లెక్కచేయరనీ, సమాజానికి తిరిగి తన వంతుగా ఇవ్వవలసిన బాధ్యత ప్రతి వ్యక్తికీ ఉందనీ ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. సమాజానికి సేవ చేయడం నైతిక బాధ్యత, దేశ నిర్మాణానికి తోడ్పడే ఒక మార్గం అని ఆయన ఉద్ఘాటించారు.
దేశానికి గుజరాత్ అందించిన తోడ్పాటును కూడా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. గుజరాత్ దేశానికి ముగ్గురు సమున్నత వ్యక్తుల్ని అందించిందని ఆయన చెబుతూ, వారే.. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించిపెట్టడం కోసం మహాత్మాగాంధీనీ, దేశ సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్‌‌నీ, దేశాభివృద్ధికి శ్రీ నరేంద్ర మోదీనీ గుజరాత్ ఇచ్చిందన్నారు.
గాంధేయవాదులను దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ కుమార్ సాన్యాల్ రాసిన ‘‘ఏజ్ ఆఫ్ ఎంటైటిల్‌మెంట్: మహాత్మా గాంధీస్ విజన్’’ (జ్ఞ‌ానోదయ యుగం: మహాత్మాగాంధీ దృష్టికోణం) గ్రంథాన్ని ఇదే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఆయన మహాత్మాగాంధీకీ, ఠక్కర్ బాపాకీ, వినోబా భావేకీ పుష్పాంజలి కూడా సమర్పించారు.
ఈ కార్యక్రమంలో హరిజన్ సేవక్ సంఘ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ కుమార్ సాన్యాల్, పార్లమెంట్ పూర్వ సభ్యుడు, హరిజన్ సేవక్ సంఘ్ ఉపాధ్యక్షుడు శ్రీ నరేశ్ యాదవ్, కేవీఐసీ పూర్వ చైర్మన్, హరిజన్ సేవక్ సంఘ్ ఉపాధ్యక్షుడు శ్రీ లక్ష్మీ దాస్‌లతో పాటు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. 

 

***


(रिलीज़ आईडी: 2216443) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Malayalam