విద్యుత్తు మంత్రిత్వ శాఖ
విద్యుత్ రంగ నియంత్రణ వ్యవహారాల కోసం ఐఐటీ ఢిల్లీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం
కేంద్రాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి.. ప్రయోజనకరమైన, ముందుచూపుతో కూడిన నియంత్రణ దిశగా ఇది కీలక పాత్ర పోషిస్తుందన్న మంత్రి
प्रविष्टि तिथि:
19 JAN 2026 2:01PM by PIB Hyderabad
విద్యుత్ రంగంలో నియంత్రణ వ్యవహారాల కోసం ఐఐటీ ఢిల్లీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఈ రోజు ప్రారంభించారు.
ఐఐటీ ఢిల్లీ, కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (సీఈఆర్సీ), గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గ్రిడ్ ఇండియా) సంయుక్తంగా నెలకొల్పిన ఈ కేంద్రం.. వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యుత్ రంగంలో దేశ నియంత్రణ సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా ముఖ్యమైన ముందడుగు. దేశంలో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతోంది. అలాగే భారీ స్థాయిలో పునరుత్పాదక ఇంధన ఏకీకరణ, విద్యుత్ మార్కెట్ల విస్తరణ జరుగుతున్నాయి. డిజిటల్ సాంకేతికతల వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కీలకమైన చర్య.
నియంత్రణ పరమైన పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, సలహాలతో చేయూత, అవగాహన కల్పించడం వంటి అంశాల్లో జాతీయ స్థాయి కేంద్రంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను రూపొందించారు. ప్రముఖ విద్యా సంస్థలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, జాతీయ విద్యుత్ నియంత్రణ సంస్థ - సిస్టమ్ ఆపరేటర్ మధ్య సన్నిహిత సహకారంతో అనుసంధానం చేయడం ద్వారా.. విధాన నిర్ణయాలు, నియంత్రణ, వ్యవస్థాగత నిర్వహణ, విద్యా పరిశోధనలన్నింటినీ ఈ కేంద్రం ఒకే వేదికపైకి తెస్తోంది.

సీఈఆర్సీ, గ్రిడ్ ఇండియాతో సన్నిహితంగా కలిసి పనిచేస్తూ.. నియంత్రణ పరమైన సమస్యలను, విద్యుత్ రంగ సవాళ్లను ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గుర్తిస్తుంది. సామర్థ్యాల పెంపుదల, మానవ వనరుల అభివృద్ధికి దోహదపడడం ద్వారా సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. అలాగే సమర్థంగా అవగాహన కల్పించి, ప్రభావవంతంగా దాన్ని వ్యాప్తి చేస్తుంది. ప్రపంచ స్థాయి విద్యా, విధాన రూపకల్పన వ్యవస్థల సహకారంతో ఈ కేంద్రం అత్యాధునిక పరిశోధనలు చేపడుతుంది. అదే సమయంలో నియంత్రణ సంస్థలకు, విద్యుత్ రంగంలోని ఇతర భాగస్వాములకు సలహాలు, సంప్రదింపులతో చేయూతనూ అందిస్తుంది.
ఐఐటీ ఢిల్లీలో ఈ కేంద్రం ప్రారంభం సందర్భంగా శ్రీ మనోహర్ లాల్ ప్రసంగించారు. శుద్ధ ఇంధనం, పోటీ మార్కెట్లు, వినియోగదారు ప్రయోజనమే పరమావధిగా సంస్కరణల దిశగా భారత్ పయనిస్తున్న ఈ తరుణంలో.. విజ్ఞానమూ, పరిశోధన ప్రాతిపదికలుగా ఉన్న బలమైన నియంత్రణ వ్యవస్థ ఎంతో అవసరమని ఆయన అన్నారు. ప్రయోజనకరమైన, ముందుచూపుతో కూడిన నియంత్రణ దిశగా.. ఐఐటీ ఢిల్లీలోని ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అందుబాటు ధరలు, సుస్థిరత, సమర్థత... విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న ఈ మూడు ప్రధాన సవాళ్లన పరిష్కరించడం ద్వారా, విధానపరమైన, నియంత్రణ నిర్ణయాలకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రత్యక్షంగా దోహదపడుతుంది. విద్యుత్ పంపిణీ సంస్థలు, నియంత్రణ సంస్థల వ్యవస్థాగత సామర్థ్యాన్ని ఈ కేంద్రం బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా వినియోగదారుల సంక్షేమం, వ్యవస్థల విశ్వసనీయత, పెట్టుబడి సంకేతాల ప్రాతిపదికన నియంత్రణ ప్రతిపాదనలను అంచనా వేయడానికి అవసరమైన బలమైన విశ్లేషణాత్మక సాధనాలను, దేశవ్యాప్త సిస్టమ్ మోడళ్లను.. నియంత్రణ సంస్థలకు, విధాన నిర్ణేతలకు అందుబాటులోకి తెస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థాయిలో చూస్తే- సౌర, పవన విద్యుత్తులు ప్రధాన స్రవంతిలోకి వస్తూ విద్యుత్ వ్యవస్థ ప్రణాళికలు, నిర్వహణ, నియంత్రణ చట్రాలను పూర్తిగా మార్చేస్తున్న ఈ కీలక సమయంలో.. విద్యుత్ రంగ సంస్కరణలకు ఈ కేంద్రం సరైన దిశానిర్దేశం చేస్తుంది.

ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ రంగరాజన్ బెనర్జీ మాట్లాడుతూ.. ఈ కొత్త కేంద్రం కోసం సీఈఆర్సీ, గ్రిడ్ ఇండియాతో భాగస్వామ్యం వహించడం తమకెంతో ఆనందాన్నిస్తోందన్నారు. మన విద్యుత్ రంగాన్ని సుస్థిరంగా, అందుబాటు ధరలో, భవిష్యత్ సన్నద్ధంగా తీర్చిదిద్దేలా అవసరమైన సరికొత్త విజ్ఞానాన్ని, విశ్లేషణలను అందించడానికి తమ సంస్థ ఎంతో ఆసక్తిగా ఉందన్నారు. అలాగే విద్యుత్ నియంత్రణ సంస్థలు, ఈ రంగంలోని నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడం, వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరచడం వంటి లక్ష్యాలను సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐఐటి ఢిల్లీలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఈఆర్సీ చైర్మన్ శ్రీ జిష్ణు బారువా మాట్లాడుతూ.. ఒక ఉత్తమమైన నియంత్రణ వ్యవస్థకు పటిష్టమైన విశ్లేషణ, కచ్చితమైన సమాచారం, దీర్ఘకాలిక ఆలోచనా దృక్పథం తోడుగా ఉండాలన్నారు. నియంత్రణ సంబంధిత పరిశోధనలను మరింత లోతుగా నిర్వహించడానికి, విద్యుత్ రంగంలో ఆధారాలతో కూడిన విధాన రూపకల్పనను బలోపేతం చేయడానికి ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందన్నారు.
గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎస్.సి. సక్సేనా మాట్లాడుతూ.. నియంత్రణ చట్రాలు గ్రిడ్ కార్యకలాపాల వాస్తవికతకు అనుగుణంగా ఉండాలన్నారు. నియంత్రణ పరిశోధన, మార్కెట్ రూపకల్పనల కోసం.. నిర్వహణానుభవం, వ్యవస్థాపరమైన అవగాహన ఈ కేంద్రం ద్వారా నేరుగా దిశానిర్దేశం చేస్తాయి.
ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఐఐటీ ఢిల్లీ, సీఈఆర్సీ, గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ అగర్వాల్ అభినందించారు. దేశంలో విద్యుత్ రంగ అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
విద్యుత్ రంగ నిబంధనలు, మార్కెట్ రూపకల్పన, గ్రిడ్ కార్యకలాపాలు, ఇంధన పరివర్తన సవాళ్లు, అకర్బనీకరణ మార్గాలు, డిజిటలీకరణతోపాటు ఇంధన నిల్వ, డిమాండ్ రెస్పాన్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి అధునాతన సాంకేతికతలు సహా బహుళ విభాగ పరిశోధనలపై ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రధానంగా దృష్టి పెడుతుంది. క్రమబద్ధీకరించిన శిక్షణ కార్యక్రమాల ద్వారా విద్యుత్ రంగ నిపుణుల దీర్ఘకాలిక నియంత్రణ సామర్థ్యాన్ని ఈ కేంద్రం పెంపొందిస్తుంది. అదే సమయంలో ఆధారాలతో కూడిన విశ్లేషణాత్మక సమాచారాన్ని అందించడం ద్వారా నియంత్రణ సంస్థలకు, సిస్టమ్ సహకారాన్ని అందిస్తుంది.
నియంత్రణ పరమైన నేతృత్వం, కార్యాచరణ నైపుణ్యం, విద్యాపరమైన నైపుణ్యాలను ఒక్కచోట చేర్చే విశిష్టమైన సంస్థాగత నమూనాగా.. సీఈఆర్సీ, గ్రిడ్ ఇండియా, ఐఐటీ ఢిల్లీ మధ్య భాగస్వామ్యం నిలుస్తోంది. దేశ విద్యుత్ రంగం కోసం బలమైన, సానుకూల, భవిష్యత్ సన్నద్ధ నియంత్రణ ఛట్రాల నిర్మాణం కోసం ఈ సహకారం విశేషంగా దోహదపడుతుందని భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2216195)
आगंतुक पटल : 5