కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
యూపీయూ అంతర్జాతీయ లేఖల రచనా పోటీ 2026లో పాల్గొనడానికి యువతకు ఇండియా పోస్టు ఆహ్వానం
प्रविष्टि तिथि:
15 JAN 2026 5:33PM by PIB Hyderabad
యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ) ప్రతి ఏడాది నిర్వహించే అంతర్జాతీయ లేఖల రచన పోటీలో పాల్గొనాల్సిందిగా దేశంలోని యువతను భారత తపాలాశాఖ ఆహ్వానిస్తోంది. పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను, ఆలోచన విధానాన్ని పెంపొందించడం, ఉత్తరం రాసే కళను ప్రోత్సహించడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశం.
2026 సంవత్సరం ఇతివృత్తం: “డిజిటల్ ప్రపంచంలో మానవ సంబంధాలు ఎందుకు ముఖ్యమో మీ స్నేహితుడికి ఒక లేఖ రాయండి.”
ఈ పోటీని దేశవ్యాప్తంగా అన్ని తపాలా శాఖల ద్వారా పాఠశాలలు, విద్యాసంస్థల సమన్వయంతో నిర్వహిస్తారు. భార తపాలాశాఖ ప్రోత్సహించి, లేఖలను స్వీకరించి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వాటిని మూల్యాంకనం చేసి బహుమతులు ప్రదానం చేస్తుంది. సాధారణంగా ఇవి ప్రపంచ తపాలా దినోత్సవం (అక్టోబర్ 9) సందర్భంగా అందజేస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమంగా ఎంపికైన లేఖను స్విట్జర్లాండ్‌లోని యూపీయూ ప్రధాన కార్యాలయానికి పంపుతారు. అక్కడ భారత్ తరపున ప్రపంచ దేశాలన్నింటి నుంచి వచ్చిన లేఖలతో పోటీ పడుతుంది. అక్కడ యూపీయూ బంగారు, వెండి, కాంస్య పతకాలు, సర్టిఫికెట్లు, ఇతర బహుమతులను అందిస్తుంది. బంగారు పతక విజేతకు స్విట్జర్లాండ్‌లోని బెర్న్ నగరంలో ఉన్న యూపీయూ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించే అవకాశం లేదా దానికి బదులుగా ప్రత్యామ్నాయ బహుమతి కూడా పొందవచ్చు.
అర్హత, మార్గదర్శకాలు
వయోపరిమితి: 9 నుండి 15 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న విద్యార్థులు
రూపం: చేతితో రాసిన లేఖ అయి ఉండాలి.
భాష: అభ్యర్థులు తమ లేఖను ఇంగ్లీష్ లేదా భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న ఏదైనా భారతీయ భాషలో రాయవచ్చు.
పాల్గొనేవారు: గుర్తింపు పొందిన పాఠశాలలు లేదా సంస్థల విద్యార్థులు
పాఠశాలలు ఈ పోటీని అంతర్గతంగా నిర్వహించి, ఎంపిక చేసిన ఎంట్రీలను 20 మార్చి 2026లోగా తమ సంబంధిత పోస్టల్ సర్కిళ్లకు పంపవలసిందిగా కోరారు. తపాలా శాఖలు ఈ లేఖలను మూల్యాంకనం చేసి, ఉత్తమమైన మూడు లేఖలను 31 మార్చి 2026లోగా డైరెక్టరేట్‌కు పంపిస్తాయి.
సర్కిల్ స్థాయి:
ప్రథమ బహుమతి: రూ. 25,000, సర్టిఫికేట్
ద్వితీయ బహుమతి: రూ. 10,000, సర్టిఫికేట్
తృతీయ బహుమతి: రూ. 5,000, సర్టిఫికేట్
జాతీయ స్థాయి:
ప్రథమ బహుమతి: రూ. 50,000, సర్టిఫికేట్
ద్వితీయ బహుమతి: రూ. 25,000, సర్టిఫికేట్
తృతీయ బహుమతి: రూ. 10,000, సర్టిఫికేట్
తప్పనిసరి నమోదు వివరాలు
ప్రతి దరఖాస్తు మొదటి పేజీలో ఇంగ్లీష్, హిందీ భాషలలో ఈ కింది వివరాలు తప్పనిసరిగా ఉండాలి.
1. అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజు ఫోటో
2. అభ్యర్థి పేరు
3. పుట్టిన తేదీ
4. లింగం
5. తండ్రి/సంరక్షకుని పేరు
6. పాఠశాల/సంస్థ పేరు, పూర్తి చిరునామా
7. పూర్తి పోస్టల్ చిరునామా
విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలలు మరిన్ని వివరాల కోసం తమ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్/పోస్ట్‌మాస్టర్ జనరల్/డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్/నోడల్ అధికారిని సంప్రదించవచ్చు. మరింత సమాచారం తపాలా శాఖ వెబ్‌సైట్: www.indiapost.gov.in లో అందుబాటులో ఉంది.
***
(रिलीज़ आईडी: 2215131)
आगंतुक पटल : 2