ఉప రాష్ట్రపతి సచివాలయం
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం 9వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్
మేధో సమగ్రతనీ, దేశ నిర్మాణాన్నీ పరిరక్షించాలని యువతకు పిలుపు
ఆధునిక శాస్త్ర విజ్ఞానమూ, సాంప్రదాయిక విలువలూ కలిసి కదం తొక్కాలని స్పష్టం చేసిన ఉపరాష్ట్రపతి
వివేకానంద మాటల్ని ఉదాహరిస్తూ విద్య... శీలాన్ని పెంపొందించాలన్న ఉపరాష్ట్రపతి
చర్చ, వాదోపవాదాలు, భిన్నాభిప్రాయం అవసరమే, కానీ వాటితో నిర్ణయాలు, సహకారం దిశగా
తప్పక పురోగతి చోటుచేసుకోవాలన్న ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
12 JAN 2026 2:07PM by PIB Hyderabad
ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు న్యూఢిల్లీలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం 9వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పట్టభద్రులైన విద్యార్థులను అభినందించారు. వారు తమ జ్ఞానాన్నీ, నైపుణ్యాలనీ దేశానికి సేవ చేయడానికి అంకితం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
స్వామి వివేకానంద జయంతి సందర్బంగా ఆయన బోధనలను ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. చదువు ఒక్క డిగ్రీని సాధించడానికే పరిమితం కాకూడదనీ, అంతకన్నా విద్య... శీల నిర్మాణానికీ, బుద్ధిని ప్రసాదించాలని, వ్యక్తులకు సొంత కాళ్ల మీద నిలబడే శక్తిని ఇవ్వాలనీ అన్నారు. విద్య, తగిన శిక్షణ మాత్రమే 2047కల్లా వికసిత్ భారత్‌ను సాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వప్నాన్ని సాకారం చేయడంలో భారత యువతీయువకులను సమర్థులుగా తీర్చిదిద్దగలవని ఆయన స్పష్టం చేశారు.
భారత నాగరికతలోని జ్ఞాన సంప్రదాయాన్ని గురించి ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, నలందా, తక్షశిల వంటి ప్రాచీన విద్యాబోధన కేంద్రాల్ని ఉదాహరించారు. భారతీయ ధర్మగ్రంథాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మొదలు కౌటిల్యుని అర్థశాస్త్రం, తిరువళ్లువర్ రాసిన తిరుక్కురళ్ వరకు విద్యను సదా సామాజిక, నైతిక జీవనానికి కేంద్ర స్థానంలో నిలబెడుతూ వచ్చాయన్నారు. నిజమైన విద్య ఆచరణనీ, శీలాన్నీ తీర్చిదిద్దుతుందనీ, ఇది పట్టాని అందుకోవడానికే పరిమితం కాదన్నారు.
ఆధునిక విజ్ఞానశాస్త్రం, సాంప్రదాయిక విలువలు చెట్టపట్టాల్ వేసుకు ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి ఉద్ఘాటించారు. జేఎన్‌యూలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొందని ఆయన ప్రస్తావిస్తూ చర్చ, వాదోపవాదాలు, భిన్నాభిప్రాయాలతో పాటు సంఘర్షణ పడటం కూడా ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య తత్వమేనన్నారు. ఏమైనా, ఇలాంటి ప్రక్రియలు చివరకు ఒక తార్కిక ముగింపునకు చేరుకోవాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఒకసారి నిర్ణయమంటూ తీసుకున్న తరువాత, పాలన సాఫీగానూ, ప్రభావవంతంగానూ చోటుచేసుకొనేటట్లు చూడటానికి ఆ నిర్ణయం అమలు ప్రక్రియకు సహకరించాలన్న ఉమ్మడి ఇచ్ఛాశక్తిని వ్యక్తపరచాలన్నారు.
జేఎన్‌యూలో సమ్మిళిత్వ వాతావరణాన్ని ఏర్పరిచారంటూ ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. విద్యార్థుల ప్రవేశాల్లో, ఫేకల్టీ నియామకంలో సమానత్వం, సామాజిక సమ్మిళితాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన మెచ్చుకున్నారు.
విద్యాసంబంధ కార్యకలాపాలను కొత్తగా ఉనికిలోకి వస్తున్న రంగాలకీ, నాగరికతతో ముడిపడి ఉన్న రంగాలకీ విస్తరించినందుకు విశ్వవిద్యాలయం నాయకత్వాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. దీనిలో భాగంగానే సంస్కృతం, భారతీయ అధ్యయన విభాగంలో హిందూ, జైన, బౌద్ధ అధ్యయనానికి కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారతీయ భాషలను ప్రోత్సహించడానికి జేఎన్‌యూ ఎప్పటికప్పుడు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన మెచ్చుకున్నారు. వీటిలో.. తమిళ అధ్యయనం కోసం ప్రత్యేక పీఠాన్నీ, అస్సామీ, ఒడియా, మరాఠీ, కన్నడ భాషల్లో పాఠ్యమాలనీ, ప్రోగ్రాముల్నీ ప్రారంభించడం వంటివి భాగంగా ఉన్నాయి. జాతీయ విద్యావిధాన భావనకు అనుగుణంగా మాతృభాషలో జ్ఞాన వికాస ప్రక్రియ వర్ధిల్లాలని ఆయన చెప్పారు.
సత్యాన్ని అన్వేషించడంలో మేధోపరమైన నిజాయతీ, అసమానతలను తగ్గించడానికి సామాజిక సమ్మిళిత్వం, దేశాభివృద్ధిలో చురుకుగా పాలుపంచుకోవడం.. ఈ మూడు ముఖ్య బాధ్యతలనూ పరిరక్షించాల్సిందిగా పట్టభద్రులైన విద్యార్థులకు ఉపరాష్ట్రపతి తన ముగింపు సందేశంలో విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ విలువల నుంచీ, భారతీయ నాగరికత నుంచీ స్ఫూర్తిని పొంది తమ తల్లితండ్రుల్నీ, గురువుల్నీ ఎల్లప్పటికీ గౌరవించాలని ఆయన సూచించారు. విద్యార్థులు వారి భావి ప్రయత్నాల్లో సఫలం కావాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశ ఏకత కోసం, ప్రగతి కోసం కలిసికట్టుగా కృషి చేద్దామన్న సామూహిక సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ శ్రీ కన్వల్ సిబల్, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్-చాన్స్‌లర్ ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూలిపూడి పండిత్, సీనియర్ అధికారులు, ఫేకల్టీ సభ్యులు, పట్టభద్రులైన విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2215026)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23