హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోం,సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన న్యూఢిల్లీలో మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కేంద్రం (ఎన్‌కార్డ్) తొమ్మిదో ఉన్నత స్థాయి సమావేశం
ఎన్‌సీబీ అమృత్‌సర్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, గత 11 ఏళ్లలో
మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో గణనీయమైన విజయం: శ్రీ అమిత్ షా
మాదక ద్రవ్యాల సమస్యకు సమగ్ర పరిష్కారం కోసం భారత్ ప్రభుత్వంలోని అన్ని విభాగాలు 2029 వరకూ
అమలు చేసే రోడ్‌మ్యాప్‌ను, దానికి అనుసంధానమైన పర్యవేక్షణ విధానాన్ని రూపొందించడం ముఖ్యం
మాదక ద్రవ్యాల నివారణ శాంతిభద్రతలతో కంటే నార్కో టెర్రరిజం సమస్యతో
ఎక్కువగా ముడిపడి ఉంది... ఇది దేశ భవిష్యత్ తరాలను నాశనం చేసే కుట్ర
యువత ఆరోగ్యం, వారి ఆలోచనా సామర్థ్యం, పని చేసే శక్తి, సమాజంలో
పెరుగుతున్న అసంతృప్తి... ఇవన్నీ ఈ సమస్యతో ఉన్నాయి
మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో నిరంతర అవగాహనే రక్ష
మాదక ద్రవ్యాల సరఫరా వ్యవస్థను నిర్దాక్షిణ్యంగా ఛేదించే దృక్పథం, డిమాండ్ తగ్గింపునకు వ్యూహాత్మక చర్యలు,
హాని తగ్గింపునకు మానవీయ దృక్పథం ద్వారా మాత్రమే డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యం సాధ్యం
మాదకద్రవ్యాలను తయారు చేసి, విక్రయించే వారి పట్ల ఎలాంటి కనికరం చూపరాదు..
బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి - ఇది భారత ప్రభుత్వ స్పష్టమైన విధానం
ఆదేశం, నిబంధనల అమలు, జవాబుదారీతనంతో ముందుకు సాగాలి…
జరిగిన సమావేశాల సంఖ్య ముఖ్యం కాదు, ఫలితాల సమీక్ష, ప్రభావం అంచనా ముఖ్యం.
డ్రగ్ వ్యాపారానికి నాయకత్వం వహించే ముఠా పెద్దలు, ఆర్థిక సహకారం అందించే వర్గాలు, సరఫరా మార్గాలపై తీసుకున్న కఠిన చర్యలను మనం ప్రధానంగా సమీక్షించాలి
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) వినియోగం, సకాలంలో చార్జిషీట్‌ల దాఖలు ద్వారా
శిక్షల రేటును పెంచడం మన లక్ష్యం కావాలి.
నేరస్తులు కొత్త ఆవిష్కరణలను అనుసరించడంతో డ్రగ్స్ సరఫరా, చెల్లింపుల విధానాలు మారాయి….
వాటిని ఎదుర్కోవడానికి మనం కూడా మన వ్యూహాలను కాలానుగుణంగా నవీకరించుకోవాలి
రాష్ట్ర పోలీసు బలగాలన్నీ నిర్దిష్ట లక్ష్య సాధనతో ఎంపిక చేసిన అధికారులతో కూడిన శాశ్వత బృందాలను ఏర్పాటు చేయాలి: వాటిని నిఘా, కృత్రిమ మేధ వ్యవస్థలతో మెరుగ్గా సమన్వయం చేయాలి
డ్రగ్స్ పై సమర్థంగా పోరాడగలిగే శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం
డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి
प्रविष्टि तिथि:
09 JAN 2026 9:33PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు జరిగిన నార్కో-కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్సీఓఆర్డీ) తొమ్మిదో ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర హోం మంత్రి ఈ సందర్భంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అమృత్‌సర్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థల నుంచి కీలక భాగస్వాములు హాజరయ్యారు.
మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో భారత ప్రభుత్వంలోని అన్ని శాఖలు 2029 వరకూ ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని, దాని అమలుకు కాలపరిమితి గల సమీక్షా విధానాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఆదేశించారు. ఈ సవాలు శాంతి భద్రతల సమస్య కంటే మాదక ద్రవ్యాల సంబంధిత ఉగ్రవాదానికి (నార్కో-టెర్రర్) ఎక్కువగా ముడిపడి ఉందని ఆయన అన్నారు. మరీ ముఖ్యంగా, ఇది దేశంలోని రాబోయే తరాలను నాశనం చేసే కుట్ర అని ఆందోళన వ్యక్తం చేశారు. యువత ఆరోగ్యం, ఆలోచించగలిగే, ప్రదర్శించ గలిగే వారి సామర్థ్యం, సమాజంలో పెరుగుతున్న అసంతృప్తి ఈ సమస్యతో ముడిపడి ఉన్నాయని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
ఈ సమస్యపై 2026 మార్చి 31 నుంచి కేంద్రం, రాష్ట్రాలు కలసి మూడేళ్ల సామూహిక ప్రచారాన్ని ప్రారంభిస్తాయని, ఇందులో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా అన్ని విభాగాలకు పనితీరు పద్ధతులను, లక్ష్యాలను నిర్దేశించడం, సమయానుకూలంగా సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని హోం మంత్రి చెప్పారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, గత 11 ఏళ్లలో మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో గణనీయమైన విజయం సాధించామని, 2019లో ఎన్‌కార్డ్ పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ సమస్యపై సంపూర్ణ నియంత్రణకు మార్గం కూడా సుగమం చేశామని శ్రీ అమిత్ షా చెప్పారు. ఇప్పుడు ఇంకా వేగం పెంచామని, మూడు అంచెల కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెడుతున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాల సరఫరా వ్యవస్థలపై సమష్టిగా కఠినమైన దృష్టి పెట్టడంతో పాటు, వాటి డిమాండ్ తగ్గించేందుకు వ్యూహాత్మక చర్యలు, అలాగే వాటి వల్ల హాని జరక్కుండా నిరోధించడానికి మానవీయ కోణాన్ని అనుసరించడం ద్వారా మాదక ద్రవ్యాల రహిత భారత్ లక్ష్యాన్ని సాధించగలమని ఆయన తెలిపారు.
ఎన్‌కార్డ్ సమావేశాల సంఖ్య పెరిగిందని హోం మంత్రి చెప్పారు, కానీ దానిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సమావేశాలు క్రమం తప్పకుండా జరగాలని ఆయన అన్నారు. మాదక ద్రవ్యాలను తయారు చేసే లేదా అమ్మే వారి పట్ల ఎటువంటి కనికరం చూపరాదనే భారత ప్రభుత్వ విధానం చాలా స్పష్టంగా ఉందని శ్రీ షా చెప్పారు. మాదక ద్రవ్యాల బాధితుల పట్ల మానవతా దృక్పథంతో మనం ముందుకు సాగాలని ఆయన అన్నారు.
ఈ పోరాటంలో ఆదేశాలు, నిబంధనల అమలు, జవాబుదారీతనంతో మాత్రమే మనం ముందుకు సాగాలని హోం మంత్రి చెప్పారు. ఇప్పుడు, సమావేశాల సంఖ్యకు బదులుగా, వాటి ఫలితాలను మనం సమీక్షించాలని, మాదక ద్రవ్యాల వ్యాపారంలోని ముఖ్య సూత్రధారులు, డబ్బు సరఫరాదారులు, సరఫరా మార్గాలపై కఠిన చర్యలు తీసుకోవడం మన సమీక్షకు ప్రధాన అంశం కావాలని ఆయన అన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) లను ఉపయోగించడం, చార్జ్ షీట్లను సమయానికి దాఖలు చేయడం త్వరగా తీర్పులను పొందడం వంటి అంశాలను కూడా మన లక్ష్యాల్లో చేర్చాలని. మొత్తం మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌ను పరిశీలించడానికి పై స్థాయి నుంచి కింది స్థాయికి, కింది స్థాయి నుంచి పై స్థాయికి ఉండే విధానాన్ని అనుసరించడం అత్యంత అవసరమని ఆయన చెప్పారు.
2004 నుంచి 2013 వరకూ, రూ. 40,000 కోట్ల విలువైన 26 లక్షల కిలోగ్రాముల మాదక ద్రవ్యాలు పట్టుబడగా, 2014 నుంచి 2025 వరకూ, రూ. లక్ష 71 వేల కోట్ల విలువైన కోటి 11 లక్షల కిలోగ్రాముల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయని శ్రీ అమిత్ షా చెప్పారు. సింథటిక్ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యమం ప్రోత్సాహకరంగా ఉందని శ్రీ షా పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసిన పరిమాణంలో కూడా 11 రెట్ల పెరుగుదలను సాధించామని, 2020లో 10,770 ఎకరాల భూమిలో ఉన్న నల్లమందు పంటను నాశనం చేశామని, 2025 నవంబర్ నాటికి 40 వేల ఎకరాల భూమిలో ఉన్న పంటను నాశనం చేశామని ఆయన అన్నారు.
మాదకద్రవ్యాల సమస్య సమగ్ర పరిష్కారానికి వారి వారి బాధ్యతల ప్రకారం మార్చి 31 లోగా ఒక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని, పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, దానిపై పూర్తిగా దృష్టి పెట్టాలని అన్ని విభాగాలను శ్రీ శ్రీ అమిత్ షా ఆదేశించారు.
రాబోయే మూడేళ్లలో, దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అన్ని రంగాల్లో పోరాడి, భారతదేశాన్ని డ్రగ్ రహిత ఇండియాగా మార్చాలని, దేశ యువతను మాదక ద్రవ్యాల నుంచి కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేయాలని ఆయన అన్నారు. నిరంతర అవగాహన మాత్రమే మనలను సురక్షితంగా ఉంచగలదని ఆయన చెప్పారు. ఈ పోరాటం చేయగల శాశ్వత వ్యవస్థను మనం సృష్టించాలని ఆయన అన్నారు.
మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని శ్రీ అమిత్ షా చెప్పారు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసే వేగం తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఆ వేగాన్ని పెంచాలని కోరారు. మాదక ద్రవ్యాలను సకాలంలో ధ్వంసం చేయడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన అన్ని రాష్ట్రాల పోలీస్ డైరెక్టర్ జనరళ్లను కోరారు.
స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే 2047 నాటికి, ప్రపంచంలో భారతదేశాన్ని ప్రతి రంగంలో నెంబర్ వన్ గా తయారు చేయాలనే లక్ష్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించారని కేంద్ర హోం మంత్రి చెప్పారు. అటువంటి భారతదేశాన్ని సృష్టించడానికి యువతకు మాదక ద్రవ్యాల నుంచి సంపూర్ణ రక్షణ కల్పించడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఈ పోరాటం ప్రస్తుతం మనం గెలవగల దశలో ఉందని శ్రీ షా చెప్పారు. దేశంలోని రాబోయే తరాలను కాపాడే పనిని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తామని హోం మంత్రి చెప్పారు.
ఎన్‌కార్డ్ యంత్రాంగం నాలుగు అంచెల నిర్మాణాన్ని కలిగి ఉంది. కేంద్ర హోం కార్యదర్శి అధ్యక్షత వహించే అపెక్స్ స్థాయి ఎన్‌కార్డ్ కమిటీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి అధ్యక్షత వహించే ఎగ్జిక్యూటివ్ స్థాయి ఎన్‌కార్డ్ కమిటీ, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు అధ్యక్షత వహించే రాష్ట్ర స్థాయి ఎన్‌కార్డ్ కమిటీలు, జిల్లా మేజిస్ట్రేట్లు అధ్యక్షత వహించే జిల్లా స్థాయి ఎన్‌కార్డ్ కమిటీలు. మాదక ద్రవ్యాల సమస్యను సంపూర్ణంగా పరిష్కరించడంలో రాష్ట్రాలు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సంబంధిత భాగస్వాముల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి ఎన్‌కార్డ్ విధానాన్ని 2016లో ఏర్పాటు చేశారు.
***
(रिलीज़ आईडी: 2213670)
आगंतुक पटल : 3