సహకార మంత్రిత్వ శాఖ
ఉదయపూర్‌లో జాతీయ స్థాయి వర్క్‌షాప్: ‘సహకార్ సే సమృద్ధి’ దార్శనికతతో సహకార రంగ సంస్కరణలపై సమీక్ష
· పీఏసీఎస్ బలోపేతం, సహకార బ్యాంకింగ్, డిజిటల్ కార్యక్రమాలపై కేంద్రం, రాష్ట్రాల చర్చలు
· జాతీయ సహకార డేటాబేస్, ఎంఎస్‌సీఎస్ సంస్కరణలు, భవిష్యత్ సన్నద్ధ - సమ్మిళిత సహకార సంఘాలపై ప్రధాన దృష్టి
· పీఏసీఎస్‌ల సాధికారత, ధాన్యం నిల్వ, సహకార రంగ ఆవిష్కరణలపై అత్యుత్తమ విధానాలను పంచుకున్న రాష్ట్రాలు
प्रविष्टि तिथि:
10 JAN 2026 12:45PM by PIB Hyderabad
గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గనిర్దేశం, నాయకత్వంలో- సమ్మిళిత వృద్ధి, గ్రామీణ సంక్షేమం, క్షేత్రస్థాయిలో ఆర్థిక సాధికారతలను సాధించేందుకు సహకార రంగాన్ని కీలక చోదక శక్తిగా నిలిపేలా.. ఆయన పిలుపునిచ్చిన ‘సహకార్ సే సమృద్ధి’ లక్ష్యంగా.. ఆ రంగాన్ని బలోపేతం చేయడంపై రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో 2026 జనవరి 8, 9 తేదీల్లో రెండు రోజుల జాతీయ స్థాయి వర్క్‌షాప్, సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గౌరవ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సమర్థ నాయకత్వంలో.. ఈ లక్ష్యాన్ని సహకార మంత్రిత్వ శాఖ ఆచరణలోకి తెస్తోంది. సహకార సంస్థల బలోపేతం, పారదర్శకతను పెంచడం, వాటి ఆర్థిక పరిధిని దేశవ్యాప్తంగా విస్తరించడం లక్ష్యంగా విస్తృతంగా సంస్కరణలు చేపట్టింది.
భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కార్యదర్శులు, సహకార సంఘాల రిజిస్ట్రార్‌లతోపాటు సహకార వ్యవస్థకు చెందిన కీలక భాగస్వాములు పాల్గొన్నారు. మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖుల సమక్షంలో.. సహకార శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భూటానీ ఈ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. రాజస్థాన్ ప్రభుత్వ సహకార శాఖ కార్యదర్శి శ్రీమతి ఆనంది ప్రసంగిస్తూ, సదస్సుకు విచ్చేసిన ప్రతినిధులకు స్వాగతం పలికారు.
కేంద్రం - రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, భావ వినిమయాన్ని ప్రోత్సహించడం, సహకార రంగానికి పునరుత్తేజాన్నిచ్చే వినూత్న విధానాలను ప్రోత్సహించడమే ఈ వర్క్‌షాప్ ముఖ్య ఉద్దేశ్యమని.. సహకార శాఖ కార్యదర్శి తన కీలకోపన్యాసంలో స్పష్టం చేశారు. సహకార సంఘాలు చాలా ఏళ్లుగా నష్టాల్లోనే ఉన్నాయన్నారు. ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడంతోపాటు సంప్రదాయ, సామాజిక మాధ్యమాల ద్వారా సానుకూల విజయగాథలకు ప్రాచుర్యం కల్పించడం ద్వారా.. వాటిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. బనస్కాంత డెయిరీని ఒక ఆదర్శ ఉదాహరణగా పేర్కొన్నారు. బలమైన, కార్యకలాపాల్లోని ప్రతి దశలోనూ సమగ్రమైన వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా.. కరువు పీడిత ప్రాంతమైన ఆ జిల్లాలో రోజుకు దాదాపు 90 లక్షల లీటర్ల పాలను ఎలా ఉత్పత్తి చేయగలిగారో వివరించారు. మార్పు దిశగా సహకార రంగానికి గల విప్లవాత్మక శక్తికి ఇదే నిదర్శనమన్నారు. సహకార బ్యాంకులపై ఉన్న రెండు రకాల నియంత్రణ సమస్యను పరిష్కరించడం, బోర్డు ఎన్నికల ప్రక్రియలను మెరుగుపరచడం, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకునేలా పర్యటనలను ప్రోత్సహించడం, ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకునే సంస్కృతిని పెంపొందించడం వంటి కీలక సంస్కరణల ఆవశ్యకతను ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ సహకార బ్యాంకుల నియంత్రణ నిబంధనల సరళీకరణ, అలాగే పాలనాపరమైన లోపాలను సరిదిద్దడం లక్ష్యంగా.. ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖతో సహకార మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు చర్చిస్తోందని ఆయన వివరించారు.
స్వయం సహాయక బృందాలను సహకార సంఘాలతో అనుసంధానించడం, తక్కువ వ్యయంతో కరెంట్ ఖాతాలు, పొదుపు ఖాతాల నిధులను పెంచడం కోసం.. సహకార సంస్థలన్నీ సహకార బ్యాంకుల్లోనే ఖాతాలు తెరవడాన్ని తప్పనిసరి చేయడం, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక చేయూత వంటి ప్రధాన కార్యక్రమాలను డాక్టర్ ఆశిష్ కుమార్ భూటానీ వివరించారు. ఇవేకాకుండా, ప్రతిపాదిత సహకార విశ్వవిద్యాలయం ద్వారా నైపుణ్యాభివృద్ధి, ముస్సోరీలోని ఎల్బీఎస్ఎన్ఏఏ సహకారంతో శిక్షణ కార్యక్రమాల నిర్వహణలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇ - కామర్స్ వేదికలు, ప్రతి దశలోనూ కార్యకలాపాల్లో సమగ్రాభివృద్ధి ద్వారా ఆర్థిక వ్యవస్థలో సహకార రంగ వాటాను మూడు రెట్లు పెంచాలన్న ఆశయాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటరీకరణ, వ్యవసాయ - గ్రామీణాభివృద్ధి బ్యాంకులు, ఆర్సీఎస్ కార్యాలయాలు, అలాగే ఎంపీఏసీఎస్ వంటి పథకాల అమలు, బహుళార్థ పాడి సహకార సంఘాలు (ఎండీసీఎస్), బములార్థ మత్స్య సహకార సంఘాలు (ఎంఎఫ్‌సీఎస్) వంటి కీలక కార్యక్రమాల్లో పురోగతిని పరిశీలించేందుకు ఓ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రపంచంలో అతిపెద్ద ధాన్యాగార నిర్మాణ కార్యక్రమంతోపాటు ఉమ్మడి సేవా కేంద్రాలు, ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు (పీఎంకేఎస్‌కే), పీఎం జనఔషధి కేంద్రాలు సహా పీఏసీఎస్‌ల అదనపు సేవల విస్తరణ వంటి అంశాలపైనా చర్చలు జరిగాయి. సహకార బ్యాంకింగ్ సంస్కరణలు, నేషనల్ కో ఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్, నేషనల్ కో ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ వంటి డిజిటల్ కార్యక్రమాలతోపాటు.. శ్వేత విప్లవం 2.0కు ప్రోత్సాహంపై కూడా ఈ సదస్సులో చర్చించారు.
జాతీయ సహకార డేటాబేస్‌ను బలోపేతం చేయడం, వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహించే సహకార సంఘాల్లో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం ఈ వర్క్‌షాప్ మరో ముఖ్య లక్ష్యం. ఏపీఐ అనుసంధానం, జీవీఏ అంచనా కోసం వార్షిక టర్నోవరు, లాభనష్టాల డేటాను అప్‌డేట్ చేయడం, సహకార సంస్థలను 'జెమ్' పోర్టలులో చేర్చడం, లిక్విడేషన్ ప్రక్రియలను వేగవంతం చేయడం, సహకార సంఘాల నిర్వహణను బలోపేతం చేయడం, ఇ-కామర్స్ వేదికల వంటి అంశాలపై రాష్ట్రాలు తమ అనుభవాలను పంచుకున్నాయి. ఎల్బీఎస్ఎన్ఏఏ, త్రిభువన్ సహకారీ యూనివర్సిటీ, జాతీయ సహకార శిక్షణ మండలి (ఎన్సీసీటీ), విక్రాంత్ మెహతా జాతీయ సహకార నిర్వహణ సంస్థ (వీఏఎంఎన్ఐసీవోఎం) వంటి సంస్థల ద్వారా... మహిళలు, యువత, అణగారిన వర్గాలకు అవకాశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ.. బలమైన నాయకత్వం, సుపరిపాలన, నైపుణ్యాభివృద్ధి ద్వారా భవిష్యత్ సన్నద్ధంగా ఉన్న సహకార సంఘాల నిర్మాణంపై కూడా ఈ వర్క్‌షాప్ ప్రధానంగా దృష్టి సారించింది.
సహకార రంగ బలోపేతం కోసం జరుగుతున్న రెండు రోజుల జాతీయ స్థాయి వర్క్‌షాప్, సమీక్ష సమావేశానికి కొనసాగింపుగా.. ‘సహకార్ సే సమృద్ధి – పీఏసీఎస్‌ల భవిత’ పేరుతో ఓ ప్రత్యేక సదస్సును రెండో రోజు నిర్వహించారు. నిర్దేశిత కార్యక్రమాల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సాధికారతపై ఇది ప్రధానంగా దృష్టి సారించింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునరుద్ధరణలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని ఈ చర్చ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలు తమ అనుభవాలను, అత్యుత్తమ పద్ధతులను వివరించాయి. నగదు రహిత పీఏసీఎస్- నిర్వహణ సమాచార వ్యవస్థల (ఎంఐఎస్)ను తమిళనాడు వివరించింది. సహకార సంఘాల కోసం అంకుర సంస్థల సానుకూల వ్యవస్థ దిశగా అందిస్తున్న ప్రోత్సాహంపై ఆంధ్రప్రదేశ్ ప్రదర్శన ఇచ్చింది. జిల్లాల వారీగా నిర్దేశిత వ్యాపార ప్రణాళికలపై కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ వివరించింది. అలాగే నమూనా సహకార గ్రామాలపై నాబార్డ్ ప్రదర్శననిచ్చింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ఉత్తర ప్రదేశ్ వివరించింది. వీటితోపాటు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్రాల మధ్య ఆధునిక నిల్వ - సరఫరా వ్యవస్థల అనుసంధానంపై నాబార్డ్ సంప్రదింపుల విభాగమైన నాబ్‌కాన్స్ ప్రదర్శన ఇచ్చింది. పీఏసీఎస్‌ల బలోపేతం, వాటి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడం, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దడం వంటి అంశాలతో కూడిన ఓ సమగ్ర వ్యూహం ఆవశ్యకమని ఈ సదస్సు స్పష్టం చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో సహకార రంగ అభివృద్ధిపై ప్రత్యేక సదస్సులను కూడా నిర్వహించారు. ఇందులో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలు ప్రదర్శనలు ఇచ్చాయి. అలాగే, ‘సహకార్ సంవాద్: విజయవంతమైన సహకార సంఘాలతో చర్చ’ అనే సదస్సును కూడా నిర్వహించారు. సాంకేతికత సాయంతో మత్స్య, పాడి కార్యకలాపాల్లో అనుభవాలను ఈ సదస్సులో పలు రాష్ట్రాలు పంచుకున్నాయి.
సహకార శాఖ అదనపు కార్యదర్శి శ్రీ పంకజ్ కుమార్ బన్సల్ అధ్యక్షతన.. ‘సమూహాల మధ్య సహకారం’ అంశంపై ముగింపు సమావేశంలో చర్చలు జరిగాయి. స్వయం సహాయక బృందాలు, రైతు ఉత్పత్తిదారు సంస్థలను పీఏసీఎస్‌లతో అనుసంధానించడం, ఎన్సీడీసీ పథకాల ద్వారా విస్తరణను బలోపేతం చేయడంపై ఇందులో ప్రధానంగా దృష్టి సారించారు.
సహకార వ్యవస్థకు పీఏసీఎస్‌లు వెన్నెముక వంటివని సహకార శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భూటానీ తన ముగింపు ప్రసంగంలో పునరుద్ఘాటించారు. గ్రామీణ ఆర్థిక సమ్మిళితత్వాన్ని బలోపేతం చేయడం కోసం వాటిని పూర్తిగా కంప్యూటరీకరించాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. ధాన్యం నిల్వ మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడం కోసం ఎఫ్‌సీఐ అద్దె గ్యారెంటీలను అందించిందని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా 2026 సెప్టెంబరు నాటికి 5 లక్షల టన్నులు, 2027 సెప్టెంబరు నాటికి 50 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించిన రాజస్థాన్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2213649)
आगंतुक पटल : 8