పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
గోవాలో జనవరి 27 నుంచి 30 వరకు భారత ఇంధన వారోత్సవం
ఇంధన భద్రత, పెట్టుబడులు, కర్బన ఉద్గారాల తగ్గింపుపై చర్చించనున్న
వివిధ దేశాల మంత్రులు, సీఈవోలు, విధాన రూపకర్తలు
प्रविष्टि तिथि:
06 JAN 2026 3:59PM by PIB Hyderabad
ప్రపంచ ఇంధన రంగం కీలక దశలో ఉన్న తరుణంలో.. మరోసారి గోవా వేదికగా ‘భారత ఇంధన వారోత్సవం - 2026’ను నిర్వహించబోతున్నారు. జనవరి 27 నుంచి 30 వరకు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా వివిధ దేశాల మంత్రులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీఈవోలు, విధాన నిర్ణేతలు, ఆర్థిక సంస్థలు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు ఒక్క వేదికపైకి రానున్నారు. 2026లో జరిగే మొదటి ప్రధాన అంతర్జాతీయ ఇంధన సమావేశం ఇది. ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా ఆచరణాత్మకమైన, విస్తరణకు అవకాశమున్న మార్గాలను రూపొందించడంపై ‘భారత ఇంధన వారోత్సవం (ఐఈడబ్ల్యూ)- 2026’ ప్రధానంగా దృష్టి సారించనుంది.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన డిమాండ్, భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, వాతావరణ మార్పులపై నిబద్ధతలను వేగవంతం చేస్తూ ఐఈడబ్ల్యూ 2026 చర్చలకు, సహకారానికి ఒక కీలక వేదికగా నిలవనుంది. గత విడతల్లో సాధించిన విజయాలను ఆధారంగా చేసుకొని.. ఈ కార్యక్రమానికి 120కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. 2025 ఏడాదిలో 68,000 మందికి పైగా సందర్శకులు, 570 ప్రదర్శనకారులు, 5,400 మంది కాన్ఫరెన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో 100కు పైగా కాన్ఫరెన్స్ సమావేశాల్లో 540 మందికి పైగా అంతర్జాతీయ వక్తలు ప్రసంగించారు. ఈ ఏడాది మరింత విస్తృతంగా జరగనుంది. ప్రపంచంలోని ప్రముఖ ఇంధన చర్చా వేదికలలో ఒకటిగా ఐఈడబ్ల్యూ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది.
కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత పెట్రోలియం పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌ఐపీఐ),డీఎంజీ ఈవెంట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇంధన భద్రత, అందుబాటు ధరలు, స్థిరత్వం అంశాలపై సహకారం కోసం తటస్థమైన, ప్రపంచస్థాయి వేదికను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల నుంచి ప్రతినిధి బృందాలు పాల్గొంటాయని భావిస్తున్నారు. ఇది అంతర్జాతీయ ఇంధన దౌత్యంలో భారతీయ ఇంధన వారోత్సవం పట్ల పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తుంది.
అంతర్జాతీయ ఇంధన సంస్థ విడుదల చేసిన ప్రపంచ ఇంధన దృక్పథం 2025 ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా పెరిగే అదనపు ఇంధన డిమాండ్‌లో 23 శాతానికి పైగా వాటా భారత్‌దే అవుతుందని అంచనా వేసింది. ఇది ఏ దేశానికైనా అత్యధికం. ఈ నేపథ్యంలో ఐఈడబ్ల్యూ 2026.. విధాన నిర్ణేతలను, పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి స్థిరమైన ఇంధన వ్యవస్థలను బలోపేతం చేయడం, క్లీన్ ఎనర్జీ ఇంధన మార్పును వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించనుంది.
సంస్కరణల ఆధారిత భారత ఇంధన వ్యవస్థ
దేశంలోని సంస్కరణల ఆధారిత ఇంధన నమూనాను ఐఈడబ్ల్యూ 2026 ప్రత్యేకంగా ప్రదర్శించనుంది. ఇది ఆర్థిక వృద్ధి, వాతావరణ బాధ్యత, వినియోగదారుల రక్షణ మధ్య సమతుల్యతను సాధిస్తోంది. చమురు క్షేత్రాలు (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం 2025, పెట్రోలియం, సహజ వాయు నియమాలు 2025 కింద అమల్లోకి వచ్చిన చారిత్రాత్మక శాసన, నియంత్రణ సంస్కరణలు దేశంలోని చమురు అన్వేషణ, ఉత్పత్తి రంగాన్ని మరింత బలోపేతం చేశాయి. ఈ సంస్కరణలు అన్వేషణ, ఉత్పత్తి, కర్బన ఉద్గారాల తగ్గింపు, సమగ్ర ఇంధన ప్రాజెక్టులన్నింటినీ కలుపుతూ ఏకీకృత పెట్రోలియం లీజు విధానాన్ని కల్పిస్తుంది. లీజుకు సంబంధించిన నిర్ణయాలను తప్పనిసరిగా 180 రోజులలోపు తీసుకునేలా నిబంధనలతోపాటు లీజు కాలపరిమితిని 30 ఏళ్ల వరకు పొడిగిస్తుంది. అవసరమైతే ఈ క్షేత్రం ఆర్థిక ఉత్పాదకత ఉన్నంత కాలం దీనిని మరింత పొడిగించే వెసులుబాటు ఉంటుంది. మౌలిక వసతుల భాగస్వామ్య విధానాలు, మధ్యవర్తిత్వం, నష్టపరిహార రక్షణలతో కూడిన పెట్టుబడిదారుల ప్రమాదాలను తగ్గించే చర్యలను చేపడుతుంది.
క్లీన్ ఎనర్జీ, ఇథనాల్ కార్యక్రమం
భారతీయ ఇథనాల్ మిశ్రమీకరణ కార్యక్రమం ప్రపంచ స్థాయిలో ఒక ప్రమాణంగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా 2014 నుంచి ఇప్పటి వరకు రూ1.59 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసింది. అలాగే 813 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించి, 270 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు వినియోగాన్ని భర్త చేసింది.. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇథనాల్ డిస్టిలర్లకు మొత్తం రూ.2.32 లక్షల కోట్లు చెల్లించగా.. రైతులకు నేరుగా రూ.1.39 లక్షల కోట్లు జమ అయ్యాయి. ఐఈడబ్ల్యూ 2026లో జీవ ఇంధనాలు, హరిత హైడ్రోజన్, స్థిరమైన ఇంధనాలు, తక్కువ కార్బన్ ఆధారిత కొత్త సాంకేతికతలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.
మౌలిక సదుపాయాల విస్తరణ, ఇంధన భద్రత
దీర్ఘకాలిక ఇంధన భద్రతను పెంచేందుకు భారత్ దేశీయ అన్వేషణ, మౌలిక సదుపాయాలను నిరంతరం విస్తరిస్తోంది. 2014లో దాదాపు 52,000గా ఉన్న పెట్రోల్ రిటైల్ విక్రయ కేంద్రాలు 2025నాటికి ఒక లక్షకు పైగా పెరిగాయి. సీఎన్ జీ స్టేషన్లు సుమారు 968 నుంచి 8,477కి పెరిగాయి. పీఎన్ జీ గృహ కనెక్షన్లు 25 లక్షల నుంచి 1.59 కోట్లకు పెరిగాయి. సహజ వాయువు పైప్‌లైన్ రవాణా వ్యవస్థ దాదాపు 66 శాతం విస్తరించి 25,923 కిలోమీటర్లకు చేరుకుంది. నగర గ్యాస్ పంపిణీ పరిధి దీవులను మినహాయించి దేశవ్యాప్తంగా విస్తరించింది.
ధరల స్థిరత్వం వినియోగదారుల రక్షణ
ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల్లో అస్థిరత ఉన్నప్పటికీ, భారత్ వినియోగదారులకు ధరల స్థిరత్వాన్ని కొనసాగించింది. 2021 నుంచి ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగినా ఢిల్లీలో 2025 నాటికి ధరలు 2021 కంటే తక్కువగానే ఉన్నాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ.13, డీజిల్‌పై లీటరుకు రూ.16 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి, ఆ ప్రయోజనానం పూర్తిగా వినియోగదారులకు చేరేలా చేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు మార్చి 2024 మార్చిలో లీటరుకు అదనంగా రూ.2 ధర తగ్గింపును అమలు చేశాయి. పీఎంయూవై లబ్ధిదారులకు ఎల్ పీజీ సిలిండర్ ను దాదాపు రూ. 553 కే అందిస్తూ వస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యల్ప ధరలలో ఒకటి.
ప్రపంచ ఇంధన చర్చా వేదిక
నాలుగు రోజుల పాటు జరిగే ఐఈడబ్ల్యూ 2026 ఇంధన రంగంలో అంతర్జాతీయ స్థాయి చర్చలకు వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో మంత్రుల రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రముఖ సంస్థల సీఈఓల చర్చలు, ప్రభుత్వ-ప్రైవేటు రంగాల మధ్య పరస్పర సంభాషణలు, సాంకేతిక ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, సామాజిక కార్యక్రమాలు, మీడియా సమావేశాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థ, గ్రీన్ ఫైనాన్స్, స్థిరమైన ఇంధనాలు, వనరుల పునర్వినియోగం, డిజిటల్ మార్పు, శ్రామిక శక్తి అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇంధన సరఫరా వ్యవస్థలోని అన్ని విభాగాలకు చెందిన వందలాది కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి. అనేక దేశాల నుంచి ప్రతినిధులు, వివిధ దేశాల ప్రత్యేక స్టాళ్లుఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
భారత ఇంధన వారోత్సవం
భారత ఇంధన వారోత్సవం దేశంలోని ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ఇంధన వేదిక. ఇది సురక్షితమైన, స్థిరమైన, సరసమైన ఇంధన భవిష్యత్తును నిర్మించేందుకు ప్రభుత్వ నాయకులను, పరిశ్రమ కార్యనిర్వాహకులను, ఆవిష్కర్తలను ఒకచోట చేర్చుతుంది. తటస్థ అంతర్జాతీయ వేదికగా.. ఇది పెట్టుబడులు, విధానపరమైన సమన్వయం, సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. భారత ఇంధన వారోత్సవం 2026 జనవరి 27 నుంచి 30 వరకు గోవాలో జరగనుంది.
నిపుణుల ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరిగే ఐఈడబ్ల్యూ 2026 కార్యక్రమంలో మంత్రుల రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రపంచ మూలధన ప్రవాహాలపై ప్రముఖ సంస్థల సీఈఓల చర్చలు, ప్రభుత్వ-ప్రైవేటు రంగ సంభాషణలు, బహుళజాతి సంస్థలు, జాతీయ ఇంధన కంపెనీలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న అంకుర సంస్థల నుంచి సాంకేతిక ప్రదర్శనలు, సామాజిక కార్యక్రమాలు, మీడియా సమావేశాలు, అద్భుత ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.
మరిన్ని వివరాల కోసం https://www.indiaenergyweek.com/ ను సందర్శించండి.
***
(रिलीज़ आईडी: 2212286)
आगंतुक पटल : 8