ఉప రాష్ట్రపతి సచివాలయం
‘ఎన్‌సీసీ రిపబ్లిక్ డే క్యాంప్-2026’ ప్రారంభోత్సవానికి హాజరైన ఉపరాష్ట్రపతి
దేశ నిర్మాణంలో ఎన్ సీసీ పాత్రను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి
దేశ ఐక్యత, యువశక్తిని ప్రతిబింబించనున్న ఎన్‌సీసీ రిపబ్లిక్ డే క్యాంప్: ఉపరాష్ట్రపతి
ఎన్‌సీసీ ద్వారా భారత భవిష్యత్తు నాయకత్వ నిర్మాణం: ఉప రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
05 JAN 2026 2:28PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని డీజీఎన్‌సీసీ క్యాంప్‌లో నిర్వహించిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) గణతంత్ర దినోత్సవ శిబిరం- 2026 ప్రారంభోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణంలో, యువత అభివృద్ధిలో ఎన్‌సీసీ అందిస్తున్న నిరంతర సేవలను ఆయన ప్రశంసించారు.
క్యాడెట్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఎన్‌సీసీ 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. క్రమశిక్షణ, బాధ్యత,దేశభక్తి కలిగిన పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తూ.. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫాం ధరించిన యువజన సంస్థగా ఎదిగిందని ఆయన ప్రశంసించారు. యువతపై దేశానికి ఉన్న విశ్వాసానికి, బలమైన, ఐక్య దేశాన్ని నిర్మించాలనే మనందరి నిబద్ధతకు గణతంత్ర దినోత్సవ శిబిరం శక్తిమంతమైన ప్రతీకగా నిలుస్తుందని అభివర్ణించారు.
ఎన్‌సీసీ నినాదమైన ‘‘ఐక్యత, క్రమశిక్షణ’’ గురించి ప్రస్తావిస్తూ.. ఆత్మవిశ్వాసం, విలువలతో కూడిన యువతను ఈ సంస్థ తీర్చిదిద్దుతోందని, వీరే వికసిత్ భారత్ @2047కు వెన్నెముకగా నిలుస్తారని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో అభివృద్ధి చెందిన భారత్ వైపు ప్రయాణం... నైపుణ్యం, క్రమశిక్షణ, సేవాభావం కలిగిన యువత శక్తితో ముందుకు సాగుతుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎన్‌సీసీ క్యాడెట్లు అందించిన అసాధారణ సేవలను ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. దాదాపు 72,000 మంది క్యాడెట్లు పౌర రక్షణ విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారని, క్లిష్ట సమయాల్లో దేశ సేవ చేయడానికి వారికున్న నిబద్ధత, ధైర్యం, అంకితభావాన్ని ఇది చాటిచెబుతోందని ఈయన ప్రశంసించారు.
గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఎన్‌సీసీ గణతంత్ర దినోత్సవ శిబిరం మన రాజ్యాంగ విలువలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. విభిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన క్యాడెట్లు ఒకే చోట కలిసి నివసిస్తూ, శిక్షణ పొందుతూ జాతీయ ఐక్యత భావాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు.
సాహస క్రీడలు, అంతర్జాతీయ యువజన మార్పిడి కార్యక్రమాలు, పర్యావరణ కార్యక్రమాలు, విపత్తు సహాయ చర్యల్లో ఎన్‌సీసీ క్యాడెట్లు చూపుతున్న ప్రతిభను ఉపరాష్ట్రపతి కొనియాడారు. ముఖ్యంగా కేరళలోని వయనాడ్ వరదల సమయంలో వారు అందించిన సేవలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
ఎన్‌సీసీ శిక్షణను ఆధునికీకరించడాన్ని ఉపరాష్ట్రపతి స్వాగతించారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ శిక్షణను ప్రవేశపెట్టడం, రిమోట్ పైలట్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలను ఆయన ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎదురయ్యే సాంకేతిక, భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొనేలా యువతను సిద్ధం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. యువత ఆలోచనలను సరైన దిశలో మలిచి, దేశ గౌరవాన్ని పెంచే విధంగా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతున్న ఎన్‌సీసీ అధికారులు, శిక్షకులు, సిబ్బంది చూపుతున్న అంకితభావాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఎన్‌సీసీ గణతంత్ర దినోత్సవ శిబిరం-2026లో పాల్గొంటున్న క్యాడెట్లందరికీ ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. సేవ, క్రమశిక్షణ, దేశభక్తి అనే అత్యున్నత ఆశయాలను ఎల్లప్పుడూ కాపాడాలని వారికి పిలుపునిచ్చారు.
అంతకముందు శిబిరానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి ఎన్‌సీసీ క్యాడెట్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ‘హాల్ ఆఫ్ ఫేమ్’ ను సందర్శించి, ఎన్‌సీసీ చరిత్ర, సాధించిన విజయాలు, అభివృద్ధి ప్రయాణం గురించి వివరాలు తెలుసుకున్నారు. యువ ఆపద మిత్ర పథకం, డ్రోన్ శిక్షణ వంటి కార్యక్రమాలను ప్రదర్శించే స్టాళ్లను ఆయన సందర్శించారు. విపత్తు నిర్వహణలో ఎన్‌సీసీ చేపడుతున్న చర్యలు, ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో సంస్థ చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి అభినందించారు అనంతరం క్యాడెట్లు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించి, వారితో ముచ్చటించారు.. క్యాడెట్ల క్రమశిక్షణ, ఉత్సాహం, దేశభక్తి భావాన్ని ఆయన ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ విరేంద్ర వత్స్, ఇతర ఉన్నతాధికారులు, శిక్షకులతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్యాడెట్లు పాల్గొన్నారు.
****
(रिलीज़ आईडी: 2211548)
आगंतुक पटल : 111