మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
తెలంగాణలో స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ ఫామ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, అత్యాధునిక రీ-సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ కేంద్రాలను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్
హైదరాబాద్ వాతావరణ పరిస్థితుల్లో అధిక విలువ కలిగిన చల్లని నీటి చేప జాతి- రెయిన్‌బో ట్రౌట్‌ను
తొలిసారి విజయవంతంగా సాగు చేయడంలో స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ మార్గదర్శనం
प्रविष्टि तिथि:
04 JAN 2026 10:17AM by PIB Hyderabad
తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈ నెల 5న జరిగే సాధారణ కార్యవర్గ సమావేశం అనంతరం కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ ఫామ్- రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, అత్యాధునిక రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ కేంద్రాలను ప్రారంభిస్తారు.
స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ లిమిటెడ్ దేశంలోనే మొదటి వాణిజ్య-స్థాయి ఉష్ణమండల రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఆధారిత రెయిన్‌బో ట్రౌట్ ఆక్వాకల్చర్ ఫామ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసింది. ఇది భారత ఆక్వాకల్చర్ పరివర్తనలో కీలక ముందడుగును సూచిస్తుంది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో రెయిన్‌బో ట్రౌట్ వంటి అధిక-విలువైన చల్లని నీటి చేప జాతులను ఉష్ణమండల వాతావరణంలో ఏడాది పొడవునా, కచ్చితమైన ఇంజనీరింగ్, నియంత్రిత జీవ వ్యవస్థలు, అధునాతన నీటి పునర్వినియోగ సాంకేతికతలను ఉపయోగించి సాగు చేయవచ్చని ఇది నిరూపిస్తుంది. ప్రీమియం ఆక్వాకల్చర్ జాతులు భౌగోళికంగా నిర్దిష్ట వాతావరణ మండలాలకు పరిమితమనే దీర్ఘకాలిక అంచనాలను ఈ విజయం తారుమారు చేస్తుంది. ఇది ఆక్వాకల్చర్ సాగులో వాతావరణం కంటే సాంకేతికతే కీలకమని నిరూపిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ ప్రత్యక్ష శిక్షణ, ప్రదర్శనల వేదికగా పనిచేస్తుంది. అధునాతన ఆక్వాకల్చర్ వ్యవస్థలు, ఆటోమేషన్, బయోసెక్యూరిటీలలో యువతకు ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తుంది. మత్స్య రంగంలో ఉత్పాదకతను పెంచడం కోసం రైతులకు మంచి అవగాహనను, విజ్ఞానాన్ని అందిస్తుంది.
దేశంలో మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా భారత ప్రభుత్వం అనేక పరివర్తనాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. గత కొన్ని సంవత్సరాల్లో ప్రత్యేకించి ఈ రంగం కోసం కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. 2015లో ఈ ప్రయత్నం ప్రారంభించినప్పటి నుంచి వివిధ పథకాల ద్వారా మొత్తం రూ. 38,572 కోట్ల విలువైన పెట్టుబడులను ఆమోదించారు...లేదా ప్రకటించారు.
విస్తృత మత్స్య రంగంలో చల్లని నీటి మత్స్య పరిశ్రమ వేగంగానూ, అధిక-సంభావ్యత కలిగిన విభాగంగా అభివృద్ధి చెందుతోంది. ఖరీదైన చల్లని నీటి చేప జాతులకు పెరుగుతున్న మార్కెట్ డిమాండ్‌తో పాటు దేశీయ, ఎగుమతి అవకాశాలను విస్తరించడం, సుస్థిర ఆక్వాకల్చర్ సాంకేతికతల్లో పెట్టుబడులను పెంచడం ద్వారా ఈ ఉప విభాగం పర్వతాలు, ఎత్తయిన ప్రాంతాల ప్రజల జీవనోపాధికి, ఆర్థిక వృద్ధికి కీలక సహకారిగా అభివృద్ధి చెందుతోంది.
ట్రౌట్ చేపల సాగు భారత ఆక్వాకల్చర్ రంగంలో అధిక-విలువైన, వ్యూహాత్మకంగా ముఖ్యమైన విభాగాన్ని సూచిస్తుంది. ఇది ఎక్కువగా హిమాలయాలు, కొండ ప్రాంత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో కేంద్రీకృతమై ఉంది. ఇది మంచుతో నిండిన వాగులు, నదుల నుంచి చల్లని, ఆక్సిజన్ సంతృప్తంగా ఉన్న నీటి వనరుల్లో పెరుగుతుంది.
రెయిన్‌బో ట్రౌట్ హేచరీల అభివృద్ధి ద్వారా ఈ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో మత్స్య శాఖ గణనీయ పురోగతిని సాధించింది. ఇవి చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలనూ సృష్టించాయి. కొత్త హేచరీల ఏర్పాటు, అధునాతన ఆక్వాకల్చర్ పద్ధతులను అవలంబించడంతో సంవత్సరానికి 14 లక్షల ట్రౌట్ చేప విత్తనాల ఉత్పత్తి సాధ్యమైంది. ట్రౌట్ చేపలను అందించడానికి వైబ్రంట్ విలేజ్ పథకం కింద ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)తో ఒక అవగాహన ఒప్పందంపై ఉత్తరాఖండ్ సంతకం చేసింది.
కేంద్రీకృత పెట్టుబడులు, సాంకేతికత స్వీకరణ, సంస్థాగత సంస్కరణల ద్వారా భారత ప్రభుత్వం ఆక్వాకల్చర్‌ను వ్యూహాత్మక వృద్ధి ఇంజిన్‌గా నిర్ణయాత్మకంగా ముందుకు నడిపిస్తోంది. ఆర్ఏఎస్, జాతుల వైవిధ్యాన్ని అధిక-విలువైన ఆక్వాకల్చర్‌గా మార్చడం... సామర్థ్యాలను పెంపొందించడం... మౌలిక సదుపాయాల కల్పన వంటి ఆధునిక వ్యవస్థలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా ప్రభుత్వం ఈ రంగాన్ని జీవనాధార పద్ధతుల నుంచి సాంకేతికత ఆధారిత, మార్కెట్ ఆధారిత వ్యవస్థగా మారుస్తోంది. ఉత్పాదకతను బలోపేతం చేయడం... రైతుల ఆదాయాన్ని పెంచడం... ప్రాంతీయ పరిమితులను తగ్గించడం... భారత ఆక్వాకల్చర్ సుస్థిరమైన, సులభంగా విస్తరించగల విధానాలతో పెరుగుతున్న దేశీయ డిమాండ్‌ను, పెరుగుతున్న ఎగుమతి అవకాశాలను తీర్చేలా చేయడం ఇందులో ఒక భాగం. జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో కోల్డ్ వాటర్ ఫిషరీస్ క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు భారత ప్రభుత్వ మత్స్యశాఖ అధికారికంగా ప్రకటించింది.
***
(रिलीज़ आईडी: 2211502)
आगंतुक पटल : 13