ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన 51 వేల మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందచేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
28 AUG 2023 1:36PM by PIB Hyderabad
నమస్కారం!
ఈ 'ఆజాదీ కా అమృతకాలం'లో దేశ స్వాతంత్య్ర పరిరక్షకులుగా, కోట్లాదిమంది దేశప్రజల సంరక్షకులుగా మారినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నేను మిమ్మల్ని 'అమృత్ రక్షకులు' అని పిలుస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు నియామక పత్రాలు పొందుతున్న యువత దేశానికి సేవ చేయడమే కాక, దేశ పౌరులను కూడా రక్షించనున్నారు. అందువల్ల ఒక విధంగా మీరు ప్రజల రక్షకులే కాక, ఈ ‘అమృతకాలానికి‘ చెందిన ‘అమృత రక్షకులు’ కూడా.
నా కుటుంబ సభ్యులారా,
ఈసారి ఈ రోజ్‌గార్ మేళా దేశమంతా గర్వంతోనూ, ఆత్మవిశ్వాసంతోనూ నిండిన వాతావరణంలో జరుగుతోంది. మన చంద్రయాన్, దాని రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై నుంచి నిరంతరం చిత్రాలను పంపుతూ చరిత్ర సృష్టిస్తున్నాయి. ఈ గర్వించదగిన క్షణంలో, మీరు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. విజయం సాధించిన అభ్యర్థులందరికీ, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మిత్రులారా,
సైన్యంలో చేరడం, రక్షణ దళాలలో చేరడం, పోలీస్ సేవలో చేరడం ద్వారా దేశ రక్షణకు కాపలాదారులుగా మారాలని ప్రతి యువకుడూ కలలు కంటాడు. కాబట్టి, మీపై గొప్ప బాధ్యత ఉంది. అందుకే, మీ అవసరాల విషయంలో కూడా మా ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో, బాధ్యతతో ఉంది.
గత కొన్నేళ్లుగా, పారామిలిటరీ దళాల నియామక ప్రక్రియలో మేము అనేక ముఖ్యమైన మార్పులు చేశాం. దరఖాస్తు నుంచి ఎంపిక వరకు ఉన్న ప్రక్రియను వేగవంతం చేశాం. పారామిలిటరీ దళాల నియామకానికి సంబంధించిన పరీక్షను ఇప్పుడు 13 స్థానిక భాషల్లో కూడా నిర్వహిస్తున్నారు. గతంలో అలాంటి పరీక్షలకు హిందీ లేదా ఆంగ్లంలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు మాతృభాషకు ప్రాధాన్యత లభించింది. ఈ మార్పు లక్షలాది మంది యువత ఉపాధి అవకాశాలను పొందడానికి దోహదపడింది.
గత ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్ ప్రభావిత జిల్లాల్లో వందలాది గిరిజన యువతకు నియామకాలు జరిగాయి. అభివృద్ధి ప్రక్రియలో వారు భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో నిబంధనలను సడలించి వారికి రక్షణ దళాల్లో చేరే అవకాశాన్ని కల్పించారు. అదే విధంగా సరిహద్దు జిల్లాలు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల యువత కోసం కానిస్టేబుల్ నియామక పరీక్షలో కోటాను కూడా పెంచారు. ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా పారామిలిటరీ దళాలు నిరంతరం మరింత బలపడుతున్నాయి.
మిత్రులారా,
దేశాభివృద్ధిలో మీరు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. భద్రత, శాంతిభద్రతల వాతావరణం అభివృద్ధి వేగాన్ని పెంచుతుంది. మీరు ఉత్తరప్రదేశ్ (యూపీ) ఉదాహరణను తీసుకోవచ్చు. ఒకప్పుడు యూపీ అభివృద్ధి పరంగా చాలా వెనుకబడి, నేరాల పరంగా చాలా ముందు ఉండేది. కానీ ఇప్పుడు చట్టబద్ధమైన పాలనతో, యూపీ అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుతోంది. ఒకప్పుడు ప్రజలు గూండాలు, మాఫియా భయంతో జీవించిన ఉత్తరప్రదేశ్‌లో, ఇప్పుడు భయం లేని సమాజాన్ని నెలకొల్పుతున్నారు. అటువంటి శాంతిభద్రతలు ప్రజలలో విశ్వాసాన్ని నింపుతాయి. నేరాల రేటు తగ్గడంతో యూపీలో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. పెట్టుబడి ప్రవాహం మొదలైంది. దీనికి విరుద్ధంగా, నేరాల రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో దానికి అనుగుణంగా పెట్టుబడులు తగ్గడం కూడా మనం చూస్తాం. అలాగే జీవనోపాధికి సంబంధించిన పనులన్నీ నిలిచిపోతాయి.
నా కుటుంబ సభ్యులారా,
ప్రస్తుతం, ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్టు మీరు నిరంతరం చదువుతున్నారు. ఈ దశాబ్దంలో భారత్ ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుంది. మరి నేను మీకు ఈ హామీని ఇచ్చినప్పుడు, లేదా మోదీ తన దేశ ప్రజలకు, కుటుంబ సభ్యులకు ఈ హామీని ఇచ్చినప్పుడు అది ఒక గొప్ప బాధ్యతతో కూడి ఉంటుంది. అయితే మీరు దీని గురించి చదివినప్పుడు ఒక ప్రశ్న మీమదిలోకి వస్తుంది. దేశంలోని సామాన్య పౌరులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న చాలా సహజమైనది.
మిత్రులారా,
ఏదైనా ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగాలంటే, దేశంలోని ప్రతి రంగం అభివృద్ధి చెందడం అవసరం. ఆహార రంగం నుండి ఔషధ రంగం వరకు, అంతరిక్షం నుంచి స్టార్టప్‌ల వరకు ప్రతి రంగం ముందుకు సాగినప్పుడు, ఆర్థిక వ్యవస్థ కూడా ముందుకు సాగుతుంది. మనం ఔషధ పరిశ్రమ ఉదాహరణ తీసుకుందాం. మహమ్మారి సమయంలో భారత ఔషధ పరిశ్రమ ఎన్నో ప్రశంసలందుకుంది. నేడు ఈ పరిశ్రమ విలువ రూ. 4 లక్షల కోట్లకు పైగా ఉంది. 2030 నాటికి భారత ఔషధ పరిశ్రమ విలువ సుమారు రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందని చెబుతున్నారు. ఈ ఔషధ పరిశ్రమ ముందుకు సాగుతోందంటే దాని అర్థం ఏమిటి? దీని అర్థం ఏమిటంటే, ఈ దశాబ్దంలో ఈ పరిశ్రమకు ఈ రోజు ఉన్నదాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంది యువత అవసరం అవుతుంది. అనేక కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.
మిత్రులారా,
నేడు, దేశంలోని ఆటోమొబైల్, ఆటో విడిభాగాల పరిశ్రమలు కూడా వేగవంతమైన వృద్ధిని చూస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు పరిశ్రమల విలువ రూ. 12 లక్షల కోట్లకు పైగా ఉంది. రాబోయే సంవత్సరాల్లో ఇది మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ వృద్ధిని నిర్వహించడానికి, ఆటోమొబైల్ పరిశ్రమకు కూడా పెద్ద సంఖ్యలో కొత్తగా యువత అవసరం అవుతుంది. కొత్త కార్మికులు అవసరమవుతారు. లెక్కలేనన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి. అలాగే ఇప్పుడు ఆహార శుద్ధి పరిశ్రమ ప్రాముఖ్యత గురించి చాలా చర్చ జరుగుతున్నట్టు మీరు గమనించే ఉంటారు. గత సంవత్సరం భారత ఆహార శుద్ధి మార్కెట్ విలువ సుమారు రూ. 26 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడు రాబోయే 3-3.5 సంవత్సరాలలో, ఈ రంగం విలువ సుమారు రూ. 35 లక్షల కోట్లు అవుతుంది. అంటే, ఇది ఎంత ఎక్కువగా విస్తరిస్తే, అంత ఎక్కువ మంది యువత అవసరం అవుతుంది. అంత ఎక్కువ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
మిత్రులారా,
నేడు భారతదేశంలో మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గత 9 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై రూ. 30 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఇది దేశవ్యాప్తంగా అనుసంధానతను విస్తరిస్తోంది. పర్యాటక, ఆతిథ్య రంగాలలో కొత్త అవకాశాలకు దారితీసింది. కొత్త అవకాశాలు అంటే, మరింత ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అర్థం.
మిత్రులారా,
2030 నాటికి, మన ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం వాటా రూ. 20 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. కేవలం ఈ పరిశ్రమ నుంచే 13 నుంచి 14 కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు రావచ్చు. ఈ ఉదాహరణలన్నింటి ద్వారా, భారతదేశ అభివృద్ధి కేవలం అంకెల పరుగు మాత్రమే కాదని మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ అభివృద్ధి భారతదేశంలోని ప్రతి పౌరుడి జీవితంపై ప్రభావం చూపుతుంది. దీని అర్థం ఏంటంటే పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఇది ఆదాయం, జీవన నాణ్యతలో పెరుగుదలను ఖాయం చేస్తోంది. ఒక రైతు కుటుంబంలో మంచి దిగుబడి వచ్చి, పంటలకు మంచి ధరలు లభిస్తే, ఆ ఇల్లు ఆనందంతో నిండిపోవడం కూడా మనం చూస్తాం. వారు కొత్త బట్టలు కొంటారు. బయటికి వెళ్లి కొత్త వస్తువులు కొనాలనిపిస్తుంది. ఇంటి ఆదాయం పెరిగితే ఆ కుటుంబ సభ్యుల జీవితాల్లో కూడా సానుకూలమైన మార్పు వస్తుంది. కుటుంబంలో మాదిరిగానే దేశం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. దేశ ఆదాయం పెరిగే కొద్దీ, దేశం శక్తి పెరుగుతుంది. సంపద పెరుగుతుంది. దేశ పౌరులు కూడా సంపన్నం కావడం ప్రారంభిస్తారు.
మిత్రులారా,
గత 9 సంవత్సరాలుగా మనం చేసిన కృషి కారణంగా మార్పులో మరో కొత్త దశ కనిపిస్తోంది. గత సంవత్సరం భారత్ రికార్డు స్థాయిలో ఎగుమతులు చేసింది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్తువులకు గిరాకీ నిరంతరం పెరుగుతోందనడానికి ఇది సూచన. దీని అర్థం ఏంటంటే, మన ఉత్పత్తి పెరిగింది. అదే సమయంలో ఉత్పత్తి ప్రక్రియలో కొత్తగా యువత అవసరం పెరగడం వల్ల ఉద్యోగాలు కూడా పెరిగాయి. సహజంగానే కుటుంబ ఆదాయం కూడా పెరుగుతోంది. ఈ రోజు భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారు. దేశంలో మొబైల్ ఫోన్లకు డిమాండ్ కూడా నిరంతరం పెరుగుతోంది. ప్రభుత్వ ప్రయత్నాలు కూడా మొబైల్ తయారీని అనేక రెట్లు పెంచాయి. ఇప్పుడు దేశం మొబైల్ ఫోన్లను దాటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీపై కూడా దృష్టి సారిస్తోంది
మొబైల్ రంగంలో మనం సాధించిన విజయాన్ని ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తి రంగంలో కూడా పునరావృతం చేయబోతున్నాం. మొబైల్ ఫోన్‌ల మాదిరిగానే, భారత్ లో తయారైన అత్యుత్తమ నాణ్యత గల ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌లు ప్రపంచవ్యాప్తంగా మన ఖ్యాతిని పెంచే రోజు ఎంతో దూరంలో లేదు. వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని అనుసరించి, భారత ప్రభుత్వం ‘మేడ్ ఇన్ ఇండియా’ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వంటి అనేక ఉత్పత్తులను కొనుగోలు చేయడంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. దీని ఫలితంగా దేశంలో తయారీ రంగం విస్తరిస్తూ, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. అందుకే నేను మరోసారి చెబుతున్నాను. ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థ చక్రాన్ని సక్రమంగా నడిపించి, దాన్ని కాపాడే బాధ్యత మీ అందరిపై ఎంతో ఉంది. మీరు ఇప్పుడు భద్రతా సిబ్బందిగా మీ సేవలను ప్రారంభిస్తున్న నేపథ్యంలోమీపై ఎంతటి బాధ్యత ఉందో మీరు ఊహించగలరు.
నా కుటుంబ సభ్యులారా,
ఈ రోజుతో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రారంభించి 9 సంవత్సరాలు పూర్తయింది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల, పేద ప్రజల ఆర్థిక సాధికారతతో పాటు ఉపాధి కల్పనలోనూ ప్రధాన పాత్ర పోషించింది. 9 సంవత్సరాల క్రితం, దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలకు కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదు. కానీ, జన్ ధన్ యోజన కారణంగా, గత 9 సంవత్సరాలలో 50 కోట్ల పైగా కొత్త బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఈ పథకం పేదలకు, గ్రామస్తులకు ప్రభుత్వ ప్రయోజనాలను నేరుగా అందించడంలో సహాయపడటమే కాకుండా, ఉద్యోగం, స్వయం ఉపాధి పరంగా మహిళలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులకు కూడా చాలా శక్తిని ఇచ్చింది.
ప్రతి గ్రామంలో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నప్పుడు లక్షలాది మంది యువతకు బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా, ‘బ్యాంకుమిత్ర‘ లుగా ఉద్యోగావకాశాలు లభించాయి. మన వేల సంఖ్యలో ఉన్న కొడుకులు, కూతుళ్లు బ్యాంక్ మిత్ర, బ్యాంక్ సఖి రూపంలో ఉపాధి పొందారు. ఈ రోజు, 21 లక్షల పైగా యువ మిత్రులు ప్రతి గ్రామంలో బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా, లేదా బ్యాంక్ మిత్రగా లేదా బ్యాంక్ సఖిగా సేవలు అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న డిజిటల్ సఖీలు మహిళలను, వృద్ధులను బ్యాంకింగ్ సేవలతో అనుసంధానిస్తున్నారు.
అదేవిధంగా, జన్‌ధన్ యోజన మరో భారీ ఉపాధి, స్వయం ఉపాధి ఉద్యమానికి ఊపునిచ్చింది. అదే ముద్ర యోజన. ఈ పథకం వల్ల మహిళలు సహా చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి రుణాలు పొందడం ఎంతో సులభమైంది. ఇంతకుముందు వారు అలాంటి రుణాల గురించి ఆలోచించడానికే వీలు ఉండేది కాదు. బ్యాంకులకు ఇవ్వడానికి ఎలాంటి గ్యారంటీ కూడా వీరి వద్ద ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్వయంగా వారి తరఫున గ్యారంటీగా నిలిచింది. ముద్ర యోజన కింద ఇప్పటివరకు రూ. 24 లక్షల కోట్లకు పైగా రుణాలు మంజూరు అయ్యాయి. ఈ లబ్ధిదారులలో దాదాపు 8 కోట్ల మంది ప్రజలు మొదటిసారిగా తమ వ్యాపారాన్ని ప్రారంభించిన వారు ఉన్నారు. అలాగే పీఎం స్వనిధి పథకం కింద, సుమారు 43 లక్షల మంది వీధి వ్యాపారులకు మొదటిసారిగా బ్యాంకుల నుంచి ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు అయ్యాయి. ముద్రా, స్వనిధి లబ్ధిదారులలో పెద్ద సంఖ్యలో మహిళలు, దళితులు, వెనుకబడిన వారు ఇంకా గిరిజన యువత ఉన్నారు.
జన్ ధన్ ఖాతాలు గ్రామాలలో ఉన్న మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయడంలో కూడా చాలా సహాయపడ్డాయి. ఈ రోజుల్లో, నేను గ్రామానికి వెళ్ళినప్పుడు, మహిళా స్వయం సహాయక బృందాల మహిళలను కలిసినప్పుడు, వారిలో చాలా మంది వచ్చి, 'నేను లక్షాధికారి దీదీ‘ని అని చెబుతున్నారు. ఇదంతా ఈ జన్ ధన్ ఖాతాల వల్లే సాధ్యమైంది. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం ఇప్పుడు మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతోంది. దేశంలో సామాజిక, ఆర్థిక మార్పు వేగవంతం కావడంలో జన్ ధన్ యోజన పోషించిన పాత్ర నిజంగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు ఒక పరిశోధనాంశంగా మారింది.
మిత్రులారా,
నేను ఇప్పటి వరకు రోజ్‌గార్ మేళాకు సంబంధించిన వివిధ కార్యక్రమాలలో లక్షలాది మంది యువతను ఉద్దేశించి మాట్లాడాను. ఆ యువత ప్రభుత్వ సేవల్లో లేదా ఇతర రంగాలలో ఉద్యోగాలు పొందారు. ప్రభుత్వంలోనూ, పాలనలోనూ మార్పు తీసుకురావాలనే లక్ష్యంలో మీ యువ మిత్రులందరూ నాకు అతిపెద్ద బలం. మీ అందరూ ప్రతిదీ ఒక క్లిక్‌తోనే అందుబాటులో ఉండే తరానికి చెందినవారే. అందుకే ప్రజలు ప్రతి సేవను వేగంగా అందుకోవాలని కోరుకుంటున్నారన్న విషయం మీకు బాగా తెలుసు. నేటి తరం సమస్యలకు తాత్కాలికంగా, విడివిడిగా పరిష్కారాలు కావాలని అనుకోవడం లేదు. శాశ్వతమైన పరిష్కారాలనే కోరుకుంటోంది. అందువల్ల ప్రజాసేవకులుగా మీరు తీసుకునే నిర్ణయాలు, నిర్వర్తించే బాధ్యతలు ప్రతి క్షణం ప్రజలకు దీర్ఘకాలంలో మేలు చేసేలా ఉండేందుకు మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.
ఈ తరం విజయాన్ని సాధించాలని నిశ్చయించుకుంది. ఈ తరం ఎవరి దయాదాక్షిణ్యాలు కోరుకోవడం లేదు. ఇందుకు ఒకటి ముఖ్యం. అదేమంటే, ఎవరూ వారి మార్గంలో అడ్డంకిగా మారకూడదు. అందువల్ల, ప్రజా సేవకులైన మీరు ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేయడానికి, వారి ఆశయాలను నెరవేర్చడానికి ఉంటుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకుని మీరు పనిచేస్తే, శాంతిభద్రతలను నిర్వహించడం మీకు మరింత సులభమవుతుంది.
మిత్రులారా,
పారామిలటరీ దళాలలో మీ ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తిస్తూనే, మీరు నిరంతర అభ్యాస ప్రక్రియను కూడా కొనసాగించాలి. మీలాంటి కర్మయోగుల కోసం ఐగాట్ కర్మయోగి పోర్టల్‌లో 600కు పైగా వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి. ఈ పోర్టల్‌లో 20 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు నమోదు చేసుకున్నారు. వారు ఆన్‌లైన్‌లో చదువుకుంటూ, పరీక్షలు కూడా రాస్తున్నారు.
మొదటి రోజు నుంచే మీరు అందరూ ఈ పోర్టల్‌లో చేరాలని నేను కోరుతున్నాను. మొదటి రోజే మీ వంతు ప్రయత్నాన్ని పూర్తిగా చేయాలని, వీలైనంత ఎక్కువ సర్టిఫికేట్ కోర్సులను పూర్తిచేసి, ఎక్కువ సర్టిఫికెట్లు పొందాలని నిర్ణయించుకోండి. మీరు నేర్చుకునే, తెలుసుకునే, అర్థం చేసుకునే ప్రతి విషయం పరీక్షలకే పరిమితం కాదు. అవి మీ జీవితాల్లోని బాధ్యతలను అత్యుత్తమంగా నిర్వహించేందుకు ఉపయోగపడతాయి. ఇవన్నీ మీకు గొప్ప అవకాశాలుగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
మిత్రులారా,
మీ రంగం యూనిఫామ్ ప్రపంచానికి చెందింది. మీరందరూ శారీరక దారుఢ్యం విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ పని ఒక నిర్దిష్ట సమయానికి మాత్రమే పరిమితం కాదు. మీరు అన్ని రకాల వాతావరణ వైపరీత్యాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ విభాగంలో పనిచేసే వారికి శారీరక దారుఢ్యం చాలా ముఖ్యం. శారీరక దారుఢ్యంతోనే సగం పని పూర్తవుతుంది. మీరు బలంగా నిలబడితే శాంతిభద్రతలను నిర్వహించడానికి మీరు అదనంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. మీరు అక్కడ ఉండటమే సరిపోతుంది.
రెండోది, మీరు మీ డ్యూటీ సమయంలో కొన్ని ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవచ్చు. చిన్న చిన్న విషయాల వల్ల ఒత్తిడి ఉండవచ్చు. నా అభిప్రాయం ప్రకారం, యోగా మీ జీవితంలో ఒక నిత్య సాధనగా ఉండాలి. సమతుల్యమైన మనస్సు మీ పనితీరును ఎంతో మెరుగుపరుస్తుందని మీరు గమనిస్తారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. ఆరోగ్యమైన మనస్సు కోసం, సమతుల్యమైన మనస్సు కోసం, అలాగే విధి నిర్వహణలో మీలాంటి వారు ఒత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు యోగాను జీవితంలో భాగంగా చేసుకోవడం అత్యంత అవసరం.
మిత్రులారా,
2047లో దేశం స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయానికి, మీరు ప్రభుత్వంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకుని ఉంటారు. దేశంలోని ఈ 25 సంవత్సరాలకు మీ జీవితంలోని ఈ 25 సంవత్సరాలకు అద్భుతమైన అనుబంధం ఉంది! కాబట్టి, మీరు ఇప్పుడు ఈ అవకాశాన్ని కోల్పోకూడదు. మీరు మీ సంపూర్ణ శక్తిని, సామర్థ్యాన్ని ఎంతవరకు అభివృద్ధి చేయగలరో అంతవరకు అభివృద్ధి చేసుకోండి. ఎంత వీలైతే అంతగా మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. సామాన్య ప్రజల కోసం మీరు మీ జీవితాలను ఎంత ఎక్కువగా అంకితం చేస్తే, జీవితంలో మీరు అంత ఎక్కువ సంతృప్తిని పొందుతారు. అది మీకు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో విజయం మీకు అపారమైన సంపూర్ణ సంతృప్తిని ఇస్తుంది.
మీకు నా శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులకు అనేక అభినందనలు! ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.
***
(रिलीज़ आईडी: 2210761)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam