ఉప రాష్ట్రపతి సచివాలయం
నూతన సంవత్సరం సందర్భంగా ఉపరాష్ట్రపతి సందేశం
प्रविष्टि तिथि:
01 JAN 2026 3:31PM by PIB Hyderabad
నూతన సంవత్సరం 2026కు మనం స్వాగతం పలుకుతున్న క్రమంలో, నేను దేశ విదేశాల్లో ని మన సోదరీసోదరులకు నేను హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
ఆత్మవిశ్వాసం, ఉమ్మడి సంకల్పం, దేశాభిమానాలు మరో సారి పుంజుకున్న సంవత్సరంగా 2025 సంవత్సరాన్ని జ్ఞాపకం పెట్టుకుంటారు. సార్వభౌమత్వాన్నీ, సురక్షనూ కాపాడుకోవడం మొదలు వివిధ రంగాల్లో ప్రపంచ శ్రేణిలో భారత స్థితిని బలపరచడం వరకూ.. లక్ష్యం పట్ల ఏకత్వం, స్పష్టమైన దృష్టికోణంతో దేశం ముందడుగు వేసింది.
భారత్ తన పౌరులను కాపాడుకోవడానికి ఎంతటి దృఢసంకల్పాన్ని కనబరుస్తుందో ఆపరేషన్ సిందూర్ స్పష్టంగా నిరూపించింది.. జయం ఎప్పటికీ న్యాయానిదీ, సురక్షదేనని ఉగ్రవాదులకూ, వారికి కొమ్ము కాసే వారికీ బలమైన సందేశాన్ని కూడా ఇచ్చింది.. మన సార్వభౌమత్వానికి ఎలాంటి ముప్పును తలపెట్టినా దృఢమైన, నిర్ణయాత్మకమైన చర్యలు ఉండి తీరుతాయని కూడా ఇది స్పష్టం చేసింది.
పార్లమెంటు ఈ సంవత్సరం చరిత్రాత్మక చట్టాల్ని ఆమోదించింది. ఈ చట్టాలు వికసిత్ భారత్ దిశగా దేశం దృఢంగా కదులుతోందని సూచిస్తున్నాయి. వందే మాతరం 150వ సంవత్సర స్మరణోత్సవం కూడా ఈ సంవత్సరంలో మరో విశిష్ట సందర్భం.
దేశ ప్రజలు అనేక చరిత్రాత్మక సందర్భాల్ని పూర్తి శ్రద్ధతో జరుపుకొన్నారు.. వాటిలో గురు తేగ్ బహాదుర్ జీ అమరత్వాన్ని పొంది 350 ఏళ్లు పూర్తి అయినందుకు గుర్తుగా నిర్వహించిన ఉత్సవం, భగవాన్ బిర్సా ముండా జీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ 150వ జయంతి, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిలతో పాటు శ్రీ అటల్ బీహారీ వాజ్‌పేయీ జీ శత జయంతి వంటివి ఉన్నాయి.
సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నాగరికత దృష్ట్యా చూసినా కూడా అనేక ముఖ్య విజయాలకు 2025 సంవత్సరం సాక్షిగా నిలిచింది. రామ మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం, మహాకుంభ్ వైభవోపేత నిర్వహణ ప్రపంచ దృష్టిని భారత చైతన్యవంత వారసత్వం వైపు ఆకర్షించాయి.
ఈ గౌరవంలో మరో అంశం జత కలిసింది.. దీపావళిని యునెస్కో అమూర్త సాంస్కృతిక వారసత్వ సూచీలో చేర్చింది. ఇది చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, అధర్మంపై ధర్మం గెలుస్తూ ఉంటాయన్న సార్వజనిక విలువలను పునరుద్ఘాటిస్తోంది.
కాశీ తమిళ్ సంగమం వంటి కార్యక్రమాలు భారత సాంస్కృతిక ఏకత్వాన్నీ, నాగరికతా బంధాల్నీ మరింత పటిష్ఠపరిచాయి.
సైన్సు, టెక్నాలజీ, అంతరిక్ష రంగాల్లో 2025లో భారత్ సాధించిన విజయాలు ప్రపంచ నవకల్పన కూడలిగా మన దేశానికి ఉన్న స్థానాన్ని మరింత బలోపేతం చేశాయి.
ఇస్రో నాయకత్వంలో సఫలమైన స్పేడెక్స్ మిషన్.. ఉపగ్రహాల డాకింగ్ సామర్థ్యాల్ని చాటిచెప్పింది. ఎల్‌వీఎమ్ 3-ఎం6 ప్రయోగం భారీ బరువును రోదసిలోకి మోసుకుపోయే విషయంలో భారత్ అంతకంతకూ తన సామర్థ్యాన్ని పెంచుకుంటోందని నిరూపించింది.
భారతీయ అంతరిక్ష యాత్రికుడు శ్రీ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టిన సాహసయాత్ర.. మనిషి అంతరిక్ష యాత్ర విషయంలో నానాటికీ పెరుగుతున్న భారత్ ఆకాంక్షలను సూచించిన ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది.
క్రీడాజగతిలో.. దేశం గర్వించే అనేక క్షణాల్ని 2025వ సంవత్సరం అందించింది.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని మన పురుషుల క్రికెట్ జట్టు ఒడిసిపట్టింది. కాగా ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్పును మొదటిసారి గెలుచుకొని భారతీయ మహిళా క్రికెట్ జట్టు చరిత్రను లిఖించింది.
ఖో ఖో ప్రపంచ కప్‌లో పురుషుల, మహిళల టైటిళ్లను రెండిటినీ భారతే చేజిక్కించుకుంది.
భారతీయ మహిళలు, పారా-అథ్లెట్లు ప్రధాన అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లలో అసాధారణ ప్రదర్శనతో దేశానికి సదా స్ఫూర్తిని అందిస్తున్నారు.
దివ్య దేశ్‌ముఖ్ మహిళల చదరంగం ప్రపంచ కప్ విజేతగా నిలిచారు.. శీతల్ దేవి పారా-ఆర్చరీ ప్రపంచ టైటిల్‌ను గెలిచారు.. ఈ ఘనతలు వ్యక్తిగత శ్రేష్ఠత్వానికి నిదర్శనాలు. మరో వైపు, మహిళల బ్లయిండ్ టీ20 ప్రపంచ కప్ ఆటల పోటీలో భారత్ గెలుపు ఉమ్మడి విజయానికి ప్రతీకగా ఉంది.
మనం 2026వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో.. ఈ కింద పేర్కొన్న అయిదు ప్రతిజ్ఞల్నీ స్వీకరించాల్సిందిగా భారతదేశ భావి సంరక్షకులైన మన యువతీయువకులకు నేను పిలుపునిస్తున్నాను.
1. మత్తుమందు తో పాటు అన్ని విధాలైన వ్యసనాల నుంచీ పూర్తిగా విముక్తులం అవుతాం.. క్రమశిక్షణ, స్పష్టత, లక్ష్యంతో కూడిన జీవనాన్ని గడుపుతాం.
2. సాంకేతిక విజ్ఞానాన్ని బాధ్యతయుతంగానూ, నైతికతతోనూ అనుసరిస్తాం.. నవకల్పననీ, డిజిటల్ పరికరాలనీ దేశ నిర్మాణానికీ, సమ్మిళిత అభివృద్ధి సాధనకీ ఉపయోగిస్తాం.
3. యోగా, క్రీడలతో పాటు చురుకైన, సమతూకంతో కూడిన జీవనశైలిని అలవరుచుకొని శారీరక, మానసిక ఆరోగ్య రక్షణపై దృష్టిని కేంద్రీకరిస్తాం.
4. రాజ్యాంగ విలువలనీ, సమగ్రతనీ, సామాజిక సద్భావననీ పరిరక్షిస్తాం.. భారత్‌లో ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేస్తాం.
5. సేవ, పనిలో శ్రేష్ఠత్వం, భారత్ ఆదర్శాల పట్ల నిబద్ధత.. వీటిని అవలంబిస్తూ దేశ పురోగతికి నిస్వార్థంగా తోడ్పడుతాం.
ఈ విలువలు మనకు మార్గాన్ని చూపుతుండగా మన యువతీయువకుల శక్తి నుంచి స్ఫూర్తి పొందుతూ, మన సుసంపన్న సాంస్కృతిక పరంపరతో మమేకమవుతూ భారత్‌ను 2047వ సంవత్సరానికల్లా ‘వికసిత్ భారత్’లా తీర్చిదిద్దే దిశగా మన దేశం ముందుకు ముందుకు సాగిపోతూనే ఉంటుంది.
కొత్త ఏడాది మనందరికీ శాంతినీ, సమృద్ధినీ, పురోగతినీ ప్రసాదించుగాక.
మీ అందరికీ నూతన సంవత్సరం 2026 ఆరోగ్యప్రదం, సమృద్ధం, సంతోషకరంగా మారాలని నేను కోరుకుంటున్నాను.
జై హింద్. భారత మాతకు సదా జయమగు గాక.
***
(रिलीज़ आईडी: 2210612)
आगंतुक पटल : 18