రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

21వ శతాబ్దపు మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు: అనుసంధానతలో సరికొత్త యుగానికి సారథ్యం వహిస్తున్న భారతీయ రైల్వేలు


ఇంజనీరింగ్ అద్భుతాలు: ఆర్థిక కార్యకలాపాలు, ప్రయాణ సౌకర్యాలను మారుస్తున్న బైరబీ-సైరాంగ్ మార్గం, కొత్త పాంబన్ వంతెన, చినాబ్ వంతెన

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈశాన్య భారత్‌లో 60 రైల్వే స్టేషన్ల అభివృద్ధి

प्रविष्टि तिथि: 30 DEC 2025 5:24PM by PIB Hyderabad

21వ శతాబ్దపు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను భారతీయ రైల్వే చేపడుతోంది. ఆధునిక రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించటం, రవాణాను మెరుగుపరుస్తూ జాతీయ సమైక్యతను ఇవి మరింత దృఢంగా చేస్తున్నాయి. పెరుగుతున్న భారత్ ఇంజనీరింగ్ సామర్థ్యం, దీర్ఘకాలిక దార్శనికతను ప్రతిబింబిస్తూ హై-స్పీడ్ రైలు మార్గాలు, రవాణా కారిడార్ల నుంచి భౌగోళికంగా కష్టతరమైన ప్రాంతాల్లో అద్భుతమైన వంతెనలను భారతీయ రైల్వే నిర్మిస్తోంది. 

ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం (యూఎస్‌బీఆర్ఎల్) అనేది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటి. ఇది అధిక వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు. దీనికి జాతీయ ప్రాముఖ్యత కూడా ఉంది. హిమాలయ ప్రాంతం గుండా వెళ్లే ఈ 272 కిలోమీటర్ల మార్గాన్ని సుమారు రూ. 44,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చి వంతెన అయిన చినాబ్ రైల్వే వంతెన ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంది. ఐఫిల్ టవర్ కంటే ఎత్తైన ఈ వంతెన నదీ మట్టానికి 359 మీటర్ల పైన ఉంది. భూకంపాలు, బలమైన గాలులను తట్టుకునేలా రూపొందించిన ఈ ఉక్కు ఆర్చి వంతెన 1,315 మీటర్ల పొడవు కలిగి ఉంది.

చినాబ్ రైల్వే వంతెన

అంజి రైల్వే వంతెనగా అంజి నదిపై నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి కేబుల్ రైల్వే వంతెన కూడా ఈ ప్రాజెక్టులోనే ఉంది. ఈ ప్రాజెక్టులో 943 వంతెనలు, 36 సొరంగ (119 కిలోమీటర్ల పొడవు) మార్గాలు ఉన్నాయి. కాశ్మీర్ లోయకు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ నిరంతర రైలు అనుసంధానతలను యూఎస్‌బీఆర్ఎల్ అందిస్తుంది. ఈ ప్రాంతంలో పర్యాటకం, రవాణా సౌకర్యాల కల్పన, ఆర్థిక కార్యకలాపాలను ఇది వేగవంతం చేస్తోంది.

అంజి రైల్వే వంతెన

రైల్వేలు సాధించిన మరొక ప్రధాన విజయం తమిళనాడులోని కొత్త పాంబన్ రైల్వే వంతెన. భారతదేశపు మొట్టమొదటి వర్టికల్-లిఫ్ట్ సముద్ర వంతెన ఇది. మొత్తం 100 స్పాన్‌లను కలిగి ఉన్న ఈ 2.08 కిలోమీటర్ల పొడవైన వంతెనను సుమారు రూ. 550 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో ఒక ప్రధాన స్పాన్ 72.5 మీటర్ల ఉండగా మిగతా 99 స్పాన్‌లు ఒక్కొక్కటి 18.3 మీటర్లు ఉన్నాయి.

నిర్మాణ స్థిరత్వం ఉండేలా 101 పైల్ క్యాప్‌లు, 333 పైల్స్‌తో కూడిన బలమైన సబ్‌స్ట్రక్చర్ వ్యవస్థను ఈ వంతెన కలిగి ఉంది. బరువును సమర్థవంతంగా మోయడానికి వీలుగా ఈ వంతెనలో 99 అప్రోచ్ గర్డర్లు కూడా ఉన్నాయి. తీరప్రాంతంలోని బలమైన గాలుల, తీవ్ర సముద్ర వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దీనిని నిర్మించారు. వంతెన ఎక్కువ రోజులు మన్నికగా ఉండేలా చూసుకునేందుకు ఇందులో తుప్పు పట్టకుండా నిరోధించే వ్యవస్థను ఉపయోగించారు. దీని ద్వారా వంతెన ఎటువంటి నిర్వహణ లేకుండా 38 ఏళ్లు, కనీస నిర్వహణతో 58 ఏళ్ల వరకు పనిచేస్తుంది. 

ముఖ్యమైన పర్యాటక, పుణ్యక్షేత్రమైన రామేశ్వరానికి నిరంతర రైలు అనుసంధానాన్ని ఈ కొత్త వంతెన నిర్ధరిస్తుంది. అత్యున్నత రూపకల్పన, ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని తెలియజేసేలా ఈ కొత్త పాంబన్ రైల్వే వంతెన ప్రతిష్ఠాత్మకమైన 'స్టీల్ స్ట్రక్చర్స్ అండ్ మెటల్ బిల్డింగ్స్ అవార్డు 2024'ను దక్కించుకుంది.

పాంబన్ రైల్వే వంతెన

ఈశాన్య ప్రాంతంలో కూడా భారతీయ రైల్వేలు గొప్ప పురోగతిని సాధించాయి. చాలా సంవత్సరాలుగా అనుసంధానత విషయంలో ఈ ప్రాంతం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో 2014 సంవత్సరం నుంచి 1,679 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన రైల్వే పట్టాలు వేశారు. సుమారు 2,500 కంటే ఎక్కువ కిలోమీటర్లు రైల్వే మార్గం విద్యుదీకరణ పూర్తైంది. దాదాపు 470 కంటే ఎక్కువ రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు నిర్మాణమయ్యాయి. బైరబీ-సైరాంగ్ కొత్త రైల్వే మార్గం ఇప్పుడు పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల మొట్టమొదటిసారిగా రైల్వే నెట్‌వర్క్‌లో ఐజ్వాల్ చేరింది. జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఈశాన్య భారతంలోని నాలుగో రాష్ట్ర రాజధానిగా ఐజ్వాల్ నిలిచింది.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈశాన్య ప్రాంతంలోని అరవై స్టేషన్లు పునరాభివృద్ధి అవుతున్నాయి. జిరిబామ్-ఇంఫాల్, డిమాపూర్-కోహిమా, సీవోక్-రంగ్‌పో వంటి ప్రధాన ప్రాజెక్టులు కూడా స్థిరంగా పురోగమిస్తున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాలతో ఈశాన్య ప్రాంత సామాజిక, ఆర్థిక ఏకీకరణను ఈ ప్రాజెక్టులు మెరుగుపరుస్తున్నాయి.

బైరాబి-సైరాంగ్ రైలు మార్గంలో 144వ వంతెన (కుతుబ్ మినార్ కంటే 42 మీటర్లు పొడవు ఎక్కువ)

ప్రత్యేక సరకు రవాణా కారిడార్ (డీఎఫ్‌సీ) ద్వారా ఈ రంగాన్ని భారతీయ రైల్వేలు మారుస్తున్నాయి. లూధియానా నుంచి సోన్‌నగర్ వరకు 1,337 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న తూర్పు ప్రత్యేక సరకు రవాణా కారిడార్ (ఈడీఎఫ్‌సీ) పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ టెర్మినల్‌ను దాద్రీతో అనుసంధానించే 1,506 పొడవైన పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌లో (డబ్ల్యూడీఎఫ్‌సీ)1,404 కిలోమీటర్లు అంటే 93.2 శాతం వరకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

ఈ రెండు కారిడార్లు కలిపి మొత్తం 2,843 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ఇందులో 2,741 కిలోమీటర్లు అంటే సుమారు 96.4 శాతం మార్గం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికుల రైలు మార్గాల్లో రద్దీని ఈ ప్రత్యేక కారిడార్లు గణనీయంగా తగ్గిస్తున్నాయి. పరిశ్రమలు, ఓడరేవుల విశ్వసనీయతను పెంచుతూ రవాణా ఖర్చులు, సమయాన్ని ఇవి తగ్గిస్తున్నాయి. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి తోడ్పడుతూ భారతదేశపు సరుకు రవాణా వ్యవస్థను ఈ డీఎఫ్‌సీలు బలోపేతం చేస్తున్నాయి.

హై-స్పీడ్ రైల్వేల విషయంలో కూడా భారతీయ రైల్వేలు ముందుకు సాగుతున్నాయి. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఎస్‌ఆర్‌సీఎల్) ముంబయి-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్వే ప్రాజెక్టును చేపడుతోంది. మొత్తం 508 కిలోమీటర్ల మార్గంలో 2025 డిసెంబర్ 21 నాటికి 331 కిలోమీటర్ల వయాడక్ట్ పనులు పూర్తయ్యాయి. 410 కిలోమీటర్ల మేర పిల్లర్ల పనులు పూర్తయ్యాయి. పదకొండు స్టీల్ వంతెనలు, ఐదు పీఎస్‌సీ వంతెనలు, పదిహేడు నదీ వంతెనల నిర్మాణం ఇప్పటికే పూర్తైంది. సుమారు 272 ట్రాక్ కిలోమీటర్ల మేర ఆర్‌సీ ట్రాక్ బెడ్, 4100 కంటే ఎక్కువ విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని ప్రధాన సొరంగం పనులు పురోగతిలో ఉన్నాయి. అహ్మదాబాద్, సూరత్‌లలో రోలింగ్ స్టాక్ డిపోల నిర్మాణం కొనసాగుతోంది. 

ఈ ప్రాజెక్టు ప్రపంచ స్థాయి హై-స్పీడ్ రైల్ సాంకేతికతను భారతదేశానికి తీసుకువస్తుంది. దేశంలోని రెండు ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య ప్రయాణ సమయాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది.

ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగమైన సూరత్ జిల్లాలోని వయాడక్ట్ 

దేశాభివృద్ధిలో భారతీయ రైల్వేల పాత్రను ఈ చారిత్రాత్మక ప్రాజెక్టులు తెలియజేస్తున్నాయి. అత్యాధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలు, భారీ స్థాయి వ్యయాన్ని ఇవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ పనుల ద్వారా వివిధ ప్రాంతాల జాతీయ సమైక్యతను బలపరచటం, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతూ అనుసంధానతను మెరుగుపరిచే విషయంలో భారతీయ రైల్వేలు ముందుకు సాగుతున్నాయి.

 

***


(रिलीज़ आईडी: 2210087) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , Kannada , English , Urdu , Bengali-TR , Bengali