జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘జేఎస్‌జేబీ’ పురస్కార ప్రక్రియపై జలశక్తి మంత్రిత్వ శాఖ వివరణ.. తప్పుదోవ పట్టించే సమాచారంపై ఖండన

प्रविष्टि तिथि: 30 DEC 2025 11:28PM by PIB Hyderabad

దేశంలో జల సంరక్షణను ప్రజా ఉద్యమంగా మలచే దిశగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2024 సెప్టెంబరు 6న ‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’ (జేఎస్‌జేబీ) పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జల పునఃపూరణ కోసం స్వల్ప వ్యయంతో కృత్రిమ వ్యవస్థల నిర్మాణానికి ప్రజలు, ప్రైవేటు భాగస్వాములను ఒకే వేదికపైకి తెచ్చే ఏకోన్ముఖ విధానాన్ని ‘జేఎస్‌జేబీ’ అనుసరిస్తుంది. ఈ మేరకు పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్రీయ సాంకేతికత-సంప్రదాయ పద్ధతుల సమ్మేళనంతో తన కార్యాచరణను అమలు చేస్తుంది. ఇందుకోసం విరాళాల సేకరణ సహా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌రెగా), జిల్లా ఖనిజ నిధి, కాంపా నిధులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత, సామాజిక భాగస్వామ్యం, శ్రమదానం వంటి పద్ధతులను ప్రోత్సహిస్తుంది. తద్వారా భవనాల పైకప్పు వర్షపు నీటి సమీకరణ వ్యవస్థలు, ఇంకుడు గుంటలు, వట్టిపోయిన బోరుబావుల పునరుద్ధరణ వంటి కార్యకలాపాలు చేపడుతుంది. అందువల్ల, ఇది క్షేత్రస్థాయి పథకం కాగా, దీనికింద కార్యాచరణలో స్థానిక పాలన సంస్థలు కీలకపాత్ర పోషిస్తాయి.

ఈ కార్యక్రమాలను జీఐఎస్‌ సమన్వయ వ్యవస్థలు, జియో ట్యాగ్ ఛాయాచిత్రాలు, ఆర్థిక వివరాలు ప్రాతిపదికగా ప్రతి జల పునఃపూరణ నిర్మాణ పనులను ఆన్‌లైన్ వేదిక ‘జేఎస్‌జేబీ డాష్‌బోర్డు' ద్వారా పర్యవేక్షిస్తారు. జిల్లాల నుంచి అందే వివరాలన్నీ ఆయా జిల్లాల అధికారులతోపాటు మంత్రిత్వ శాఖ బహుళ స్థాయి పరిశీలనలకు లోబడి ఉంటాయి. అలాగే నాణ్యత, ప్రామాణికత నిర్ధారణ కోసం కనీసం ఒక శాతం పనులను స్వతంత్రంగా క్షేత్రస్థాయిలో ధ్రువీకరించుకోవచ్చు. అయితే, అవతవకలు చోటు చేసుకోకుండా చూడటం కోసం మిగిలిన 99 శాతం పనులను ‘జేఎస్‌జేబీ’ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ విధంగా ధ్రుకీకృత సమాచారం ప్రాతిపదికన జలశక్తి మంత్రిత్వశాఖ 2025 నవంబరు 18న విజ్ఞాన్ భవన్‌లో తొలి ‘జేఎస్‌జేబీ’ అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించింది. తద్వారా జిల్లాలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, వ్యక్తిగత విరాళ ప్రదాతలు, పారిశ్రామిక సంఘాల ఆదర్శప్రాయ జల సంరక్షణ కృషికి గుర్తింపునిస్తుంది. ఈ పురస్కారం కింద లభించే ప్రోత్సాహక నగదు బహుమతిని తిరిగి జల సంరక్షణ కార్యకలాపాల కోసమే వెచ్చిస్తూ, కార్యక్రమ లక్ష్యాల దిశగా మరింత కృషిని కొనసాగించాలి.

అయితే, ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందించిన ఆహ్వాన పత్రికలు, నకిలీ చిత్రాలను కొన్ని సామాజిక మాధ్యమ వేదికలలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ విధంగానే చిన్న గోతులు తవ్వి, వాటిని పెద్ద నీటి వనరులుగా చిత్రీకరించి కూడా అవార్డు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిలో కొన్ని పోస్టులు ‘క్యాచ్ ది రెయిన్’ (సీటీఆర్‌) పోర్టల్ నుంచి స్క్రీన్‌షాట్లు తీసి, పాత-సంబంధం లేని చిత్రాలను  జోడించి కూడా పంపినట్లు తేలింది. దీంతో ఇటువంటి మోసపూరిత పద్ధతుల ద్వారానే అవార్డుకు విజేతలను ఎంపిక చేసినట్లు కథనాలు వస్తున్నాయి. కానీ, ఇవన్నీ ఆరోపణలు మాత్రమేనని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. కానీ, పురస్కారం కోసం ఎంపిక ప్రక్రియ పూర్తిగా డ్యాష్‌బోర్డులోని సమాచారం ప్రాతిపదికన మాత్రమే సాగుతుందని స్పష్టం చేసింది.

వాస్తవానికి ‘సీటీఆర్‌’ పోర్టల్ పూర్తి ప్రత్యేక వేదిక కాబట్టి, అక్కడ పోస్ట్ చేసిన చిత్రాలను అవార్డు ఎంపిక ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోబోమని తెలిపింది. ఈ పోర్టల్‌లో కృత్రిమ మేధ ఆధారిత లేదా మోసపూరిత చిత్రాలు పోస్ట్‌ అయినప్పటికీ, సంబంధిత జిల్లాలు వాటిని ధ్రువీకరిస్తాయి కనుక,  ‘జేఎస్‌జేబీ’ ఎంపిక ప్రక్రియపై అవి ఎలాంటి ప్రభావం చూపబోవని పేర్కొంది. ఆ మేరకు అనుమానాస్పద ఛాయాచిత్రాలు ‘సీటీఆర్‌’ పోర్టల్ నుంచి తీసి, పంపినట్లు తెలుపుతూ అవార్డు ప్రక్రియలో వాటిని పరిగణనలోకి తీసుకోలేదని జిల్లా పాలన సంస్థలు కూడా స్పష్టం చేశాయి. అంతేగాక సామాజిక మాధ్యమాలలో ప్రచారంలోగల చిత్రాల వాస్తవికతను నేషనల్ వాటర్ మిషన్ పూర్తిగా పరిశీలించి, అవి ‘జేఎస్‌జేబీ’ పనులకు సంబంధించినవి కాదని ధ్రువీకరించింది.

అందువల్ల, అవార్డులకు ఎంపికలో చిత్రాల తారుమారు లేదా దుర్వినియోగం వంటి వాదనలను జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇలాంటి సమాచారం ప్రజలను తప్పుదోవ పట్టించడంతోపాటు ఫీల్డ్ ఆఫీసర్లు, సామాజిక కార్యకర్తల నైతికతను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా దేశ జల భద్రతకు ఉద్దేశించిన కీలక జాతీయ కృషిని నీరుగారుస్తుందని స్పష్టం చేసింది. పారదర్శకత, జవాబుదారీతనం, ఆయా పనుల కఠిన ధ్రువీకరణ ప్రక్రియల అమలు సహా అక్రమాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

 

***


(रिलीज़ आईडी: 2210083) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Kannada