ఉప రాష్ట్రపతి సచివాలయం
శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్
పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజా సేవతో ముడిపడిన వాజ్‌పేయి పాలనా విధానం
పౌరులు పారదర్శకత, నైతిక ప్రవర్తన, సహానుభూతిని కొనసాగించాలని సుపరిపాలన దినోత్సవం పిలుపునిస్తుంది
వాజ్‌పేయి పరిపాలనా విధానం వికసిత్ భారత్-2047 దార్శనికతకు స్ఫూర్తి
प्रविष्टि तिथि:
25 DEC 2025 8:46PM by PIB Hyderabad
మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో నిర్వహించిన సుపరిపాలన దినోత్సవ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి... దార్శనికులు, కవి, అంకితభావం గల ప్రజా సేవకులుగా శ్రీ వాజ్‌పేయి చేసిన సేవలను ప్రముఖంగా ప్రస్తావించారు. శ్రీ వాజ్‌పేయి అసమాన వాక్చాతుర్యం, వినయం, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత సంక్లిష్టమైన ఎన్నో దేశీయ, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపించాయన్నారు. ఆయన అందించిన సుపరిపాలన బలమైన, సుసంపన్న భారత్‌కు పునాది వేసిందని ఆయన స్పష్టం చేశారు. శ్రీ వాజ్‌పేయి పాలనా విధానం పారదర్శకత, జవాబుదారీతనం, సమ్మిళితత్వం, సమాజంలోని అన్ని వర్గాలకు సేవ చేయడం అనే సూత్రాలపై ఆధారపడి ఉందని శ్రీ రాధాకృష్ణన్ తెలిపారు.
శ్రీ వాజ్‌పేయి పదవీకాలంలో చేపట్టిన కీలక కార్యక్రమాలనూ ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీ వాజ్‌పేయి పాలనా విధానం ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విలువలు, జాతీయ ఏకాభిప్రాయంతో ముడిపడిందని ఆయన స్పష్టం చేశారు.
సుపరిపాలనను సమష్టి బాధ్యతగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి... ప్రభుత్వాలు, నిర్వాహకులు, సంస్థలు, పౌర సమాజం సహా పౌరులంతా పారదర్శకమైన, నైతిక విలువలు గల, జవాబుదారీ పాలనను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. వికసిత్ భారత్-2047 దార్శనికతకు అనుగుణంగా అభివృద్ధి చెందిన, సమ్మిళితమైన, సమర్థమైన దేశాన్ని నిర్మించడం కోసం ఆయన అనుసరించిన ఈ సూత్రాలను కొనసాగించాలని శ్రీ రాధాకృష్ణన్ కోరారు.
ఈ కార్యక్రమంలో సత్యవాది రాజా హరిశ్చంద్ర గురించిన ఒక నాటకాన్నీ ప్రదర్శించారు. ఇది పురాణాల్లోని రాజు హరిశ్చంద్రుడు ఆచరించిన సత్యం, సమగ్రత, నిస్వార్థ సేవ సూత్రాలకు ప్రతీకగా శ్రీ వాజ్‌పేయి జీవితాన్ని అనుసంధానిస్తుంది.
ఈ కార్యక్రమాన్ని గాంధీ స్మృతి - దర్శన్ సమితి, హెరిటేజ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష్ మల్హోత్రా... ఢిల్లీ శాసనసభ స్పీకర్ శ్రీ విజేందర్ గుప్తా... గాంధీ స్మృతి-దర్శన్ సమితి వైస్ చైర్మన్ శ్రీ విజయ్ గోయెల్... ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
****
(रिलीज़ आईडी: 2208726)
आगंतुक पटल : 16