ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ‘జాతీయ స్ఫూర్తి ప్రదాన ప్రాంగణాన్ని’ ప్రారంభించిన ప్రధానమంత్రి
“దేశాన్ని ఆత్మగౌరవం.. ఐక్యత.. సేవ వైపు నడిపించిన దార్శనికతకు ఈ ప్రాంగణం ఒక ప్రతీక”
సమష్టి కృషితో ‘వికసిత భారత్’ సంకల్పం సాకారమవుతుంది”
“మేము అంత్యోదయ ఆదర్శానికి సంతృప్త స్థాయిని… అంటే- పరిపూర్ణత అనే కొత్త దృక్కోణాన్ని జోడించాం”
प्रविष्टि तिथि:
25 DEC 2025 5:23PM by PIB Hyderabad
-
మాజీ ప్రధాని అటల్ బిహారీ శ్రీ వాజ్‌పేయి 101వ జయంతి నేపథ్యంలో ఆయన జీవితం, ఆదర్శాల గౌరవపూర్వక సంస్మరణ దిశగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్మించిన ‘జాతీయ స్ఫూర్తి ప్రదాన ప్రాంగణాన్ని (రాష్ట్ర ప్రేరణా స్థల్)ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- లక్నో నగరం ఇవాళ ఓ నవ్య స్ఫూర్తికి సాక్షిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. అలాగే, దేశ ప్రజలతోపాటు యావత్ ప్రపంచంలోని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో లక్షలాది కుటుంబాలు నేడు ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం నింపాలన్నదే ప్రజానీకం సమష్టి ఆకాంక్షగా ఆయన పేర్కొన్నారు.
భరతమాత విశిష్ట పుత్రులలో ఇద్దరి జయంతి ఏటా డిసెంబరు 25వ తేదీన వస్తుందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ మేరకు మేరునగ సమానులైన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి, భారతరత్న-మహామన శ్రీ మదన్ మోహన్ మాలవీయ…. దేశం గుర్తింపు, ఐక్యత, గౌరవాల పరిరక్షణలో తమ జీవితాలను అంకితం చేశారని శ్రీ మోదీ కొనియాడారు. ఈ మహనీయులిద్దరూ తమ అసమాన సేవలతో దేశ ప్రగతిపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.
మహారాజా బిజ్లీ పాసి జయంతి కూడా ఇదే డిసెంబర్ 25వ తేదీన వస్తుందని, ఈ ప్రసిద్ధ కోట కార్యక్రమ ప్రాంగణానికి సమీపంలోనే ఉందని గుర్తుచేశారు. సుపరిపాలన, శౌర్యపరాక్రమాలు, సార్వజనీనత సహిత వారసత్వాన్ని మహారాజా బిజ్లీ పాసి మనకు ఇచ్చి వెళ్లారని పేర్కొన్నారు. ఆయన వారసత్వాన్ని పాసి సమాజం సగర్వంగా కొనసాగిస్తున్నదని ప్రశంసించారు. మహారాజా గౌరవార్థం 2000 సంవత్సరంలో అటల్ జీ ప్రత్యేక తపాలా బిళ్లను ఆవిష్కరించడాన్ని ఒక యాదృచ్ఛిక సంఘటనగా అభివర్ణించారు. ఈ సందర్భంగా మహామన మాలవీయ, శ్రీ వాజ్‌పేయిలతోపాటు మహారాజాకు కూడా ఆయన సగౌరవ నివాళి అర్పించారు.
భారతదేశానికి ఆత్మగౌరవం, ఐక్యత, సేవా మార్గం చూపిన మహనీయుల దార్శనికతకు ప్రతీకగా కాసేపటి కిందటే ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించే అదృష్టం తనకు లభించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంగణంలో డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయిల భారీ విగ్రహాలు సగర్వంగా నిలిచాయన్నారు. దేశ ప్రజానీకానికి వారందించే స్ఫూర్తిని మించినది మరేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీ అటల్ వ్యాఖ్యాలను ఉటంకిస్తూ- ఈ ప్రాంగణం మన ప్రతి అడుగు, ప్రతి ప్రయత్నం దేశ పురోగమనానికి అంకితం కావాలనే సందేశాన్నిస్తుందని చెప్పారు. సమష్టి కృషితోనే వికసిత భారత్ స్వప్నం సాకారం కాగలదని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ ఆధునిక స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు కావడంపై లక్నోనగర వాసులతోనే కాకుండా ఉత్తరప్రదేశ్ సహా యావద్దేశానికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ ప్రాంగణం నిర్మించిన ప్రదేశంలో 30 ఎకరాలకు పైగా భూమి దశాబ్దాల పాటు చెత్త పర్వతం పేరుకుపోయిందని పేర్కొన్నారు. దీన్నంతటినీ గడచిన మూడేళ్లలో పూర్తిగా తొలగించారని ఆయన తెలిపారు. తద్వారా ఈ ప్రాజెక్టు సాకారం కావడానికి దోహదం చేసిన కార్మికులు, కళాకారులు, ప్రణాళిక రూపకర్తలందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలుపుతూ వారి కృషి అపారమని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రికి, ఆయన బృందానికి కూడా ప్రత్యేక ప్రశంసలు తెలిపారు.
దేశానికి దిశానిర్దేశంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నిర్ణయాత్మక పాత్ర పోషించారని చెప్పారు. భారత్లో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానమంత్రుల నిబంధనను తిరస్కరించింది ఆయనేనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా జమ్మూకాశ్మీర్ విషయంలో ఈ ఏర్పాటు దేశ సమగ్రతకు గొడ్డలిపెట్టుగా నిలిచిందని గుర్తుచేశారు. అయితే, అందుకు కారణమైన ఆర్టికల్ 370 అడ్డుగోడను కూల్చే అవకాశం తమ ప్రభుత్వానికే లభించిందన్నారు. అందుకే, ఇవాళ జమ్మూకాశ్మీర్‌లో భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలవుతున్నదని శ్రీ మోదీ సగర్వంగా ప్రకటించారు.
స్వతంత్ర భారత తొలి పరిశ్రమల శాఖ మంత్రిగా దేశ ఆర్థిక స్వావలంబనకు డాక్టర్ ముఖర్జీ పునాది వేశారని ప్రధానమంత్రి చెప్పారు. తొలి పారిశ్రామిక విధానంతో దేశంలో పారిశ్రామికీకరణకు పునాది వేశారని గుర్తుచేశారు. ఆయన బాటలో, అదే స్వావలంబన మంత్రంతో దేశాన్ని నేడు సమున్నత శిఖరాలకు చేరుస్తున్నామని తెలిపారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌నే ఉదాహరణగా స్వీకరిస్తే- ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ పేరిట భారీ కార్యక్రమం అమలవుతోందని, తద్వారా చిన్న పరిశ్రమలు, చిన్న యూనిట్లు బలోపేతం అవుతున్నాయని శ్రీ మోదీ అన్నారు. మరోవైపు ఈ రాష్ట్రంలో ఒక భారీ రక్షణ కారిడార్ నిర్మాణం చేపట్టినట్లు గుర్తుచేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచానికి మన శక్తిసామర్థ్యాలు చాటిన బ్రహ్మోస్ క్షిపణి లక్నోలోనే తయారవుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో ఉత్తరప్రదేశ్ రక్షణ కారిడార్ అంతర్జాతీయ గుర్తింపు పొందే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.
పండిట్ శ్రీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ దశాబ్దాల కిందట కలలగన్న ‘అంత్యోదయ’ సూత్రాన్ని ఉటంకిస్తూ- వరుసలో నిలుచునే చివరి వ్యక్తి ముఖంలోనూ చిరునవ్వునే దేశ ప్రగతికి కొలబద్దగా ఆయన పరిగణించారని గుర్తుచేశారు. ఆయన ప్రబోధించిన సమగ్ర మానవతావాదం మన శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ.. అన్నిటినీ వికసింపజేస్తుందని స్పష్టం చేశారు. దీన్‌దయాళ్ స్వప్నాన్ని తన సొంత సంకల్పంగా స్వీకరించిన నేపథ్యంలో ‘అంత్యోదయ’కు సంతృప్త స్థాయి పేరిట సరికొత్త దృక్కోణాన్ని జోడించామని చెప్పారు. తద్వారా ప్రతి నిరుపేదను, అర్హుడైన ప్రతి లబ్ధిదారును ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలోకి తెస్తున్నామని శ్రీ మోదీ పేర్కొన్నారు. సంతృప్తత స్ఫూర్తితో కృషి చేస్తే వివక్ష తావుండదని, నిజమైన సుపరిపాలన, వాస్తవిక సామాజిక న్యాయం, అసలుసిసలు లౌకికవాదం తదిరాలకు ఇదే తార్కాణమని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ రోజున దేశంలోని లక్షలాది పౌరులు ఎలాంటి వివక్ష లేకుండా తొలిసారి పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, కొళాయి నీరు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు తదితరాలన్నిటినీ పొందుతున్నారని ఆయన గుర్తుచేశారు. ఇక లక్షలాది మందికి తొలిసారి ఉచిత రేషన్, ఉచిత వైద్యం సమకూరాయని తెలిపారు. వరుసలో నిలిచిన చిట్టచివరి వ్యక్తికీ చేరువయ్యేందుకు కృషి చేస్తేనే పండిట్ దీన్‌దయాళ్ ఆశయానికి న్యాయం చేసినట్లు కాగలదని పునరుద్ఘాటించారు.
దేశవ్యాప్తంగా గత దశాబ్దంలో కోట్లాది ప్రజలు పేదరిక విముక్తులయ్యారని శ్రీ మోదీ చెప్పారు. సమాజంలో వెనుకబడిన, చివరి వరుసలోగల వారికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. దేశంలో 2014కు ముందు సామాజిక భద్రత పథకాల పరిధిలోగల ప్రజల సంఖ్య సుమారు 25 కోట్లు కాగా, నేడు దాదాపు 95 కోట్ల మంది ప్రజల జీవితాలకు ఈ రక్షణ కవచం భరోసా ఇస్తున్నదని తెలిపారు. ఈ లబ్ధిదారులలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రవాసులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు బ్యాంకు ఖాతాలే కాకుండా జీవిత బీమా రక్షణ కూడా సంపన్నులైన కొద్దిమందికే పరిమితమై ఉండేదని ప్రధానమంత్రి ఉదాహరించారు. అయితే, చిట్టచివరి పంక్తిలో ఉన్న వ్యక్తికీ బీమా రక్షణ కల్పించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకున్నదని ఆయన ఉద్ఘాటించారు. ఈ మేరకు నామమాత్రపు రుసుముతో రూ.2 లక్షల బీమా సదుపాయం కల్పిస్తూ ‘ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన’ను ప్రారంభించామని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా 25 కోట్లకుపైగా పేదలు ఈ పథకం కింద రక్షణ పొందుతున్నారని ఆయన తెలిపారు. అలాగే ప్రమాద బీమా దిశగా ‘ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన’ కింద దాదాపు 55 కోట్ల మంది పేదలకు భద్రత లభించిందని చెప్పారు. గతంలో బీమా గురించి కలలోనైనా ఆలోచించలేని వారికీ నేడు సామాజిక భద్రత లభిస్తున్నదని వివరించారు. ఈ పథకాల కింద ఇప్పటికే దాదాపు రూ.25వేల కోట్ల విలువైన లబ్ధిదారుల క్లెయిమ్‌లు పరిష్కరించడం గురించి తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. సంక్షోభ సమయాల్లో ఈ సొమ్ము పేద కుటుంబాలకు అండగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
అటల్ జీ జయంతి సుపరిపాలనను జరుపుకునే రోజు కూడా అని ప్రధానమంత్రి అన్నారు. చాలా కాలం పాటు పేదరిక నిర్మూలన వంటి నినాదాలనే పాలనగా పరిగణించారని, అయితే అటల్ జీ నిజంగా సుపరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకువచ్చారని ఆయన అన్నారు. ఈ రోజు డిజిటల్ గుర్తింపుపై విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పటికీ, దానికి పునాదులు వేసింది అటల్ జీ ప్రభుత్వమేనని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఆ సమయంలో ప్రారంభించిన ప్రత్యేక కార్డు కార్యక్రమం నేడు ఆధార్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో టెలికాం విప్లవాన్ని వేగవంతం చేసిన ఘనత కూడా అటల్ జీకే దక్కుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఆయన ప్రభుత్వం రూపొందించిన టెలికాం విధానం ప్రతి ఇంటికి ఫోన్లు, ఇంటర్నెట్‌ను సులభంగా చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించిందని, ఫలితంగా నేడు ప్రపంచంలోనే అత్యధిక మొబైల్, ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్న దేశాలలో భారత్ ఒకటిగా నిలిచిందని ఆయన తెలిపారు.
గత పదకొండు సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా ఎదిగిందని ఈ విషయం అటల్ జీకి సంతోషాన్ని కలిగిస్తుందని శ్రీ మోదీ అన్నారు. అటల్ జీ పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం భారతదేశంలో మొబైల్ తయారీలో మొదటి స్థానంలో ఉందని ఆయన ప్రముఖంగా చెప్పారు.
కనెక్టివిటీపై అటల్ జీ దూరదృష్టి 21వ శతాబ్దపు భారతదేశానికి ప్రారంభ దశలోనే బలాన్ని ఇచ్చిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అటల్ జీ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలను రోడ్లతో కలిపే కార్యక్రమం ప్రారంభమైందని, స్వర్ణ చతుర్భుజి రహదారి విస్తరణ పనులు ఆనాడే మొదలయ్యాయని గుర్తు చేశారు. దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అటల్ జీ వేసిన పునాది నేటి ప్రగతికి కారణమని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద 2000 సంవత్సరం నుంచి సుమారు 8 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణం జరిగిందని, వీటిలో దాదాపు 4 లక్షల కిలోమీటర్ల రోడ్లను గత 10-11 సంవత్సరాలలో నిర్మించారని చెప్పారు. నేడు దేశవ్యాప్తంగా అపూర్వ వేగంతో ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం అసాధారణ వేగంతో జరుగుతోందని, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్రంగా గుర్తింపు పొందుతోందని ఆయన తెలిపారు. ఢిల్లీ మెట్రోకు కూడా అటల్ జీ శ్రీకారం చుట్టారని ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. నేడు దేశంలోని 20కి పైగా నగరాలలో మెట్రో నెట్‌వర్క్‌లు లక్షలాది ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్నాయని అన్నారు. శ్రీ వాజ్ పేయి ప్రభుత్వం సృష్టించిన సుపరిపాలన వారసత్వాన్ని కేంద్రం, రాష్ట్రాలలోని తమ ప్రభుత్వాలు ఇప్పుడు మరింత విస్తరించి, కొత్త కోణాలను ఇస్తున్నాయని ఆయన తెలిపారు.
డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయీల స్ఫూర్తితో పాటు దూరదృష్టితో కూడిన వారి కృషి, వారి భారీ విగ్రహాలు అభివృద్ధి చెందిన భారతదేశానికి బలమైన పునాదిగా నిలుస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ విగ్రహాలు నేడు దేశమంతటా కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుతున్నాయని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో జరిగిన ప్రతి మంచి పనిని ఒకే కుటుంబంతో అనుసంధానించే ధోరణి ఎలా ఏర్పడిందో మరచిపోవద్దని ఆయన స్పష్టం చేశారు. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తుల కీర్తిని పెంచడానికి వారి పేర్లు, విగ్రహాలతో పుస్తకాలు, ప్రభుత్వ పథకాలు, సంస్థలు, వీధులు లేదా కూడళ్ళను అనుసంధానం చేశారని విమర్శించారు. ఇలా ఒకే కుటుంబం చేతిలో బందీ అయిన పాత విధానం నుంచి దేశానికి తమ పార్టీ విముక్తి కల్పించిందని ఆయన స్పష్టం చేశారు. మాతృభూమి సేవలో అమరులైన ప్రతి ఒక్కరినీ తమ ప్రభుత్వం గౌరవిస్తోందని ప్రధాని తెలిపారు. ఉదాహరణగా, నేడు ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం సగర్వంగా నిలిచి ఉందని, అలాగే అండమాన్‌లో నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన దీవికి ఇప్పుడు ఆయన పేరే పెట్టామని పేర్కొన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని చెరిపివేయడానికి ఎలా ప్రయత్నాలు జరిగాయో ఎవ్వరూ మర్చిపోలేరని ప్రధాని పేర్కొన్నారు. ఈ పాపాన్ని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలే చేశాయని ఆయన అన్నారు. అయితే బాబాసాహెబ్ వారసత్వం నశించకుండా తమ పార్టీ కాపాడిందని ఆయన స్పష్టం చేశారు. నేడు ఢిల్లీ నుంచి లండన్ వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ పంచతీర్థాలు ఆయన మహత్తర వారసత్వాన్ని ఘనంగా చాటుతున్నాయని ఆయన తెలిపారు.
వందలాది సంస్థానాలుగా విడిపోయిన దేశాన్ని సర్దార్ పటేల్ ఏకం చేశారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. కానీ, స్వాతంత్ర్యం తరువాత ఆయన కృషిని, ఆయన హోదాను తగ్గించే ప్రయత్నాలు జరిగాయని, అయితే సర్దార్ పటేల్‌కు నిజంగా దక్కవలసిన గౌరవాన్ని తమ పార్టీ ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. సర్దార్ పటేల్‌కు అంకితంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహాన్ని తమ ప్రభుత్వమే నిర్మించిందని, అలాగే స్ఫూర్తిదాయక కేంద్రంగా ఏక్తా నగర్‌ను అభివృద్ధి చేశామని ప్రధాని తెలిపారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జాతీయ ఏక్తా దినోత్సవ ప్రధాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఇదే ప్రదేశంలో దేశం నిర్వహిస్తోందని ఆయన తెలియజేశారు.
గిరిజన సమాజాల సేవలకు దశాబ్దాల పాటు తగిన గుర్తింపు లభించలేదని శ్రీ మోదీ గుర్తు చేశారు. భగవాన్ బిర్సా ముండా మహత్తర స్మారకాన్ని తమ ప్రభుత్వమే నిర్మించిందని, అలాగే కొన్ని వారాల క్రితమే ఛత్తీస్‌గఢ్‌లో షహీద్ వీర్ నారాయణ్ సింగ్ గిరిజన మ్యూజియాన్ని ప్రారంభించామని ఆయన చెప్పారు. దేశమంతటా ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయని పేర్కొంటూ, ఉత్తరప్రదేశ్‌లో మహారాజా సుహేల్దేవ్ స్మారకం కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఏర్పాటయిందని ప్రధాని స్పష్టం చేశారు. నిషాదరాజు, శ్రీరాముడు కలుసుకున్న స్థలానికి ఇప్పటికి తగిన గౌరవం లభించిందని ఆయన తెలిపారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ నుంచి చౌరి చౌరా అమరవీరుల వరకు భరతమాత వీర బిడ్డల సేవలను తమ ప్రభుత్వం పూర్తి గౌరవంతో, వినయంతో గుర్తు చేసుకుందని ఆయన తెలిపారు.
కుటుంబాధారిత రాజకీయాలు భిన్నమైన, అభద్రతా భావంతో నిండిన ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటాయని, ఈ పరిస్థితి ఇతరుల విలువను తగ్గించి తమ కుటుంబాన్ని గొప్పగా చూపించడానికి, తమ ప్రభావాన్ని నిలుపుకోవడానికి నేతలను ప్రేరేపిస్తుందని శ్రీ మోదీ అన్నారు. ఈ ధోరణి భారత్లో రాజకీయ అస్పృశ్యతను పరిచయం చేసిందని వ్యాఖ్యానించారు.స్వతంత్ర భారతదేశంలో ఎందరో ప్రధానమంత్రి పదవులు నిర్వహించినప్పటికీ ఢిల్లీలోని మ్యూజియం చాలామందికి ప్రాముఖ్యత ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితిని తమ ప్రభుత్వమే సరిచేసిందని, నేడు ఢిల్లీలో సందర్శకులు వెళ్లినప్పుడు, అద్భుతమైన ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం వారిని స్వాగతిస్తుందని, స్వతంత్ర భారతదేశంలో స్వల్ప కాలం పనిచేసిన వారితో సహా ప్రతి ప్రధాని ఇందులో తగిన గౌరవం, సముచిత స్థానం పొందారని శ్రీ మోదీ తెలిపారు.
ప్రతిపక్షం, దాని మిత్రపక్షాలు తమ పార్టీని ఎప్పుడూ రాజకీయంగా అస్పృశ్యంగా ఉంచారని, అయితే తమ పార్టీ విలువలు ప్రతి ఒక్కరికీ గౌరవం కల్పించడం నేర్పిస్తాయని ఆయన అన్నారు. గత 11 సంవత్సరాల్లో, తమ ప్రభుత్వం శ్రీ నరసింహరావు, శ్రీ ప్రణబ్ ముఖర్జీలకు భారతరత్న అవార్డులు ఇచ్చిందని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. శ్రీ ములాయం సింగ్ యాదవ్, శ్రీ తరుణ్ గొగోయ్ వంటి నాయకులను కూడా తమ ప్రభుత్వం జాతీయ అవార్డులతో గౌరవించిందని, ప్రతిపక్షాలు, వాటి మిత్రపక్షాల పాలనలో ఇతర పార్టీల నాయకులకు అవమానం మాత్రమే ఎదురయ్యేదని, అటువంటి ప్రతిపక్షాల నుంచి ఈ విధమైన గౌరవం ఎన్నటికీ ఆశించలేమని ఆయన అన్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు ఉత్తర ప్రదేశ్‌కు గొప్ప ప్రయోజనం చేకూర్చాయని ప్రధానమంత్రి చెప్పారు. 21వ శతాబ్దపు భారతదేశంలో ఈ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపును పొందుతోందని అన్నారు. ఉత్తర ప్రదేశ్ నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న తాను, కష్టించే మనస్తత్వం ఉన్న ఈ రాష్ట్ర ప్రజలు కలసి ఒక కొత్త భవిష్యత్తును నిర్మిస్తున్నారని చెప్పడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. గతంలో ఉత్తర ప్రదేశ్ పేలవమైన శాంతిభద్రతల గురించి చర్చ జరిగేదని, కానీ, నేడు ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి చర్చించుకుంటున్నారని ఆయన అన్నారు. దేశ పర్యాటక పటంలో ఉత్తరప్రదేశ్ వేగంగా ఎదుగుతోందని, అయోధ్యలోని మహత్తర రామ మందిరం, కాశీ విశ్వనాథ ధామ్ రాష్ట్ర కొత్త గుర్తింపును ప్రపంచానికి తెలియజేస్తున్న చిహ్నాలుగా మారుతున్నాయని ప్రధాని తెలిపారు. రాష్ట్ర ప్రేరణ స్థల్ వంటి ఆధునిక నిర్మాణాలు ఉత్తరప్రదేశ్ కొత్త ముఖచిత్రాన్ని మరింత ప్రకాశింప చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
సుపరిపాలన, సౌభాగ్యం, నిజమైన సామాజిక న్యాయానికి ఒక నమూనాగా ఉత్తర ప్రదేశ్ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రేరణా స్థల్ ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి అభినందనలు తెలియజేశారు.
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ పంకజ్ చౌధరి, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, స్వతంత్ర భారతదేశ మహానుభావుల వారసత్వాన్ని గౌరవించేందుకు ఏర్పాటయిన రాష్ట్ర ప్రేరణా స్థల్, భారతదేశ అత్యంత గౌరవనీయ రాజనీతిజ్ఞులలో ఒకరి జీవితం, ఆశయాల శాశ్వత వారసత్వానికి నివాళిగా నిలుస్తుంది. ఆయన నాయకత్వం దేశ ప్రజాస్వామ్య, రాజకీయ, అభివృద్ధి ప్రయాణంపై చెరగని ముద్ర వేసింది.
రాష్ట్ర ప్రేరణా స్థల్ ను ఒక చారిత్రాత్మక జాతీయ స్మారక చిహ్నంగా, శాశ్వత జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్ఫూర్తిదాయక ప్రాంగణంగా అభివృద్ధి చేశారు. సుమారు రూ. 230 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాంగణం 65 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. నాయకత్వ విలువలు, జాతీయ సేవ, సాంస్కృతిక చైతన్యం, ప్రజా స్ఫూర్తిని పెంపొందించడానికి అంకితమైన శాశ్వత జాతీయ సంపదగా దీనిని తీర్చిదిద్దారు.
భారతదేశ రాజకీయ ఆలోచన, దేశ నిర్మాణం, ప్రజా జీవితానికి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన మౌలిక సేవలకు గుర్తింపుగా వారి 65 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాలను ఈ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. ఇందులో సుమారు 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, తామర పువ్వు ఆకారంలో రూపొందించిన ఒక అత్యాధునిక మ్యూజియం కూడా ఉంది. ఈ మ్యూజియం భారతదేశ జాతీయ ప్రయాణాన్ని, ఈ దార్శనిక నాయకుల సేవలను అధునాతన డిజిటల్, ఆధునిక సాంకేతికతల ద్వారా ప్రదర్శిస్తుంది. ఇది సందర్శకులకు ఆకర్షణీయమైన, విజ్ఞానవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.
రాష్ట్ర ప్రేరణా స్థల్ ప్రారంభోత్సవం నిస్వార్థ నాయకత్వం, సుపరిపాలన ఆదర్శాలను పరిరక్షించడంలోనూ, ప్రోత్సహించడంలోనూ ఒక ముఖ్యమైన ఆవిష్కరణ. ఇది ప్రస్తుత, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2208725)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam