ఆయుష్
ఆయుష్ విధానాలను ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలతో అనుసంధానించేందుకు న్యూఢిల్లీలో సమావేశమైన డబ్ల్యూహెచ్ఓ, ఆయుష్ మంత్రిత్వశాఖ
प्रविष्टि तिथि:
22 DEC 2025 4:08PM by PIB Hyderabad
సంప్రదాయ వైద్య విధానాలను ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలతో అనుసంధానించే దిశగా ఒక కీలక అడుగు పడింది. దీనిలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ 20, 21 తేదీల్లో న్యూఢిల్లీలోని హోటల్ ఇంపీరియల్‌లో సంప్రదాయ వైద్య విధివిధానాలపై రెండు రోజులపాటు సాంకేతిక ప్రాజెక్టు సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మే 24, 2025న ఆయుష్ మంత్రిత్వ శాఖ, డబ్ల్యూహెచ్ ఓ మధ్య కుదిరిన చారిత్రాత్మక అవగాహన ఒప్పందం, దాతృత్వ ఒప్పందం స్పూర్తిగా నిలిచాయి. ఆరోగ్య సేవలను వర్గీకరించడానికి ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెల్త్ ఇంటర్వెన్షన్స్ (ఐసీహెచ్ఐ)లో సంప్రదాయ వైద్యానికి సంబంధించిన మాడ్యూల్‌ను అభివృద్ధి చేయడానికి ఈ ఒప్పందం కీలకంగా పనిచేయనుంది. ఆయుర్వేదం, సిద్ధ, యునానీ వైద్య విధానాలను ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ప్రధాన వ్యవస్థలోకి తీసుకురావడానికి అవసరమైన ఆర్థిక, సాంకేతిక మౌలిక సదుపాయాలను కల్పించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు ఆయుష్ వైద్య విధానాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రపంచవ్యాప్తంగా గరిష్ట సంఖ్యలో ప్రజలను చేరుకునేందుకు సహాయపడతాయని ఆయన తెలిపారు. మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రమాణీకరించిన విధానం ఆయుష్ వ్యవస్థలకు అంతర్జాతీయ గుర్తింపు, శాస్త్రీయ విశ్వసనీయతను తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు. అంతకముందు ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా ప్రస్తావిస్తూ.. ప్రత్యేక ఐసీహెచ్‌ఐ మాడ్యూల్ ఏర్పాటుతో ఆయుష్ వ్యవస్థలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని అన్నారు. సమగ్రమైన, సురక్షితమైన, ఆధారిత ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించేందుకు డబ్ల్యూహెచ్ ఓ చేస్తున్న ప్రయత్నాలకు ఇది మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
సాంకేతిక సమావేశాలకు ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి కవితా గార్గ్ అధ్యక్షత వహించారు. ఆమె నేతృత్వంలో భారత బృందం ఆయుర్వేదం, సిద్ధ, యునానీ వైద్యం కోసం జాతీయ ఆరోగ్య విధానా అభివృద్ధికి కృషి చేసింది. ఆమె మార్గదర్శకత్వంలో అనేక మంది నిపుణులు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారాన్ని అందించారు. వారిలో సీసీఆర్ఏఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ రబినారాయణ ఆచార్య, సీసీఆర్ఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ ఎన్.జె. ముత్తుకుమార్, సీసీఆర్ యూఎమ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాహీర్ అహ్మద్ ఉన్నారు.
ఈ సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఆరు ప్రాంతాలైన ఏఎఫ్ఆర్ ఓ, ఏఎమ్ఆర్ఓ, ఈఎమ్ ఆర్ఓ, ఈయూఆర్ఓ, సీఈఏఆర్ఓ, డబ్ల్యూపీఆర్ఓ నుంచి విస్తృత స్థాయిలో ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది సాంప్రదాయ వైద్యంపై సమగ్రమైన ప్రపంచ దృక్పథాన్ని అందించడానికి దోహదపడింది. జెనీవాలోని డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయం ప్రతినిధులైన రాబర్ట్ జాకబ్, నెనాద్ కొస్తాంజ్సెక్, స్టెఫాన్ ఎస్పినోసా, డాక్టర్ ప్రదీప్ దువా వంటి కీలక ప్రతినిధులు వర్గీకరణ చర్చలకు నాయకత్వం వహించారు. వీరితోపాటు జామ్‌నగర్‌లోని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ సంప్రదాయ వైద్య కేంద్రానికి చెందిన డాక్టర్ గీతా కృష్ణన్, ఢిల్లీలోని డబ్ల్యూహెచ్ఓ సీఈఏఆర్ఓ ప్రాంతం నుంచి డాక్టర్ పవన్ కుమార్ గోడాత్వర్ కూడా పాల్గొన్నారు. భూటాన్, బ్రెజిల్, భారత్, ఇరాన్, మలేసియా, నేపాల్, మారిషస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఫిలిప్పీన్స్, యూకే, అమెరికా వంటి సభ్య దేశాలు ఈ సమావేశంలో పాల్గొని, తమ తమ దేశాల్లోని ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడంతో పాటు, వైద్య విధానాలను పరస్పరం సమన్వయం చేసుకునే దిశగా చర్చించాయి.
సాంప్రదాయ వైద్యాన్ని ఐసీహెచ్‌ఐలో చేర్చడం అత్యంత కీలకం. ఎందుకంటే ఈ చికిత్సా విధానాలు వివిధ దేశాలు, వైద్య వ్యవస్థల మధ్య ఆరోగ్య ప్రక్రియలకు సంబంధించి ఒక సాధారణ పరిభాషను అందిస్తుంది. ఈ విధానాలను ప్రమాణీకరించడం ద్వారా ఆరోగ్య సేవలను అందించే వారు సంప్రదాయ చికిత్సల వినియోగం, అవి ఎంత తరుచుగ్గా అమలవుతుతున్నాయి, వాటి ప్రభావం ఎంత వరకు ఉందనే అంశాలను సరైన విధంగా నమోదు చేయడం, నివేదించడం, విశ్లేషించడానికి వీలవుతుంది. ఈ ప్రాజెక్టును ప్రపంచ ఆరోగ్య సంస్థ కచ్చితమైన సమయపాలనతో పూర్తిగా శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబిస్తూ అమలు చేయనుంది. ఇది కేవలం వైద్య పరిశోధనలకు, విధాన రూపకల్పనకు మద్దతివ్వడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయ ఆరోగ్య సమాచార వ్యవస్థల్లో సాంప్రదాయ వైద్యాన్ని విస్తృతంగా అమలు చేసేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2207569)
आगंतुक पटल : 6