ఆయుష్
అస్సాంలోని నామరూప్‌లో అమ్మోనియా-యూరియా ఎరువుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
అస్సాం వేగాన్ని అందుకున్న అభివృద్ధి... రైతు సంక్షేమమే కేంద్రంగా మా ప్రభుత్వ ప్రయత్నాలు
వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, రైతులకు మద్దతునివ్వడానికే
ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, దల్హన్ ఆత్మనిర్భరతా మిషన్
సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ దార్శనికత మార్గనిర్దేశంలో పేదల జీవితాలను మార్చిన మా ప్రయత్నాలు: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
21 DEC 2025 6:38PM by PIB Hyderabad
అస్సాంలోని దిబ్రూగఢ్‌లో గల నామరూప్ లో అస్సాం వ్యాలీ ఫర్టిలైజర్-కెమికల్ కంపెనీకు చెందిన అమ్మోనియా-యూరియా ఎరువుల ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ మోదీ... ఇది చౌలుంగ్ సుఖపా, మహావీర్ లచిత్ బోర్ఫుకాన్ వంటి గొప్ప వీరుల భూమి అని వ్యాఖ్యానించారు. భీంబర్ దేవూరి, షహీద్ కుషాల్ కున్వర్, మోరన్ రాజు బోడౌసా, మాలతీ మేమ్, ఇందిరా మిరి, స్వర్గదేవ్ సర్బానంద సింగ్, పరాక్రమానికి మారుపేరుగా నిలిచే సతీ సాధని వంటి వారి సహకారాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. పరాక్రమం, త్యాగాలకు నిలయమైన ఉజాని అస్సాం పవిత్ర నేలకు నమస్కరిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు.
తనముందు కనిపిస్తున్న అశేష ప్రజానీకం చూపుతున్న ఆప్యాయత మరవలేనిదని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. పెద్ద సంఖ్యలో తల్లులు, ఆడపడుచులు ఇక్కడకు రావడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. వారు తెచ్చిన ప్రేమ, ఆశీర్వాదాలు అసాధారణమైనవని ఆయన తెలిపారు. అస్సాం తేయాకు తోటల సువాసనను మోసుకుని చాలా మంది మహిళలు ఇక్కడకు వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సువాసన అస్సాంతో తనకు గల సంబంధంలో ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సభకు హాజరైన వారందరికీ నమస్కరించిన ఆయన, వారు చూపిన ఆప్యాయత, ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.
అస్సాంతో పాటు ఈశాన్య ప్రాంతాలన్నింటికీ ఈ రోజు చరిత్రాత్మకమైనదని శ్రీ మోదీ తెలిపారు. నామ్ రూప్, దిబ్రూఘర్ ప్రాంతాల చిరకాల స్వప్నం నెరవేరిందనీ, ఈ ప్రాంతంలో పారిశ్రామిక పురోగతికి నూతన అధ్యాయం ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి కిందట తాను అమ్మోనియా-యూరియా ఎరువుల కర్మాగారానికి భూమి పూజ చేశానన్నారు. దిబ్రూఘర్‌కు చేరుకునే ముందు గౌహతి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ను ప్రారంభించానని ఆయన తెలిపారు. అస్సాం ఇప్పుడు అభివృద్ధిలో కొత్త వేగాన్ని అందుకుందని అందరూ చెబుతున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, అస్సాంను మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. అహోం రాజ్యంలో అస్సాం బలం, కీలక పాత్రను ఆయన గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి చెందిన భారత్‌లో అస్సాం అంతే శక్తిమంతమైన పాత్రను పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. కొత్త పరిశ్రమల ప్రారంభం, ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం, సెమీ కండక్టర్ల తయారీ, వ్యవసాయంలో కొత్త అవకాశాలు, టీ తోటలు, వాటి కార్మికుల పురోగతి, పర్యాటక రంగంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ఆయన వివరించారు. అస్సాం ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందుతోందన్న ప్రధానమంత్రి... ఆధునిక ఎరువుల కర్మాగార ప్రారంభం పట్ల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గౌహతి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభమైనందుకు ప్రజలను అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలు, కనెక్టివిటీలు కలిసి అస్సాం కలలను సాకారం చేస్తున్నాయనీ, యువత పెద్ద కలలు కనేలా స్ఫూర్తినిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో దేశంలోని రైతులు, అన్నదాతలు కీలక పాత్ర పోషిస్తున్నారని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలు అత్యంత ప్రాధాన్యంగా భావిస్తూ పనిచేస్తోందనీ, రైతు అనుకూల పథకాలను అందరికీ విస్తరిస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు. వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలతో పాటు, రైతులకు నిరంతర ఎరువుల సరఫరాను నిర్ధారించడం చాలా అవసరమని ఆయన గుర్తు చేశారు. రాబోయే కాలంలో ఈ కొత్త యూరియా ప్లాంట్ సరిపడా సరఫరాకు భరోసానిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఏటా 12 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులను ఉత్పత్తి చేసే ఎరువుల ప్రాజెక్టులో దాదాపు రూ.11,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. స్థానికంగా ఉత్పత్తి జరుగుతున్నందున సరఫరా వేగంగానే ఉంటుందనీ, సరుకు రవాణా ఖర్చులూ తగ్గుతాయని ఆయన స్పష్టం చేశారు.
నామరూప్ యూనిట్ ఉపాధికి, స్వయం ఉపాధి కోసం వేలాది కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్న శ్రీ మోదీ... ఈ ప్లాంట్ కార్యాకలాపాలు ప్రారంభమైన వెంటనే చాలా మందికి స్థానికంగా శాశ్వత ఉద్యోగాలు లభిస్తాయన్నారు. మరమ్మతు, సరఫరా, ఇతర సంబంధిత కార్యకలాపాల వంటి అనుబంధ పనులూ యువతకు ఉపాధి కల్పిస్తాయని శ్రీ మోదీ తెలిపారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని శ్రీ మోదీ అన్నారు. నామ్ రూప్ చాలా కాలంగా ఎరువుల ఉత్పత్తికి కేంద్రంగా ఉండేదన్నారు. ఒకప్పుడు ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఎరువులు ఈశాన్య ప్రాంతాల పొలాలను బలోపేతం చేసి, రైతుల పంటలకు మద్దతునిచ్చాయని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎరువుల సరఫరా ఒక సవాలుగా ఉన్నప్పటికీ, నామ్ రూప్ రైతులకు మాత్రం ఇది ఆశాజనకంగానే ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే, కాలక్రమేణా పాత మొక్కల సాంకేతికత పాతబడిపోయిందని, గత ప్రభుత్వాలు దానిని పట్టించుకోలేదని ఆయన తెలిపారు. ఫలితంగా నామ్ రూప్ ప్లాంట్‌లోని అనేక యూనిట్లను మూసివేయడంతో ఈశాన్య ప్రాంత రైతులు ఇబ్బందుల్లో పడ్డారు... వారి ఆదాయాలు దెబ్బతిన్నాయి... వ్యవసాయ ఇబ్బందులు పెరుగుతున్నాయి.... గత ప్రభుత్వం సృష్టించిన ఈ సమస్యలను ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తున్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
అస్సాంలో మాదిరిగానే అనేక ఇతర రాష్ట్రాల్లో ఎరువుల కర్మాగారాలు కూడా మూతపడ్డాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆ సమయంలో రైతులు యూరియా కోసం పొడవైన క్యూల్లో నిలబడాల్సి వచ్చిందనీ, దుకాణాల వద్ద పోలీసులను మోహరించడమే కాకుండా రైతులపై లాఠీ ఛార్జీలు జరిగిన సంఘటనలూ ఉండేవని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్షాలు ఈ పరిస్థితులను మరింత దిగజార్చాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని సరిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ఎరువుల కర్మాగారాలు మూతపడితే... ప్రస్తుత ప్రభుత్వ హాయాంలో గోరఖ్‌పూర్, సింద్రీ, బరౌని, రామగుండంలలో అనేక ప్లాంట్లు ప్రారంభమయ్యాయని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్నీ ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రయత్నాల ఫలితంగానే యూరియా రంగంలో భారత్ స్వయం-సమృద్ధి దిశగా పయనిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
"2014లో దేశం కేవలం 225 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే ఉత్పత్తి చేసింది. ఈ రోజు ఉత్పత్తి దాదాపు 306 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది" అని ప్రధానమంత్రి తెలిపారు. అయితే ఏటా దాదాపు 380 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మన రైతులకు అవసరమనీ, ఈ అంతరాన్ని తగ్గించడం దిశగా ప్రభుత్వం వేగంగా పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. విదేశాల నుంచి అధిక ధరలకు దిగుమతి చేసుకున్న యూరియా కూడా రైతులపై భారం పడటానికి కారణమైందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వమే సబ్సిడీల రూపంలో ఆ ఖర్చును భరిస్తోందని శ్రీ మోదీ తెలిపారు. భారత రైతులు కేవలం రూ.300లకి యూరియా సంచీని పొందుతారని, అదే సంచీ కోసం ప్రభుత్వం ఇతర దేశాలకు దాదాపు రూ.3,000 చెల్లిస్తోందని ఆయన వివరించారు. రైతు సోదరీసోదరులపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా మిగిలిన మొత్తాన్ని తమ ప్రభుత్వమే భరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. యూరియా, ఇతర ఎరువుల వినియోగాన్ని తగినంత పరిమాణంలోనే ఉపయోగించడం ద్వారా నేలను రక్షించాలని రైతులను ఆయన కోరారు.
ఈ రోజు విత్తనాల నుంచి మార్కెట్ దాకా తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. వ్యవసాయ పనులకు సంబంధించిన డబ్బును రైతుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తున్నామని, తద్వారా వారు రుణాల కోసం తిరగాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకు దాదాపు రూ.4 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఒక్క ఏడాదిలోనే రైతులకు మద్దతుగా రూ.35,000 కోట్ల విలువైన రెండు కీలక పథకాలను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, దల్హన్ ఆత్మనిర్భరత మిషన్ పథకాలు వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహిస్తాయని ఆయన తెలిపారు.
రైతుల ప్రతి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పనిచేస్తోందని శ్రీ మోదీ తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు... పంటల బీమా పథకం ద్వారా రైతులకు మద్దతు లభిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధర పొందేలా సేకరణ ఏర్పాట్లు మెరుగుపడ్డాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు బలంగా ఉన్నప్పుడే దేశం పురోగతి సాధించగలదని ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తుందనీ, ఈ దిశగా సాధ్యమైన అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయని ప్రధానమంత్రి ధ్రువీకరించారు.
కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పశుసంవర్ధక రైతులు, చేపల పెంపకందారులకూ కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యం కల్పించామనీ, వారు దాని నుంచి ఎంతో ప్రయోజనం పొందుతున్నారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఈ సంవత్సరం కేసీసీ ద్వారా రైతులు రూ.10 లక్షల కోట్లకు పైగా సహాయం పొందారని ఆయన తెలిపారు. జీవ-ఎరువులపై జీఎస్‌టీ తగ్గింపు ద్వారా రైతులకు గణనీయమైన ఉపశమనం కలిగిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని చురుగ్గా ప్రోత్సహిస్తోందని, ఇప్పటికే లక్షలాది మంది రైతులను అనుసంధానిస్తూ ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్ ప్రారంభించామని శ్రీ మోదీ తెలిపారు. ఇటీవలి సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 10,000 రైతు ఉత్పత్తి సంస్థలు (ఎఫ్‌పిఓలు) స్థాపించామని ఆయన స్పష్టం చేశారు. ఈశాన్యంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ఆయిల్ పామ్‌కు సంబంధించి ఒక మిషన్‌నూ ప్రారంభించిందనీ, ఇది దేశాన్ని ఆహార సంబంధ నూనెల రంగంలో స్వయం-సమృద్ధి సాధించేలా చేయడమే కాకుండా ఈ ప్రాంత రైతుల ఆదాయాన్నీ పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రాంతంలో టీ తోట కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న ప్రధానమంత్రి... అస్సాంలోని ఏడున్నర లక్షల మంది టీ తోట కార్మికులకు జన్ ధన్ బ్యాంకు ఖాతాలు తెరవడానికి తమ ప్రభుత్వం సహాయపడిందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం ద్వారా కార్మికులు వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు బదిలీ చేసే ప్రయోజనాన్ని ఇప్పుడు పొందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీ తోటలు గల ప్రాంతాల్లో పాఠశాలలు, రహదారులు, విద్యుత్, నీరు, ఆసుపత్రుల వంటి సౌకర్యాలను ప్రభుత్వం విస్తరిస్తోందని ప్రధానమంత్రి వివరించారు.
ప్రభుత్వం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ మంత్రంతో ముందుకు సాగుతోందని, ఈ దార్శనికత పేదల జీవితాల్లో పెను పరివర్తనను తీసుకొచ్చిందని శ్రీ మోదీ తెలిపారు. ఈ ప్రయత్నాల కారణంగా గత 11 సంవత్సరాల్లో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. దేశంలో ఒక నవ-మధ్యతరగతీ ఉద్భవించిందని ప్రధానమంత్రి తెలిపారు. ఇటీవలి సంవత్సరాల్లో పేద కుటుంబాల జీవన ప్రమాణాలు నిరంతరం మెరుగుపడటం వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు.
దేశంలో జరుగుతున్న మార్పులకు ప్రతీకగా నిలిచే కొత్త డేటా వచ్చిందని ప్రధానమంత్రి తెలిపారు. గతంలో గ్రామాల్లోని అత్యంత పేద కుటుంబాల్లోని పది మందిలో ఒకరికి మాత్రమే సైకిల్ ఉండేదని, ఇప్పుడు గ్రామాల్లో దాదాపు సగం కుటుంబాలు బైక్, కారు కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు దాదాపు ప్రతి ఇంటికీ చేరుకున్నాయని, ఒకప్పుడు విలాసవంతమైనవిగా భావించిన రిఫ్రిజిరేటర్ల వంటి వస్తువులు ఇప్పుడు సర్వసాధారణమయ్యాయన్నారు. గ్రామాల వంటశాలల్లోనూ అవి చోటు సంపాదించాయని ఆయన వ్యాఖ్యానించారు. స్మార్ట్‌ఫోన్‌లు వ్యాప్తి చెందినప్పటికీ, గ్రామాల్లో టీవీ చూసే ధోరణి పెరిగిందని ఆయన తెలిపారు. ఈ మార్పులు వాటంతట అవే జరగలేదని, దేశంలోని పేదలు సాధికారత పొందుతున్నారనీ, మారుమూల ప్రాంతాల్లో నివసించే వారూ ఇప్పుడు అభివృద్ధి నుంచి ప్రయోజనం పొందుతున్నారని శ్రీ మోదీ వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, గిరిజనులు, యువత, మహిళల ప్రభుత్వాలని చెబుతూ... అస్సాం, ఈశాన్య ప్రాంతాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న హింసను అంతం చేయడానికి తమ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని శ్రీ మోదీ తెలిపారు. ప్రభుత్వం అస్సాం గుర్తింపును, సంస్కృతిని ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంచుతోందని, ప్రతి వేదికపై అస్సామీ గర్వానికి చిహ్నాలను హైలైట్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం గర్వంగా 125 అడుగుల మహావీర్ లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని నిర్మించిందనీ... భూపేన్ హజారికా జయంతి శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించిందనీ... అస్సాం కళలు, చేతిపనులు, గమోసాలకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించేలా ప్రోత్సహించిందని ఆయన తెలిపారు. కొద్ది రోజుల కిందట రష్యా అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీని సందర్శించిన సమయంలో ఆయనకు అస్సాం బ్లాక్ టీని ఎంతో గర్వంగా కానుకగా ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
అస్సాం గౌరవాన్ని పెంపొందించే ప్రతి ప్రయత్నానికీ ప్రాధాన్యమిస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. మనం ఇలాంటి పని చేపట్టినప్పుడు అది ప్రతిపక్షాలకు అత్యంత అసౌకర్యాన్ని కలిగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం భూపేన్ హజారికాకు భారతరత్నను ప్రదానం చేసినప్పుడూ ప్రతిపక్షం దానిని బహిరంగంగానే వ్యతిరేకించిందన్నారు. పైగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే 'మోదీ పాటలు పాడేవారికి, నాటకాలు ఆడే వారికి భారతరత్న ఇస్తున్నారు' అని వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు. అస్సాంలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు సమయంలోనూ ప్రతిపక్షం దానిని వ్యతిరేకించిందని ఆయన అన్నారు. టీ కమ్యూనిటీ సోదరీసోదరులకు దశాబ్దాలుగా భూమి హక్కులను నిరాకరించింది ప్రతిపక్ష ప్రభుత్వమేనని, అయితే తమ ప్రభుత్వం వారికి భూమి హక్కులను, గౌరవప్రదమైన జీవితాన్నీ ఇచ్చిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రతిపక్షం తన ఓటు బ్యాంకు బలోపేతం కోసం అస్సాం అడవులు, భూములను బంగ్లాదేశ్ చొరబాటుదారులకు అప్పగించడానికి ప్రయత్నిస్తూ, జాతి వ్యతిరేక ఆలోచనలను ముందుకు తెస్తూనే ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్షాలకు అస్సాం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, వారి గుర్తింపు పట్ల ఎటువంటి ఆందోళన లేదనీ... అధికారం, ప్రభుత్వంపై మాత్రమే ఆసక్తి ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రతిపక్షాలు బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఇష్టపడతాయనీ, వారికి ఇక్కడ స్థిర ఆవాసం కల్పిస్తూ వారిని రక్షిస్తూనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ప్రతిపక్షాలు ఓటర్ల జాబితాలను సరిచేసే కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాల బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాల విషం నుంచి అస్సాంను రక్షించాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. అస్సాం గుర్తింపును, గౌరవాన్ని కాపాడటానికి తమ పార్టీ ఒక కవచంలా నిలుస్తుందని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో తూర్పు భారత్, ఈశాన్య ప్రాంతాల పాత్ర నిరంతరం పెరుగుతోందని శ్రీ మోదీ అన్నారు. తూర్పు భారతం దేశాభివృద్ధికి చోదకశక్తిగా మారుతోందని పునరుద్ఘాటించారు. కొత్త నమ్రూప్ యూనిట్ ఈ పరివర్తనకు చిహ్నమన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఎరువులు అస్సాం పొలాలకు మాత్రమే కాకుండా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లకూ ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఇది దేశ ఎరువుల అవసరాలకు ఈశాన్య ప్రాంతం అందించే గణనీయమైన సహకారం అని ఆయన స్పష్టం చేశారు. నమ్రూప్ వంటి ప్రాజెక్టులు రాబోయే కాలంలో, స్వయం-సమృద్ధ భారత్‌కు ఈశాన్య ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉద్భవించి, నిజమైన అర్థంలో అష్టలక్ష్మిగా కొలువై ఉంటుందని వ్యాఖ్యానిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. కొత్త ఎరువుల కర్మాగారం పనుల ప్రారంభ సందర్భంగా ఆయన మరోసారి అందరినీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వ శర్మ, కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
అస్సాంలోని దిబ్రూఘర్‌లో గల నమ్రూప్‌లో బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీవీఎఫ్‌సీఎల్) ప్రస్తుత ప్రాంగణంలో కొత్త బ్రౌన్‌ఫీల్డ్ అమ్మోనియా-యూరియా ఎరువుల ప్రాజెక్టుకు ప్రధానమంత్రి భూమిపూజ నిర్వహించారు.
రూ. 10,600 కోట్లకు పైగా అంచనా పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రధానమంత్రి రైతు సంక్షేమ దార్శనికతను ముందుకు తీసుకెళ్తుంది. అస్సాంతో పాటు పొరుగు రాష్ట్రాల ఎరువుల అవసరాలను తీర్చుతుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. గణనీయమైన ఉపాధిని కల్పిస్తుంది. ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఇది పారిశ్రామిక పునరుజ్జీవనం, రైతు సంక్షేమానికి మూలస్తంభంగా నిలుస్తుంది.
***
(रिलीज़ आईडी: 2207228)
आगंतुक पटल : 4