సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ ద్వారా భారత్ యానిమేషన్, గేమింగ్, ఎక్స్ఆర్ రంగాలకు బలం: భారత్ ను సృజనాత్మకతకు ప్రపంచ కేంద్రంగా నిలబెట్టిన వేదిక
प्रविष्टि तिथि:
19 DEC 2025 8:03PM by PIB Hyderabad
ఏవీజీసీ-ఎక్స్ఆర్ కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్సీఓఈ) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) గా కార్యకలాపాలు ప్రారంభించింది. సృజనాత్మక సాంకేతికతలకు అగ్రగామి సంస్థగా గుర్తింపు పొందిన ఈ సంస్థ ముంబైలో ఉంది.
ఐఐసీటీ రూ. 391.15 కోట్ల కేటాయింపుతో అభివృద్ధి చెందుతోంది. ఏవీజీసీ-ఎక్స్ఆర్‌తో సహా సృజనాత్మక సాంకేతికతలకు సంబంధించి ఐఐటీలు, ఐఐఎంల తరహాలో దీనిని రూపొందించారు. ఈ సంస్థ ముంబైలోని ఎన్ఎఫ్‌డీసీ ప్రాంగణం నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది.
ఇది ప్రపంచంలోని ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా పరిశ్రమ ఆధారిత పాఠ్య ప్రణాళికను అనుసరిస్తుంది. హబ్-స్పోక్ ప్రణాళికతో జాతీయ కేంద్రంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం నమూనాపై పనిచేస్తుంది.
ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, పరిశ్రమకు అనుగుణమైన పాఠ్యాంశాలు, అనువర్తిత పరిశోధన, అభివృద్ధి ద్వారా వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, 3డీమోడలింగ్‌లో నైపుణ్య అంతరాలను ఐఐసీటీ పరిష్కరిస్తోంది.
ఈ సంస్థ గేమింగ్, పోస్ట్-ప్రొడక్షన్, యానిమేషన్, కామిక్స్ ఎక్స్ఆర్ లో 17 ప్రత్యేక విద్యా కార్యక్రమాలను ప్రారంభించింది. మరిన్ని వివరాలను https://iict.org/academics/programs నుంచి తెలుసుకోవచ్చు.
పాఠ్యాంశాల సహ అభివృద్ధి, అధునాతన సాధనాల అన్వయం, మార్గదర్శకం, పరిశ్రమ భాగస్వామ్యం కోసం గూగుల్,మెటా, ఎన్వీఐడిఐఏ, మైక్రోసాఫ్ట్, యాపిల్, డబ్ల్యూపీపీ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలతో ఇది భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.
స్టార్టప్ ఇంక్యుబేషన్, ఐపీ (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ) సృష్టికి కూడా మద్దతు ఇవ్వడం ద్వారా దేశంలోని సృజనాత్మక సాంకేతికత స్టార్టప్లు ప్రపంచ స్టూడియోలు, పెట్టుబడిదారులు, మార్కెట్‌లతో అనుసంధానం కావడానికి ఐఐసీటీ మద్దతు ఇస్తోంది. తద్వారా క్రియేట్ ఇన్ ఇండియా, బ్రాండ్ ఇండియా లక్ష్యాలను ముందుకు తీసుకువెడుతుంది.
ఏవీజీసీ ఎగుమతులతో సహా సృజనాత్మక సాంకేతికతల వృద్ధికి ప్రభుత్వం కింద పేర్కొన్న అనేక చర్యలు చేపట్టింది:
-
కేంద్ర బడ్జెట్ ప్రకటన తర్వాత ఏప్రిల్ 2022లో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఏవీజీసీ ప్రమోషన్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్‌లో భారత నైపుణ్యాలు, ఉద్యోగాలు, పెట్టుబడులను పెంచడం, దేశాన్ని మీడియా, వినోద రంగాలకు ప్రపంచ కేంద్రంగా నిలబెట్టడంపై పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేసేందుకు ఇది మార్గం సుగమం చేసింది.
జాతీయ ఏవీజీసీ మిషన్, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, బలమైన మౌలిక సదుపాయాలు, భారతీయ ఐపీ, ఎగుమతులకు ప్రత్యేక సహాయాన్ని సిఫార్సు చేస్తూ టాస్క్ ఫోర్స్ డిసెంబర్ 2022లో నివేదికను సమర్పించింది.
-
ముంబైలో ఐఐసీటీని ఏర్పాటుచేసి అత్యున్నత స్థాయి శిక్షణ, పరిశోధనలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రతిభా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు.
-
ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తి సామర్థ్యం విస్తరణ, నైపుణ్య అభివృద్ధి, అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం పెంచడంపై దృష్టి సారించి మొత్తం మీడియా, వినోద రంగం కోసం వేవ్స్ 2025ను మే 2025లో ప్రపంచ వేదికగా నిర్వహించారు.
కింద పేర్కొన్న మూడు విభాగాల ద్వారా కూడా ఏవీజీసీ, రంగానికి, స్టార్టప్‌లకు వేవ్స్ మద్దతు అందిస్తోంది:
1.వేవ్స్ బజార్: ఇది భారత మీడియా, వినోద రంగానికి ఏడాది పొడవునా పనిచేసే హైబ్రిడ్ గ్లోబల్ మార్కెట్ ప్లేస్. ఇది అంతర్జాతీయ కొనుగోలుదారులకు నిర్మాణాత్మక బి2బి సమావేశాలు, ఉమ్మడి చిత్ర నిర్మాణ అవకాశాలను కల్పిస్తుంది. భారతీయ సినిమాలు, యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్, ఎక్స్ఆర్ కంటెంట్‌ను ప్రదర్శిస్తుంది.
2. వేవెక్స్: ఇది ఏవీజీసీ-ఎక్స్ఆర్, కొత్త మీడియా సాంకేతికతల కోసం ప్రత్యేకమైన స్టార్టప్ యాక్సిలరేటర్, ఇంక్యుబేటర్. ఇది మార్గదర్శకత్వం, అధునాతన నిర్మాణం, సంపూర్ణ డిజిటల్ సాంకేతిక మౌలిక సదుపాయాల లభ్యత, ప్రత్యేక పెట్టుబడిదారుల అనుసంధానాలను అందిస్తుంది.
వేవ్స్ సదస్సు 2025లో, ఇది 30 స్టార్టప్‌లు మైక్రోసాఫ్ట్, యూనికాన్ ఇండియా వెంచర్స్ లాంటి పెట్టుబడిదారుల ముందు తమ ప్రాజెక్టులను ప్రదర్శించే అవకాశం కల్పించింది. అంతేగాక, 100 స్టార్టప్‌లకు ప్రదర్శన స్థలాన్ని అందించింది.
టీ-హబ్, ఐఐసీటీ సహకారంతో ఇంక్యుబేషన్, ప్రభుత్వ పైలట్ కార్యక్రమాలు, భాషాసేతు లాంటి ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లకు వేవెక్స్ మద్దతు ఇస్తోంది. ఐఎఫ్ఎఫ్ఐ లాంటి వేదికల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పిస్తోంది. ఇది స్టార్టప్లకు విదేశీ పెట్టుబడులు సాధించడానికి, భారతీయ ఐపీలను అంతర్జాతీయంగా ధ్రువీకరించుకోవడానికి సహాయపడుతుంది.
3.సృజనాత్మక వేదిక (క్రియేటోస్పియర్): ఇది క్రియేట్ ఇన్ ఇండియా ప్రతిభా వికాస కార్యక్రమం, యానిమేషన్, గేమింగ్, వెబ్‌టూన్లు, డిజిటల్ కథాకథనం రంగాల్లో ఏడాదికి 30–35 జాతీయ పోటీలను ఇది నిర్వహిస్తుంది. ఇది కొత్త సృజనకర్తలకు మార్గదర్శకత్వం, ఇంక్యుబేషన్, పరిశ్రమ అవకాశాలతో అనుసంధానం చేసి వారిని ప్రోత్సహిస్తుంది.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ రోజు రాజ్యసభలో డాక్టర్ పరమార్ జశ్వంత్‌సిన్హ్ సలాంసిన్హ్, శ్రీ కేశరీదేవ్‌సిన్హ్ ఝాలా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ వివరాలు అందించారు.
***
(रिलीज़ आईडी: 2207058)
आगंतुक पटल : 4