రాష్ట్రపతి సచివాలయం
హైదరాబాద్‌లో జరిగిన ‘భారతదేశ శాశ్వత జ్ఞానం: శాంతి, ప్రగతికి మార్గాలు’ సదస్సులో భారత రాష్ట్రపతి ప్రసంగం
ఆధునికత, ఆధ్యాత్మికత సమ్మేళనమే మన నాగరికతకు అతిపెద్ద బలం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
प्रविष्टि तिथि:
20 DEC 2025 5:57PM by PIB Hyderabad
బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ సంస్థ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నేడు (డిసెంబర్ 20, 2025) నిర్వహించిన ‘‘భారతదేశ శాశ్వత జ్ఞానం: శాంతి, ప్రగతికి మార్గాలు’’ అంశంపై జరిగిన సదస్సును ఉద్దేశించి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రపంచ సమాజం అనేక మార్పులకు లోనవుతోందని అన్నారు. ఈ మార్పులతో పాటు మనమూ మానసిక ఆరోగ్య సమస్యలు, సామాజిక సంఘర్షణలు, పర్యావరణ అసమతుల్యత, మానవీయ విలువల క్షీణత వంటి అనేక తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సదస్సు కోసం ఎంచుకున్న అంశం చాలా సందర్భోచితంగా ఉందని ఆమె అన్నారు. కేవలం భౌతిక అభివృద్ధి మాత్రమే సంతోషాన్ని, శాంతిని తీసుకురాదని మనం గుర్తుంచుకోవాలని సూచించారు. అంతర్గత స్థిరత్వం, భావోద్వేగ మేధస్సు, విలువలతో కూడిన జీవన విధానం అత్యంత అవసరమని తెలిపారు.

భారతీయ పురాతన ఋషి సంప్రదాయం మనకు సత్యం, అహింస, శాంతియుత సహజీవనం అనే సందేశాన్ని ఇచ్చిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. మన ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచం ఎదుర్కొంటున్న మానసిక, నైతిక, పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను చూపుతుందని ఆమె అన్నారు. ఆధునికత, ఆధ్యాత్మికత సమ్మేళనమే మన నాగరికతకు ఉన్న అతిపెద్ద బలం. వసుధైక కుటుంబకం అనే భావన ప్రపంచమంతటినీ ఒకే కుటుంబంగా భావించే ఆలోచనని, ఇది నేటి ప్రపంచ శాంతికి అత్యంత అవసరమని ఆమె తెలిపారు.

సామాజిక ఐక్యతకు, జాతీయ ప్రగతికి ఆధ్యాత్మికత ఒక బలమైన పునాదిగా పనిచేస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఒక వ్యక్తి మానసిక స్థిరత్వం, నైతిక విలువలు, ఆత్మ నియంత్రణను పెంపొందించుకున్నప్పుడు, వారి ప్రవర్తన సమాజంలో క్రమశిక్షణ, సహనం, సహకారాన్ని పెంపొందిస్తుందని ఆమె వివరించారు. ఆధ్యాత్మిక చైతన్యంతో స్పూర్తి పొందిన ప్రజలు తమ బాధ్యలపై అవగాహన కలిగి ఉంటారని, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేస్తారని ఆమె అన్నారు. అటువంటి వ్యక్తులు దేశ నిర్మాణంలో కూడా చురుకైన సహకారాన్ని అందిస్తారని అన్నారు.

దశాబ్దాలుగా బ్రహ్మకుమారీస్ సంస్థ భారతీయ విలువలను వివిధ దేశాలకు విస్తరింపజేయడంపై రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలలో శాంతి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా ఈ సంస్థ సమాజం నైతిక, భావోద్వేగ నిర్మాణాన్ని బలోపేతం చేస్తోందని కొనియాడారు. ఈ విధంగా దేశ నిర్మాణంలో బ్రహ్మకుమారీస్ సంస్థ గణనీయమైన సహకారాన్ని అందిస్తోందని ఆమె పేర్కొన్నారు.

***
(रिलीज़ आईडी: 2207034)
आगंतुक पटल : 14