ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్‌-కమ్-కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ) ప్రాంగణ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 26 JUL 2023 10:52PM by PIB Hyderabad

నమస్కారం!

నా కనుల ముందు ఆవిష్కృతమైన ఈ అద్భుత దృశ్యం మహత్తరం.. బృహత్తరం.. లోకోత్తరం! నేటి ఈ సందర్భంలో... ఊహల్లో మెదిలిన స్వప్నం సాకారమై సాక్షాత్కరించిన ఈ క్షణంలో ఒక ప్రసిద్ధ కవితా పంక్తులను మీకందరికీ వినిపించాలనిపిస్తోంది:

“నయా ప్రాత్‌ హై, నయీ బాత్‌ హై, నయీ కిరణ్‌ హై, జ్యోతి నయీ

నయీ ఉమంగే, నయీ తరంగే, నయీ ఆస్‌ హై, సాం‌స్‌ నయీ

ఉఠో ధరా కే అమర్ సపూతో, పునః నయా నిర్మాణ్‌ కరే

జన్‌-జన్‌ కే జీవన్‌ మే ఫిర్‌ సే నయీ స్ఫూర్తి, నవ్‌ ప్రాణ్‌ భరే”

ఇది నవోదయం.. నవ విశేషం... నవ కిరణం.. నవ్య కాంతి

నవ్యాకాంక్షలు.. నవ్య తరంగాలు.. నవ్య ఆశ... నవ్య శ్వాస

ఈ నేల ఉత్తమ పుత్రులారా రండి.. నవ నిర్మాణం చేపడదాం

అందరి జీవితాల్లో నవ్య స్ఫూర్తిని, నవ్యోత్తేజాన్ని నింపుదాం

ఈ బృహత్తర.. లోకోత్తర ‘భారత్ మండపం’ చూసిన ప్రతి భారతీయుడి హృదయం ఆనందోత్సాహాలతో, గర్వంతో ఉప్పొంగింది. ఈ దేశ సామర్థ్యాన్ని, నవశక్తిని సందర్శించదలచే వారికి ఇదొక ఆహ్వానం. భారత వైభవానికి, సంకల్ప శక్తికి ఇది ప్రతీక. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్ల ఫలితంగా ఎల్లెడలా పనులు ఆగిపోయినా, మన కార్మికులు ఉక్కు సంకల్పంతో రేయింబవళ్లు శ్రమించి భారత్‌ మండప నిర్మాణం పూర్తి చేశారు.

ఈ సుందర ప్రాంగణ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి కార్మికుడికి, సోదరుడికి, సోదరికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఇవాళ ఉదయమే కార్మికులందరినీ కలిసే అవకాశం లభించగా, వారిని సన్మానించడం నాకు దక్కిన అదృష్టం. వారి కఠోర శ్రమ ఇలా భారత్‌ మండపం రూపంలో దివ్య సౌధంగా సాక్షాత్కరించడం చూసి యావద్భారతం ఆశ్చర్యానందాలు వెలిబుచ్చుతోంది.

‘భారత్ మండపం’ రూపంలో ముస్తాబైన ఈ కొత్త అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మన రాజధాని నగరం ఢిల్లీ ప్రజలతోపాటు దేశవాసులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. దేశం నలుమూలల నుంచి వచ్చిన అతిథులందరికీ సాదర స్వాగతం. అలాగే టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా మాతో మమేకమైన కోట్లాది వీక్షకులకూ నా శుభాకాంక్షలు.

మిత్రులారా!

దేశంలోని ప్రతి పౌరుడికీ ఇదొక చారిత్రక దినం.. ఎందుకంటే- ఇవాళ కార్గిల్ విజయ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఇది శత్రు దుస్సాహసాన్ని భరతమాత పుత్రులు దునుమాడిన సందర్భం.  కృతజ్ఞతా భావంగల దేశం తరపున కార్గిల్ యుద్ధక్షేత్రంలో అమరులైన ప్రతి వీరుడికీ నా వినమ్ర నివాళి అర్పిస్తున్నాను.

మిత్రులారా!

భగవాన్ బసవేశ్వరుని ‘అనుభవ మండపం’ స్ఫూర్తితో ‘భారత్‌ మండపం’ నిర్మితమైందని శ్రీ పీయూష్‌ ఇప్పుడే మనకు తెలిపారు. ప్రపంచ తొలి పార్లమెంటుగా తరచూ వ్యవహరించే ఈ ‘అనుభవ మండపం’  చర్చలు, సంభాషణలు, భావ వ్యక్తీకరణకు నెలవైన ప్రజాస్వామ్య వేదికను సూచిస్తుంది. యావత్‌ ప్రపంచం నేడు భారత్‌ను ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా అంగీకరిస్తోంది. తమిళనాడులోని ఉత్తరమేరూరులో లభ్యమైన ప్రాచీన శాసనాల నుంచి వైశాలి వంటి ప్రదేశాల దాకా శతాబ్దాలుగా వర్ధిల్లిన భారత ప్రజాస్వామ్య చైతన్యం మనకెంతో గర్వకారణం.

మిత్రులారా!

మనమిప్పుడు 75 వసంతాల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అమృత మహోత్సవం నిర్వహించుకుంటున్న వేళ మన ప్రజాస్వామ్యానికి భారతీయులు ఇచ్చిన అందమైన కానుకగా ‘భారత్ మండపం’ నిలుస్తుంది. మరికొన్ని వారాల్లోనే మండపం వేదికగా ప్రపంచంలోని ప్రధాన దేశాల నాయకుల సమక్షాన జి20 సంబంధిత కార్యక్రమాలు నిర్వహించనున్నాం. భారత్‌ పురోగమనాన్ని, అంతర్జాతీయంగా ఇనుమడిస్తున్న దాని  ప్రతిష్ఠను ఈ అద్భుత ‘భారత్ మండపం’ ప్రపంచానికి సాక్షాత్కరింపజేస్తుంది.

మిత్రులారా!

నేటి పరస్పర అనుసంధాన-ఆధారిత ప్రపంచంలో ఏదో ఒక దేశంలో నిరంతరం అనేక అంతర్జాతీయ కార్యక్రమాలు, సదస్సులను నిర్వహిస్తుంటారు. కాబట్టి, మన దేశానికి... ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో ఒక అంతర్జాతీయ స్థాయి వేదిక ఎంతైనా అవసరం. అయితే, గత శతాబ్దంలో ఎన్నడో నిర్మించిన ప్రస్తుత సౌకర్యాలు, సమావేశ మందిరాలు ఈ 21వ శతాబ్దపు భారత్‌ వేగానికి అనుగుణంగా లేవు. అందుకే, మన పురోగమన వేగానికి తగినట్లు, ఈ శతాబ్దపు అవసరాలకు అనువైన సౌకర్యాలను మనం సిద్ధం చేసుకోవాలి.

అందుకే, ఈ అద్భుత ‘భారత్ మండపం’ ఇప్పుడు నా దేశ ప్రజలందరి ముందు... మీ అందరి సమక్షాన ఠీవిగా దర్శనమిస్తోంది. దేశవిదేశాల నుంచి వచ్చే భారీ ఎగ్జిబిటర్లకు ఇది ఎంతో అనువుగా ఉంటుంది. దేశంలో సమావేశ పర్యాటకానికి కీలక కూడలిగా రూపొందుతుంది. మన అంకుర సంస్థల శక్తిసామర్థ్యాలను ప్రదర్శించే మాధ్యమంగా ‘భారత్ మండపం’ ఉపయోగపడుతుంది. సినిమా పరిశ్రమ సహా కళాకారుల ప్రదర్శనలకూ అనువుగా ఉంటుంది.

దేశీయ హస్తకళాకారులు, చేతివృత్తుల వారి శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆవిష్కరించే ముఖ్యమైన వేదికగా ఉపయోగపడుతుంది. స్వయంసమృద్ధ భారత్, స్థానికం కోసం నినాదం కార్యక్రమాలకు చేయూతనిస్తుంది. ఒక విధంగా ఆర్థిక వ్యవస్థ నుంచి పర్యావరణం దాకా, వాణిజ్యం నుంచి సాంకేతిక పరిజ్ఞానాల వరకూ విస్తృత శ్రేణి కృషిని ప్రదర్శించే ఘనమైన వాస్తవిక వేదికగా మారుతుంది.

మిత్రులారా!

ఇటువంటి సౌకర్యాల కల్పన అనేక దశాబ్దాల కిందటే చేపట్టి ఉండాలి... కానీ, అది సాధ్యం కాలేదు. బహుశా అనేక బృహత్‌ కార్యక్రమాలు నా చేతుల మీదుగా పూర్తికావాలని విధి నిర్దేశించడమే అందుకు కారణమై ఉండొచ్చునని నా నమ్మకం. ఒక దేశం ఒలింపిక్ సదస్సు లేదా ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడల్లా ప్రపంచ యవనికపై దాని ప్రతిష్ఠ గణనీయంగా ఇనుమడిస్తుందని మన ప్రత్యక్ష అనుభవం చెబుతోంది. ప్రపంచంలో ఇటువంటి కార్యక్రమాలకు ఇప్పుడు విపరీత  ప్రాధాన్యం ఉంది. ఈ తరహా వేదికలు దేశ ప్రతిష్ఠకు ఏదో ఒక రకమైన విలువను తప్పక జోడిస్తాయి.

కానీ, మన దేశంలో భిన్న ధోరణులున్నవారు కూడా ఉన్నారు... ముఖ్యంగా ప్రతికూల మనస్తత్వానికి కొదవ లేదు. కాబట్టే, నిరాశావాదులు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఎంతో గందరగోళం సృష్టించారు... కోర్టులకెక్కారు. అయితే, ఎక్కడ సత్యం ఉంటుందో.. అక్కడ దేవుడు కూడా ఉంటాడు. కాబట్టే, ఈ అందమైన వేదిక మీ కళ్లముందుంది.

వాస్తవానికి ప్రతి మంచి పనిమీద విమర్శలకు, ఆటంకాల సష్టికి కొందరు సదా సిద్ధంగా ఉంటారు. ‘కర్తవ్య పథ్’ నిర్మాణ సమయంలో ఎలాంటి కథనాలు ప్రచారంలోకి వచ్చాయో... టీవీలో తాజా వార్తలుగా కనిపించనవేమిటో, వార్తా పత్రికల తొలిపేజీ శీర్షికల్లో ఏమేం ప్రచురితమయ్యాయో మీకు తెలిసే ఉంటుంది! కోర్టులలో అనేక కేసులు కూడా దాఖలయ్యాయి... కానీ, ‘కర్తవ్య పథ్’ పూర్తయ్యాక ఇది దేశ గౌరవాన్ని పెంచే సానుకూల పరిణామమని అయిష్టంగానైనా అదే వ్యక్తులు అంగీకరిస్తున్నారు. అదే తరహాలో ‘భారత్ మండపం’పై వ్యతిరేకత వెళ్లగక్కిన వారు కూడా బహుశా బహిరంగంగా మాట్లాడకపోయినా, మనసులోనైనా దాని ప్రాధాన్యాన్ని అంగీకరిస్తారని, బహుశా ఇక్కడి కార్యక్రమాల్లో ఉపన్యసించడం లేదా పాల్గొనడానికి వస్తారని నా నమ్మకం.

మిత్రులారా!

ఏ దేశమైనా, సమాజమైనా భిన్న ఆలోచన దృక్పథంతో పనిచేస్తే అభివృద్ధి సాధించడం కల్ల. ప్రభుత్వం తన పనితీరులో ఎంత ముందుచూపుతో, సమగ్ర విధానాలను అనుసరిస్తున్నదో ఈ కన్వెన్షన్ సెంటర్  ‘భారత్ మండపం’ తేటతెల్లం చేస్తోంది. భారత్‌ ఇవాళ 160కిపైగా దేశాలకు ఇ-కాన్ఫరెన్స్ వీసాలు జారీచేస్తోంది. తద్వారా ప్రజలు ఇటువంటి కేంద్రాలకు రావడం సులభమవుతుంది. అలాగే దేశవిదేశాల నుంచి పెద్ద కంపెనీలను స్వాగతిస్తోంది. ఇది కేవలం ఒక వేదికకు పరిమితం కాదు... ఇక్కడ సరఫరా వ్యవస్థ సహా అన్ని ఏర్పాట్లూ ఉంటాయి.

మిత్రులారా!

ఢిల్లీ విమానాశ్రయ వార్షిక ప్రయాణిక నిర్వహణ సామర్థ్యం 2014కు ముందు సుమారు 5 కోట్లు... అయితే, ఇప్పుడు 7.5 కోట్ల మందికిపైగా ప్రయాణిక రాకపోకలను నిర్వహించే స్థాయికి ఎదిగింది. టెర్మినల్-2, నాలుగో రన్‌వే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ నోయిడాలోని జెవార్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైతే దీనికి మరింత ఊపు లభిస్తుంది. కొన్నేళ్లుగా ఢిల్లీ రాజధాని ప్రాంతంలో హోటల్ పరిశ్రమ కూడా గణనీయంగా విస్తరించింది. అంటే- కాన్ఫరెన్స్ పర్యాటకం కోసం ఒక పూర్తి వ్యవస్థను ప్రణాళికబద్ధంగా సృష్టించేందుకు మేం సమష్టిగా కృషి చేశామని చెప్పడానికి ఇదే నిదర్శనం.

మిత్రులారా!

ఈ పరిణామాలు సహా కొన్నేళ్లుగా ఢిల్లీలో నిర్మితమైన ప్రాజెక్టులు కూడా దేశ గౌరవాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా కొత్త పార్లమెంటు సముదాయాన్ని చూశాక గర్వంతో ఉప్పొంగని భారతీయులు ఎవరూ ఉండరు. అలాగే ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారకం, పోలీసు స్మారకం, బాబా సాహెబ్ అంబేడ్కర్‌ స్మారకం రూపొందాయి. ఆధునిక ప్రభుత్వ కార్యాలయాలు, సౌకర్యాల కల్పనతో కర్తవ్య పథ్ పరిసర ప్రాంతమంతా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన పని సంస్కృతిని, పని వాతావరణాన్ని కూడా ఇదే తరహాలో మనం మార్చుకోవాలి.

మన పూర్వ ప్రధానమంత్రుల గురించి నవతరం తెలుసుకునేందుకు ఢిల్లీలోని ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ అవకాశం కల్పిస్తోంది. ఇక ఇప్పుడు నేను చెప్పే ఈ సమాచారం మీతోపాటు ప్రపంచానికే శుభవార్త కాగలదు. అదేమిటంటే- ‘యుగే యుగే భారత్’ (నిత్య సత్య భారత్‌) పేరిట  ప్రపంచంలోనే అతిపెద్ద... అత్యంత భారీ మ్యూజియం కూడా నిర్మితమవుతోంది.

మిత్రులారా!

యావత్ ప్రపంచం నేడు భారత్‌ వైపు చూస్తోంది. ఎన్నడూ ఊహించని, ఎవరి ఆలోచనలకూ అందని  అందని విజయాలను భారత్‌ ఇవాళ సాధిస్తోంది. ప్రగతి పథంలో పురోగమించడానికి మనం విస్తృత స్థాయిలో ఆలోచిస్తూ, భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఆ మేరకు ‘గొప్పగా ఆలోచిద్దాం.. గొప్ప కలలు కందాం... గొప్ప విజయాలు సాధిద్దాం’ అనే సూత్రంతో భారత్‌ ఇప్పుడు వేగంగా దూసుకెళ్తోంది. ‘ఆకాశమే హద్దు’ అనే నానుడి ప్రకారం మనం మునుపటికన్నా గొప్పగా, మెరుగ్గా, వేగంగా ముందడుగు వేస్తున్నాం.

భారత మౌలిక సదుపాయాలు తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం దాకా నలుదిక్కులా రూపాంతరం చెందుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద సౌర-పవన విద్యుత్తు పార్కు దేశంలో  నిర్మితమవుతోంది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన మన దేశంలోనే ఉంది. అలాగే 10,000 అడుగులకు పైగా ఎత్తున ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగాన్ని భారత్‌ నిర్మించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రహదారి దేశంలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం భారత్‌ సొంతం. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహం మన దేశంలో ఉంది. అంతేకాదు... ఆసియా ఖండం స్థాయిలో రెండో అతిపెద్ద రైలు-రోడ్డు వంతెన మన దేశంలోనే ఉంది. ఇక గ్రీన్‌ హైడ్రోజన్‌ రంగంలో అత్యంత చురుగ్గా, భారీస్థాయిలో కృషి చేస్తున్న కొన్ని దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలుస్తోంది.

మిత్రులారా!

మా ప్రభుత్వ ప్రస్తుత, మునుపటి పదవీ కాలాల్లోని ఫలితాలను, సాధించిన యావద్దేశం నేడు ప్రత్యక్షంగా చూస్తోంది. భారత ప్రగతి ప్రయాణం ఇక ఆగదనే దృఢ విశ్వాసం నేడు దేశానికి కలిగింది. మా తొలి ఐదేళ్ల పదవీకాలం ఆరంభంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 10వ స్థానంలో ఉందన్న సంగతి మీకు తెలిసిందే. అంటే- ప్రజలు నాకు తొలిసారి దేశ పాలన బాధ్యత అప్పగించినపుడు మనం పదో స్థానంలో ఉన్నాం. అయితే, నా రెండో పదవీకాలంలో నేడు భారత్‌ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి దూసుకెళ్లింది. ఇది ఎంతమాత్రం మాటల గారడీ కాదు... పనితీరు ఆధారిత గణాంకాల సాక్షిగా ఈ మాట చెబుతున్నాను.

ఈ నేపథ్యంలో నేనివాళ దేశానికి ఒక వాగ్దానం చేస్తున్నాను... నా మూడో పదవీకాలంలో భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందిస్తాం. అవును మిత్రులారా... మూడో పదవీకాలం ముగిసే సరికి భారత్‌ సగర్వంగా తొలి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలవడం తథ్యం. ఇది మోదీ గ్యారంటీ... 2024 ఎన్నికల తర్వాత మా మూడో పదవీకాలంలో దేశం మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తుందని నేను పౌరులందరికీ హామీ ఇస్తున్నాను. మీరు కంటున్న కలలన్నీ సాకారం కావడం మీ కళ్లతో మీరే తప్పక చూస్తారు.

మిత్రులారా!

భారత్‌ నేడు సరికొత్త ప్రగతి విప్లవ పురోగమన దశలో ఉంది... దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం గడచిన తొమ్మిదేళ్లలో దాదాపు రూ.34 లక్షల కోట్లు వెచ్చించాం. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ మూలధన వ్యయం కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించాం. కొత్త విమానాశ్రయాలు, ఎక్స్‌ ప్రెస్‌వేలు, రైలు మార్గాలు, వంతెనలు, ఆస్పత్రులు వగైరాలతో భారత్‌ పురోగమన వేగం, స్థాయి నిజంగా అసాధారణం.

గత ఏడు దశాబ్దాల్లో... నేను ఎవరినో విమర్శించడానికి ఈ ప్రస్తావన తేవడం లేదు. ఓ లెక్క తేలాలంటే పాత రోజులతో కాస్త పోల్చి చూడటం అవసరం కాబట్టి, నేనీ మాట అంటున్నాను. స్వాతంత్ర్యం వచ్చాక తొలి 70 ఏళ్లలో దేశంలో రైలు మార్గాల విద్యుదీకరణ కేవలం 20,000 కిలోమీటర్లు మాత్రమే. కానీ, మేం అధికారంలోకి వచ్చాక కేవలం తొమ్మిదేళ్లలో సుమారు 40,000 కిలోమీటర్ల దాకా రైలు మార్గాల విద్యుదీకరణ పూర్తయింది. అలాగే, 2014కు ముందు దేశంలో కొత్త మెట్రో మార్గాల నిర్మాణం ప్రతి నెలా కేవలం 600 మీటర్లకు పరిమితం కాగా, ఇప్పుడు 6 కిలోమీటర్లకు పెరిగింది.

గ్రామీణ రహదారుల పొడవు 2014కు ముందు 4 లక్షల కిలోమీటర్లకన్నా తక్కువ కాగా, నేడు 7.25 లక్షల కిలోమీటర్లకు పైగా పెరిగింది. అదేవిధంగా ఆనాడు విమానాశ్రయాల సంఖ్య సుమారు 70 కాగా, ఇప్పుడు దాదాపు 150కి పెరిగింది. ఇక 2014కు ముందు నగర గ్యాస్ పంపిణీ వ్యవస్థలు కేవలం 60 నగరాలకు పరిమితం కాగా, నేడు 600కుపైగా పట్టణాలకు విస్తరించాయి.

మిత్రులారా!

దేశం ఇప్పుడు పాత సమస్యలను పరిష్కరించడమే కాకుండా శాశ్వత పరిష్కారాలతో పురోగమిస్తోంది. అనేక సమస్యలను దీర్ఘకాలికంగా పరిష్కరించడంపై నిశితంగా దృష్టి సారించింది. ‘ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్‌ ప్రణాళిక’ ఇందుకు తిరుగులేని ఉదాహరణ. ఇక్కడ ఆసీనులైన పారిశ్రామిక రంగ మిత్రులకు నాదొక మనవి... మీరు ‘పీఎం గతిశక్తి’ పోర్టల్‌ను ఒకసారి పరిశీలించండి. దేశవ్యాప్తంగా రైలు మార్గాలు, రహదారులు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటి భౌతిక-సామాజిక మౌలిక సదుపాయాలు కల్పనలో ‘పీఎం గతిశక్తి జాతీయ బృహత్‌ ప్రణాళిక’ ఓ కీలక మలుపుగా రుజువు అవుతోంది. దేశం సమయాన్ని, నిధులను వృథాకు తావులేకుండా సమర్థంగా, ప్రయోజనకరంగా వెచ్చించడంపై నిఘా పెట్టే దిశగా ఇది 1600కుపైగా అంచెల నుంచి సమాచారాన్ని డిజిటల్ వేదికలపై ఏకీకృతం చేస్తుంది.

మిత్రులారా!

దేశం ముందు ఇవాళ ఓ గొప్ప అవకాశం ఉంది... ఈ నేపథ్యంలో నేనిప్పుడు శతాబ్దం కిందటి సంగతి ప్రస్తావిస్తున్నాను. గత శతాబ్దపు మూడో దశాబ్దంలో దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతూండేది. అంటే- 1923-1930 వైపు దృష్టి సారించాలని మీకు సూచిస్తున్నాను. ఆ కాలం భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత కీలకమైనది. అదేవిధంగా ఈ 21వ శతాబ్దపు ప్రస్తుత మూడో దశాబ్దానికీ అంతే ప్రాముఖ్యం ఉంది.

స్వరాజ్య సాధనే ఆనాటి ఏకైక, ప్రగాఢ ఆకాంక్ష... ఇప్పుడిక సుసంపన్న, ప్రగతిశీల భారత్‌గా దేశాన్ని రూపుదిద్దడమే మన అంతిమ లక్ష్యం. గత శతాబ్దపు మూడో దశాబ్దం స్వాతంత్ర్య సాధనకు నడుం బిగించింది. స్వేచ్ఛా వాయువులు పీల్చాలన్న సంకల్పం దేశం నలుమూలల నుంచి ప్రతిధ్వనించింది. ఆనాడు విప్లవం, సహాయ నిరాకరణ సహా స్వరాజ్య ఉద్యమ మార్గాలన్నీ ఒకే ప్రవాహంగా పూర్తి అవగాహనతో, శక్తియుతంగా ముందుకు సాగాయి. ఫలితంగా దేశం 25 ఏళ్లలో స్వాతంత్ర్యం సాధించి, స్వేచ్ఛా వాయువులు పీల్చాలన్న స్వప్నాన్ని సాకారం చేసుకుంది. అదే తరహాలో ఇప్పుడీ శతాబ్దపు రాబోయే 25 సంవత్సరాల్లో మన కొత్త లక్ష్యంపై ఈ మూడో దశాబ్దంలో సంకల్పం పూనాలి. ఆ మేరకు సుసంపన్న, వికసిత భారత్‌ సంకల్పంతో మనమీ ప్రయాణం ప్రారంభించాం. దేశాన్ని సమున్నత శిఖరాలకు చేర్చాలని, ప్రతి స్వాతంత్ర్య సమరయోధుడు కలలుగన్న విజయాలను సాధించాలని మనం లక్ష్యనిర్దేశం చేసుకున్నాం.

ఈ సంకల్ప సాకారం కోసం దేశంలోని ప్రతి పౌరుడు, 140 కోట్ల మంది భారతీయులంతా రేయింబవళ్లు కృషి చేయాలి. నా అనుభవం ప్రాతిపదికగా నేనిప్పుడు చెప్పేదేమిటంటే- ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో విజయాలను చూశాను. తద్వారా దేశం శక్తిసామర్థ్యాలను గుర్తించాను కాబట్టే, ఈ రోజున ‘భారత్ మండపం’లో మీ ముందు... సర్వ సమర్థులైన ప్రజలందరి ముందు నిలబడి, పూర్తి విశ్వాసంతో ఈ  మాట చెబుతున్నాను. భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందడం తథ్యం... ఈ దేశం పేదరికాన్ని నిర్మూలించడం నిశ్చయం. నాలో నేటి ఈ నమ్మకానికి పునాది ఏమిటో మీకు చెబుతాను.

నీతి ఆయోగ్ విడుదల చేసిన ఓ అధ్యయన నివేదిక ప్రకారం- కేవలం ఐదేళ్ల వ్యవధిలో దేశవ్యాప్తంగా 13.5 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరిక విముక్తులయ్యారు. అంతేకాకుండా పేదరిక సంపూర్ణ నిర్మూలనకు భారత్‌ ఎంతో చేరువలో ఉందని అంతర్జాతీయ సంస్థలు కూడా పేర్కొంటున్నాయి. అంటే- తొమ్మిదేళ్లుగా మా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు దేశాన్ని సరైన బాటలో నడుపుతున్నాయి.

మిత్రులారా!

సంకల్పం స్పష్టమైనదై, లక్ష్యం మీద అవగాహనతో అర్థవంతమైన మార్పుల దిశగా సరైన వ్యూహాలు ఉన్నపుడు మాత్రమే దేశాభివృద్ధి సాధ్యం. జి20కి భారత్‌ అధ్యక్షతన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇందుకు స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తాయి. జి20 సమావేశాలను కేవలం ఒక నగరం లేదా ప్రదేశానికి పరిమితం చేయకుండా దేశంలోని 50కి పైగా నగరాలకు చేరువ చేశాం. తద్వారా భారత వైవిధ్యాన్ని, సాంస్కృతిక సుసంపన్నతను ప్రపంచానికి సగర్వంగా చాటాం. ఎన్నో వైవిధ్యాల నడుమన కూడా సాంస్కృతిక బలం, వారసత్వంతో భారత్‌ పురోగమిస్తున్న తీరును విశదం చేశాం. వైవిధ్యం ఎంత విస్తృతమో, విశిష్టమో ప్రపంచానికి నిరూపించాం.

ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులు, పర్యాటకులు భారత్‌ వస్తున్నారు. వివిధ నగరాల్లో జి20 సమావేశాల నిర్వహణ వల్ల కొత్త సౌకర్యాలు రూపుదిద్దుకోగా, ఇప్పటికే ఉన్నవి ఆధునికంగా ముస్తాబయ్యాయి. దీనివల్ల దేశానికి, ప్రజలకు ప్రయోజనం చేకూరింది. సుపరిపాలనకు ఇదొక గొప్ప నిదర్శనం... దేశానికి ప్రాధాన్యం, పౌరులకు ప్రథమ ప్రాధాన్యం స్ఫూర్తిగా మనం వికసిత భారత్‌ను రూపుదిద్దబోతున్నాం.

మిత్రులారా!

నేటి ఈ కీలక సందర్భంలో మీరంతా ఇక్కడికి రావడం ఈ దేశం కోసం మీ హృదయాల్లో పాదుకొల్పిన స్వప్నాల సాకారానికి లభించిన మహదవకాశం. ‘భారత్ మండపం’ వంటి అద్భుత సౌధం సమకూరడంపై ఢిల్లీ ప్రజలకు, దేశవాసులందరికీ మరోసారి నా అభినందనలు. ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసిన మీకందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ నిండు మనసుతో శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

ధన్యవాదాలు!

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.

 

***


(रिलीज़ आईडी: 2205090) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam