ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో జరిగిన బీ-20 సదస్సు ఇండియా 2023 లో ప్రధాన మంత్రి ప్రసంగానికి అనువాదం.
प्रविष्टि तिथि:
27 AUG 2023 3:40PM by PIB Hyderabad
సొదరసొదరీమణులారా,
గౌరవనీయ ప్రతినిధులారా,
నమస్కారం!
భారతదేశానికి స్వాగతం.
స్నేహితులారా,
మా దేశంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొన్నవేళ వ్యాపార దిగ్గజాలైన మీరంతా భారతదేశానికి విచ్చేశారు. సంవత్సరంపాటు కొనసాగే పండుగ వాతావరణం ఈసారి మీ రాకతో ముందుగానే మొదలైంది. మన సమాజం, మన వ్యాపారాలు అన్నీ కలసి ఆనందించే పండుగల కాలం ఇది. ఈసారి ఆ ఆనందం ఆగస్టు 23 నుంచే ప్రారంభమైంది. ఎందుకంటే ఆ రోజే మన చంద్రయాన్ చంద్రుడిని చేరుకుంది. మన అంతరిక్ష సంస్థ ఇస్రో, చంద్రయాన్ విజయానికి మూల కారణం. కానీ అదే సమయంలో, భారతీయ పరిశ్రమలు కూడా ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున మద్దతు ఇచ్చాయి. చంద్రయాన్‌లో వాడిన అనేక విడిభాగాలు మన పరిశ్రమలు, ప్రైవేట్ కంపెనీలు, సూక్ష్మ చిన్న మధ్యస్థ పరిశ్రమ (MSME)లు తయారు చేసి సరైన సమయానికి అందించాయి. అంటే ఈ విజయం శాస్త్రవిజ్ఞానానికి, పరిశ్రమరంగానికి చెందుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సారి భారత్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం మనతో కలిసి విజయోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇది ఒక బాధ్యతాయుతమైన అంతరిక్ష కార్యక్రమం చేపట్టడం పట్ల జరుపుకునే సంబరం. ఇది దేశ అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్లే ఉత్సవం. ఇది ఆవిష్కరణల పండుగ. అంతరిక్ష సాంకేతికత ద్వారా స్థిరత్వం, సమానత్వం సాధించాలనే ఆలోచనలకి జరిపే ఆనందోత్సవం. అలాగే, ఇదే ఈ బీ20 సదస్సు థీమ్ ‘RAISE’ సారాంశం కూడా. RAISE అంటే (Responsibility, Acceleration, Innovation, Sustainability, Equality) బాధ్యత, వేగం, ఆవిష్కరణ, స్థిరత్వం, సమానత్వం. అన్నింటికీ మించి ఇది మానవత్వానికి సంబంధించినది. ఇది ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’కు సంబందించినది.
స్నేహితులారా,
బీ20 కి సంబంధించిన "RAISE" థీమ్‌లో ‘ఐ’ అంటే ఇన్నోవేషన్ (ఆవిష్కరణ) అని మనకు తెలుసు. కానీ నేను ఇన్నోవేషన్ పక్కనే మరో ‘ఐ’ కూడా చూస్తున్నాను. అది ఇంక్లూసివ్ నెస్,అంటే అందరినీ కలుపుకోవడం. ఈ ఆలోచనతోనే మనం ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో శాశ్వత సభ్యునిగా చేరాలని ఆహ్వానించాం. బీ20లో కూడా ఆఫ్రికా ఆర్థిక అభివృద్ధికోసం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఈ వేదిక ఎంతగా అందరినీ కలుపుకుని వెళుతుందో, దాని ప్రభావం అంతగా పెరుగుతుందని భారతదేశం నమ్ముతుంది. ఈ విధానం ప్రపంచ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడంలో, అభివృద్ధిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా ఇక్కడ తీసుకునే నిర్ణయాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో తోడ్పడుతుంది.
స్నేహితులారా,
సాధారణంగా ఏ కష్టమో, ఏ సంక్షోభమో వచ్చినపుడు, అది మనకు ఒక విలువైన పాఠాన్ని నేర్పుతుందని అంటారు. రెండుమూడు సంవత్సరాల క్రితం ప్రపంచం, ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మహమ్మారిని, అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సంక్షోభం ప్రతి దేశానికి, ప్రతి సమాజానికి, ప్రతి వ్యాపార గృహానికి, ప్రతి కార్పోరేట్ సంస్థకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. ఆ పాఠం ఏమిటంటే, ఇప్పుడు మనం అత్యధికంగా దృష్టి పెట్టాల్సింది పరస్పర నమ్మకం మీద మాత్రమే. కరోనా మహమ్మారి ప్రపంచం అంతటా ఆ పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీసింది. అపనమ్మకం రాజ్యమేలుతున్న ఈ పరిస్థితిలో, అత్యంత సున్నితత్వంతో, వినయంతో, నమ్మకం అనే జెండాను ఎత్తుకుని మీముందు నిలబడిన దేశం, భారతదేశం మాత్రమే. శతాబ్దపు అతిపెద్ద సంక్షోభ సమయంలో, నమ్మకం.. పరస్పర నమ్మకం అనే అమూల్యమైన సందేశాల్నిప్రపంచానికి భారతదేశం అందించింది.
కరోనా సమయంలో ప్రపంచానికి అత్యవసరమైన వేళ, ‘ప్రపంచ ఫార్మసీ’గా పేరున్నభారత్, 150 కంటే ఎక్కువ దేశాలకు మందులు పంపిణీ చేసింది. ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్లు అవసరమైనప్పుడు, భారత్ వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచి లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది. భారతదేశం నిర్వర్తించే కార్యకలాపాల్లో , ప్రదర్శించే స్పందనల్లో మన ప్రజాస్వామ్య విలువలు స్పష్టంగా కనిపిస్తాయి. దేశమంతటా 50 కంటే ఎక్కువ నగరాల్లో జరిగిన జీ20 సదస్సుల్లో కూడా ఈ ప్రజాస్వామ్య భావన స్పష్టంగా కనిపించింది. అందుకే భారత్‌తో మీ భాగస్వామ్యం చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈరోజు భారత్ ప్రపంచంలోనే అత్యంత యువ ప్రతిభ ఉన్న దేశం. ‘ఇండస్ట్రీ 4.0’ యుగంలో డిజిటల్ విప్లవానికి ముఖచిత్రంలా భారత్ నిలుస్తోంది. అందువల్ల మీరు భారత్‌తో ఎంతగా కలిసి సాగితే, ఇరువురికీ అభివృద్ధి అవకాశాలు అంతగా పెరుగుతాయి. వ్యాపారాలు సామర్థ్యాన్ని అభివృద్ధిగా మార్చగలవని, అడ్డంకులను అవకాశాలుగా మార్చగలవని, కోరికలను విజయాలుగా మార్చగలవని మీ అందరికీ తెలిసిందే. అవి చిన్నవైనా, పెద్దవైనా, అంతర్జాతీయమైనా, స్థానికమైనా వ్యాపారాలు అందరికీ పురోగతిని తీసుకురాగల శక్తి కలిగి ఉంటాయి. అందుకే ప్రపంచ అభివృద్ధి భవిష్యత్తు, వ్యాపారాల భవిష్యత్తుపై ఆధారపడి ఉంది
స్నేహితులారా,
కోవిడ్‌కి ముందూ, తర్వాతా ప్రపంచంలో చాలా ప్రస్పుటమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక తిరిగి పూర్వస్థితికి వెళ్లే వీలులేని అనేక మార్పులను కూడా మనం గమనించాం. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థను కూడా ఇప్పుడు క్రితంలా చూడలేం. ఒకప్పుడు ఈ సరఫరా వ్యవస్థ సమర్థవంతంగా ఉన్నన్నాళ్ళు, ఆందోళన అవసరం లేదు అనుకునేవారు. కానీ అసలు ప్రపంచానికి అత్యవసరం అయిన సమయాల్లోనే ఆ వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఉంటుందని మనం తెలుసుకోవాలి. అందుకే, ఇలాంటి సమస్య గురించి ప్రపంచం మధనపడుతున్న ఈ సమయంలో, మిత్రులారా నేను మీకు చెప్పే విషయం ఏమిటంటే, దీనికి పరిష్కారం భారత్ మాత్రమే. సమర్థవంతమైన, విశ్వసనీయమైన అంతర్జాతీయ సరఫరా గొలుసు వ్యవస్థను నిర్మించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే, అంతర్జాతీయ వ్యాపార సంస్థల బాధ్యత కూడా ఇంకా పెరగాలి. మనం అందరం కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది.
స్నేహితులారా,
జీ20 దేశాల మధ్య చర్చలకూ, అభిప్రాయాలు పంచుకోవడానికీ బిజినెస్-20 ఒక మెరుగైన వేదికగా ఎదగడం నాకు ఆనందంగా ఉంది. ఈ వేదికపై మనం ప్రపంచ సమస్యలకు పరిష్కారాల గురించి చర్చిస్తున్నప్పుడు, స్థిరత్వం అనేది ఒక అత్యంత ప్రాధాన్యమైన అంశం. స్థిరత్వం అనేది కేవలం నియమాలు, నిబంధనల వరకే పరిమితం కాకూడదు. అది మన రోజువారీ జీవనంలో భాగం కావాలి. ఈ దిశగా అంతర్జాతీయ వ్యాపారారులు మరొక అడుగు ముందుకు వేయాలని నా అభ్యర్థన. స్థిరత్వం అనేది ఒక అవకాశం మాత్రమే కాదు, అదే ఒక వ్యాపార నమూనా కూడా. దీన్ని అర్థం చేసుకోవడానికి మిల్లెట్ల గురించి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఐక్యరాజ్యసమితి, ఈ ఏడాదిని అంతర్జాతీయ మిల్లెట్ల సంవత్సరంగా ప్రకటించింది. మిల్లెట్లు ఆరోగ్యానికి మంచివి మాత్రమే కాదు, ప్రకృతికి అనుకూలమైనవి, అలాగే చిన్న రైతులకు లాభసాటివి కూడా. ఇదే సమయంలో, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా భారీ అవకాశాలు ఉన్నాయి. అంటే మెరుగైన జీవనశైలి, ఆర్థిక వ్యవస్థ రెండింటికీ ఇది లాభదాయకమైన నమూనా. ఇదే భావన ఆర్థిక వలయం (సర్క్యులర్ ఎకానమీ)లో కూడా కనిపిస్తుంది, ఇది వ్యాపారాలకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది. భారత్‌లో మేము హరిత శక్తి పై ప్రత్యేక దృష్టి పెట్టాం. సౌరశక్తిలో మేము సాధించిన విజయాన్ని ఇప్పుడు హరిత హైడ్రోజన్ రంగంలో కూడా సాధించడమే మా లక్ష్యం. భారత్ ఈ ప్రయాణంలో ప్రపంచాన్ని కూడా భాగం చేసుకోవాలనే భావనతో ఉంది. అంతర్జాతీయ సౌర కూటమి ఈ ప్రయత్నానికి మంచి ఉదాహరణగా నిలుస్తోంది.
స్నేహితులారా,
కరోనా తర్వాత ప్రపంచాన్ని చూస్తే, మనుషులు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. భోజనం చేసేటప్పుడు మాత్రమే కాదు, వస్తువులు కొన్నప్పుడు, ఆహారం ఎంచుకున్నప్పుడు, కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు, ఇలా అన్నింటిలోనూ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం. ప్రతి సందర్భంలో ఇవన్నీ మన ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయోనని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. తమకు భవిష్యత్తులో ఎలాంటి అసౌకర్యం కలగాకుడదని, తీవ్రమైన ఇబ్బందులు రాకూడదని కూడా ఆలోచిస్తున్నారు. అంటే, మనం నేడు తీసుకునే నిర్ణయం రేపు ఎలా ప్రభావితం చేస్తుందోనని చూసుకుంటున్నాం. మన భూమి శ్రేయస్సు గురించి కూడా వ్యాపార సంస్థలు, సమాజం ఒకలాగే ఆలోచించాలని నేను విశ్వసిస్తాను. నేను నా వ్యక్తిగత ఆరోగ్యం, నా దైనందిన జీవితంపై దాని ప్రభావం గురించి ఎలా జాగ్రత్త వహిస్తానో, నా చర్యల వల్ల భూమి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో కూడా శ్రద్ధ వహించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా “దీని ప్రభావం భూమిపై ఎలా ఉంటుంది?” అని ఆలోచించాలి. పర్యావరణ హిత జీవనం కోసం రూపొందిన ‘ది మిషన్ లైఫ్’ ఈ భావనతోనే ప్రారంభమైంది. దీని లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా భూమిని ప్రేమించే వ్యక్తుల సమూహాన్ని తయారు చేసి, తద్వారా ఒక పెద్ద ఉద్యమాన్ని సృష్టించడం. మన జీవనశైలికి అనుగుణంగా తీసుకునే ప్రతి నిర్ణయం వ్యాపార ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. జీవనశైలి అయినా, వ్యాపారాలు అయినా, రెండూ భూమికి మేలు చేసే దిశగా సాగితే, చాలా సమస్యలు సహజంగానే మాయమైపోతాయి. అందుకే మన జీవనం, మన వ్యాపారాలు పర్యావరణానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. భారతదేశం వ్యాపార రంగానికి ‘ గ్రీన్ క్రెడిట్ ’ అనే ఒక కొత్త కార్య ప్రణాళిక రూపొందించింది. మనం చాలాకాలం కార్బన్ క్రెడిట్ గురించి ఆలోచించే స్థాయిలోనే కొట్టుమిట్టాడుతున్న సమయంలో, ఇతరులు కార్బన్ క్రెడిట్ ప్రయోజనాలు కూడా పొందారు. అందుకని ‘గ్రీన్ క్రెడిట్’ భావనను ప్రపంచం ముందు ఉంచుతున్నాను. గ్రీన్ క్రెడిట్ అనేది భూమికి మేలు చేసే చర్యలకు ప్రోత్సాహం ఇస్తుంది. ప్రపంచ వ్యాపార దిగ్గజాలు అందరూ దీనిలో భాగస్వాములై, దీనిని ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మార్చాలని కోరుతున్నాను.
హితులారా,
మనం సంప్రదాయ వ్యాపార దృక్పథాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం మన ఉత్పత్తులు, బ్రాండ్లు, అమ్మకాల వరకే వ్యాపారాన్ని పరిమితం చేయకూడదు, అది సరిపోదు. ఒక వ్యాపారంగా, దీర్ఘకాలంలో ప్రయోజనాలు చేకూర్చేపూర్తిస్థాయి అనుబంధ వ్యవస్థను కూడా నిర్మించాలి. ఉదాహరణకు, ఇటీవల భారత్ అమలు చేసిన విధానాల వల్ల, కేవలం 5 సంవత్సరాల్లో 13 కోట్ల మంది పేదరికం నుండి విముక్తి పొందారు. ఇలా దారిద్ర్యరేఖ పైకి చేరుకున్నవారు, నూతన మధ్యతరగతి వారు కలిసి, కొత్త ఆశయాలతో కూడిన అత్యంత పెద్ద వినియోగదారుల వర్గంలో భాగస్వాములుగా ఏర్పడ్డారు. ఈ వర్గం భారత్ అభివృద్ధి వేగాన్ని గణనీయంగా పెంచుతోంది. అంటే, పేదల ప్రయోజనం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన, పేదలకు మాత్రమే కాక, మధ్యతరగతి వారికి, సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు కూడా ప్రయోజనం చేకూరింది. ఈ తరహా పాలన వలన రాబోయే 5–7 సంవత్సరాల్లో ఈ నూతన మధ్యతరగతి ఎంతగా పెరుగుతుందో ఊహించండి. ముఖ్యంగా మధ్యతరగతివారి కొనుగోలు శక్తి నిరంతరంగా పెరుగుతున్న వేళ, వ్యాపారాలు ఎక్కువ మందికి సేవ చేసే విధంగా ప్రణాలికలు ఆలోచించాలి. ఈ కొనుగోలు శక్తి పెరిగే కొద్దీ, అది వ్యాపారాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఈ రెండు అంశాలపై మన దృష్టిని సమానంగా ఎలా సమతూకం చేసుకోవాలో నేర్చుకోవాలి. మన దృష్టి వ్యక్తిగత లాభాలపైనే ఉంటే, మనం మనకూ ప్రయోజనం చేసుకోలేం, ప్రపంచానికీ ఉపయోగం ఉండదని నా నమ్మకం. ఇప్పటికే ముఖ్యమైన ఖనిజాలు, అరుదైన మూలకాలు, ఇతర లోహాల విషయంలోఈ సవాళ్ళను మనం ఎదుర్కొంటున్నాం. ఇవి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సమృద్ధిగా ఉన్నాయి, కొన్నిచోట్ల అసలే లభ్యం కావు, కానీ మొత్తం మానవ జాతికీ వీటి అవసరం మాత్రం ఉంది. ఈ వనరులు ఉన్నవారు వాటిని ప్రపంచం మొత్తానికి చెందినవిగా చూడకుండా, స్వార్థపూరితంగా వ్యహరిస్తే, అది కొత్తరకమైన వలస పాలనకు దారితీస్తుంది. ఇది నేను చేస్తున్న ఒక గంభీరమైన హెచ్చరిక అని గుర్తుంచుకోండి.
స్నేహితులారా,
ఉత్పత్తిదారుల, వినియోగదారుల ప్రయోజనాలు సమప్రాధాన్యంలో ఉన్నప్పుడే ఏదైనా మార్కెట్ దీర్ఘకాలం లాభదాయకంగా కొనసాగుతుంది. దేశాల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఇతర దేశాలను కేవలం మార్కెట్‌గా మాత్రమే చూడటం ఎప్పటికీ పనికిరాదు. అది ఒకానొక సమయంలో ఉత్పత్తి చేసే దేశాలకే నష్టం చేస్తుంది. అందుకే అందరినీ అభివృద్ధిలో సమాన భాగస్వాములుగా చూడటం ద్వారానే మనం ముందుకు వెళ్ళగలం. ఇక్కడ చాలా మంది ప్రపంచస్థాయి వ్యాపార దిగ్గజాలు ఉన్నారు. మనం ఇకనుండి వ్యాపారాలను మరింతగా వినియోగదారుల కేంద్రకంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచించలేమా? ఈ వినియోగదారులు వ్యక్తులు కావచ్చు, దేశాలు కావచ్చు, వారి ప్రయోజనాలను కూడా మనం కాపాడాలి. ప్రతి సంవత్సరం ఈ దిశగా ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమాన్ని మనం నిర్మించలేమా? ప్రపంచంలోని వ్యాపార సంస్థలన్నీ కలసి, వినియోగదారులు, వారి మార్కెట్ల ప్రయోజనం కోసం ప్రతి సంవత్సరం ఒక సంకల్పం తీసుకోగలరా?
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా వ్యాపారులందరూ కలసి ఈ వినియోగదారుల సంవత్సరంలో, వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక దినాన్నిపాటించగలరా? దురదృష్టవశాత్తు, మనం వినియోగదారుల హక్కుల గురించి ఎక్కువగా మాట్లాడతాం, అలాగే ప్రపంచం కూడా వినియోగదారుల హక్కుల దినాన్నిమొక్కుబడిగా జరుపుకుంటుంది. కానీ మనం ఈ వ్యవస్థను మార్చి, కార్బన్ క్రెడిట్ నుండి గ్రీన్ క్రెడిట్ వైపు దృష్టి మరల్చలేమా? తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగదారుల హక్కుల దినాన్నిజరుపుకోవడంకన్నా, వినియోగదారుల పరిరక్షణ గురించి ముందుగా మనం దృష్టి పెట్టాలి. ఒకసారి వినియోగదారుల పరిరక్షణ దినాన్ని పాటించడం మనం మొదలు పెడితే, అది పర్యావరణం పైన కూడా ఎంత సానుకూల ప్రభావం చూపగలదో ఊహించండి. వినియోగదారుల పరిరక్షణపై దృష్టి పెట్టినప్పుడే, హక్కుల విషయంలో వచ్చే సమస్యలన్నీ సహజంగానే పరిష్కారమవుతాయి. అందుకే, అంతర్జాతీయ వినియోగదారుల పరిరక్షణ దినం అనే ప్రాధమిక కార్యాచరణ ప్రణాళికలోనే ఏదో కొత్త ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ ప్రయత్నం వ్యాపారారుల, వినియోగదారుల మధ్య నమ్మకాన్ని మరింత పెంచుతుంది. వినియోగదారులు ఒకే భౌగోళిక ప్రాంతానికి పరిమితం కాలేరు; వారు అంతర్జాతీయ వ్యాపారాలు నిర్వహిస్తూ, గ్లోబల్ వస్తువులు, సర్వీసులను వినియోగించుకునే వివిధ దేశాలకు ప్రతినిధులుగా ఉంటారని మనం గుర్తుంచుకోవాలి.
ఆప్తులారా,
ఈ రోజు, ప్రపంచంలోని ప్రముఖ వ్యాపార నేతలు ఇక్కడ కలిసినప్పుడు, వ్యాపారం అలాగే మానవాళి భవిష్యత్తును నిర్ణయించే కొన్ని పెద్ద సవాళ్ళను మనం ఎదుర్కొంటున్నాం. ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి పరస్పర సహకార ప్రయత్నాలు అవసరం. వాతావరణ మార్పులు, ఎనర్జీ రంగంలో సంక్షోభం, ఆహార సరఫరా శృంఖలంలో అసమానతలు, నీటి భద్రత, సైబర్ సెక్యూరిటీ లాంటి ఈతరం సమస్యలు ఏవైనా, ఇవన్నీ వ్యాపారాలపై పెద్ద ప్రభావం చూపుతాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి మన సంయుక్త ప్రయత్నాలకు మరింత పదునుపెట్టాలి. 10–15 సంవత్సరాల క్రితం ఊహకు కూడా అందని కొత్త సమస్యలు ఈకాలంలో ఉత్పన్నం అవుతున్నాయి. ఉదాహరణకు, క్రిప్టోకరెన్సీ వల్ల వచ్చే సవాళ్లు. దీన్నిఎదుర్కోవాలంటే సమగ్రమైన దృక్పథం అవసరం. అందరు భాగస్వాముల ఆందోళనలను పరిగణలోకి తీసుకొని, ఒక అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయడం అవసరమని నా విశ్వాసం.
ఇలాంటి విధానం కృత్రిమ మేధ విషయంలో కూడా అవసరం. ప్రస్తుతం ప్రపంచం ఏఐ మాయలో చాలా ఉత్సాహంగా ఉంది, కానీ ఆ జోరులోనే అంతర్గతంగా అనేక నైతిక సమస్యలు కూడా ఉన్నాయి. ఉద్యోగ శిక్షణ పున:శిక్షణ, కంప్యూటింగ్ అల్గోరిథమ్స్ ఉండే పక్షపాతం, సమాజంపై ఏఐ చూపే ప్రభావం వంటి విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి మనం కలిసి పని చేయాలి. గ్లోబల్ వ్యాపార సమాజాలు, ప్రభుత్వాలు కలిసి నైతిక ఏఐని విస్తరించేందుకు ప్రయత్నించాలి. వివిధ రంగాలలో సంభవించే అంతరాయాలను మనం విశ్లేషించాలి. ప్రతి సందర్భంతో పాటే ఈ అంతరాయం మరింత తీవ్రంగా, విస్తృతంగా, ప్రధానమైనదిగా మారుతోంది. ఈ సవాళ్లకు ప్రపంచ పరిధిలో పరిష్కారం కనుక్కోవాల్సి ఉంది. స్నేహితులారా, ఇవేమీ కొత్తగా పుట్టుకొచ్చిన సమస్యలు కావు. విమానయాన రంగం అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఆర్థిక రంగం ముందుకు దూసుకు పోతున్నప్పుడు కూడా, గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా ప్రపంచం ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నది. అందుకే, ఈ కొత్త సమస్యలపై చర్చలు జరిపి, ఆలోచనలు పంచుకోవాలని ఈరోజు నేను బీ20 సమూహాన్ని కోరుతున్నాను.
స్నేహితులారా,
వ్యాపారాలు ఇప్పటికే దేశ సరిహద్దులను దాటి విజయవంతంగా విస్తరించాయి. ఇప్పుడు వ్యాపారాలను కేవలం లాభాలకే పరిమితమైన విషయంగా చూడకూడని సమయం వచ్చింది. ఇది సాధించడానికి మనం సరఫరా వ్యవస్థల పునరుత్థానం, స్థిరత్వం పై దృష్టి పెట్టాలి. బీ20 సదస్సు, సమూహ రీతిలో మార్పుకు దారితీసిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక అనుసంధానమైన ప్రపంచం అనేది కేవలం సాంకేతికత ద్వారా అనుసంధానం మాత్రమే కాదని మనం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం ఐక్య సామాజిక వేదికలకు సంబంధించినది కాక, ఉమ్మడి లక్ష్యం, ఉమ్మడి భూగ్రహం, ఉమ్మడి సంపద, అలాగే ఉమ్మడి భవిష్యత్తుకు కూడా సంబంధించినది.
ధన్యవాదాలు.
చాలా చాలా కృతజ్ఞతలు!
(గమనిక:ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి స్వేచ్ఛానువాదం)
***
(रिलीज़ आईडी: 2205086)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam