హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ.. 20 రాష్ట్రాలకు సంబంధించిన పంచాయతీ రాజ్ సంస్థల్లో విపత్తు ముప్పు తగ్గింపు కార్యక్రమాలను బలోపేతం చేసే రూ. 507.37 కోట్ల ప్రాజెక్ట్‌కు ఆమోదం


అన్ని రకాల విపత్తులను ఎదుర్కొనేందుకు 2021లో జాతీయ విపత్తు ఉపశమన నిధిని (ఎన్‌డీఎంఎఫ్) ప్రారంభించిన మోదీ ప్రభుత్వం

ప్రస్తుతం దీనిని పంచాయతీ స్థాయికి విస్తరించిన ప్రభుత్వం

ఏ రకమైన విపత్తునైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాధికారత కల్పించే విషయంలో దృఢ నిశ్చయంతో ఉన్న మోదీ ప్రభుత్వం

'విపత్తును తట్టుకోగల భారత్‌' అనే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

పరిపాలనా వ్యవస్థలో విపత్తు నిర్వహణ ప్రక్రియలను (డీఆర్ఆర్) ఏకీకృతం చేయడం ద్వారా క్షేత్ర స్థాయి నుంచి విపత్తు ముప్పు తగ్గింపును సాధించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం

ఈ కార్యక్రమం పరిధిలోకి 20 రాష్ట్రాల్లోని 81 విపత్తు ప్రభావిత జిల్లాలు

ప్రధాన విపత్తుల విషయంలో అనుసరించదగిన నమూనాలుగా 20 గ్రామ పంచాయతీల అభివృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఎస్‍డీఆర్‌ఎఫ్ కింద 28 రాష్ట్రాలకు రూ. 16118.00 కోట్లు, ఎన్‌డీఆర్‍ఎఫ్ కింద 18 రాష్ట్రాలకు రూ. 2854.18 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి (ఎస్‍డీఎంఎఫ్) నుంచి 21 రాష్ట్రాలకు రూ. 5273.60 కోట్లు, జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్‌డీఎంఎఫ్) నుంచి 14 రాష్ట్రాలకు రూ. 1423.06 కోట్లను విడుదల చేసిన కేంద్రం

प्रविष्टि तिथि: 16 DEC 2025 7:12PM by PIB Hyderabad

ఇరవై రాష్ట్రాలకు సంబంధించిన పంచాయతీ రాజ్ సంస్థల్లో కమ్యూనిటీ ఆధారిత విపత్తు ముప్పు తగ్గింపు కార్యక్రమాలను బలోపేతం చేసే రూ. 507.37 కోట్ల వ్యయంతో కూడిన జాతీయ ప్రాజెక్ట్‌కు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. దీనిని పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థల సమన్వయంతో అమలు చేయనున్నారు.

అన్ని రకాల విపత్తులను తట్టుకోగలిగే సమాజాన్ని తయారు చేసేందుకు మోదీ ప్రభుత్వం 2021లో జాతీయ విపత్తు ఉపశమన నిధిని (ఎన్‌డీఎంఎఫ్) ప్రారంభించింది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ఈ రోజు పంచాయతీ స్థాయికి విస్తరించారు. ఏ రకమైన ప్రకృతి వైపరీత్యాన్నైనా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను శక్తిమంతం చేసేందుకు మోదీ ప్రభుత్వం నిబద్ధతతో ఉంది.

విపత్తు నిర్వహణలో దిగువ నుంచి పై స్థాయి విధానం ద్వారా విపత్తు ముప్పు తగ్గింపు (డీఆర్‌‍ఆర్) విధానాలను పరిపాలనా వ్యవస్థలో మిళితం చేయాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ‘విపత్తులను తట్టుకునే భారత్‌’ అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందిస్తోంది. 20 రాష్ట్రాల్లోని 81 విపత్తు ప్రభావిత జిల్లాలు ఈ కార్యక్రమం పరిధిలో ఉంటాయి. దీనితో పాటు ప్రధాన విపత్తుల విషయంలో అనుసరించదగిన స్థానిక డీఆర్ఆర్ నమూనాలుగా 20 గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయనున్నారు. విపత్తు ముప్పు తగ్గింపులో పంచాయతీ రాజ్ సంస్థలకు సాధికారత కల్పించేందుకు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు చేస్తోన్న కృషికి ఇది మద్దతునిస్తుంది. 

ఆమోదించిన రూ. 507.37 కోట్ల వ్యయంలో జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్‍డీఎంఎఫ్) కింద కేంద్ర వాటాగా రూ. 273.38 కోట్లు ఉంది. రాష్ట్రాలు తమ వాటా కింద రూ. 30.37 కోట్లు సమకూరుస్తాయి. వీటితో పాటు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ రూ. 151.47 కోట్లు అందజేస్తుంది.. దీనికి సంబంధిత రాష్ట్ర వాటా రూ. 52.15 కోట్లుగా ఉంది. 

ఈ ప్రాజెక్టు కింద చేపట్టే కార్యకలాపాల్లో పంచాయతీ రాజ్ సంస్థల (పీఆర్ఐ) ద్వారా విపత్తు ముప్పు తగ్గింపు (డీఆర్ఆర్) అభివృద్ధి ప్రణాళికలో సంస్థాగత బలోపేతం, విధానపరమైన ఏకీకరణ వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఐఈసీ ద్వారా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు (ఎస్‍డీఎంఏ), జిల్లా విపత్తు నిర్వహణ సంస్థలు (డీడీఎంఏ), పంచాయతీ రాజ్ సంస్థలకు అవగాహన కల్పించటం - సామర్థ్య పెంపు కూడా ఉన్నాయి. స్థానిక విపత్తు ఉపశమనం విషయంలో సమర్థవంతమైన సమన్వయం కోసం సహకారాన్ని పెంపొందించడం వంటి చర్యలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. 

రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి కింద రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న నిధులకు ఈ మొత్తం అదనంగా ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఎస్‍డీఆర్‍ఎఫ్ కింద 28 రాష్ట్రాలకు రూ. 16118.00 కోట్లు, ఎన్‌డీఆర్‍ఎఫ్ కింద 18 రాష్ట్రాలకు రూ. 2854.18 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

వీటికి అదనంగా రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి (ఎస్‍డీఎంఎఫ్) నుంచి 21 రాష్ట్రాలకు రూ. 5273.60 కోట్లు, జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్‍డీఎంఎఫ్) నుంచి 14 రాష్ట్రాలకు రూ. 1423.06 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.


(रिलीज़ आईडी: 2204920) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Odia , Tamil