ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా-జోర్డాన్ బిజినెస్ ఫోరంలో ప్రసంగించిన ప్రధానమంత్రి, కింగ్ అబ్దుల్లా II
प्रविष्टि तिथि:
16 DEC 2025 1:19PM by PIB Hyderabad
అమ్మాన్‌లో ఈ రోజు నిర్వహించిన ఇండియా-జోర్డాన్ బిజినెస్ ఫోరాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి జోర్డాన్ యువరాజు హుస్సేన్, ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రి, పెట్టుబడుల మంత్రి కూడా హాజరయ్యారు. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు పెంపొందించుకోవాల్సిన ప్రాధాన్యాన్ని రాజు, ప్రధాని ఇద్దరూ గుర్తించారు. సామర్థ్యాన్ని, అవకాశాలను వృద్ధిగా, సంక్షేమంగా మార్చాలని రెండు దేశాల పారిశ్రామిక వేత్తలను కోరారు. దక్షిణాసియా, పశ్చిమాసియా పరిధి దాటి విస్తరించిన ఆర్థిక కారిడార్‌ను తయారుచేయడానికి జోర్డాన్ స్వేచ్ఛాయుత వ్యాపార ఒప్పందాలను, భారత ఆర్థిక శక్తిని ఏకం చేయాలని జోర్డాన్ రాజు తెలిపారు.
ఈ ఫోరాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. జోర్డాన్, భారత్ మధ్య నాగరిక సంబంధాలనే బలమైన పునాదులపై నిర్మితమైన శక్తిమంతమైన, సమకాలీన భాగస్వామ్యం ఉందన్నారు. మహారాజు నాయకత్వంలో మార్కెట్లను, ప్రాంతాలను కలిపే, వ్యాపారాన్ని, వృద్ధినీ ప్రోత్సహించే వారధిగా జోర్డాన్ మారిందని ప్రశంసించారు. వచ్చే 5 ఏళ్లలో జోర్డాన్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ల యూఎస్ డాలర్లకు చేర్చాలని ప్రధాని ప్రతిపాదించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రయాణిస్తూ.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ సాధించిన విజయాన్ని ప్రధానమంత్రి తెలియజేశారు. జోర్డాన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన భాగస్వామ్యులకు అంసఖ్యాకమైన వ్యాపార అవకాశాలను భారత్ అందిస్తోందన్నారు. భారత దేశంతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని, 1.4 బిలియన్ల వినియోగదారు మార్కెట్, బలమైన తయారీ వ్యవస్థ, స్థిరమైన, పారదర్శకమైన, ఊహించదగిన విధాన వాతావరణం అందించే ప్రయోజనాలను అందుకోవాలని జోర్డాన్ వ్యాపార సంస్థలను ఆహ్వానించారు. ఈ ప్రపంచానికి నమ్మకమైన సరఫరా భాగస్వాములుగా మారేందుకు రెండు దేశాలూ కలసి పనిచేయాలని ప్రధాని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన 8 శాతానికి పైగా వృద్ధిని గురించి ప్రస్తావిస్తూ.. ఇది ఉత్పాదకత ఆధారిత పాలన, ఆవిష్కరణల ఆధారిత విధానాల ఫలితమని స్పష్టం చేశారు.
డిజిటల్ ప్రజా మౌలిక వసతులు, ఐటీ, ఫిన్‌టెక్, హెల్త్-టెక్, అగ్రి-టెక్ రంగాల్లో భారత్-జోర్డాన్ వ్యాపార సహకారానికున్న అవకాశాలను ప్రధానమంత్రి వివరించారు. ఈ రంగాల్లో కలసి పనిచేయాల్సిందిగా రెండు దేశాలకు చెందిన అంకుర సంస్థలను ఆయన కోరారు. ఫార్మా, మెడికల్ పరికరాల రంగాల్లో భారతదేశానికున్న సామర్థ్యం, జోర్డాన్ కున్న భౌగోళిక ప్రాధాన్యంతో పరస్పరం ప్రయోజనం చేకూర్చుకోవచ్చని, ఈ రంగాల్లో పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు నమ్మకమైన కేంద్రంగా జోర్డాన్‌ను మార్చవచ్చన్నారు. వ్యవసాయం, కోల్డ్ చెయిన్, ఫుడ్ పార్కులు, ఎరువులు, మౌలిక వసతులు, ఆటోమొబైల్, గ్రీన్ మొబిలిటీ, వారసత్వ, సాంస్కృతిక పర్యాటకం తదితర రంగాల్లో ఉభయపక్షాలకు ఉన్న వ్యాపార అవకాశాలను ప్రధాని వివరించారు. భారత్ అనుసరిస్తున్న హరిత కార్యక్రమాల గురించి వివరిస్తూ.. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ ఫైనాన్సింగ్, డీశాలినేషన్, నీటి పునర్వినియోగ రంగాల్లో భారత్-జోర్డాన్ వ్యాపార సహకారాన్ని విస్తరించుకోవాలని ప్రధానమంత్రి సూచించారు.
మౌలిక వసతులు, ఆరోగ్యం, ఫార్మా, ఎరువులు, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, జౌళి, సరకు రవాణా, ఆటోమొబైల్, విద్యుత్, రక్షణ, తయారీ రంగాల్లో రెండు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు ఈ ఫోరంలో పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఒప్పందం చేసుకున్న ఫిక్కీ, జోర్డాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కూడా ఈ బృందంలో ఉన్నారు.
***
(रिलीज़ आईडी: 2204644)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam