ప్రధాన మంత్రి కార్యాలయం
అనువాదం: మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో నిర్వహించిన దివంగత శ్రీ అరవింద్ భాయ్ మాఫత్‌లాల్ శత జయంతి వేడుకల్లో ప్రధాని ప్రసంగం
प्रविष्टि तिथि:
27 OCT 2023 7:19PM by PIB Hyderabad
జై గురుదేవ్! మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్, సద్గురు సేవా సంఘ్ ట్రస్ట్ సభ్యులందరూ, మహిళలు - పెద్దలారా!
ఈ రోజు నాకు చిత్రకూట్ అనే ఈ పవిత్ర స్థలాన్ని మళ్లీ సందర్శించే అవకాశం లభించింది. మన రుషులు చెప్పిన అలౌకిక స్థలం ఇదే. దీని గురించి మన రుషులు"చిత్రకూట్ సబ్ దిన్ బసత్, ప్రభు సియా లఖన్ సమేత్!!" అని చెప్పేవారు. ప్రభు శ్రీరాముడు సీత, లక్ష్మణుడితో కలిసి చిత్రకూట్‌లో శాశ్వతంగా నివసిస్తారు అనేది దీని అర్థం. ఇక్కడికి రాకముందు శ్రీ రఘుబీర్ ఆలయం, శ్రీ రామ్ జానకి ఆలయాన్ని సందర్శించే అదృష్టం నాకు లభించింది. అలాగే కామద్గిరి పర్వతానికి హెలికాప్టర్ నుంచే అభివాదం చేశాను. గౌరవనీయులైన రణ్చోద్దాస్ గారు, అరవింద్ భాయ్ స్మారకం వద్ద నేను పుష్పగుచ్ఛాలు అర్పించడానికి వెళ్లాను. ప్రభు శ్రీరాముడు- జానకి దర్శనం, రుషుల మార్గదర్శనం, సంస్కృత కళాశాల విద్యార్థులు చేసిన వేద మంత్రాల అద్భుతమైన పఠన అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం.
మానవ సేవకు సంబంధించిన ఈనాటి ఈ గొప్ప తపస్సులో నన్ను భాగం చేసినందుకు పేదలు, దోపిడీకి గురైన వారు, గిరిజనుల తరపున నేను శ్రీ సద్గురు సేవా సంఘ్‌కు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఈ రోజు ప్రారంభించిన జానకీ కుండ్ ఆసుపత్రిలోని కొత్త సదుపాయం లక్షలాది మంది రోగులకు కొత్త జీవితాన్ని ఇస్తుందని నేను విశ్వసిస్తున్నాను. సద్గురు మెడిసిటీలో పేదలకు సేవ చేసే ఈ క్రతువు మరింత విస్తరిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ సందర్భంగా ఈ రోజు అరవింద్ భాయ్ జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక స్టాంప్‌ను కూడా విడుదల చేసింది. ఈ క్షణం మనందరికీ గొప్ప గర్వకారణమైన క్షణం.. గాఢ సంతృప్తి కలిగించే క్షణం. ఈ సందర్భంగా మీ అందరికీ నా అభినందనలు.
మిత్రులారా,
ఒక వ్యక్తి జీవితకాలంలో చేసే మంచి పనికి ప్రశంసలు అందుతాయి. సమకాలీనులు కూడా దీనిని అభినందిస్తారు. కానీ ఆ మనిషి చేసిన పని అసాధారణమైనదయినప్పుడు అది అతని జీవితం తర్వాత కూడా మెప్పు పొందుతూ ఉంటుంది. అరవింద్ భాయ్ కుటుంబం ఆయన స్వచ్ఛంద ధార్మిక సేవను నిరంతరం సుసంపన్నం చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ముఖ్యంగా భాయ్ 'విషాద్', సిస్టర్ 'రూపాల్', ఇతర కుటుంబ సభ్యులందరూ కొత్త శక్తితో అరవింద్ భాయ్ సేవలను మరింతగా విస్తరిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. అరవింద్ భాయ్ ఒక పారిశ్రామికవేత్త. అది ముంబయి అయినా లేదా గుజరాత్ అయినా.. పారిశ్రామిక, కార్పొరేట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆయన ప్రభావం ఉండేది. ఆయనకు ఉన్న అపారమైన ప్రతిభ అందరికీ తెలిసిందే. అందుకే విషాద్ ఈ శత జయంతి కార్యక్రమాన్ని ముంబయిలో నిర్వహించి ఉండొచ్చు. దానిని గొప్ప ఆడంబరం, ప్రదర్శనతో నిర్వహించి ఉండొచ్చు. కానీ సద్గురు పట్ల వారి అంకితభావాన్ని చూడండి. అరవింద్ భాయ్ ఈ స్థలంలోనే చివరి శ్వాస విడిచారు. అందుకే శత జయంతికి ఈ స్థలాన్ని ఎంచుకున్నారు. ఇటువంటి పనులకు విలువలు, ఆలోచన, అంకితభావం కూడా అవసరం. అప్పుడే ఇలాంటిది జరగటం చూడొచ్చు. గౌరవనీయులైన సాధువులు పెద్ద సంఖ్యలో మనలను ఆశీర్వదించడానికి ఇక్కడకు వచ్చారు. కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. చిత్రకూట్ గురించి "కామద్ భే గిరి రామ్ ప్రసాదా. అవలోకత అపహరత విషాదా" అని అంటారు. ‘చిత్రకూట్ పర్వతం అయిన కామద్గిరి శ్రీరాముని ఆశీస్సులతో అన్ని కష్టాలను, సమస్యలను తొలగించేది’ అనేది దీని అర్థం. చిత్రకూట్‌కు ఉన్న ఈ మహిమ ఇక్కడి రుషులు కారణంగానే చెక్కుచెదరకుండా ఉంది. గౌరవనీయులైన శ్రీ రణ్‌చోద్దాస్ గారు ఇటువంటి గొప్ప రుషి. ఆయన నిస్వార్థ కర్మయోగ ఎల్లప్పుడూ నాలాంటి లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. అందరూ చెప్తున్నట్లు చాలా సరళమైన మాటలలో ఆయన మంత్రం ఉంది. అదే ‘ఆకలితో ఉన్నవారికి ఆహారం, బట్టలు లేనివారికి బట్టలు, అంధులకు దృష్టి’. ఈ మంత్రంతో పూజ్య గురుదేవ్ మొదటిసారిగా 1945లో చిత్రకూట్‌కు వచ్చారు. 1950లో ఆయన ఇక్కడ మొదటి కంటి శిబిరాన్ని నిర్వహించారు. ఆ శిబిరంలో వందలాది మంది రోగులకు శస్త్రచికిత్స నిర్వహించటం ద్వారా వారికి కంటి చూపు తిరిగి వచ్చింది.
ఈ రోజు ఇది మనకు చాలా సాధారణంగా అనిపించొచ్చు. కానీ ఏడు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతం దాదాపు పూర్తిగా అటవీ ప్రాంతం. ఇక్కడ రోడ్డు సౌకర్యాలు లేవు.. విద్యుత్తు లేదు.. అవసరమైన వనరులు లేవు. ఆ సమయంలో ఈ అటవీ ప్రాంతంలో ఇటువంటి భారీ సంకల్పాన్ని తీసుకోవడానికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఉన్నత సేవా స్ఫూర్తి హెచ్చు స్థాయిలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యమై ఉండేది. కానీ గౌరవనీయులైన రణ్‌చోడ్ దాస్ వంటి సాధువుల విషయానికి వస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తామనే ధైర్యంతో ఈ సంకల్పాన్ని తీసుకున్నారు. ఈ పవిత్ర నేలపై మనం చూస్తున్న ప్రజలకు సేవ చేసే ఈ ప్రధాన ప్రాజెక్టులన్నీ ఈ సాధువు దృఢ సంకల్పం ఫలితమే. ఆయన ఇక్కడ శ్రీరామ్ సంస్కృత విద్యాలయాన్ని స్థాపించారు. కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్ట్ ఏర్పడింది. విపత్తు వచ్చినప్పుడల్లా ఒక కవచం వలె ఆ విపత్తును పూజ్య గురుదేవ్ ఎదుర్కొనేవారు. భూకంపం, వరద, కరువు ఏదైనా కావచ్చు.. ఆయన ప్రయత్నాలు, ఆశీర్వాదాల కారణంగా చాలా మంది పేదలకు కొత్త జీవితం లభించింది. స్వార్థానికి అతీతంగా ఎదిగి అంకితభావంతో సమాజానికి ఇటువంటి సేవ చేసే గొప్ప వ్యక్తులకు జన్మనివ్వటం మన దేశం ప్రత్యేకత.
నా కుటుంబ సభ్యులారా,
సాధువుల స్వభావం ఏంటంటే.. ఎవరికి వారి సాంగత్యం, మార్గదర్శకత్వం లభిస్తుందో వారు కూడా సాధువుగా మారతారు. అరవింద్ భాయ్ మొత్తం జీవితం దీనికి అతిపెద్ద ఉదాహరణ. వేషధారణ, రూపం కారణంగా అరవింద్ గారు చాలా సాధారణ వ్యక్తిలా కనిపిస్తారు. చాలా సాధారణ జీవితాన్ని గడిపినట్లు కనిపిస్తారు. కానీ లోపల నుంచి ఆయన ఒక నికార్సైన సాధువు. పూజ్య రణ్చోద్దాస్ గారు బీహార్‌లో సంభవించిన తీవ్ర కరువు సమయంలో అరవింద్ భాయ్‌ను కలిశారు. సాధువుల సంకల్పంతో పాటు సేవకు ఉన్న శక్తి, వారి సహకారం ద్వారా సాధించిన ఫలితాలు మన ముందు ఉన్నాయి.
ఈ రోజు మనం అరవింద్ భాయ్ శత జయంతిని చేసుకుంటున్నప్పుడు ఆయన స్ఫూర్తిని మనం స్వీకరించడం ముఖ్యం. ఆయన తీసుకున్న ప్రతి బాధ్యతను వంద శాతం అంకితభావంతో పూర్తి చేశారు. ఆయన ఇంత పెద్ద పారిశ్రామిక సామ్రాజ్యాన్ని నిర్మించి.. మాఫత్‌లాల్ గ్రూప్‌ను కొత్త శిఖరాలను అధిరోహించేలా చేశారు. దేశంలోనే మొదటి పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను స్థాపించింది అరవింద్ భాయ్. నేటి దేశ ఆర్థిక వ్యవస్థ, సామాన్య ప్రజల జీవితాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న అనేక కంపెనీలకు ఆయన దార్శనికత, ఆలోచన, కృషి పునాదిగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో కూడా ఆయన చేసిన కృషికి గొప్ప ప్రశంసలు దక్కాయి. ఇండియన్ ఆగ్రో-ఇండస్ట్రీస్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలు ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయి. ఆయన భారతదేశ సంప్రదాయ పరిశ్రమ అయిన వస్త్ర పరిశ్రమ గౌరవాన్ని తిరిగి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన దేశంలోని ప్రధాన బ్యాంకులు, సంస్థలకు కూడా నాయకత్వం వహించారు. ఆయన పని, కృషి, ప్రతిభ పారిశ్రామిక ప్రపంచంతో పాటు సమాజంపై కూడా చెరగని ముద్ర వేశాయి. అరవింద్ భాయ్ ముఖ్యమైన దేశీయ, అంతర్జాతీయ అవార్డులు, సన్మానాలను అందుకున్నారు. లయన్స్ హ్యుమానిటేరియన్ అవార్డు, సిటిజన్ ఆఫ్ బాంబే అవార్డు, పారిశ్రామిక శాంతికి సర్ జహంగీర్ గాంధీ గోల్డ్ మెడల్ వంటి అనేక గౌరవాలు.. అరవింద్ భాయ్ చేసిన సేవకు చిహ్నాలుగా నిలుస్తున్నాయి.
నా కుటుంబ సభ్యులారా,
"ఉపార్జితానాం విత్తానాం త్యాగ ఏవ హి రక్షణమ్॥" అని ఇక్కడే చెప్పారు.
అంటే మనం సంపాదించిన విజయం, సంపద అనేవి త్యాగం ద్వారా అత్యంత ప్రభావవంతమైన రక్షణలో ఉంటాయి. అరవింద్ భాయ్ ఈ నినాదాన్ని తన లక్ష్యంగా చేసుకుని జీవితాంతం అనుసరించారు. ఈ రోజు శ్రీ సద్గురు సేవ ట్రస్ట్, మాఫత్‌లాల్ ఫౌండేషన్, రఘుబీర్ మందిర్ ట్రస్ట్, శ్రీ రామ్‌దాస్ హనుమాన్జీ ట్రస్ట్ వంటి అనేక సంస్థలు గ్రూపులో భాగంగా ఉన్నాయి. జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్, చారుతర్ ఆరోగ్య మండల్ వంటి సంస్థలు సేవా భావాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. రఘుబీర్ ఆలయ అన్నక్షేత్రంలో లక్షలాది మందికి ఆహారం పెట్టటం, ఇక్కడ లక్షలాది మంది సాధువులకు నెలవారీ రేషన్ కిట్‌లను అందించటం, గురుకులంలో వేలాది మంది పిల్లలకు విద్య, జానకీ కుండ్ ఆసుపత్రిలో లక్షలాది మంది రోగులకు చికిత్స ఇవన్నీ సాధారణమైన విషయాలు కావు. నిస్వార్థ సేవ చేసేందుకు కావాల్సిన శక్తిని మనకు ఇస్తూ సేవను తపస్సుగా భావించి విజయం కోసం ప్రయత్నించే భారతదేశ శక్తికి ఇదొక నిదర్శనం. మీ ట్రస్ట్ గ్రామీణ పరిశ్రమలలో గ్రామీణ మహిళలకు శిక్షణను కూడా అందిస్తోంది. ఇది మహిళా-నేతృత్వంలోని అభివృద్ధి కోసం దేశం చేస్తోన్న ప్రయత్నాలను వేగవంతం చేయడానికి దోహపడుతోంది.
మిత్రులారా,
సద్గురు నేత్ర ఆసుపత్రి ఈ రోజు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ నేత్రాసుపత్రుల్లో స్థానాన్ని సంపాదించుకోవటం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఈ ఆసుపత్రి ఒకప్పుడు కేవలం 12 పడకలతో ప్రారంభమైంది. నేడు ఇక్కడ ప్రతి సంవత్సరం సుమారు 15 లక్షల మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. సద్గురు నేత్ర ఆసుపత్రి సేవలతో నా కాశీ కూడా లబ్ధి పొందింది కాబట్టి నాకు వ్యక్తిగతంగా ఈ పని గురించి అవగాహన ఉంది. మీరు కాశీలో నిర్వహిస్తున్న “ఆరోగ్యకరమైన దృష్టి-శ్రేయస్సు గల కాశీ” కార్యక్రమం అనేక మంది వృద్ధులకు లబ్ధి కలిగిస్తోంది. ఇప్పటివరకు బనారస్, దాని చుట్టుపక్కల సుమారు 6.5 లక్షల మందికి సద్గురు నేత్రాసుపత్రి ఇంటి వద్దే పరీక్షలు చేసింది. వీటి తర్వాత 90 వేల మందికి పైగా రోగులను శిబిరానికి వెళ్లమని చెప్పారు. పెద్ద సంఖ్యలో రోగులకు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. కాశీలో ఈ కార్యక్రమంలో లబ్ధి పొందిన వారిని కలిసే అవకాశం కొంతకాలం క్రితం నాకు కూడా లభించింది. నేను ఈ రోజు మీ మధ్య ఉన్నందున కాశీ ప్రజలందరి తరపున.. ట్రస్ట్, సద్గురు నేత్ర ఆసుపత్రి, వైద్యులందరికీ, ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా,
సేవ చేయడానికి వనరులు అవసరమే కానీ అంకితభావం అనేది ప్రధానంగా ఉండాల్సి ఉంటుంది. అరవింద్ భాయ్‌కి ఉన్న అత్యంత ప్రత్యేకమైన గుణం ఏంటంటే ఆయన కష్టతరమైన పరిస్థితులలో కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో పని చేసేవారు. అది రాజ్‌కోట్ కావచ్చు.. అహ్మదాబాద్ కావచ్చు.. గుజరాత్ నలుమూలలా నేను ఆయన పనిని చూశాను. నాకు గుర్తుంది. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. నాకు సద్గురు గారిని చూసే భాగ్యం లభించలేదు. కానీ నాకు అరవింద్ భాయ్‌తో సన్నిహిత పరిచయం ఉండేది. గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలోని గిరిజన ప్రాంతం భిలోడాలో నేను అరవింద్ భాయ్‌ను మొదటిసారి కలిశాను. అక్కడ తీవ్రమైన కరువు ఉండేది. మాకు డాక్టర్ మణికర్ అనే ఒక డాక్టర్ ఉన్నారు. ఆయనకు అరవింద్ భాయ్‌తో బాగా పరిచయం ఉండేది. కరువు బారిన పడిన ఆ గిరిజన సోదర సోదరీమణులకు సేవ చేసే పనిలో నేను అక్కడ ఉన్నాను. ఆ ప్రాంతంలో వేడి తీవ్రంగా ఉండేది. అరవింద్ భాయ్ ఆక్కడికి వచ్చి రోజంతా అక్కడే ఉండి సేవ చేశారు. సేవలను మరింత విస్తరించేందుకు అవసరమైన ప్రతిదాని బాధ్యతను కూడా ఆయన తీసుకున్నారు. పేదల పట్ల ఆయనకున్న కరుణ, పని చేయాలనే ఆయన దృఢ సంకల్పాన్ని నేను వ్యక్తిగతంగా చూసి తెలుసుకున్నాను. ఈ రోజు కూడా గుజరాత్‌లోని మా గిరిజన ప్రాంతమైన దాహోద్‌లో గిరిజన సమాజ సంక్షేమం కోసం ఆయన చేసిన పనిని ప్రజలు గుర్తు చేసుకుంటారు. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. సాధారణంగా ఇక్కడ గుజరాత్, ఇతర ప్రాంతాలలో కూడా వ్యవసాయం చేసే స్థలాన్ని 'ఖేత్' అని పిలుస్తారు. కానీ దాహోద్ ప్రజలు దీనిని 'ఫూల్‌వాడి' అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడి రైతులకు సద్గురు ట్రస్ట్ కొత్త రకం వ్యవసాయాన్ని నేర్పింది. వారు పూలను పండించడం ప్రారంభించారు. అందుకే ఆ పొలాన్ని ఫూల్‌వాడి అని పిలుస్తారు. నేడు వారు పండించే పూలు ముంబయికి వెళ్తున్నాయి. అరవింద్ భాయ్ ప్రయత్నాలు వీటన్నింటిలో ప్రధాన పాత్ర పోషించాయి. ఇతరులకు సేవ చేయడంలో ఆయనకు ఒక విభిన్నమైన అభిరుచి ఉందని నేను గమనించాను. తనను దాతగా పిలవటాన్ని ఆయన ఎప్పుడూ ఇష్టపడలేదు. తాను ఇతరుల కోసం ఏదైనా చేసినట్లు కూడా తెలియనిచ్చేవారు కాదు. మరొకరు ఆయనకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పినా.. ముందుగా ఆ ప్రాంతానికి వెళ్లాలని, ఎంత ఇబ్బంది పడినా వ్యక్తిగతంగా అక్కడికి వెళ్లి పనిని చూడాలని చెప్పేవారు. ముందుగా ప్రాజెక్ట్‌ను చూడాలని ఆయన పట్టుబట్టేవారు. అప్పుడే వారిని మద్దతు ఇవ్వనిచ్చేవారు.. దీనికి ముందు కాదు. ఆయన పని, ఆయన వ్యక్తిత్వం గురించి నేను తెలుసుకున్న విషయాలతో ఆయన లక్ష్యంతో నాకు భావోద్వేగ అనుబంధం పెరిగింది. అందుకే ఈ సేవా కార్యక్రమాలకు మద్దతుదారుడిగా.. ఒక విధంగా మీ సహచరుడిగా నన్ను నేను చూసుకుంటున్నాను.
నా కుటుంబ సభ్యులారా,
చిత్రకూట్ భూమి మన నానాజీ దేశ్‌ముఖ్ 'కర్మస్థలి' కూడా. అరవింద్ భాయ్ మాదిరిగానే గిరిజన సమాజానికి సేవ చేయడంలో ఆయన చేసిన కృషి కూడా మనందరికీ గొప్ప స్ఫూర్తినిస్తోంది. ఈ రోజు ఈ ఆదర్శాలను అనుసరించే దేశం మొదటిసారిగా గిరిజన సమాజ సంక్షేమం కోసం భారీ ప్రయత్నాలు చేస్తోంది. భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా గిరిజనులను గౌరవించే దినోత్సవాన్ని దేశం ప్రారంభించింది. గిరిజన సమాజం అందించే సహకారం, వారసత్వాన్ని గౌరవించేందుకు దేశవ్యాప్తంగా గిరిజన మ్యూజియంలను కూడా నిర్మిస్తున్నారు. గిరిజన పిల్లలకు మంచి నాణ్యమైన విద్య లభించి, వారిని దేశ అభివృద్ధికి సహకరించేలా చూసుకునేందుకు ఏకలవ్య ఆవాస పాఠశాలలు ప్రారంభిస్తున్నాం. అటవీ సంపద చట్టం వంటి విధాన నిర్ణయాలు కూడా గిరిజన సమాజపు హక్కులను రక్షించడానికి ఒక మాధ్యమంగా మారాయి. గిరిజనులను అక్కున చేర్చుకున్న ప్రభు శ్రీరాముని ఆశీస్సులతోనే ఈ ప్రయత్నాలతో గిరిజన సమాజాన్ని మేం అక్కున చేర్చుకుంటున్నాం. ఈ ఆశీర్వాదం మనకు సామరస్య, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం వైపు మార్గనిర్దేశం చేస్తోంది. మరోసారి శత జయంతి శుభ సందర్భంగా అరవింద్ భాయ్ గొప్ప ప్రయత్నాలకు నేను వందనం చేస్తున్నాను. ఆయన పని, జీవితం మనందరికీ స్ఫూర్తిని ఇస్తూనే ఉండాలి. మనపై సద్గురు ఆశీస్సులు కొనసాగాలి! ఈ స్ఫూర్తితో మీ అందరికీ నా ధన్యవాదాలు!
జై శ్రీరామ్.
గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగం అనువాదం ఇది.
***
(रिलीज़ आईडी: 2201647)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam