ప్రధాన మంత్రి కార్యాలయం
రష్యా అధ్యక్షుడితో సంయుక్తంగా చేసిన పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
प्रविष्टि तिथि:
05 DEC 2025 3:33PM by PIB Hyderabad
గౌరవనీయులు, నా మిత్రుడు, అధ్యక్షుడు పుతిన్,
ఇరుదేశాల ప్రతినిధులు,
మీడియా మిత్రులారా,
నమస్కారం!
శుభోదయం!
ఇవాళ 23వ భారత్-రష్యా సమావేశానికి అధ్యక్షుడు పుతిన్‌ను స్వాగతించినందుకు నేను సంతోషిస్తున్నాను. మన ద్వైపాక్షిక సంబంధాలు ఎన్నో చారిత్రక ఘట్టాలను అధిగమిస్తున్న తరుణంలో ఆయన భారత పర్యటనకు వచ్చారు. సరిగ్గా 25 ఏళ్ల కిందట అధ్యక్షుడు పుతిన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాది వేశారు. పదిహేనేళ్ల కిందట 2010లో మన భాగస్వామ్యం "ప్రత్యేక, విశేషాధికార వ్యూహాత్మక భాగస్వామ్యం" స్థాయికి పెరిగింది.
గత రెండున్నర దశాబ్దాలుగా ఆయన నాయకత్వం, దార్శనికతతో ఈ సంబంధాన్ని నిరంతరం పెంపొందించారు. ఆయన నాయకత్వం అన్ని పరిస్థితుల్లో పరస్పర సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చింది. అధ్యక్షుడు పుతిన్‌కు, నా మిత్రుడికి, భారతదేశం పట్ల ఆయనకున్న ప్రగాఢమైన స్నేహానికి, చెక్కుచెదరని ప్రాధాన్యతకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఎనిమిది దశాబ్దాలుగా ప్రపంచం ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. మానవాళి లెక్కలేనన్ని సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొంది. అయినప్పటికీ, భారత్-రష్యా స్నేహం ఒక ధ్రువతారలా స్థిరంగా నిలిచింది. పరస్పర గౌరవం, అమితమైన విశ్వాసంపై పెంపొందిన మన బంధం కాలపరీక్షకు అతీతంగా నిలబడింది.
ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయటానికి ఇవాళ మేం అన్ని అంశాలపై చర్చించాం. మన ఆర్థిక సహకారాన్ని కొత్త శిఖరాలకు చేర్చటమే మా ఉమ్మడి ప్రాధాన్యత. ఇందుకోసం 2030 వరకు ఆర్థిక సహకారానికి అంగీకారం తెలిపాం. ఇది మన వాణిజ్యం, పెట్టుబడులను మరింత వైవిధ్యభరితంగా, సమతుల్యంగా, స్థిరంగా మారుస్తుంది. సహకార రంగాలకు కొత్త కొలమానాలను జోడిస్తుంది.
అధ్యక్షుడు పుతిన్, నేను ఇవాళ భారత్-రష్యా వాణిజ్య సదస్సులో పాల్గొనే అవకాశముంది. ఈ వేదిక వాణిజ్య సంబంధాలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఎగుమతులు, సహ-ఉత్పత్తి, సహ-ఆవిష్కరణకు ఇది కొత్త మార్గాలను చూపిస్తుంది.
యురేషియన్ ఎకనామిక్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ముగించేందుకు ఇరుపక్షాలు క్రీయాశీలకంగా కృషి చేస్తున్నాయి. వ్యవసాయం, ఎరువుల రంగాల్లో మా సన్నిహిత సహకారం ఆహార భద్రత, రైతు సంక్షేమానికి చాలా కీలకం. ఈ సహకారాన్ని కొనసాగిస్తూ యూరియా ఉత్పత్తిపై ఇరుదేశాలు కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది.
మిత్రులారా,
రెండు దేశాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచటం ముఖ్య ప్రాధాన్యత. ఐఎన్ఎస్టీసీ, ఉత్తర సముద్ర మార్గం, చెన్నై-వ్లాడివోస్టాక్ కారిడార్లపై నూతనోత్తేజంతో ముందుకు సాగుతాం. ధృవ ప్రాంత సముద్రయాన కార్యకలాపాలకు భారతీయ నావికుల శిక్షణపై రష్యా సహకరించనున్నందుకు సంతోషిస్తున్నాను. ఇది ఆర్కిటిక్ మహాసముద్ర జలాల్లో సహకారాన్ని బలోపేతం చేయడమే కాక, భారతీయ యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.
అదేవిధంగా, నౌకా నిర్మాణంలో సహకారంతో 'మేక్ ఇన్ ఇండియా' మరింత బలపడుతుంది. ఇది ఉభయ-లాభదాయక భాగస్వామ్యానికి మరొక అద్భుతమైన ఉదాహరణ. దీని ద్వారా ఉద్యోగాలు, నైపుణ్యాలు, ప్రాంతీయ అనుసంధానం మెరుగుపడుతుంది.
భారత్-రష్యా భాగస్వామ్యంలో ఇంధన భద్రత బలమైన, కీలకమైన అంశం. పౌర అణుశక్తి రంగంలో దశాబ్దాల నాటి సహకారం, పర్యావరణ హిత ఇంధనానికి ఉమ్మడి ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఉభయులకూ విజయాన్ని చేకూర్చే సహకారాన్ని మేం కొనసాగిస్తాం.
కీలక ఖనిజాల అంశంలో ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, వైవిధ్యభరితమైన సరఫరా వ్యవస్థల ఏర్పాటుకు మన సహకారం చాలా ముఖ్యమైనది. ఇది పర్యావరణ హిత ఇంధన, హై-టెక్ తయారీ, అత్యాధునిక పరిశ్రమల్లో మా భాగస్వామ్యానికి బలమైన మద్దతునందిస్తుంది.
మిత్రులారా,
భారత్-రష్యా సంబంధాల్లో సాంస్కృతిక సహకారం, ప్రజల మధ్య అనుబంధాలది ప్రత్యేక స్థానం. దశాబ్దాలుగా ఇరు దేశాల ప్రజలు పరస్పరం ప్రేమ, గౌరవం, ఆప్యాయతను పంచుకుంటున్నారు. ఈ బంధాలను మరింత బలపరిచేందుకు మేం ఎన్నో చర్యలు తీసుకున్నాం.
రష్యాలో ఇటీవల రెండు కొత్త భారతీయ కాన్సులేట్లు ప్రారంభించాం. ఇది ఇరు దేశాల పౌరుల మధ్య పరస్పర సహకారాన్ని, బంధాలను మరింత దృఢపరుస్తుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో 'కల్మికియా' వద్ద జరిగిన అంతర్జాతీయ బౌద్ధ ఫోరమ్‌లో లక్షలాది మంది భక్తులు గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాల ఆశీర్వాదం అందుకున్నారు.
త్వరలో రష్యా పౌరులకు ఉచితంగా 30-రోజుల ఈ-టూరిస్ట్ వీసా, 30-రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసాను ప్రవేశపెట్టనుండటం సంతోషకరం.
ఇతర దేశాలకు కార్మిక శక్తి తరలి వెళ్లటం వలన అనుసంధానం పెరగటమే కాక, రెండు దేశాలకు కొత్త శక్తినిస్తుంది. నూతన అవకాశాలను సృష్టిస్తుంది. ఈ సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఇవాళ రెండు ఒప్పందాలు కుదరటం సంతోషకమైన విషయం. వృత్తి విద్య, నైపుణ్యాల పెంపుదల, శిక్షణ ఇవ్వటంపై మేం కలిసి పనిచేస్తాం. మన విద్యార్థులు, పరిశోధకులు క్రీడాకారుల మధ్య మార్పిడులను కూడా పెంచుతాం.
మిత్రులారా,
ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా ఇవాళ మేం చర్చించాం. ఉక్రెయిన్ పరిస్థితులు, అక్కడ శాంతి స్థాపనకు మొదట్నుంచీ భారత్ కృషి చేస్తోంది. ఈ విషయంలో శాంతియుతమైన, శాశ్వత పరిష్కారానికి జరుగుతున్న అన్ని ప్రయత్నాలను మేం స్వాగతిస్తున్నాం. సహకారానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. ఉంటుంది కూడా.
ఉగ్రవాదంపై పోరాటంలో భారత్, రష్యా చాలా కాలంగా ఐకమత్యంతో నిలబడ్డాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కావచ్చు లేదా క్రోకస్ సిటీ హాల్లో జరిగిన పిరికిపంద దాడి కావచ్చు.. వీటికి మూలం ఒక్కటే. మానవతా విలువలను ఉగ్రవాదం నేరుగా దెబ్బతీస్తుందని, దానికి వ్యతిరేకంగా ప్రపంచ ఐక్యతే గొప్ప బలమని భారత్ దృఢంగా విశ్వసిస్తుంది.
యూఎన్, జీ20, బ్రిక్స్, ఎస్సీఓ ఇతర వేదికల్లో భారత్, రష్యా సన్నిహిత సహకారాన్ని కొనసాగించాయి. అదే విధమైన సమన్వయంతో ముందుకు సాగుతూ, ఈ అన్ని వేదికల్లోనూ చర్చలను, సహకారాన్ని కొనసాగిస్తాం.
గౌరవనీయులు,
భవిష్యత్తులో ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు మన స్నేహం శక్తినిస్తుందని, ఈ నమ్మకం మన ఉమ్మడి భవిష్యత్తును మరింత సుసంపన్నం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
మీరు, మీ ప్రతినిధి బృందం భారత్‌ను సందర్శించినందుకు మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు.
***
(रिलीज़ आईडी: 2199716)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam