వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ రంగంలో భారత్-రష్యా సహకారాన్ని బలోపేతం చేసేలా రెండు దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం
ద్వైపాక్షిక వ్యవసాయ వాణిజ్యాన్ని పెంపొందించడానికి, ఆహార ధాన్యాలు,
ఉద్యానవన ఎగుమతుల్లో నూతన అవకాశాలను అన్వేషించడానికి భారత్, రష్యా అంగీకారం
వ్యవసాయ పరిశోధన, ఆవిష్కరణల్లో సహకారాన్ని బలోపేతం చేసే దిశగా
ఐసీఏఆర్, రష్యాలోని ఫెడరల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం
బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశానికి రష్యాను ఆహ్వానించిన భారత్: ఎరువులు, విత్తనాలు, మార్కెట్ సౌలభ్యం, ఉమ్మడి పరిశోధనల్లో సహకారాన్ని విస్తరించడంలో నిబద్ధతను పునరుద్ఘాటించిన ఇరు పక్షాలు
प्रविष्टि तिथि:
05 DEC 2025 3:55PM by PIB Hyderabad
రష్యన్ ఫెడరేషన్ వ్యవసాయ మంత్రి గౌరవ ఒక్సానా లట్‌తో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. కృషిభవన్లో 2025, డిసెంబర్ 4న జరిగిన ఈ సమావేశంలో కొనసాగుతున్న సహకారం, భవిష్యత్తులో భాగస్వామ్యం కుదుర్చుకొనే రంగాలపై ఇరు పక్షాలు చర్చించాయి.
నమ్మకం, స్నేహం, పరస్పర సహకారం ఆధారంగా భారత్-రష్యా సంబంధాలు ఏర్పడ్డాయని మంత్రులు స్పష్టం చేశారు. ద్వైపాక్షిక వ్యవసాయ వాణిజ్యం విస్తరిస్తోందనీ, ప్రస్తుతం దీని విలువ 3.5 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉందనీ శ్రీ చౌహాన్ తెలియజేశారు. మరింత సమతుల్యమైన వాణిజ్యాన్ని అవలంబించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ.. భారతీయ బంగాళాదుంప, దానిమ్మ, విత్తనాల ఎగుమతులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించిన రష్యాకు కృతజ్ఞతలు తెలియజేశారు.
వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని పెంపొందించడానికి, భారత్ నుంచి ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ఉన్న అవకాశాలను ఉభయ పక్షాలు అన్వేషించాయి.
ఈ సమావేశంలో.. వ్యవసాయ పరిశోధన, ఆవిష్కరణ, సామర్థ్య నిర్మాణంలో సహకారాన్ని బలోపేతం చేసే దిశగా రష్యాలోని ఫెడరల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్, ఐసీఏఆర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశంలో పాల్గొనాలని రష్యా వ్యవసాయ మంత్రిని శ్రీ చౌహాన్ ఆహ్వానించారు.
వ్యవసాయ వాణిజ్యం, ఎరువులు, విత్తనాలు, మార్కెట్ సౌలభ్యం, ఉమ్మడి పరిశోధనలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. అలాగే ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలోనూ, రెండు దేశాల రైతులకు ప్రయోజనాలు అందించడంలోనూ తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. వాణిజ్యాన్ని పెంపొందించడం, వ్యవసాయం రంగంలో సహకారాన్ని విస్తరించడంపై లట్ ఆసక్తిని ప్రదర్శించారు.
రష్యా ప్రతినిధి బృందంలో వ్యవసాయ మంత్రితో పాటుగా.. సహాయ మంత్రులు శ్రీ మాక్సిమ్ మార్కోవిచ్, మరీనా అఫోనినా, ఎఫ్ఎస్వీపీఎస్ అధినేత సెర్జీ డంక్వెర్ట్, ఆసియా విభాగ డైరెక్టర్ శ్రీమతి డరియా కొరొలెవా, ఇతర సభ్యులు ఉన్నారు.
భారత్ తరఫున వ్యవసాయం, రైతు సంక్షేమ విభాగం కార్యదర్శి శ్రీ దేవేశ్ చతుర్వేది, డీఏఆర్ఈ కార్యదర్శి శ్రీ ఎంఎల్ జాట్, ఎరువుల విభాగం కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్రా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, వ్యవసాయం, రైతు సంక్షేమ విభాగ సంయుక్త కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2199668)
आगंतुक पटल : 4