ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలోని ద్వారకలో విజయదశమి వేడుకల్లో ప్రధాని ప్రసంగం

प्रविष्टि तिथि: 24 OCT 2023 7:44PM by PIB Hyderabad

సియావర్ రామచంద్ర కీ జై

సియావర్ రామచంద్ర కీ జై

శక్తిని ఆరాధించే నవరాత్రి పండుగ, విజయోత్సవమైన విజయదశమి సందర్భంగా తోటి భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అన్యాయంపై న్యాయంఅహంకారంపై వినయందుందుడుకుతనంపై సహనం సాధించిన విజయానికి ప్రతీక ఈ విజయదశమి పండుగ. పీడకుడైన రావణుడిపై.. రాముడు సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకొనే పండుగ ఇది. ఏటా రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేసి మనం ఈ విజయాన్ని ప్రతీకాత్మకంగా చాటుతాం. కానీ ఈ పండుగ దానికి మాత్రమే పరిమితం కాదు. ఈ పండుగ మనకు సంకల్పాల సమయం.. మన నిశ్చయాలను పునరుద్ఘాటించే వేడుక ఇది.

ప్రియమైన దేశవాసులారా,

చంద్రుడిపై మన విజయానికి రెండు నెలలు పూర్తయిన సందర్భంలో ఈ సంవత్సరం మనం విజయదశమిని జరుపుకొంటున్నాం. విజయదశమిలో ఆయుధాల పూజ కూడా ఉంటుంది. భారత్‌లో ఆయుధ పూజ అంటే ఈ నేలపై ఆధిపత్యం కాదు.. అది దేశ రక్షణ కోసం నిర్వహించే క్రతువు. నవరాత్రి సమయంలో శక్తిని పూజించే వేళ మనమిలా చెప్తాం:

యా దేవి సర్వభూతేశూశక్తిరూపేణ సంస్థితానమస్తస్యైనమస్తస్యైనమస్తస్యై నమోనమః (జీవులన్నింటిలో శక్తి రూపంలో ఉండే ఓ దేవీ.. నీకు నమస్కరిస్తున్నాం). 

పూజ పూర్తయిన తర్వాత మనమిలా చెప్తాం:

దేహి సౌభాగ్య ఆరోగ్యందేహి మే పరమం సుఖంరూపం దేహిజయం దేహియశో దేహిద్విషోజహీ! (అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, సర్వోత్కృష్టమైన ఆనందాన్ని, సౌందర్యాన్ని, విజయాన్ని, యశస్సును ప్రసాదించుశతృబాధలు తొలగించు!)

మన శక్తి ఆరాధన కేవలం మన కోసం మాత్రమే కాదు.. ఈ మొత్తం సృష్టి శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందం, విజయం, యశస్సు కోసం మనం ప్రార్థిస్తాం. భారత్ అంటే ఇదీ. మనకు భగవద్గీత బోధనలూ తెలుసు.. ఐఎన్ఎస్ విక్రాంత్తేజస్‌లను నిర్మించడమూ తెలుసు. మనకు శ్రీరాముడి ఘనత తెలుసు.. మన సరిహద్దులను ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసు. మనకు శక్తి ఆరాధన సూత్రాలూ తెలుసు.. అలాగే కోవిడ్ వేళ సర్వే సంతు నిరామయ (అందరూ అనారోగ్యం నుంచి విముక్తులవుదురు గాక) మంత్రాన్నీ విశ్వసించాం. ఇదీ భారత్ స్ఫూర్తి. దసరా విజయం భారత్‌లో ఈ ఆదర్శాలను సూచిస్తుంది.

మిత్రులారా,

ఈ రోజు శ్రీరాముడి గొప్ప ఆలయ నిర్మాణాన్ని చూసే భాగ్యం మనకు దక్కింది. వచ్చే రామనవమి వేళ అయోధ్య ఆలయంలో ప్రతిధ్వనించే మంత్రోచ్చారణ యావత్ప్రపంచానికీ ఆనందాన్నిస్తుంది. శతాబ్దాలుగా ఇక్కడ ప్రతిధ్వనిస్తున్న నాధాలివే -

భయ ప్రగట కృపాలా, దీనదయాళా... కౌసల్యా హితకారీ (ఆర్తుల పట్ల దయనూ, కరుణనూ చూపే ఆ స్వామి కౌసల్య ఎదుట నిలిచి ఉన్నాడు)... రామ మందిరంలో ప్రతిధ్వనిస్తుంది.

శతాబ్దాల పాటు సహనం వహించిన భారతీయుల సంకల్పం జయించిందనేందుకు రామ మందిర నిర్మాణం ప్రతీక. రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్ఠాపన వేడుకకు ఇంకా కొన్ని నెలలే ఉంది. రాముడొస్తున్నాడు. మిత్రులారా.. శతాబ్దాల అనంతరం ఆలయంలో రామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠ ఎంతటి ఆనందాన్నిస్తుందో ఊహించండి. శ్రీరాముడి ఆగమన వేడుక విజయదశమితో మొదలైంది. రామచరిత మానస్‌లో తులసీదాసు ఇలా రాశారు...

సగుణ్ హోహి సుందర సకల మన్ ప్రసన్న సబ్ కెర్.. ప్రభు ఆగవన్ జనవ జాను నగర రమ్య చహుం ఫేర్. అంటే.. భగవాన్ రాముడి ఆగమనం సమీపించిన వేళ అయోధ్య నిండా ప్రసన్నత వ్యాపిస్తోంది. అందరూ సంతృప్తితో ఉన్నారు. నగరం మొత్తం మనోహరంగా మారింది. ఇప్పుడు కూడా దేశంలో అలాంటి ప్రసన్నతనే చూస్తున్నాం. భారత్ చంద్రుడిని జయించింది. అతిత్వరలో మనం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. కొన్ని వారాల కిందటే కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశించాం. నారీ శక్తి వందన అధినియంను పార్లమెంటు ఆమోదించింది. మహిళా సాధికారతను ప్రతిబింబించే దిశగా ఇదొక కీలక చర్య.

ప్రపంచంలో అతిపెద్దఅత్యంత విశ్వసనీయ ప్రజాస్వామ్యంగా భారత్ నేడు ఎదుగుతోంది. ప్రజాస్వామ్యానికి మాతృకగా ప్రపంచం భారత్‌ను చూస్తోంది. ఈ ఆనందకరమైన క్షణాల నడుమ.. అయోధ్య మందిరంలో రాముడు కొలువుదీరబోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే, స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లకు భారత్ కొత్త గమ్యాన్ని చేరుకోబోతోంది. అయితే ఇది భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కూడా. నేటి రావణ దహనం కేవలం దిష్టిబొమ్మను కాల్చడం మాత్రమే కాదని మనం గుర్తుంచుకోవాలి.. అది సమాజంలో సామరస్యానికి విఘాతం కలిగించే ప్రతి వికారాన్నీ దహించివేయడమే. అది కులతత్వం, ప్రాంతీయతత్వం పేరిట భరతమాతను విభజించడానికి ప్రయత్నించే శక్తులను అందులో తగులబెట్టాలి. భారత పురోగతి కన్నా వ్యక్తిగత లాభానికే ప్రాధాన్యమిచ్చే మనస్తత్వాన్ని ఆ మంటల్లో కాల్చేయాలి. విజయదశమి వేడుక కేవలం రావణుడిపై రాముడి విజయం మాత్రమే కాదు.. దేశంలోని ప్రతి వికారంపైనా దేశభక్తి సాధించిన విజయాన్ని చాటేదిగా ఉండాలి. సమాజంలోని దురాచారాలను, వివక్షను నిర్మూలించేందుకు మనం సంకల్పించాలి.

మిత్రులారా,

రాబోయే 25 ఏళ్లు భారత్కు అత్యంత కీలకమైనవి. ప్రపంచం మొత్తం నేడు భారత్‌నే చూస్తోంది. మన సమర్థతను గమనిస్తోంది. మనమిప్పుడు విశ్రమించడానికి లేదు.. రామచరిత మానస్‌లో ఇలా రాశారు - 

రామ్ కాజ్ కిన్హేం బినుమోహి కహా విశ్రమ్... అంటే, రాముడి ఆదర్శాల ఆధారంగా భారత్‌ను నిర్మించే వరకు విశ్రాంతి తీసుకునేది లేదు. అభివృద్ధి చెందిన భారత్‌ను మనం నిర్మించాలి – అది స్వావలంబన కలిగినదై ఉండాలి, ప్రపంచ శాంతికి దోహదపడాలి. కలలను సాకారం చేసుకునేందుకు ఇక్కడ అందరికీ సమాన హక్కులుండాలి. ప్రజలకు శ్రేయోదాయకమైన, వారికి సంతృప్తినిచ్చేలా.. ‘అభివృద్ధి చెందిన భారత్‌’ను మనం సాకారం చేసుకోవాలి. రామరాజ్య ఆదర్శమిదే: రామ్ రాజ్ బైఠే త్రైలోకాహర్షిత్ భయే గయే సబ్ సోకా... అంటే, రాముడు సింహాసనాన్నధిష్ఠించిన వేళ ప్రపంచమంతా ఆనందం నిండాలి, అందరి బాధలూ తొలగిపోవాలి. కానీ, అదెలా జరుగుతుంది? కాబట్టి, ఈ విజయదశమి వేళ 10 తీర్మానాలను చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరినీ నేను కోరుతున్నాను.

మొదటి తీర్మానం - రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకుని వీలైనంత ఎక్కువ నీటిని మేం ఆదా చేస్తాం.

రెండో తీర్మానం - డిజిటల్ లావాదేవీలను అవలంబించేలా వీలైనంత ఎక్కువ మందిని ప్రోత్సహిస్తాం.

మూడో తీర్మానం - మన గ్రామాలను, నగరాలను పరిశుభ్రత దిశగా నడిపిస్తాం.

నాలుగో తీర్మానం – ‘వోకల్ ఫర్ లోకల్’ను మంత్రప్రదంగా మునుపెన్నడూ లేనంతగా అనుసరిస్తాం. భారత్‌లో తయారైన ఉత్పత్తులనే ఉపయోగిస్తాం.

అయిదో తీర్మానం నాణ్యమైన పనిపై, నాణ్యమైన ఉత్పత్తులపై దృష్టి సారిస్తాం. తద్వారా నాణ్యత తక్కువగా ఉన్న వస్తువులు మన దేశ గౌరవాన్ని దెబ్బతీయకుండా చూసుకుంటాం.

ఆరో తీర్మానం - మేం దేశమంతటా పర్యటిస్తాంప్రయాణిస్తాం, తీర్థయాత్రలను మొదలుపెడతాం. ఈ దేశాన్నంతా చూసిన తర్వాత సమయం దొరికితేనే విదేశాలకు వెళ్లేందుకు ఆలోచిస్తాం.

ఏడో తీర్మానం - సహజ వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచుతాం.

ఎనిమిదో తీర్మానం - మన చిన్న రైతులకు మేలు చేసే, మన ఆరోగ్యాన్ని రక్షించే సూపర్ ఫుడ్ చిరుదాన్యాలు, శ్రీ అన్నను రోజువారీ జీవనంలో భాగం చేసుకుంటాం.

తొమ్మిదో తీర్మానం - ఆరోగ్యం కోసం యోగా, క్రీడలు, శారీరక దారుఢ్యానికి ప్రాధాన్యమిస్తాం.

పదో తీర్మానం - కనీసం ఒక పేద కుటుంబంలో సభ్యుడిగా మారడం ద్వారా.. మేం వారి సామాజిక స్థితిని పెంచుతాం.

కనీస సౌకర్యాలు లేని.. ఇల్లు, విద్యుత్, గ్యాస్, నీరు అందుబాటులో లేని.. ఆరోగ్య రక్షణ సదుపాయం అందుబాటులో లేని పేదవాడు దేశంలో ఒక్కడున్నా సరే... మనం ప్రశాంతంగా కూర్చోలేం. మనం ప్రతి లబ్ధిదారుడినీ చేరుకుని సాయమందించాలి. అప్పుడే పేదరిక నిర్మూలన జరిగి, అందరి అభివృద్ధీ సాధ్యపడుతుంది. అప్పుడే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది. రామ నామాన్ని స్మరిస్తూ ఈ సంకల్పాలను మనం నెరవేర్చుకుందాం. ఈ విజయదశమి శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

రామచరిత మానస్‌లో ఇలా చెప్పారు బిసి నగర్ కీజై సబ్ కాజాహృదయ రాఖీ కోసలపుర రాజా... అంటే, రామనామాన్ని హృదయాల్లో నింపుకొని, మన సంకల్పాలను నెరవేర్చుకునే దిశగా అడుగులేయడం ద్వారా.. నిస్సందేహంగా మనం విజయం సాధిస్తాం. భారత సంకల్పాలతో అభివృద్ధి పథంలో మనమంతా పురోగమిద్దాం. ‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యం దిశగా సమష్టిగా దేశాన్ని నడిపిద్దాం. ఈ శుభాకాంక్షలతో.. ఈ విజయ దశమి శుభ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

సియావర్ రామచంద్ర కీ జై

సియావర్ రామచంద్ర కీ జై

గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించుగా చేసిన అనువాదం. మూల ప్రసంగం హిందీలో ఉంది.  

 

***


(रिलीज़ आईडी: 2199156) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam