ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆహార భద్రత బలోపేతం, కల్తీ నియంత్రణకు చర్యలు
47 రాష్ట్ర ఆహార పరీక్షా ప్రయోగశాలల ఆధునికీకరణ; సాఫ్టెల్ పథకం కింద 34 మైక్రోబయాలజీ ల్యాబ్‌ల ఏర్పాటు
ఆహార తనిఖీలో మౌలిక వసతుల లోటును పూడ్చేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సహాయంతో 305 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను సమకూర్చుకున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
प्रविष्टि तिथि:
02 DEC 2025 4:42PM by PIB Hyderabad
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉంచే లక్ష్యంతో భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆహార పదార్థాలకు సంబంధించి శాస్త్రీయ ఆధారిత ప్రమాణాలను రూపొందించడంతో పాటు అవి తయారయ్యే విధానం, నిల్వ, పంపిణీ, విక్రయం, దిగుమతులను నియంత్రించడం వంటి బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది.
ఆహార భద్రతా ప్రమాణాల చట్టం, 2006 అమలు, పర్యవేక్షణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యతగా ఉంది. కేంద్ర స్థాయిలో శాస్త్రీయ ఆధారిత ప్రమాణాలను రూపొందించడం, మొత్తం సమన్వయం ఎఫ్ఎస్ఎస్ఏఐ బాధ్యత కాగా, రాష్ట్రాల స్థాయిలో ప్రధానంగా క్షేత్ర స్థాయిలో ఈ చట్టం అమలును పర్యవేక్షించడం, అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ఆహార భద్రతా సంస్థలు కలిగి ఉన్నాయి.
చట్టం ప్రకారం, ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనల (ఎఫ్ఎస్ఎస్ఆర్) ప్రకారం నిర్దేశించిన ప్రమాణాలు, పరిమితులు ఇతర చట్టబద్ధమైన అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రత సంస్థలతో పాటు తన నాలుగు ప్రాంతీయ కార్యాలయాల ద్వారా నిరంతరం ప్రాంతీయ/నిర్దేశిత ప్రత్యేక అమలు, పర్యవేక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆహార భద్రత స్థాయిని అర్థం చేసుకునేందుకు, కల్తీకి అవకాశం ఉన్న ముఖ్య ఆహారాలు, వస్తువులపై క్రమ పద్ధతిలో సమయానుగుణంగా నిఘా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నిఘా ద్వారా డేటా సేకరణ, విశ్లేషణ జరుగుతుంది. ఆహార భద్రత పర్యవేక్షణ, రిస్క్ అంచనా, ప్రమాణాల నిర్ధారణ కోసం ఈ ప్రామాణిక డేటా ఉపయోగపడుతుంది.
ఆహార నమూనాల పరీక్ష కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ 246 నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్ (ఎన్ఏబీఎల్) ను నోటిఫై చేసింది. అలాగే అప్పీల్ నమూనాల విశ్లేషణ కోసం, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థల యాజమాన్యంలో ఉన్న 24 రెఫరల్ ఫుడ్ లేబొరేటరీలను కూడా నోటిఫై చేసింది.
ఆహార తనిఖీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుతో సహా' దేశంలో ఆహార తనిఖీ వ్యవస్థను బలోపేతం చేసే సాఫ్టెల్ పథకం కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తోంది. ఈ పథకం కింద, 47 రాష్ట్ర ఆహార పరీక్షా ప్రయోగశాలల స్థాయిని పెంచారు. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల రంగంలో 34 మైక్రోబయాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. తనిఖీ సామర్థ్యాలలో అంతరాన్ని తగ్గించడానికి, ప్రయోగశాలలు వంటి మౌలిక సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలలో అక్కడికక్కడే ఆహార తనిఖీల కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సంచార ఆహార తనిఖీ సదుపాయాన్ని అందించింది. దీనితో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ప్రయోగశాలలను (ఎంఎఫ్టీఎల్) ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటివరకు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నిధులు అందించిన 541 ఎంఎఫ్టీఎల్ లలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు 305 ఎంఎఫ్టీఎల్ లను కొనుగోలు చేసి వినియోగంలోకి తెచ్చాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2197942)
आगंतुक पटल : 2