రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

యుద్ధ విమానాల రక్షణ వ్యవస్థ హైస్పీడ్ రాకెట్ స్లెడ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీవో

प्रविष्टि तिथि: 02 DEC 2025 6:43PM by PIB Hyderabad

యుద్ధ విమానాల రక్షక వ్యవస్థ (ఎస్కేప్ సిస్టమ్)కు సంబంధించిన హై స్పీడ్ రాకెట్ స్లెడ్ పరీక్షను రక్షణ పరిశోధన - అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) నియంత్రిత వేగంతో విజయవంతంగా నిర్వహించింది. చండీగఢ్‌లోని టర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీకి చెందిన రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహించారు. విమానం పైభాగం (కానోపీ) వేరుపడడం, పైలట్‌ను బయటకు పంపే క్రమం (ఎజెక్షన్ సీక్వెన్సింగ్), వైమానిక సిబ్బందిని పూర్తిగా రక్షించే వ్యవస్థలను ఈ పరీక్ష విజయవంతంగా ధ్రువీకరించింది.

ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సహకారంతో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ సంక్లిష్టమైన డైనమిక్ పరీక్ష.. దేశీయంగా అధునాతన ప్రాణ రక్షక వ్యవస్థ (ఎస్కేప్ సిస్టమ్) పరీక్ష సమర్థత కలిగిన అగ్రదేశాల సరసన భారత్‌ను నిలుపుతుంది.

నెట్ టెస్ట్ లేదా జీరో-జీరో టెస్ట్ వంటి స్థిర పరీక్షల కన్నా డైనమిక్ ఎజెక్షన్ పరీక్షలు ఎంతో సంక్లిష్టమైనవి. ఎజెక్షన్ సీట్ పనితీరు, కానోపీని వేరుచేసే వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఇది నిజమైన కొలమానం. అనేక ఘన ఇంధన రాకెట్ మోటార్లను దశలవారీగా కాల్చడం ద్వారా.. తేలికపాటి విమానం (ఎల్‌సీఏ) ముందు భాగంతో కూడిన ద్వంద్వ స్లెడ్ వ్యవస్థను కచ్చితమైన నియంత్రిత వేగానికి ప్రయోగించారు.

పరికరాలు అమర్చి ఉన్న మానవ రూపంలోని బొమ్మను ఉపయోగించి... పై భాగం (కానోపీ) విచ్ఛిన్నమయ్యే విధానం, ఎజెక్షన్ క్రమం, సిబ్బందిని పూర్తిగా రక్షించే ప్రక్రియలను అనుకరించారు. బయటకు దూకే పైలట్లు ఎదుర్కోవాల్సి వచ్చే క్లిష్టమైన భారాలు, బలాలు, వేగాలను ఇది రికార్డ్ చేసింది. విమానంలో అమర్చిన, భూమిపై ఏర్పాటు చేసిన ఇమేజింగ్ వ్యవస్థల ద్వారా ఈ మొత్తం ప్రక్రియను చిత్రీకరించారు. భారత వైమానిక దళం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ - సర్టిఫికేషన్ అధికారులు ఈ పరీక్షను వీక్షించారు.

పరీక్ష విజయవంతమైన నేపథ్యంలో డీఆర్‌డీవో, ఐఏఎఫ్, ఏడీఏ, హెచ్‌ఏఎల్, సంబంధిత పరిశ్రమలను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. స్వావలంబన దిశగా భారత దేశీయ రక్షణ సామర్థ్యంలో ఇదొక కీలక మైలురాయిగా ఆయన అభివర్ణించారు.

రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ కూడా ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీవో బృందాన్ని అభినందించారు.

 

***


(रिलीज़ आईडी: 2197933) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Urdu , हिन्दी