యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
మై భారత్ పోర్టల్‌లో 2 కోట్లకు పైగా యువత నమోదు
प्रविष्टि तिथि:
01 DEC 2025 4:45PM by PIB Hyderabad
మై భారత్ పోర్టల్ (https://mybharat.gov.in/) లో 2025 నవంబరు 26 నాటికి మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 2.05 కోట్లు.
డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌తో ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకున్నారు.. దీనిలో భాగంగా, మై భారత్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా యువతకు డిజిటల్ లభ్యతతో పాటు మొబైల్- అనుకూల సేవలను అందిస్తారు. వీటిలో ఈ కింద ప్రస్తావించిన ప్రధానాంశాలు భాగంగా ఉంటాయి:
1. ఆండ్రాయిడ్, ఐఓఎస్ కోసం పూర్తి స్థాయిలో పని చేసే మొబైల్ అప్లికేషన్;
2. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత స్మార్ట్ సీవీ బిల్డర్, డిజిటల్ ప్రొఫైళ్లు;
3. కార్యక్రమాల్ని ఏర్పాటు చేసే సంస్థలు, విద్యాసంస్థల కోసం ఏకీకృత డ్యాష్ బోర్డులు.. ఇవి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల అందిన ఫలితాలను విశ్లేషించడానికి ఉపయోగపడతాయి.
4. స్పీచ్ టు టెక్స్‌ట్, వాయిస్ అసిస్టెడ్ నేవిగేషన్‌లతో పాటు ఏఐ చాట్‌బాట్స్‌కు సంబంధించిన ఆధునిక సదుపాయాలు;
5. మీ చుట్టుపక్కల అవకాశాలతో పాటు, ఏదైనా ప్రత్యేక రంగంలో అవకాశాలను గుర్తించడానికి లొకేషన్ ఇంటెలిజెన్స్‌తో పాటు జియో-ట్యాగ్;
6. యువత భాగస్వామ్యానికి ఉద్దేశించిన శిక్షణ మాడ్యూళ్లు, క్విజ్‌లు;
7. ఆధార్, డిజిలాకర్, భాషిణిలతో పాటు మైగవ్ ప్లాట్‌ఫామ్ వంటి వాటితో నిరంతరాయ ఏకీకరణ సదుపాయం.
డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడానికి అమలు చేయదలుస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో.. 22 భాషల్లో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావడం, మొబైల్ అప్లికేషన్‌తో పాటు ప్రభుత్వానికి చెందిన ఇతర వేదికలతో మాటామంతీ వంటివి.. భాగంగా ఉన్నాయి.
పైన పేర్కొన్న వాటికి అదనంగా, యువజన వ్యవహారాల విభాగం అధీనంలో పనిచేసే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా మై భారత్‌ను ఏర్పాటు చేశారు. యువజనాభివృద్ధితో పాటు, దేశ నిర్మాణానికి ఒక విస్తృత వేదికగా పనిచేయడం కోసం దీనిని స్థాపించారు. మై భారత్‌ను మరింత బలోపేతం చేయడానికి ఈ కింది కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది:
i. యువత పాలుపంచుకొనే కార్యకలాపాలను ప్రభావవంతంగా అమలుచేయడం, సమన్వయాన్ని నెలకొల్పుకోవడంతో పాటు పర్యవేక్షణకు గాను జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో మై భారత్ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తారు.
ii. ఇంటర్న్‌షిప్పులూ, అనుభవ ప్రధాన జ్ఞానార్జన, సమాజ సేవలతో పాటు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంచే దృష్టితో కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ భాగస్వాములు, విద్యాసంస్థలతో సహకారానికి మార్గాన్ని సుగమం చేస్తారు.
iii. పక్కాగా రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక ద్వారా ప్రధాన యువజన భాగస్వామ్య కార్యక్రమాల నిర్వహణ ప్రక్రియను విస్తరిస్తారు. ఈ ప్రణాళికలో భాగంగా అనుభవ ప్రధాన జ్ఞానార్జన, సముదాయాల్ని భాగస్వాముల్ని చేయడం, స్వచ్ఛంద సేవల అవకాశాల్ని కల్పించి, దేశ నిర్మాణ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసి వీటిలో ఎక్కువ మంది పాల్గొనేటట్లు చూస్తూ, ఆశించిన ఫలితాలను రాబడతారు.
iv. యువజన స్వచ్ఛంద సేవకులు, సమన్వయకర్తలతో పాటు అమలు సంస్థలకు ప్రత్యేక శిక్షణ మాడ్యూళ్లను ప్రారంభిస్తారు. నిర్దిష్ట కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా సూచించడం, నాయకత్వ నైపుణ్యాలతో పాటు మొత్తంమీద సామర్థ్యాన్ని పెంచడం దీనిలోని ప్రధానోద్దేశం.
v. లక్షిత ప్రజాసంబంధాలు, డిజిటల్ సాధికారత కార్యక్రమాలను నిర్వహించి ఈ కార్యక్రమాలలో గ్రామీణులు, గిరిజనులతో పాటు, సామాజిక ప్రయోజనాలకు నోచుకోని జనసమూహాలు పాలుపంచుకొనేటట్లు జాగ్రత్త చర్యల్ని తీసుకుంటూ సమ్మిళితత్వాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తారు.
ఈ సమాచారాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ఈ రోజు లోక్‌సభలో రాతపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2197364)
आगंतुक पटल : 25