సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఏఐతో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారీ వృద్ధికి సిద్ధంగా ఉన్న మీడియా- వినోద రంగం: కార్యదర్శి, సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ
ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా భారతదేశ కథనాలు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చేరుకోవాలి: కార్యదర్శి, సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
01 DEC 2025 5:47PM by PIB Hyderabad
కృత్రిమ మేధస్సు రాకతో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మీడియా, వినిోద రంగం (ఎం-ఈ) రంగం భారీ వృద్ధీ సాధించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ (ఐఎన్‌బీ) కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు అన్నారు. ఈ రోజు ముంబయిలో జరిగిన 12వ సీఐఐ ‘బిగ్ పిక్చర్ సదస్సులో 'ది ఏఐ ఎరా - బ్రిడ్జింగ్ క్రియేటివిటీ అండ్ కామర్స్' అనే ఇతివృత్తంపై ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. 'ప్రపంచ పోటీ సృజనాత్మక ఆర్థికవ్యవస్థ కోసం ప్రాధాన్యతతతో కూడిన భారతదేశ విధాన సంస్కరణలు' అనే సీఐఐ వైట్ పేపర్‌ను కూడా ఆయన విడుదల చేశారు.
వేవ్స్ సదస్సును కేవలం ఒక స్వతంత్ర కార్యక్రమంగా కాకుండా కొనసాగుతున్న ఉద్యమంలో ఒక భాగంగా చూడాలని ఆయన పరిశ్రమను కోరారు. ఈ ఉద్యమం సృజనాత్మకత, ఆవిష్కరణ, పురోగతిలో నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహించేలా ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు. "వేవ్స్ సదస్సు అనేది ఒక కార్యక్రమం కంటే ఎక్కువ. ఇదొక ఉద్యమం. ఈ ప్రయాణంలో ప్రతి అంశం క్రితం విషయాలపై ఆధారపడి ఉంటుందని మన ప్రధానమంత్రి నిరంతరం మనకు గుర్తు చేస్తున్నారు. ఒక పరిశ్రమగా మనం ఎక్కడ ఉన్నాం. కలిసి ఎలా ముందుకు సాగగలం అనే దాని గురించి ఆలోచించమని ఆయన మనల్ని కోరుతున్నారు" అని శ్రీ సంజయ్ జాజు వ్యాఖ్యానించారు.
ఆహారం, ఇళ్లు, బట్టలతో పాటు వినోదం అనేది నాగరికతకు ఒక ప్రాథమిక మూలస్తంభంగా మారిందని.. ఇది కేవలం ఆర్థిక వృద్ధికి మాత్రమే కాకుండా సామాజిక సామరస్యం, సంతోషానికి కూడా అత్యవసరమని కేంద్ర సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రధానంగా పేర్కొన్నారు. "మన రంగానికి ఉన్న నిజమైన విలువ సంఖ్యలకు మించినది. ఇది ప్రజలను కలుపుతుంది.. సామరస్యాన్ని పెంపొందిస్తుంది.. దేశాలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుంది" అని ఆయన ఉద్ఘాటించారు.
భారతదేశ సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఒక కోటి కంటే ఎక్కువ మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జీవనోపాధి అందిస్తోందన్న ఆయన.. జాతీయ జీడీపీలో సుమారు రూ. 3 లక్షల కోట్లు వాటాను ఇది కలిగి ఉందని పేర్కొన్నారు. మౌఖిక సంప్రదాయాల నుంచి మొదలుకొని లిఖితపూర్వక, దృశ్య రూపాల వరకు మూడు విభాగాలుగా భారత్‌కు ఉన్న గొప్ప కథన వారసత్వం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. దీనిని వేవ్స్ సదస్సులో భారత్ పెవిలియన్, ఇప్పుడు భారతీయ చలన చిత్ర జాతీయ మ్యూజియంలో ప్రదర్శించినట్లు తెలిపారు. "ఈ వారసత్వం ఉన్నప్పటికీ ప్రపంచ ఎం-ఈ మార్కెట్‌లో భారత్ 2 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది. మన సృజనాత్మక సామర్థ్యాన్ని ప్రపంచ గుర్తింపును పొందే ఉత్పత్తులు, కథనాలుగా మార్చడమే మన ముందున్న సవాలు" అని ఆయన పేర్కొన్నారు.
కంటెంట్ సృష్టితో పాటు వినియోగాన్ని కృత్రిమ మేధ మార్చేస్తున్న ప్రస్తుత సమయంలో ప్యాషన్‌ను వాణిజ్యంగా మార్చాలన్న సవాలు తీసుకోవాలని పరిశ్రమను శ్రీ సంజయ్ జాజు కోరారు. అంతిమంగా ఈ రంగానికి వాణిజ్యపరమైన లాభాలే స్థిరత్వాన్ని అందిస్తాయని ఆయన అన్నారు. "ఏఐ వినోదాన్ని మార్చేస్తోంది. మనం కొత్త సాంకేతికతలను స్వీకరించకపోతే ప్రపంచంలో మన వాటా తగ్గిపోతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ ఆరెంజ్ ఆర్థిక వ్యవస్థ ప్రారంభమే ఆలోచనలు, ఊహల ప్రారంభమని అని ఆయన అన్నారు. సాంస్కృతిక బలాన్ని సృజనాత్మక సామర్థ్యాలుగా మార్చుకునే సామర్థ్యం దేశానికి ఉండాలన్న ఆయన.. "సాంకేతికతతో కూడిన కథనాలే ఈ రోజుల్లో అమ్ముడవుతాయి" అని వ్యాఖ్యానించారు.
"ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా భారతదేశ కథనాలు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చేరుకోవాలి. ఇదే మన సాఫ్ట్ పవర్ సారాంశం" అని శ్రీ సంజయ్ జాజు ఉద్ఘాటించారు.
ఈ రంగంలో కార్యకలపాలను సులభతరం చేసే పాత్ర ప్రభుత్వానికి ఉందన్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి.. అనుకూలమైన వాతావరణం, సమాన అవకాశాలు, ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోందని స్పష్టం చేశారు. మీడియా, వినోద రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పరిశ్రమే అని ఆయన అన్నారు. నైపుణ్యాల విషయంలో అంతరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన ఆయన.. దీని కోసం ముంబయిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్‌ను (ఐఐసీటీ) ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. విజయవంతమైన ప్రభుత్వ-పరిశ్రమ భాగస్వామ్యానికి దీనిని ఒక ఉదహారణగా పేర్కొన్న ఆయన.. ఈ పరిశ్రమ-ఆధారిత నమూనా ఇప్పటికే శ్రేష్ఠత, ఆవిష్కరణల విషయంలో ప్రశంసలు అందుకుందన్నారు. గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీలో ఉన్న ఐఐసీటీ ప్రాంగణ నిర్మాణం రెండు సంవత్సరాల్లో పూర్తవుతుందని, ఎన్ఎఫ్‌డీసీ క్యాంపస్ ఇప్పటికే పనిచేస్తోందని ఆయన తెలియజేశారు. క్రియేటర్స్ సరైన పెట్టుబడిదారులు, కొనుగోలుదారులను పొందేందుకు వేవ్స్ బజార్ ఒక వేదికను అందించిందని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గౌరవ్ బెనర్జీ (సీఐఐ నేషనల్ కౌన్సిల్ ఆన్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛైర్మన్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా ఎండీ-సీఈఓ), శ్రీ రాజన్ నవాని (సీఐఐ నేషనల్ కౌన్సిల్ ఆన్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కో ఛైర్మన్, జెట్‌సింథసిస్ ఎండీ-సీఈఓ), శ్రీమతి గుంజన్ సోని (సీఐఐ నేషనల్ కౌన్సిల్ ఆన్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కో-ఛైర్మన్, యూట్యూబ్ ఇండియా ఎండీ), ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన వైట్ పేపర్‌ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి విడుదల చేశారు. ఎం-ఈ రంగ భవిష్యత్తుకు అవసరమైన విధానపరమైన చర్యల సమగ్ర మార్గసూచిని ఇది అందిస్తోంది. వృద్ధిని నడిపించేందుకు, ఆవిష్కరణలను పెంపొందించడానికి, భారతదేశాన్ని ప్రపంచ సృజనాధారిత ఆర్థిక వ్యవస్థలో ఒక నాయకుడిగా నిలిపేందుకు కార్యాచరణ సిఫార్సులను ఇది తెలియజేస్తోంది.
ఈ సందర్భంగా సీఐఐ ఎం-ఈ ఇన్వెస్టర్స్ మీట్, సీఐఐ వేవ్స్ బజార్‌లను కూడా ప్రారంభించారు.
***
(रिलीज़ आईडी: 2197359)
आगंतुक पटल : 11