ప్రధాన మంత్రి కార్యాలయం
గ్లోబల్ మారిటైమ్ ఇండియా సదస్సు-2023లో ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
17 OCT 2023 12:26PM by PIB Hyderabad
ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. నా మంత్రివర్గ సహచరులు... గోవా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా!
గ్లోబల్ మారిటైమ్ ఇండియా సదస్సు మూడో ఎడిషన్‌కు మీ అందరినీ నేను స్వాగతిస్తున్నాను. 2021లో మనం కలిసినప్పుడు... ప్రపంచం మొత్తం కరోనా సృష్టించిన అనిశ్చితి గుప్పిట్లో ఉంది. కరోనా తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో అప్పుడు ఎవరికీ తెలియదు. కానీ ఈ రోజు ప్రపంచంలో కొత్తఒరవడి రూపుదిద్దుకుంటోంది. ఈ మారుతున్న ప్రపంచ క్రమంలో ప్రపంచం మొత్తం కొత్త ఆకాంక్షలతో భారత్ వైపు చూస్తోంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ నిరంతరం బలపడుతోంది. ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక శక్తుల్లో భారత్ ఒకటిగా నిలిచే రోజు ఎంతో దూరంలో లేదు. ప్రపంచంలో గరిష్ట వాణిజ్యం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుందని మనందరికీ తెలుసు. కరోనా అనంతర ప్రపంచంలో ప్రపంచానికి నమ్మకమైన, సమర్థమైన సరుకు రవాణా వ్యవస్థల అవసరం ఏర్పడింది. అందుకే ఈ గ్లోబల్ మారిటైమ్ ఇండియా సదస్సు మూడో ఎడిషన్ మరింత సందర్భోచితంగా మారింది.
మిత్రులారా,
భారత నౌకా వాణిజ్య సామర్థ్యం బలంగా ఉన్నప్పుడల్లా... దేశంతో పాటు ప్రపంచమంతా దాని నుంచి ఎంతో ప్రయోజనం పొందాయని చరిత్ర చెబుతోంది. ఈ ఆలోచనతోనే ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి మేం గత 9-10 సంవత్సరాలుగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాం. ఇటీవలే భారత్ చొరవతో 21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా నౌకా వాణిజ్య రంగాన్ని పునరుద్ధరించే సామర్థ్యం ఉన్న ఒక ముందడుగు పడింది. జీ-20 శిఖరాగ్ర సమావేశంలో భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్‌పై చరిత్రాత్మక ఏకాభిప్రాయం కుదిరింది. వందల సంవత్సరాల కిందట సిల్క్ రూట్ ప్రపంచ వాణిజ్యానికి ఊతమిచ్చింది. ఈ మార్గం ప్రపంచంలోని అనేక దేశాల అభివృద్ధికి ఆధారమైంది. ఇప్పుడు ఈ చారిత్రక కారిడార్ ప్రాంతీయ, ప్రపంచ వాణిజ్య చిత్రాన్ని కూడా మారుస్తోంది. తదుపరి తరం మెగా పోర్టులు, అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్టు నిర్మాణం, ద్వీపాల అభివృద్ధి, లోతట్టు జలమార్గాలు, బహుళ-మోడల్ హబ్‌ల విస్తరణ సహా అనేక ప్రధాన ప్రాజెక్టులు ఈ పథకం కింద చేపట్టాల్సి ఉంది. ఈ కారిడార్ వ్యాపార ఖర్చులను తగ్గిస్తుంది. సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది. పర్యావరణ నష్టాన్ని తగ్గిస్తుంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలనూ సృష్టిస్తుంది. భారత్‌తో అనుబంధం ద్వారా ఈ ప్రచారంలో భాగం కావడానికి పెట్టుబడిదారులకు ఇది ఒక పెద్ద అవకాశం.
మిత్రులారా,
రాబోయే 25 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారత్ కృషి చేస్తోంది. ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాం. నౌకా వాణిజ్య రంగంలో మౌలిక సదుపాయాల మొత్తం వ్యవస్థను బలోపేతం చేయడానికి మేం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. గత దశాబ్దంలో దేశంలోని ప్రధాన ఓడరేవుల సామర్థ్యం ఇప్పుడు రెట్టింపు అయింది. 9-10 సంవత్సరాల కిందట అంటే 2014లో దాదాపు 42 గంటలుగా ఉన్న కంటైనర్ నౌకల టర్న్-ఎరౌండ్ సమయం 2023లో 24 గంటల కంటే దిగువకు తగ్గింది. ఓడరేవు కనెక్టివిటీని బలోపేతం చేయడానికి వేల కిలోమీటర్ల కొత్త రోడ్లను మేం నిర్మించాం. సాగరమాల ప్రాజెక్ట్ కింద మన తీరప్రాంత మౌలిక సదుపాయాలనూ బలోపేతం చేస్తున్నాం. ఈ ప్రయత్నాలన్నీ ఉపాధి అవకాశాలను, జీవన సౌలభ్యాన్ని అనేక రెట్లు మెరుగుపరుస్తున్నాయి.
మిత్రులారా,
'సమృద్ధి కోసం ఓడరేవులు'... 'ప్రగతి కోసం ఓడరేవులు' అనే మా దార్శనికత క్షేత్రస్థాయిలో నిరంతరం మార్పును తీసుకువస్తోంది. మా కృషి 'ఉత్పాదకత కోసం ఓడరేవులు' అనే మంత్రాన్నీ ముందుకు తీసుకెళ్లింది. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకతను పెంచడానికి గానూ మా ప్రభుత్వం సరుకు రవాణా రంగాన్నీ మరింత సమర్థంగా, ప్రభావవంతంగా మారుస్తోంది. భారత్ తన తీరప్రాంత షిప్పింగ్ విధానాన్నీ ఆధునికీకరిస్తోంది. గత దశాబ్దంలో తీరప్రాంత కార్గో ట్రాఫిక్ రెట్టింపు అయింది. ఇది ప్రజలకు సరసమైన ధరతో సరుకు రవాణా ఎంపికనూ అందిస్తోంది. అంతర్గత జలమార్గాల అభివృద్ధి కారణంగా భారత్‌లోనూ ఒక పెద్ద మార్పు చోటు చేసుకుంటోంది. గత దశాబ్ద కాలంలో జాతీయ జలమార్గాలపై కార్గో నిర్వహణ దాదాపు 4 రెట్లు వృద్ధిని నమోదు చేసింది. మా ప్రయత్నాల కారణంగా లాజిస్టిక్స్ పనితీరు సూచీలో భారత్ రేటింగ్‌లు గత 9 సంవత్సరాల్లో ఎంతో మెరుగయ్యాయి.
మిత్రులారా,
మేం నౌకానిర్మాణం, మరమ్మత్తుల రంగంపైనా ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. మా దేశీయ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ భారత సామర్థ్యానికి నిదర్శనం. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచంలోని మొదటి అయిదు నౌకా నిర్మాణ దేశాల సరసన భారత్ నిలుస్తుంది. మా మంత్రం... 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్'. నౌకా వాణిజ్య క్లస్టర్ల అభివృద్ధి ద్వారా నౌకా నిర్మాణ రంగానికి చెందిన అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి మేం సమగ్ర విధానం రూపొందించేందుకు కృషి చేస్తున్నాం. రాబోయే కాలంలో దేశంలోని అనేక ప్రదేశాల్లో నౌకా నిర్మాణం, మరమ్మతు కేంద్రాలను అభివృద్ధి చేయనున్నాం. నౌకా పునర్వినియోగ రంగంలో భారత్ ఇప్పటికే ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. దేశంలోని ప్రధాన ఓడరేవులను కర్భన ఉద్గార రహితంగా మార్చడానికి భారత్ నౌకా వాణిజ్యం రంగంలో నికర సున్నా ఉద్గారాల వ్యూహంపైనా పనిచేస్తోంది. గ్రీన్ ప్లానెట్‌గా మారడానికి నీలి ఆర్థిక వ్యవస్థ మార్గంగా ఉండే భవిష్యత్తు దిశగా మేం ముందుకు సాగుతున్నాం.
మిత్రులారా,
ప్రపంచంలోని ప్రముఖ నౌకా వాణిజ్య నిర్వాహకులు భారత్‌కు వచ్చి భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా భారత్‌లో పనులు వేగంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని ఆధునిక గిఫ్ట్ సిటీ షిప్ లీజింగ్‌ను ప్రధాన ఆర్థిక సేవగా ప్రారంభించింది. గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీ ద్వారా షిప్ లీజింగ్ కంపెనీలకు అనేక రకాల రాయితీలూ అందిస్తున్నారు. ప్రపంచంలోని 4 గ్లోబల్ షిప్ లీజింగ్ కంపెనీలు కూడా గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీలో నమోదు చేసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఉన్న ఇతర షిప్ లీజింగ్ కంపెనీలను కూడా గిఫ్ట్ ఐఎఫ్ఎస్‌సీలో చేరాలని నేను పిలుపునిస్తున్నాను.
మిత్రులారా,
విస్తారమైన తీరప్రాంతాన్ని, బలమైన నదీ వ్యవస్థను, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని భారత్ కలిగి ఉంది. ఇవన్నీ కలిసి మారిటైమ్ టూరిజం కోసం కొత్త అవకాశాన్ని సృష్టిస్తాయి. దేశంలోని సుమారు 5000 సంవత్సరాల పురాతన లోథల్ డాక్‌యార్డ్ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉంది. ఒక విధంగా లోథల్ షిప్పింగ్‌కు నిలయం. ఈ ప్రపంచ వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం లోథల్‌లో జాతీయ నౌకా వాణిజ్య వారసత్వ సముదాయాన్ని నిర్మిస్తున్నాం. ముంబయి నుంచి లోథల్ ఎంతో దూరంలో లేదు. మీరు ఒకసారి లోథల్‌ను సందర్శించాలని నేను అభ్యర్థిస్తున్నా.
మిత్రులారా,
మారిటైమ్ టూరిజంను పెంపొందించడానికి మేం ప్రపంచంలోనే అతిపెద్ద నది క్రూయిజ్ సేవను కూడా ప్రారంభించాం. దేశంలోని వివిధ ఓడరేవుల్లో దీనికి సంబంధించిన అనేక ప్రాజెక్టులపై భారత్ పని చేస్తోంది. ముంబయిలో కొత్త అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణంలో ఉంది. ఈ సంవత్సరం విశాఖపట్నం, చెన్నైలలో అలాంటి ఆధునిక క్రూయిజ్ టెర్మినల్స్‌ను మేం నిర్మించాం. భారత్ తన అత్యాధునిక మౌలిక సదుపాయాల ద్వారా గ్లోబల్ క్రూయిజ్ హబ్‌గా మారే దిశగా పురోగమిస్తోంది.
మిత్రులారా,
అభివృద్ధి, జనాభా, ప్రజాస్వామ్యం, డిమాండ్ల కలయిక కలిగిన అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా మారాలనే లక్ష్యం దిశగా భారత్ పురోగమిస్తున్న తరుణంలో ఇది మీకు ఒక సువర్ణావకాశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీలాంటి పెట్టుబడిదారులందరికీ నేను మరోసారి ఆహ్వానం పలుకుతున్నాను... భారత్‌కు వచ్చి అభివృద్ధి ప్రయాణంలో మాతో చేరండి. మనం కలిసి నడుద్దాం. కలిసికట్టుగా కొత్త భవిష్యత్తును సృష్టించుదాం. చాలా ధన్యవాదాలు!
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.
***
(రిలీజ్ ఐడి: 2197012)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam