56వ ఇఫి చివరి రోజున జపాన్ చిత్రం ‘ఎ పేల్ వ్యూ ఆఫ్ హిల్స్’ను ఆస్వాదించిన ప్రేక్షకులు
ఐఎఫ్ఎఫ్ఐలో జపనీస్ చిత్రం ‘ఎ పేల్ వ్యూ ఆఫ్ హిల్స్’ గురించి ఆ చిత్ర దర్శకుడు కేయ్ ఇషికావా మీడియా సమావేశం నిర్వహించారు. ఐఎఫ్ఎఫ్ఐలో సమకాలీన జపనీస్ చిత్రాల అనుభూతిని అందించేందుకు ఉద్దేశించిన ‘కంట్రీ ఫోకస్: జపాన్’లో భాగంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
జపాన్ దేశ సినిమా వారసత్వాన్ని తీర్చిదిద్దుతున్న దర్శకనిర్మాతలు, ప్రశంసలు పొందిన సిని రూపకర్తల సృజనాత్మక శక్తిని తెలియజేసే ‘కంట్రీ ఫోకస్: జపాన్’లో జ్ఞాపకాలు, గుర్తింపు, అనుబంధాన్ని అన్వేషించే సాన్నిహిత్య నాటకీయ చిత్రాలతో పాటు చారిత్రక ఇతిహాసాలు, సైకలాజికల్ థ్రిల్లర్లు, పిల్లల కథనాలు ఉన్నాయి. సినిమాటిక్ సరిహద్దులను విస్తరించే ప్రయోగాత్మక చిత్రాలను కూడా ఇందులో చేర్చారు.
చర్చను ప్రారంభించిన దర్శకుడు ఇషికావా మాట్లాడుతూ “ఇది భారతదేశంలో నా మొదటి సందర్శన. నేను ఈ అనుభూతిని నిజంగా ఆస్వాదించాను” అని అన్నారు. ఈ చిత్రాన్ని నోబెల్ బహుమతి గెలుచుకున్న రచయిత కజువో ఇషిగురో రచించిన 1982 కాలం నాటి అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా తీశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం చాలా జపనీస్ చిత్రాలు ఈ విషయంపై ఆలోచన చేస్తున్నాయి. “నేను కూడా ఎల్లప్పుడూ ఈ విషయం గురించి మాట్లాడాలని భావించాను. కానీ నేను ఆ కాలాన్ని ప్రత్యక్షంగా చూడనందున చిత్రీకరించే విషయంలో సరైన భాషను ఉపయోగించటం నాకు కష్టంగా అనిపించింది. నేను ఈ నవల గురించి తెలుసుకున్నప్పుడు ఈ విషయం నాకు మరింత సులభంగా అర్థమైంది. ఈ కథను చెప్పేందుకు ఇది నాకు విశ్వాసాన్ని ఇచ్చింది” అని అన్నారు.
ఈ చిత్రంలో కథ ఒక యువ జపనీస్-బ్రిటిష్ రచయిత్రి చుట్టూ తిరుగుతుంది. నాగసాకిలో యుద్ధానంతరం తన తల్లి ‘ఎట్సుకో’కు ఎదురైన అనుభవాల ఆధారంగా ఒక పుస్తకాన్ని రాసేందుకు బయలుదేరుతుంది. తన పెద్ద కుమార్తె ఆత్మహత్య ఘటన ఇంకా వెంటాడుతున్న ఆమె.. 1962లో యువ గర్భిణిగా ఉన్న నాటి జ్ఞాపకాలను చెప్పడం ప్రారంభిస్తుంది. సచికో అనే మహిళకు ఎట్సుకోకు మధ్య జరిగే సన్నివేశాల గురించి వర్ణిస్తుంది. ఎట్సుకో తన కుమార్తె ‘మారికో’తో కలిసి విదేశాలలో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు నిశ్చయించుకుంటుంది. మారికో అప్పుడప్పుడు ఒక అంతుచిక్కని మహిళకు సంబంధించిన జ్ఞాపకాల గురించి మాట్లాడుతుంది. తన తల్లి నాగసాకిలో గడిపిన సంవత్సరాలను ఒక చోట చేర్చి రాస్తుండగా వాస్తవ పరిస్థితులకు అవి సరిపోనట్లు గమనిస్తుంది.
కేవలం అణుబాంబు గురించి మాత్రమే కాకుండా పలు తరాల్లో ఉన్న మహిళల గురించి ఉండటం వల్ల ఈ కథ తనని ఆకర్షించినట్లు దర్శకుడు తెలిపారు. ఎడిటింగ్ అనేది రచనా ప్రక్రియలో తుది దశగా భావిస్తానని తెలిపిన ఆయన.. అందుకే స్వయంగా స్క్రిప్ట్ రాయటం, ఎడిటింగ్ చేసినట్లు తెలిపారు.
ఈ సినిమాకు అత్యంత సముచితమైన ముగింపును నిర్ణయించేటప్పుడు చిత్ర బృందం జపాన్, బ్రిటన్, పోలాండ్ అనే మూడు దేశాల దృక్పథాలను సమతుల్యం చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఈ మూడు దేశాలు ప్రత్యేకమైన అనుభూతిని తీసుకువచ్చినట్లు తెలిపారు. బ్రిటిష్ నిర్మాతలు మరింత స్పష్టమైన- ఖచ్చితమైన ముగింపును కోరుకున్నారు. మరీ ఎక్కువ వివరణ ఇస్తే అది సినిమా ప్రభావాన్ని తగ్గిస్తుందని పోలాండ్ నిర్మాతలు భావించారు. జపనీస్ దృక్పథం ఈ రెండింటికీ మధ్యలో ఉందని దర్శకుడు తెలియజేశారు. ఈ భాగస్వామ్య ప్రక్రియతో పాటు సినిమాను సరైన ముగింపు దిశగా నడిపించిన విస్తృత చర్చలను నిజంగా ఆస్వాదించినట్లు ఆయన తెలిపారు.
పూర్తి పాత్రికేయ సమావేశాన్ని ఇక్కడ చూడండి:
ట్రైలర్ చూడండి:
ఐఎఫ్ఎప్ఐ గురించి:
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) దక్షిణాసియాలో అత్యంత ఎక్కువ చరిత్ర కలిగిన అతిపెద్ద సినిమా వేడుకగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వంలోని సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ (నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్- ఎన్ఎఫ్‌డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్‌జీ) సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. పునరుద్ధరించబడిన క్లాసిక్ సినిమాలు సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు ఒక వేదికపై నిలుస్తాయి. ప్రసిద్ధ దర్శక నిర్మాతలు, నిర్భయులైన తొలి దర్శకులతో వేదికను పంచుకుంటారు. ఇలా ఒక ప్రపంచ సినిమా కేంద్రంగా ఈ ఉత్సవం ఎదిగింది. ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు వేగాన్ని పొందే ఉత్తేజభరిత వేవ్స్ ఫిల్మ్ బజార్, మాస్టర్‌క్లాసులు, సమర్పణ చిత్రాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, అంతర్జాతీయ పోటీలు లాంటి సమ్మేళనంతో ఐఎఫ్ఎప్ఐ ప్రత్యేకంగా మారుతోంది. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలోని అద్భుతమైన తీరప్రాంతంలో నిర్వహించే ఐఎఫ్ఎప్ఐ.. భాషలు, విభాగాలు, ఆవిష్కరణలు, శ్రవణాల అద్భుతమైన కలయికను వీక్షకులకు అందించనుంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను తెలియజేసే ఒక ప్రత్యేక వేదికగా ఉంది.
మరింత సమాచారం కోసం ఈ క్రింది లింక్‌లను సందర్శించండి:
* ఐఎఫ్ఎప్ఐ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
* పీఐబీకి సంబంధించి ఐఎఫ్ఎఫ్ఐ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
* పీఐబీ ఐఎఫ్ఎఫ్ఐవుడ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
* ఎక్స్ హ్యాండిల్స్: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
रिलीज़ आईडी:
2196701
| Visitor Counter:
4