|
ప్రధాన మంత్రి కార్యాలయం
రాయ్‌పూర్‌లో ప్రధానమంత్రి అధ్యక్షతన 60వ అఖిల భారత పోలీసు డైరెక్టర్ జనరళ్లు.. ఇన్స్పెక్టర్ జనరళ్ల సదస్సు
పోలీసులపై ప్రజాభిప్రాయంలో మార్పు.. ముఖ్యంగా యువతకు చేరువ కావడం.. పట్టణ- పర్యాటక పోలీసింగ్ బలోపేతం.. కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన పెంపు దిశగా ప్రజలకు ప్రోత్సాహం అవసరాన్ని స్పష్టీకరించిన ప్రధానమంత్రి సాంకేతిక పరిజ్ఞానం.. కృత్రిమ మేధ విస్తృత వినియోగం.. ‘నాట్‌గ్రిడ్’తో ఏకీకరణకు సూచన సహా ద్వీప భద్రత.. తీరప్రాంత పోలీసింగ్.. ఫోరెన్సిక్ ఆధారిత దర్యాప్తులో ఆవిష్కరణలపై నిర్దేశం విజన్-2047 పోలీసింగ్ ప్రణాళిక.. ఉగ్రవాద నిరోధక విధానాలు.. మహిళా భద్రత.. పరారీ నేరగాళ్ల జాడ తీయడం.. ఫోరెన్సిక్ సంస్కరణలు సహా జాతీయ భద్రత ప్రాథమ్యాలపై సదస్సులో సమగ్ర చర్చ పటిష్ఠ విపత్తు సంసిద్ధత.. సమన్వయ సహిత ప్రతిస్పందన అవసరంపై స్పష్టీకరణ తోపాటు తుఫానులు.. వరదలు.. ప్రకృతి వైపరీత్యాలు సహా అత్యవసర పరిస్థితుల నిర్వహణపై ఏకోన్ముఖ ప్రభుత్వ విధానానికి పిలుపు వికసిత భారత్ జాతీయ దృక్పథానికి అనుగుణంగా పోలీసింగ్ పద్ధతుల ఆధునికీకరణ.. పునఃరూపకల్పనపై పోలీసు శాఖ అధిపతులకు నిర్దేశం విశిష్ట సేవలందించిన సిబ్బందికి రాష్ట్రపతి పోలీసు పతకాల ప్రదానంతోపాటు అత్యుత్తమ పనితీరు కనబరిచిన నగరాల కోసం ఏర్పరచిన ‘అర్బన్ పోలీసింగ్ అవార్డు’ల ప్రదానం
प्रविष्टि तिथि:
30 NOV 2025 5:17PM by PIB Hyderabad
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహిస్తున్న 60వ అఖిల భారత పోలీసు డైరెక్టర్ జనరళ్లు-ఇన్స్పెక్టర్ జనరళ్ల సదస్సుకు ఈ రోజు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ‘వికసిత భారత్: భద్రత ప్రమాణాలు’ ఇతివృత్తంగా సాగిన ఈ సదస్సులో చివరి (3వ) రోజున ఆయన ప్రసంగిస్తూ- పోలీసులపై ప్రజాభిప్రాయంలో... ముఖ్యంగా యువతరంలో మార్పు తేవాల్సిన అవసరాన్ని స్పష్టీకరించారు. ఈ మేరకు వృత్తిగత నైపుణ్యంతోపాటు సామాజిక సున్నితత్వం, ప్రతిస్పందనాత్మకత వంటి లక్షణాలను పెంపొందించకోవడం అవశ్యమని పేర్కొన్నారు. అలాగే, పట్టణ పోలీసింగ్ పటిష్ఠం కావాలని, పర్యాటక పోలీసింగ్‌లో పునరుజ్జీవం అవసరమని చెప్పారు. వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో తెచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ నాగరిక్ సురక్ష సంహితలపై ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషి చేయాలని కోరారు.
జనావాసాలు లేని దీవుల ఏకీకృతానికి వినూత్న వ్యూహాలను అనుసరించాలని, ఇందులో భాగంగా, ‘నాట్‌గ్రిడ్’ కిందగల సమీకృత సమాచార నిధిని సమర్థంగా వాడుకోవాలని చెప్పారు. అంతేకాకుండా ఈ వ్యవస్థలను కృత్రిమ మేధతో అనుసంధానించి కార్యాచరణ మేధకు రూపమివ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు శాఖల అధిపతులకు, పాలన విభాగానికి ప్రధానమంత్రి శ్రీ మోదీ నిర్దేశించారు. కేసుల దర్యాప్తులో ఫోరెన్సిక్ విజ్ఞాన వినియోగంపై అధ్యయనం దిశగా విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. విచారణతో ఫోరెన్సిక్ విజ్ఞానాన్ని వివేచనాత్మకంగా మేళవిస్తే నేర న్యాయవ్యవస్థ మరింత బలోపేతం కాగలదన్నారు.
నిషేధిత సంస్థలపై క్రమం తప్పని పర్యవేక్షణ కోసం యంత్రాంగాల ఏర్పాటు, వామపక్ష తీవ్రవాద విముక్తమైన పొందిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి భరోసా, తీరప్రాంత భద్రత బలోపేతానికి వినూత్న విధానాల అనుసరణ తదితరాల ప్రాధాన్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు. మాదకద్రవ్యాల బెడదను ఎదుర్కనడంలో ప్రభుత్వాల పరంగా ఏకోన్ముఖ విధానం ఎంతయినా అవసరమన్నారు. అంతేకాకుండా చట్టాల అమలు, పునరావాసం. సామాజిక జోక్యం కూడా అవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
జాతీయ భద్రత సంబంధిత విస్తృత అంశాలపై సదస్సు సమగ్రంగా చర్చించింది. ఇందులో భాగంగా విజన్-2047 దిశగా దీర్ఘకాలిక పోలీసింగ్ ప్రణాళిక, ఉగ్రవాదం, దుర్బోధల నిరోధంలో సరికొత్త విధానాలు, మహిళా భద్రత పెంపు దిశగా సాంకేతిక పరిజ్ఞాన సద్వినియోగం, విదేశాలకు పరారైన భారత నేరగాళ్లను పట్టుకొచ్చే వ్యూహాలు, సమర్థ దర్యాప్తు-విచారణ దిశగా ఫోరెన్సిక్ సామర్థ్యం పెంచుకోవడం తదితరాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- పటిష్ఠ విపత్తు సంసిద్ధత, సమన్వయ సహిత ప్రతిస్పందన అవసరాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుత ద్విత్వా తుపాను సహా తుపానులు, వరదలు, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాల వంటి అత్యవసర పరిస్థితులపై సమర్థ నిర్వహణ యంత్రాంగాల ఏర్పాటుకు పోలీసు శాఖ అధిపతులు కృషి చేయాలని ఆయన సూచించారు. జన ప్రాణరక్షణ, వీలైనంత తక్కువ సమయంలో విపత్తు అనంతర పరిస్థితులను సరిదిద్దే చురుకైన ప్రణాళిక, వివిధ విభాగాల మధ్య ప్రత్యక్ష సమన్వయం, సత్వర ప్రతిస్పందన తదితరాలపై ఏకోన్ముఖ ప్రభుత్వ విధానం అవసరమన్నారు.
దేశం వికసిత భారత్‌గా రూపొందే క్రమంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థ పోలీసింగ్ విధానాన్ని రూపొందించాలని పోలీసు శాఖ అధిపతులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విశిష్ట సేవలందించిన సిబ్బందికి ప్రధానమంత్రి పురస్కార ప్రదానం చేశారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు రాష్ట్రపతి పోలీసు పతకం, పట్టణ పోలీసింగ్‌లో ఉత్తమ పనితీరు కనబరిచిన 3 నగరాలకు పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు. కాగా, పట్టణ పోలీసింగ్‌లో ఆవిష్కరణలు, మెరుగుదలను ప్రోత్సహిస్తూ తొలిసారిగా ఈ సత్కారం అందజేశారు.
ఈ సదస్సులో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు, హోం వ్యవహారాల సహాయ మంత్రులు, కార్యదర్శి కూడా పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, ఐజీపీలు, కేంద్ర సాయుధ బలగాల-పోలీసు సంస్థల అధిపతులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. అలాగే, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 మందికి పైగా వివిధ ర్యాంకుల అధికారులు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2196692)
|