|
ప్రధాన మంత్రి కార్యాలయం
కేవడియాలో ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
31 OCT 2023 12:53PM by PIB Hyderabad
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
జాతీయ ఐక్యతా దినోత్సవానికి మీ యువతరంతోపాటు మీ వంటి సాహసులు ప్రదర్శిస్తున్న ఈ ఉత్సాహమే అపారమైన బలం. ఒక విధంగా, ఇక్కడ ఓ సూక్ష్మ భారతదేశాన్ని నేనిప్పుడు చూస్తున్నాను. దేశంలో వివిధ రాష్ట్రాలు, విభిన్న భాషలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఐక్యత అనే దృఢమైన సూత్రంతో ముడిపడి ఉన్నారు. పూసలెన్నో ఉన్నా, దండ ఒకటే. దేహాలు అసంఖ్యాకమైనా, హృదయం ఒకటే. ఆగస్టు 15న మన స్వాతంత్ర్య దినోత్సవం... జనవరి 26న మన గణతంత్ర దినోత్సవం... అదే తరహాలో అక్టోబర్ 31న దేశం నలుమూలలా జాతీయతను ప్రాచుర్యంలోకి తెచ్చే ఐక్యతా దినోత్సవం.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఆగస్టు 15నాటి వేడుకలు, జనవరి 26న కర్తవ్య పథ్‌లో కవాతు, అక్టోబరు 31న నర్మదా నదీమాత తీరాన ఐక్యతా విగ్రహం వద్ద జాతీయ ఐక్యతా దినోత్సవం జాతీయ పురోగమన త్రయం. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహించిన కవాతు, ఇతర కార్యక్రమాలు అందరి హృదయాలను ఉప్పొంగేలా చేశాయి. ఇవాళ ఏక్తా నగర్ సందర్శకులు ఈ భారీ విగ్రహాన్ని చూడటమే కాకుండా సర్దార్ పటేల్ సాహెబ్ జీవితం, త్యాగం, సమైక్య భారతానికి రూపుదిద్దడంలో ఆయన అవిరళ కృషి గురించి కూడా తెలుసుకుంటారు. ఈ విగ్రహ నిర్మాణం కథే ‘ఒకే భారత్ - శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి ప్రతీక. ఉక్కు మనిషి విగ్రహం కోసం దేశం నలుమూలల నుంచి రైతులు తమ పాత వ్యవసాయ పరికరాలను, ఇనుమును విరాళంగా ఇచ్చారు. మరోవైపు ప్రతి మూలనుంచి మట్టిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఐక్యతా కుడ్యాన్ని నిర్మించారు. ఇదెంత ఎంత గొప్ప స్ఫూర్తి... ఇదే ప్రేరణతో కోట్లాది దేశవాసులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
దేశవ్యాప్తంగా ఈ రోజున లక్షలాదిగా ప్రజలు ‘ఐక్యత కోసం పరుగు’లో పాల్గొంటున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మరికొన్ని లక్షల మంది కూడా ఇందులో భాగమవుతున్నారు. దేశమంతటా ఈ ఐక్యతా ప్రవాహాన్ని, 140 కోట్ల మంది ప్రజలలో ఐక్యతా స్ఫూర్తిని చూస్తుంటే, సర్దార్ సాహెబ్ ఆదర్శాలు ‘ఒకే భారత్ - శ్రేష్ఠ భారత్’ సంకల్పం రూపేణా మనలో పాదుకున్నాయనిపిస్తుంది. ఈ శుభ సందర్భంగా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పాదాలకు శిరసాభివందనం చేస్తున్నాను. అలాగే జాతీయ ఐక్యతా దినోత్సవం నేపథ్యంలో దేశవాసులందరికీ నా శుభాకాంక్షలు.
నా కుటుంబ సభ్యులారా!
భారతదేశానికి రాబోయే పాతికేళ్ల కాలం అత్యంత కీలకమైనది. ఈ శతాబ్దంలోని తదుపరి 25 సంవత్సరాల్లో దేశాన్ని మనం ప్రగతి పథంలో నడుపుతూ, సుసంపన్నం చేయాలి. గత శతాబ్దంలో స్వాతంత్ర్యం సిద్ధించడానికి ముందు మన సహ పౌరుల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా భారతం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన పాతికేళ్ల చరిత్ర ఉంది. ఇప్పుడిక సుసంపన్న భారత్ లక్ష్య సాధనలో తదుపరి పాతికేళ్ల ‘అమృత కాలం’ మన ముందుంది. ఈ వ్యవధిలో మనం సర్దార్ పటేల్ స్ఫూర్తితో ప్రతి లక్ష్యాన్ని సాధించి తీరాలి.
యావత్ ప్రపంచం నేడు భారత్ వైపు దృష్టి సారించింది. మన దేశం విజయ పరంపర శిఖరాగ్రాన నిలవడమే ఇందుకు కారణం. జి-20కి అధ్యక్షత సమయంలో భారత్ సామర్థ్యాన్ని చూసి ప్రపంచ దేశాలు విస్తుపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మన విశ్వసనీయతను ఉన్నత శిఖరాలకు చేరుస్తున్నందుకు మనమంతా గర్విస్తున్నాం. ప్రపంచంలో అనేక సంక్షోభాల నడుమ మన సరిహద్దులు సురక్షితంగా ఉండటంపై మనం గర్విస్తున్నాం. రాబోయే కొన్నేళ్లలో మనం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగనుండటంపైనా మనం గర్విస్తున్నాం. ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యంకాని రీతిలో చంద్రుని దక్షిణ ధ్రువం సమీపాన భారత్ పాదం మోపడంపై మనం గర్విస్తున్నాం. తేజస్ యుద్ధ విమానాలు, ఐఎన్‌ఎస్ విక్రాంత్ వంటి విమానవాహక యుద్ధనౌక వంటివాటిని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడంపై మనం గర్విస్తున్నాం. మన నిపుణులు ఇవాళ ప్రపంచంలోని బిలియన్ ట్రిలియన్ డాలర్ల విలువైన కంపెనీలకు సారథ్యం వహించడంపై మనం గర్విస్తున్నాం. ప్రపంచంలోని ప్రధాన క్రీడా పోటీలలో భారత కీర్తిని చాటుతూ త్రివర్ణ పతాకం నిరంతరం రెపరెపలాడటంపై మనం గర్విస్తున్నాం. మన యువతరంలోని భరతమాత పుత్రులు, పుత్రికలు రికార్డు సంఖ్యలో పతకాలు సాధించడంపై మనం గర్విస్తున్నాం!
మిత్రులారా!
ప్రస్తుత ‘అమృత కాలం’ కాలంలో బానిస మనస్తత్వాన్ని వదిలించుకుని ముందడుగు వేయాలని భారత్ సంకల్పం పూనింది. ఈ క్రమంలో మనం ఏకకాలంలో దేశాన్ని అభివృద్ధి చేసుకోవడంతోపాటు మన వారసత్వాన్ని కూడా పరిరక్షించుకుంటున్నాం. మన నావికాదళ పతాకంపై వలసవాద చిహ్నాన్ని భారత్ తొలగించింది. వలస పాలన నాటి కాలం చెల్లిన చట్టాలను కూడా రద్దుచేశాం. ప్రాచీన ‘ఐపీసీ’ స్థానంలో భారతీయ న్యాయ సంహితను తెచ్చాం. ఒకప్పుడు ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద ఒక విదేశీ పాలకుడి ప్రతినిధి విగ్రహం ఉండేది.. దాని స్థానంలో ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ విగ్రహం ఇప్పుడు మనకు స్ఫూర్తినిస్తోంది.
మిత్రులారా!
భారత సాధించలేని లక్ష్యమంటూ నేడు ఏదీ లేదు. భారతీయులుగా మనం సాకారం చేసుకోలేని స్వప్నమేదీ లేదు. గడచిన తొమ్మిదేళ్లుగా అందరూ కలసికట్టుగా కృషి చేస్తే ఏదీ అసాధ్యం కాదన్న వాస్తవాన్ని దేశం స్పష్టంగా చూసింది. ఆర్టికల్ 370 నుంచి కశ్మీర్ విముక్తం కాగలదని ఎప్పుడైనా... ఎవరైనా అనుకున్నారా? కానీ, దేశానికి, కశ్మీర్‌కూ మధ్య సదరు అడ్డుగోడ కూలింది. సర్దార్ సాహెబ్ ఏ లోకంలో ఉన్నా ఎంతో సంతోషిస్తూ, మనందరినీ ఆశీర్వదిస్తాడు. ఇవాళ కశ్మీర్‌లోని నా సోదరీసోదరులు ఉగ్రవాదం పడగ నీడనుంచి బయటపడి, స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ దేశాభివృద్ధిలో కలిసి సాగుతున్నారు. ఇటువైపున కనిపించే సర్దార్ సరోవర్ ఆనకట్ట కూడా 5-6 దశాబ్దాలుగా అనిశ్చితిలో పడింది. అటుపైన అందరి కృషితో దీని పనులు కొన్నేళ్ల కిందట పూర్తయ్యాయి.
మిత్రులారా!
‘సంకల్పంతో సత్ఫలితం’ ఒనగూడుతుందని చెప్పడానికి కూడా ఏక్తా నగర్ ఒక గొప్ప ఉదాహరణ. కేవడియా ఇంతగా పురోగమిస్తుందని 10-15 ఏళ్ల కిందట ఇంతగా మారిపోతుందని ఊహించిన వారెవరూ లేరు. దీనికి ‘గ్లోబల్ గ్రీన్ సిటీ’గా గుర్తింపు లభించడంతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ‘మిషన్ లైఫ్’ కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాం. నేనిక్కడికి వచ్చిన ప్రతిసారి, ఏక్తానగర్ ఆకర్షణ మరింత పెరుగుతూండటం నేను గమనిస్తున్నాను. “రివర్ రాఫ్టింగ్, ఏక్తా క్రూజ్, ఏక్తా నర్సరీ, ఏక్తా మాల్, ఆరోగ్య వ్యాన్, కాక్టస్-బటర్‌ఫ్లై గార్డెన్, జంగిల్ సఫారీ, మియావాకీ ఫారెస్ట్, మేజ్ గార్డెన్” వంటి విశేషాలెన్నో పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కేవలం గడచిన 6 నెలల్లోనే ఇక్కడ 1.5 లక్షలకు పైగా మొక్కలు నాటారు. మరోవైపు సౌర విద్యుదుత్పత్తి, నగర గ్యాస్ పంపిణీలో కూడా ఏక్తా నగర్ ముందంజ వేసింది.
ఈ రోజున ఇక్కడ ప్రారంభించబోయే ఒక ప్రత్యేక వారసత్వ రైలు సరికొత్త పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. ఏక్తా నగర్-అహ్మదాబాద్ మధ్య నడిచే ఈ రైలు ఆధునిక సదుపాయాలతోపాటు మన వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. దీన్ని నడిపేది విద్యుత్ ఇంజిన్‌తోనే అయినా, దాన్ని పురాతన ఆవిరి ఇంజిన్‌లా రూపొందించడం విశేషం. ఏక్తా నగర్‌లో పర్యావరణ హిత రవాణా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. పర్యాటకులకు ఇప్పుడు ఈ-బస్సు, ఈ-గోల్ఫ్ కార్ట్, ఈ-సైకిల్ సహా పబ్లిక్ బైక్ షేరింగ్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంటాయి. గడచిన 5 ఏళ్లలో 1.5 కోట్ల మందికిపైగా పర్యాటకులు ఏక్తానగర్‌ను సందర్శించగా, ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. దీనివల్ల మన గిరిజనానికి కొత్త ఆదాయ వనరులు సమకూరడం సహా భారీ ప్రయోజనం లభిస్తోంది.
మిత్రులారా!
భారత్ సంకల్ప బలాన్ని, భారతీయుల ధైర్యసాహసాలను, జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించాలనే వారి ఆకాంక్షను యావత్ ప్రపంచం నేడు అపార నమ్మకం, గౌరవంతో గమనిస్తోంది. భారత్ అద్భుత, అసాధారణ ప్రగతి ప్రయాణం నేడు అందరికీ స్ఫూర్తినిస్తోంది.
అయితే, నా ప్రియ దేశవాసులారా!
కొన్ని వాస్తవాలను మనమెన్నటికీ విస్మరించరాదు... ఈ మేరకు ఇవాళ జాతీయ ఐక్యతా దినోత్సవం నేపథ్యంలో దేశంలోని ప్రతి ఒక్కరితో నా మనోభావాలను పంచుకోవాలని భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి ఫలితంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి... అనేక దేశాలు 30-40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నేడు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాలలో నిరుద్యోగం నిరంతరం పెరుగుతోంది. కానీ, ప్రపంచమంతా అటువంటి పరిస్థితుల నడుమ అల్లాడుతున్న సమయంలోనూ భారత్ పతాకం రెపరెపలాడింది. వరుస సవాళ్లను అధిగమిస్తూ మనం నిరంతరం ముందుకు సాగుతూనే ఉన్నాం. అనేక కొత్త రికార్డులను, ప్రమాణాలను కూడా సృష్టించాం. గడచిన తొమ్మిదేళ్లలో దేశాన్ని ముందుకు నడిపిన నిర్ణయాలు, విధానాల ప్రభావం ఇవాళ మన జీవితాల్లోని ప్రతి రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. దేశంలో పేదరికం తగ్గుతుండటంతో 5 సంవత్సరాల వ్యవధిలో 13.5 కోట్ల మందికిపైగా ప్రజలు విముక్తులయ్యారు. దీంతో పేదరికాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించగలమనే విశ్వాసం మాలో ఇనుమడించింది. మనం ఈ దిశగా ముందడుగు వేయాలి కాబట్టి, అమృత కాలం ప్రతి భారతీయుడికీ అత్యంత కీలకం. దేశ స్థిరత్వానికి ముప్పు తెచ్చే చర్యలకు ఏ ఒక్కరూ పాల్పడరాదు. ప్రగతి మార్గం నుంచి మనం పక్కకు మళ్లితే, మన లక్ష్యం కూడా మనకు దూరమవుతుంది. అందువల్ల 140 కోట్ల మంది భారతీయులు దేశాన్ని అభివృద్ధి పథంలోకి తేవడంలో చేసిన కృషి ఎన్నటికీ వృథా కారాదు. భవిష్యత్తుపై శ్రద్ధగా దృష్టి నిలుపుతూ, మన సంకల్పాల సాకారం వైపు నిబద్ధతతో సాగాలి.
నా దేశవాసులారా!
దేశానికి తొలి హోంమంత్రిగా సర్దార్ పటేల్ అంతర్గత భద్రతపై అత్యంత కఠిన వైఖరి అనుసరించారు... అటువంటి ఉక్కు మనిషి ఆయన! ఈ నేపథ్యంలో గడచిన 9 సంవత్సరాలుగా అంతర్గత భద్రతకు అన్నివైపుల నుంచీ సవాళ్లు ఎదురైనా, మన సాయుధ బలగాలు అహర్నిశలూ అప్రమత్తంగా ఉంటున్న కారణంగా దేశ శత్రువుల కుట్రలు, కుయుక్తులు ఫలించడం లేదు. రద్దీ ప్రదేశాలకు వెళ్లాలంటే భయపడాల్సిన దుస్థితిని ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. పండుగ సంబరాల్లో మునిగిన జనసమూహాలు, రద్దీ మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలు సహా ఆర్థిక కార్యకలాపాలు సాగే అన్ని కేంద్రాలు లక్ష్యంగా దేశ ప్రగతికి అడ్డుపడే కుట్రలు సాగాయి. బాంబు పేలుళ్లు, ఉగ్రదాడుల తర్వాత విధ్వంసం ఎలాంటిదో ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. ఈ దాడులకు తోడు విచారణ పేరిట ఆనాటి ప్రభుత్వాల అలసత్వాన్ని కూడా గమనించారు. అటువంటి దుస్థితి మళ్లీ దాపురించకుండా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి కుయుక్తులకు పాల్పడేవారిని శక్తివంచన లేకుండా నిరోధించాలి. దేశ ఐక్యతపై దాడిచేసే వారెవరో తెలుసుకోవాలి.. గుర్తించాలి.. వారి కుట్రలను అర్థం చేసుకుంటూ జాగ్రత్త వహించాలి.
మిత్రులారా!
మన ప్రగతి పయనంలో జాతీయ ఐక్యతకు అతిపెద్ద అవరోధం బుజ్జగింపు రాజకీయాలే. దేశంలో ఉగ్రవాదాన్ని, దాని రాక్షసత్వాన్ని, భయానక దుశ్చర్యలను బుజ్జగింపుదారులు చూడటానికి ఇచ్చగించలేదనడానికి గడచిన కొన్ని దశాబ్దాల కాలమే సాక్షి. ఏ మాత్రం జంకూగొంకూ లేకుండా వారు మానవాళి శత్రువుల వైపు నిలుస్తున్నారు. అందుకే, ఉగ్రవాద దుశ్చర్యలపై దర్యాప్తును విస్మరిస్తారు.. దేశ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు చేపట్టరు. ఇలాంటి బుజ్జగింపు విధానం అత్యంత ప్రమాదకరం. చివరకు ఉగ్రవాదుల రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించడానికి కూడా వీరు వెనుకాడరు. ఇటువంటి అలసత్వపు ధోరణి ఏ సమాజానికీ ప్రయోజనం చేకూర్చదు... ఏ దేశానికీ, ఎప్పటికీ మేలు చేయదు. అందుకే... దేశం నలుమూలలా ప్రతి ఒక్కరూ... అనుక్షణం, అన్ని సందర్భాల్లో ఐక్యతకు ముప్పుతెచ్చే ఆలోచనలున్న వ్యక్తులపట్ల జాగ్రత్తగా మెలగాలి.
నా ప్రియ దేశవాసులారా!
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల కోలాహలం నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. అయితే, రాజకీయాలను సానుకూల ప్రయోజనాలకు సద్వినియోగం చేసుకునే మార్గాల వైపు కన్నెత్తి చూడని ఓ పెద్ద రాజకీయ వర్గం ఉండటం మీరిప్పటికే గమనించి ఉంటారు. దురదృష్టవశాత్తూ ఇలాంటి నాయకత్వం సమాజ, దేశ వ్యతిరేక వ్యూహాలను అనుసరిస్తోంది. స్వార్థ ప్రయోజనాల కోసం దేశ ఐక్యత విచ్ఛిన్నానికి కూడా ఈ వర్గం పాల్పడగలదు. అందువల్ల, ఇటువంటి సవాళ్ల మధ్య... నా దేశ ప్రజలారా, మీ పాత్ర అత్యంత కీలకమైనది. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దేశ ఐక్యతను దెబ్బతీయాలని వారు భావిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త! వీటన్నిటినీ తెలుసుకుంటేనే దేశం తన ప్రగతి లక్ష్యాలను సాధించగలదు. వికసిత భారత్ లక్ష్య సాధనతోపాటు మన కృషితో దేశ ఐక్యత పరిరక్షణ దిశగా అందివచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ మనం వదులుకోలేం. ఒక్క అడుగైన వెనుకబడటానికి మనం ఇచ్చగించం... కాబట్టి, మనం నిరంతరం ఐక్యతా మంత్రంతో ముందుకు సాగాలి. ఈ ఐక్యత అవిచ్ఛిన్నం కావాలంటే మనమంతా సదా సహకరించాలి. మనం ఏ రంగంలో ఉన్నా, 100 శాతం అంకితభావంతో మన వంతు కృషిచేయాలి. భావి తరాలకు మెరుగైన భవిష్యత్తు దిశగా ఇదే ఏకైక, అత్యుత్తమ మార్గం. సర్దార్ సాహెబ్ మనందరి నుంచి ఆశించింది ఇదే!
మిత్రులారా!
సర్దార్ సాహెబ్ జీవిత విశేషాలకు సంబంధించిన జాతీయ పోటీ కూడా నేటి నుంచి ‘MyGov’లో ప్రారంభమవుతుంది. ఆయన గురించి తెలుసుకోవడానికి సర్దార్ సాహెబ్‌పై క్విజ్ దేశ యువతకు సదవకాశం కల్పిస్తుంది.
నా కుటుంబసభ్యులారా!
నేటి మన దేశం నవ భారతం... ప్రతి భారతీయుడు అపార ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు. ఈ విశ్వాసం కొనసాగడమేగాక దేశం కూడా పురోగమించేలా మనం చూసుకోవాలి. ఈ స్ఫూర్తి మనందరి నిండి, ఈ వైభవం ఇలాగే కొనసాగాలి! ఈ ఆకాంక్షతో 140 కోట్ల మంది ప్రజల తరఫున గౌరవనీయ సర్దార్ పటేల్‌కు మరోసారి నా వినమ్ర నివాళి అర్పిస్తున్నాను. మనమంతా ఈ జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఎనలేని ఉత్సాహంతో నిర్వహించుకుందాం. ఐక్యతా మంత్రాన్ని జీవితంలో ఒక భాగం చేసుకోండి... అనుక్షణం ఐక్యత కోసం అంకితం కండి... ఈ పిలుపుతో మరోసారి మీకందరికీ అనేకానేక అభినందనలు!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
అనేకానేక ధన్యవాదాలు.
***
(రిలీజ్ ఐడి: 2195674)
|