మీడియా సమావేశంలో 'విస్పర్స్ ఆఫ్ ది మౌంటైన్స్' గురించి తెలుసుకున్న ఇఫి అభిమానులు ‘తుదరుమ్’తో కొనసాగుతున్న ఇఫి చలనచిత్రోత్సవం
56వ ఇఫి డైరీలో ఈ రెండు చిత్రాల బృందాలు పరస్పరం చర్చించిన సంభాషణలు
56వ ఇఫిలో 6వ రోజు దర్శకుడు జిగర్ నగ్డా, నిర్మాత జితేంద్ర మిశ్రా గోవాలోని మీడియా సమావేశ మందిరంలో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘విస్పర్స్ ఆఫ్ ది మౌంటైన్స్’ చిత్ర విశేషాలను ఇఫి అభిమానులతో పంచుకున్నారు. ఇదే కార్యక్రమంలో మలయాళ చిత్రం ‘తుదరమ్’ దర్శకుడు తరుణ్ మూర్తి, నిర్మాత ఎం రంజిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవంతిక రంజిత్ పాల్గొనడంతో ఉత్సాహం మరింత పెరిగింది.
కోవిడ్ సమయంలో రాజస్థాన్‌లోని తన సొంతూరిలో గడిపిన సమయం.. ఆ ప్రాంతంలో గనుల తవ్వకం వల్ల కలిగే ఆర్థిక ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి తనకు సహాయపడిందని దర్శకుడు జిగర్ నగ్డా తెలిపారు. అదే సమయంలో భారీ తవ్వకాల కారణంగా పర్యావరణ వినాశనం శాశ్వత ప్రభావం గురించి ప్రజలు ఎంత అజ్ఞానంలో ఉన్నది తెలిసిందన్నారు. ఇదే అంశంపై ఒక డాక్యుమెంటరీ తీసిన తర్వాత, ఫీచర్ ఫిల్మ్ రూపంలో కూడా ఈ కథను తీసుకురావాల్సిన ఆలోచన కలిగిందని ఆయన పేర్కొన్నారు.
నిర్మాత జితేంద్ర మిశ్రా తన సినిమా ప్రయాణాన్ని ఐ యామ్ కలాంతో ప్రారంభించినట్లు గుర్తుచేసుకున్నారు. ప్రాంతీయ సినిమాపై తనకు ఎప్పటి నుంచో ఉన్న మక్కువను చెప్పుకొచ్చారు. నగ్డా ప్రత్యేకమైన నైపుణ్యం, కథ సున్నితత్వం చివరికి ఈ చిత్రాన్ని రూపొందించేదుకు తనను ఒప్పించాయని ఆయన తెలిపారు.
“ఒక పౌరుడిగా, నా కళ ద్వారా నా ఆందోళనలను వ్యక్తం చేయాల్సిన అవసరం నాకు ఉంది. సామాజిక ప్రతిబింబాన్ని సినిమా వినోదంతో కలపడం నాకు ఇష్టం” అని దర్శకుడు తరుణ్ మూర్తి తన ‘తుదరమ్’ సినిమా విశేషాలు వెల్లడించారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీమతి అవంతిక మాట్లాడుతూ.. తుదరుమ్ కథ 12 సంవత్సరాల క్రితమే తమ నిర్మాణ సంస్థకు చేరుకుందని, కానీ దీనికి ప్రాణం పోసేందుకు సరైన దర్శకుడి కోసం ఎదురుచూశామని చెప్పారు. దర్శకుడు తరుణ్ తొలి చిత్రం చూసిన తర్వాతే ఆయన ఆలోచనా విధానానికి తన తండ్రి, నిర్మాత ఎం రంజిత్ ఎంతగానో ఆకర్షితుడయ్యాడని, చివరికి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారని వివరించారు. తన తండ్రి, దర్శకుడు ఇద్దరూ మోహన్‌లాల్‌కు అతిపెద్ద అభిమానులని తెలిపారు.
ఓ ప్రశ్నకు దర్శకుడు తరుణ్ మూర్తి సమాధానమిస్తూ, “మా బలం భావోద్వేగంలో, జీవించే పాత్రల్లో ఉంది. భారీ విజువల్స్ లేదా భారీ బడ్జెట్‌లో కాదు. ఆ భావోద్వేగమే చిన్న బడ్జెట్‌తో నిర్మించినప్పటికీ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడింది. మలయాళీలు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఇప్పుడు నిజాయితీతో కూడిన, సున్నితమైన అంశాల వైపు మొగ్గు చూపుతున్నారు. మేము కూడా ఈ అంశాలను తెరకెక్కించేందుకు ఉత్సాహంగా ఉన్నాం’’ అని చెప్పారు.
ఓ ప్రశ్నకు దర్శకుడు నాగదా సమాధానమిస్తూ.."నా సినిమాను మజిద్ మజిది రచనలతో పోల్చడం నాకు నిజంగా గౌరవంగా ఉంది. ఆయన ద్వారా నేను సినిమా ప్రపంచంలోకి వచ్చాను. బారాన్, దివిల్లో ట్రీ వంటి ఎన్నో చిత్రాలు నా ఫిల్మ్ స్కూల్ ఫేవరెట్‌లుగా మారాయి. ఇరానియన్ సినిమా.. కథ చెప్పే విధానంపై నా ఆలోచనను మార్చింది. దాని కళాత్మకత సహజంగానే నా సినిమాలోకి కూడా ప్రవహించింది. లాంగ్ షాట్‌ల పట్ల నాకున్న ప్రేమ కూడా ఆ ప్రభావం నుంచే వచ్చింది. ఇది దేశంలో విస్తృతంగా ఆదరించే శైలి కాదు, కానీ నాకు ఒక లాంగ్ టేక్‌లోని చిన్న కదలిక కూడా భావోద్వేగ ఉద్దేశాన్ని కలిగిస్తుంది. మీరు దీన్ని గమనించినందుకు నేను కృతజ్ఞుడను." అని సమావేశాన్ని ముంగించారు.
‘విస్పర్స్ ఆఫ్ ది మౌంటైన్స్’ సారాంశం
కఠినమైన ఆరావళి పర్వతాల సహజ సౌందర్యం నేపథ్యంలో చిత్రీకరించిన ఈ సినిమా.. సిలికోసిస్‌తో పోరాడుతున్న తండ్రి, విపరీతమైన గనుల తవ్వకం కారణంగా ఛిద్రమైన పర్వతాల గురించి విలపిస్తున్న కొడుకును అనుసరిస్తుంది. ప్రకృతికి మళ్లీ మాన్పు తీసుకురావాలనే బాలుడి చిన్న చిన్న ప్రయత్నాలు, జీవనాధారం కోసం కుటుంబం చేస్తున్న కఠిన పోరాటంతో ముడిపడి ఉంటుంది. వారి కథ ప్రేమ, నష్టం, మానవులకు,భూమికి మధ్యనున్న సున్నితమైన బంధం గురించి హృదయాన్ని కదిలించే ప్రతిబింబంగా మారుతుంది.
‘తుదరమ్’ సారాంశం
రన్నీలోని ప్రశాంతమైన కొండల్లో ఒకప్పుడు ఫైట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన షన్ముఖం.. కుటుంబంతో, ఓ నల్లని అంబాసిడర్ కారుతో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. అందరూ అతన్ని ముద్దుగా బెంజ్ అని పిలుస్తారు. కానీ ముగ్గురు పోలీసులు అతన్ని ఓ తప్పుడు కేసులోకి బలవంతంగా లాగడంతో వారి ప్రశాంతమైన జీవితం చిందరవందర అవుతుంది. దాంతో భయం, ద్రోహం, ఒకరికొకరు అండగా నిలబడటానికి చేసే పోరాటంలో ఒత్తిడికి గురైన కుటుంబ ఉత్కంఠభరితమైన కథను ఈ సినిమా మనకు చూపిస్తుంది.
ఐఎఫ్‌ఎఫ్‌ఐ గురించి..
1952లో ఆవిర్భవించిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తోంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాకు చెందిన జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్సీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం.. పునర్నిర్మిత క్లాసిక్‌ల నుంచి సాహసోపేతమైన ప్రయోగాల వరకు, దిగ్గజ చిత్ర ప్రముఖుల నుంచి తొలి అడుగు వేస్తున్న కొత్త ప్రతిభావంతుల వరకు అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రపంచ స్థాయి సినీ వేదికగా ఎదిగింది. వైవిధ్యభరితమైన మేళవింపు, అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, నివాళులు, ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలు, రెక్కలు తొడిగిన ఉత్సాహవంతమైన ఫిల్మ్ బజార్ లతో ఐఎఫ్ఎఫ్ఐ మెరిసింది. గోవాలోని అందమైన తీరప్రాంతంలో నవంబర్ 20 నుంచి 28 తేదీ వరకు జరుగుతున్న 56వ సంచిక.. భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సమాహారాన్ని ప్రదర్శిస్తూ, ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభకు అద్భుతమైన వేడుకగా నిలుస్తుంది.
మరిన్ని వివరాల కోసం, క్లిక్ చేయండి:
ఐఎఫ్‌ఎఫ్‌ఐ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
పీఐబీ ఐఎఫ్‌ఎఫ్‌ఐ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
పీఐబీ ఐఎఫ్‌ఎఫ్‌ఐవుడ్ బ్రాడ్‌కాస్ట్ చానల్:
https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
ఎక్స్ ఖాతాలు: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
Release ID:
2194350
| Visitor Counter:
5