"సినిమా ఓ ఉత్సవం.... ప్రపంచవ్యాప్త చిత్రాలను వీక్షించే వేదిక ఇఫి": దర్శకుడు అగ్ని
"నిజ జీవితంలో సమస్యలతో పోరాటానికి మనం సృష్టించే భయాన్ని అనుసరించే చిత్రం రుధిర్వన”: నటి పావన
రాబోయే కన్నడ హారర్ సినిమా 'రుధిర్వన' గురించి సినీప్రియులకు 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫి) ఆసక్తికర సమాచారాన్ని అందించింది. చిత్ర దర్శకుడు శ్రీ అగ్ని, ప్రధాన నటి పావన గౌడ ఇవాళ మీడియా సమావేశంలో ఈ సినిమా గురించి మాట్లాడారు.
సినీ రూపకర్తగా 'రుధిర్వన' సినిమా తన తొలి చిత్రమని దర్శకుడు అగ్ని తెలిపారు. ఇదివరకు పలు సినిమా ప్రాజెక్టుల్లో వివిధ హోదాల్లో పనిచేసినట్లు వెల్లడించారు. హారర్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించటంపై మాట్లాడుతూ, ఇలాంటి సినిమాలకి భిన్న ఆలోచనా విధానం అవసరమన్నారు. అడవులు, ఏకాంత ప్రదేశాలు, సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో షూటింగ్ చేయటానికి బలమైన ఏకాగ్రత, పట్టుదల ఉండాలని తెలిపారు.
హారర్ సినిమా కోసం వాణిజ్యపరమైన సాధ్యాసాధ్యాలకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ, పరిమిత వనరులతోనూ హారర్ జానర్ సినిమా తీయటం సులభమన్నారు. "ఈ సినిమాలో 40% ఇండోర్ షూటింగ్ చేశాం. దీనివల్ల లైటింగ్ నియంత్రణ, అవసరమైనట్లుగా చాలా షాట్లు తీసుకోవటానికి వీలైంది. తక్కువ మంది సాంకేతిక నిపుణులు, అనుకూలమైన పరిస్థితులతో హారర్ చిత్రం ఆచరణాత్మక, వాణిజ్యపరంగా లాభదాయకమైన జానర్ గా మారుతుంది" అని అగ్ని వివరించారు.
ఇఫిలో పాల్గొనటం పట్ల ఉత్సాహంగా ఉందన్న ఆయన.. "ఇక్కడికి రావాలని నేను ఎప్పుడూ కోరుకునేవాడిని. ఏదో ఒకరోజు ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా ప్రణాళిక రూపొందించుకున్నాను. అలాంటిది దర్శకుడిగా నా తొలి చిత్రం 'రుధిర్వన' గురించి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాను. లోలోపల నేను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను". సరిహద్దులతో సంబంధం లేకుండా సినిమాను వేడుకగా జరుపుకునే వేదిక ఇఫి అని తెలిపారు. "ప్రపంచవ్యాప్తంగా రూపొందిన సినిమాలను ఇక్కడ చూస్తారు. అవి కమర్షియల్, ఆర్ట్-హౌస్ లేదా డాక్యుమెంటరీ అయినా, ఎలాంటి భేదం లేకుండా చూడవచ్చు. ఆన్లైన్లో కూడా అందుబాటులో లేని చిత్రాలను ఇఫి ప్రదర్శిస్తుంది. సినిమా అంటే నాకు ఎంతో ఇష్టం" అని చెప్పారు.
నటి పావన గౌడ 'రుధిర్వన'పై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, "ప్రఖ్యాత సామెతలా, నిజజీవితాన్ని ఎదుర్కోవటానికి వీలుగా మనం హారర్‌ని సృష్టిస్తాం. రుధిర్వన ఆ ఆలోచనకు నిదర్శనంగా నిలుస్తుంది" అన్నారు. ఇతర జానర్లలో పనిచేయటం కంటే హారర్ చిత్రాల్లో నటించటం భిన్నంగా ఉంటుందన్నారు. "హారర్ చిత్రం.. శారీరకంగా, మానసికంగా శ్రమతో కూడుకున్నదైనప్పటికీ, ప్రాజెక్టుపై ఉన్న ఆసక్తి, కొత్తదాన్ని అన్వేషించాలనే తపన నటులను నడిపిస్తాయి" అని చెప్పారు.
సారాంశం: అడవి లోపల ఉన్న ఒక గ్రామానికి ఎన్నికల అధికారుల బృందం విధులు నిర్వహించేందుకు వెళ్తుంది. అక్కడ రిసార్ట్ నిర్మాణ సంస్థ, స్థానిక ఆదివాసీలైన దదాసి తెగ ప్రజల మధ్య జరుగుతున్న ఘర్షణలో ఎన్నికల బృందం చిక్కుకుంటుంది. అపార్థం కారణంగా ఆ బృందపై ఆదివాసీ తెగవారు దాడి చేస్తారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో భయకరంగా, శిథిలావస్థలో చెట్టు కొమ్మల మధ్య ఉన్న ఇంట్లో వారు ఆశ్రయం పొందుతారు. రాత్రి సమయం గడుస్తున్న కొద్దీ, లోపల ఉన్న పరిస్థితులతో పోల్చితే బయట ఆదివాసీల వల్ల ఉన్న ముప్పు తక్కువేనని వారు గ్రహిస్తారు. లోపల, బయట పొంచి ఉన్న ముప్పు నుంచి వారు బయటపడతారా? అడవుల విధ్వంసం వల్ల కలిగే భయానక పరిస్థితులను ఒక రాక్షసుడి దృష్టికోణం ద్వారా ఈ సినిమాలో చూపించారు.
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
దక్షిణాసియాలో అత్యంత పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలిచిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) 1952లో ప్రారంభమైంది. దీన్ని భారత ప్రభుత్వ జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ప్రభుత్వ గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్జీ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సినిమా రంగంలో గొప్ప శక్తికేంద్రంగా ఎదిగిన ఈ ఉత్సవంలో పునరుద్ధరించిన క్లాసిక్ చిత్రాలు.. సాహసోపేతమైన ప్రయోగ చిత్రాలు ఒకే వేదికపై నిలుస్తాయి. పౌరాణిక సినీ దిగ్గజాలు, తొలిసారి దర్శక రంగంలోకి అడుగుపెట్టిన వారు కలిసే వేదిక ఇది. ఐఎఫ్ఎఫ్ఐకి ఇంత ఆదరణ పెరగటానికి కారణం దానిలోని ఉద్వేగభరిమైన సమ్మేళనం. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్ తరగతులు, కీర్తిప్రశంసలు, అత్యంత శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ లో ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలు ప్రారంభమై, వృద్ధిలోకి వస్తాయి. గోవాలోని తీర ప్రాంతంలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే 56వ చలనచిత్ర ఉత్సవం.. అనేక భాషలు, తరాలు, ఆవిష్కరణలు, సంగీత ప్రదర్శనల ద్వారా భారతదేశ సృజనాత్మక ప్రతిభను ప్రపంచస్థాయిలో చాటిచెబుతుంది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ఐఎఫ్ఎఫ్ఐ వైబ్‌సైట్: https://www.iffigoa.org/
ఐఎఫ్ఎఫ్ఐ పీఐబీ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
పీఐబీ ఐఎఫ్ఎఫ్ఐవుడ్ ప్రసార ఛానెల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
ఎక్స్ హ్యాండిల్స్: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
रिलीज़ आईडी:
2194048
| Visitor Counter:
19