సినిమా, జ్ఞాపకం, వారసత్వాల మేళవింపు 'మా, ఉమ, పద్మ' పుస్తకం
ఇఫీలో సినిమా ప్రతిభకు పట్టం కట్టిన కమ్రాన్ కొత్త పుస్తకం
భారతీయ సినిమాపై పెరుగుతున్న తన సేకరణకు కొత్త శీర్షికను జోడించిన డీపీడీ
గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ రోజు సినీ దర్శకుడు, ఐఐటీ ముంబయి ప్రొఫెసర్ మజార్ కమ్రాన్ తన కొత్త పుస్తకం ‘మా, ఉమ, పద్మ: ది ఎపిక్ సినిమా ఆఫ్ రుత్విక్ ఘటక్’ ను ఆవిష్కరించడంతో ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్ సినిమా జ్ఞాపకాల స్ఫూర్తితో నిండిపోయింది. ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతికి ప్రముఖులు సంతాపం ప్రకటించడంతో గంభీరంగా మొదలైన కార్యక్రమం ఆ తర్వాత, భారతదేశ అత్యంత ప్రభావవంతమైన చిత్ర దర్శకుల్లో ఒకరైన రిత్విక్ ఘటక్‌ను గౌరవిస్తూ, ఒక ఆత్మీయ, అవగాహనాత్మక వేదికగా మారింది.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పబ్లికేషన్ డివిజన్ డైరెక్టరేట్ (డీపీడీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ భూపేంద్ర కైంతోలా పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ కూడా పాల్గొనడంతో సందర్భానికి మరింత సుహృద్భావం, ప్రత్యేకత చేకూరింది.
‘మా, ఉమ, పద్మ’ పుస్తకాన్ని డీపీడీ ప్రచురించడం గురించి శ్రీ కైంతోలా వివరించారు. వేవ్స్ సదస్సు 2025లో చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. ఆ సంవత్సరాన్ని ఐదుగురు దిగ్గజ సినీ ప్రముఖుల శతజయంతి సందర్భంగా వారికి అంకితం చేసినట్టు, వారిలో ఘటక్ కూడా ఒకరని తెలిపారు. “డీపీడీ ప్రచురించిన పుస్తకాలను అందరికీ తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతుంది. కమ్రాన్ ఈ ఆలోచనకు అనుగుణంగా పనిచేయడానికి ముందుకు వచ్చారు. అంతా సవ్యంగా జరిగింది” అని శ్రీ కైంతోలా తెలిపారు. ఈ పుస్తకం ముఖచిత్రాన్ని కమ్రాన్ విద్యార్థులే ఐఐటీ ముంబైలో రూపొందించారని, ఈ సృజనాత్మక సహకారం రచయితను ఎంతగానో సంతోషపరిచిందని ఆయన వివరించారు.

కమ్రాన్ తన మాటలు పుస్తక రూపం దాల్చినందుకు ఉద్వేగం వ్యక్తం చేస్తూ, తాను రాసిన ప్రతి పదం తన నమ్మకం నుంచే వచ్చిందని, పాఠకులు కొన్నిసార్లు తనతో ఏకీభవించవచ్చని, మరికొన్నిసార్లు విభేదించవచ్చని తాను అంగీకరిస్తున్నట్టు తెలిపారు. భారతీయ సినిమాలో ఘటక్ స్థానాన్ని ప్రస్తావిస్తూ, ఈ రోజు ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ, ఘటక్ తన జీవితాన్ని అట్టడుగ స్థాయిలో గడిపారని, ఆలోచనలో శక్తి ఉన్నప్పటికీ, ఆయన తరచుగా తన చిత్రాలను నిర్మించడానికి కష్టపడ్డారని కమ్రాన్ పేర్కొన్నారు.
ఘటక్‌కు సినిమాలకు సంబంధించిన అధికార శిక్షణ లేదనే అపోహను కూడా కమ్రాన్ తొలగించారు. “ఆయన కఠోర శ్రమతో నేర్చుకున్నారు,” అని స్పష్టం చేశారు. ఘటక్ ప్రారంభ రచనలు, తన కాలంలోని మహానుభావులతో కలసి చేసిన ప్రాజెక్టులు, ఐజెన్‌స్టైన్ స్టానిస్లావ్‌స్కీ రచనలతో ఆయనకు ఉన్న లోతైన అనుబంధాన్ని సవివరంగా తెలిపారు. ఘటక్ కొంతకాలం ఎఫ్టీఐఐలో బోధించారని కూడా గుర్తు చేస్తూ, సినిమా సంబంధ పరిజ్ఞానం అనేక రూపాల్లో ఉనికిలో ఉందుందనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

తర్వాత సంభాషణ భారతీయ సినిమా పుస్తకాలను ప్రోత్సహించడానికి డీపీడీ చేపట్టిన విస్తృత కార్యక్రమం వైపు మళ్లింది. శ్రీ కైంతోలా మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాలలో ఫాల్కే అవార్డు విజేతలపై వచ్చిన కొత్త సంపుటి, ఎఫ్టీఐఐ 'లెన్సైట్' జర్నల్ వ్యాసాలతో రాబోయే సంకలనంతో సహా మొత్తం 12 పుస్తకాలు తెచ్చినట్టు తెలిపారు. ఈ సంకలనాన్ని ఇప్పుడు ఎక్కువమందికి అందుబాటులోకి తీసుకురావడానికి హిందీలో ప్రచురిస్తున్నట్లు తెలిపారు. లక్ష్మీకాంత్-ప్యారేలాల్, లతా మంగేష్కర్ వంటి పేర్లను ప్రస్తావిస్తూ, మరో ఐదు పుస్తకాలు రానున్నాయని కూడా ఆయన ప్రకటించారు.
చర్చ చివరికి ఘటక్ చిత్రాలలో పదేపదే ప్రత్యక్షమయ్యే స్త్రీ స్వరూపాలపైకి చేరుకుంది. పుస్తక శీర్షికలోని ‘మా, ఉమ, పద్మ’ తల్లితనాన్ని స్త్రీత్వానికి అత్యంత లోతైన ప్రతిరూపంగా ఘటక్ ఎలా భావించాడో కమ్రాన్ వివరించారు. పద్మా నదితో విడదీయరాని విధంగా మిళితమైన ఈ భావం, ఘటక్ సినిమాల్లో శాశ్వత చిహ్నంగా నిలిచిందని ఆయన చెప్పారు.

ప్రతిబింబం, ప్రశంసలు, పునఃపరిశీలనతో మిళితమైన ఈ సమావేశం, రిత్విక్ ఘటక్ కళాత్మక వారసత్వానికి నివాళిగా, కమ్రాన్ లోతైన పరిశోధన, చిత్తశుద్ధి కృషికి వేడుకగా నిలిచింది.‘మా, ఉమ, పద్మ’ పుస్తకం భారతీయ సినిమాపై చర్చను సుసంపన్నం చేస్తూ, అందుబాటు, అంతర్దృష్టి, దాని అంశానికి తగిన అభిరుచితో నడిచేదిగా ఉంటుందని వాగ్దానం చేస్తోంది.
PC Link:
ఇఫీ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ), దక్షిణ ఆసియాలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద సినిమా ఉత్సవంగా పేరు గాంచింది. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్జీ) సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. పునరుద్ధరించిన పాత సినీ కళాఖండాలు, ఆధునిక ప్రయోగ చిత్రాల ప్రదర్శనతో దిగ్గజ దర్శకులు, మొదటిసారి చిత్రాలు తీసిన కొత్త, సాహసోపేత దర్శకులు ఒకే వేదికను పంచుకునే ఈ ఉత్సవం, అంతర్జాతీయ సినీశక్తి కేంద్రంగా ఎదిగింది. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, నివాళులు ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు, అత్యంత ఉత్సాహభరితమైన 'వేవ్స్ ఫిల్మ్ బజార్' వంటి వైవిధ్యభరిత అంశాల కలయిక ఇఫీని ప్రకాశవంతంగా మార్చాయి. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవా సుందర తీరప్రాంత నేపథ్యంలో జరిగే 56వ ఎడిషన్ భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుతమైన వైవిధ్యాన్ని హామీ ఇస్తోంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను సమగ్రంగా ప్రదర్శించే వేడుక.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56new/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Post Link: https://x.com/PIB_Panaji/status/1991438887512850647?s=20
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
* * *
Release ID:
2193841
| Visitor Counter:
2