ఇఫి2025లో దేశభక్తి ఉప్పొంగేలా చేసిన కాకోరి చిత్రం: ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వందల ఏళ్ల నాటి విప్లవం
దర్శకుడు కమలేష్ కె. మిశ్రా రూపొందించిన తాజా చిత్రం 'కాకోరి' సినిమా ప్రదర్శనతో 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేదిక పాత జ్ఞాపకాలు, గర్వం, సినిమా శక్తితో వెలిగిపోయింది. ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకున్న కాకోరి సాధారణ సినిమా మాత్రమే కాదు. 1925లో జరిగిన కాకోరి రైలు సంఘటనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా గౌరవ వందనమిది. ఆ సాహసోపేతమైన చర్య భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త ఊపునిచ్చింది.

దర్శకుడు కమలేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాకోరి చిత్రాన్ని "విరోచిత పోరాటం, త్యాగం కోణం నుంచి రూపొందించాం. కేవలం నలభై ఎనిమిది గంటల్లో నలుగురు విప్లవకారులు అమరులయ్యారు. అలాంటి ఘటన ఎలా మరుగున పడిపోతుంది? అమరుల ధైర్యం, త్యాగం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆగస్టు 9, 2025న ఈ సంఘటన శత జయంతి సందర్భంగా నిజాయితీ, పట్టుదల, తీవ్రమైన భావోద్వేగంతో ఈ కథను చెప్పాలని చరిత్రే మమ్మల్ని కదిలించినట్లు అనిపించింది" అని అన్నారు.
ఈ చిత్రానికి వెన్నుముకలా నిలిచిన నిశితమైన పరిశోధన గురించి దర్శకుడు కమలేష్ వివరించారు. పురాతన పుస్తకాలు, వార్తా పత్రికల నుంచి ప్రముఖ చరిత్రకారులను కలవటం, షాజహాన్పూర్ వంటి ప్రదేశాల్లోని స్మారక చిహ్నాలను సందర్శించటం వరకు ఆ సంఘటన సారాంశాన్ని పట్టుకోవటానికి ప్రతీ ఆధారాన్ని అలుపెరుగని అంకితభావంతో బృందం పరిశీలించిందని వెల్లడించారు. “ప్రతి అంశాన్ని గౌరవించటమే కాక, నిజాయితీగా, యథాతథంగా చూపించాలనేది మా లక్ష్యం” అని చెప్పారు. "డాక్యుమెంటరీగా మొదలైన ఈ ప్రాజెక్టు, క్రమంగా పూర్తి సినిమాగా రూపాంతరం చెందింది. నిజమైన సవాలు ఏమిటంటే.. చరిత్రలోని ఇంతటి భారీ అధ్యాయాన్ని కేవలం ముప్పై నిమిషాల దృశ్యరూపక నిడివిలో చూపించగలగటం. ఆ సంఘటన భావోద్వేగ అనుభూతిని, చారిత్రక ప్రాముఖ్యతను కాపాడటం" అని తెలిపారు.

నటీనటుల అంకితభావాన్ని నిర్మాత జస్విందర్ సింగ్ ప్రశంసించారు. "విప్లవకారుల పాత్రలకు నటీనటులు జీవం పోశారు. విప్లవకారుల అజేయ స్ఫూర్తికి ఈ చిత్రం ద్వారా మా నివాళి. భవిష్యత్ తరాల్లో నూతన దేశభక్తిని ఇది ఉత్తేజపరుస్తుందని మేం విశ్వసిస్తున్నాం" అని అన్నారు.
ఈ చిత్రం గురించి
భారత్ | 2024 | హిందీ | 31' | రంగు
1920ల నాటి బ్రిటీష్ ఇండియా నేపథ్యంతో కాకోరి చిత్రాన్ని, ప్రఖ్యాత కాకోరి రైలు సంఘటన శత జయంతి సందర్భంగా వలస పాలనను ధైర్యంగా ఎదురించిన విప్లకారులకు నివాళిగా రూపొందించారు. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సాహసోపేతమైన ప్రణాళికను ఈ చిత్రం తెలియజేస్తుంది. బ్రిటీష్ ఖజానా నిధులను దొంగలించటానికి రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్ సహా వారి సహచరుల నాయకత్వంలో చేసిన రైలు దాడిని చూపిస్తుంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో కాకోరి రైలు దోపిడీ కీలక మలుపు. విప్లవకారుల ఆశయాలు, వారి మధ్యనున్న స్నేహం, వారు చేసిన గొప్ప త్యాగాలను ఈ సినిమా కథ తెలియజేస్తుంది. ద్రోహం, జైలు శిక్ష, అమరత్వం ద్వారా యువత చూపిన ధైర్యాన్ని, వారి దేశభక్తిని కాకోరి చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లుగా, ప్రేక్షకులను ఉత్తేజపరిచే విధంగా చిత్రీకరించారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు...
దర్శకుడు - కమలేష్ కె. మిశ్రా
నిర్మాత - కెఎస్ఆర్ బ్రదర్స్
స్క్రీన్ ప్లే - కమలేష్ కె. మిశ్రా
సినిమాటోగ్రాఫర్ - దేవ్ అగర్వాల్
ఎడిటర్ - అభిషేక్ వత్స్, అరోన్ రామ్
సంగీత దర్శకుడు - బాపీ భట్టాచార్య
నటీనటులు - పీయూష్ సుహనే, మన్వేంద్ర త్రిపాఠి, వికాస్ శ్రీవాస్తవ్, సంతోష్ కుమార్ ఓఝా, రజనీశ్ కౌశిక్, హృదయ్‌జీత్ సింగ్
ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు: https://drive.google.com/file/d/1LZNbiwdQ6e33ag-CIXbSfsUpnUcPs7QE/view?usp=drive_link
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
దక్షిణాసియాలో అత్యంత పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలిచిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) 1952లో ప్రారంభమైంది. దీన్ని భారత ప్రభుత్వ జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ప్రభుత్వ గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్జీ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సినిమా రంగంలో గొప్ప శక్తికేంద్రంగా ఎదిగిన ఈ ఉత్సవంలో పునరుద్ధరించిన క్లాసిక్ చిత్రాలు.. సాహసోపేతమైన ప్రయోగ చిత్రాలు ఒకే వేదికపై నిలుస్తాయి. పౌరాణిక సినీ దిగ్గజాలు, తొలిసారి దర్శక రంగంలోకి అడుగుపెట్టిన వారు కలిసే వేదిక ఇది. ఐఎఫ్ఎఫ్ఐకి ఇంత ఆదరణ పెరగటానికి కారణం దానిలోని ఉద్వేగభరిమైన సమ్మేళనం. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్ తరగతులు, కీర్తిప్రశంసలు, అత్యంత శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ లో ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలు ప్రారంభమై, వెలుగులోకి వస్తాయి. గోవాలోని తీర ప్రాంతంలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే 56వ చలనచిత్ర ఉత్సవం.. అనేక భాషలు, తరాలు, ఆవిష్కరణలు, సంగీత ప్రదర్శనల ద్వారా భారతదేశ సృజనాత్మక ప్రతిభను ప్రపంచస్థాయిలో చాటిచెబుతుంది.
మీడియా సమావేశాన్ని ఇక్కడ వీక్షించవచ్చు:
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ఐఎఫ్ఎఫ్ఐ వైబ్‌సైట్: https://www.iffigoa.org/
ఐఎఫ్ఎఫ్ఐ పీఐబీ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
పీఐబీ ఐఎఫ్ఎఫ్ఐవుడ్ ప్రసార ఛానెల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
ఎక్స్ హ్యాండిల్స్: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
Release ID:
2192981
| Visitor Counter:
9