యూనిసెఫ్ తో ఐఎఫ్ఎఫ్ఐ భాగస్వామ్యం: ఐదు చిత్రాలు, ఒకే సార్వజనీన కథ
56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) లో ప్రపంచవ్యాప్తంగా బాలల సాహసం, సృజనాత్మకత, కలలను ఆవిష్కరించే ఐదు సినిమాల ప్రదర్శన
బాల్యంలోని ఆశ్చర్యం, సవాళ్లు, పోరాటాలు, చెదరని పట్టుదల వంటి అనేక కోణాలను ఆవిష్కరిస్తూ మనసును కదిలించే, ఆలోచింపచేసే, ప్రేరేపించే చిత్రాలను ప్రదర్శించడానికి భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ- ఇఫీ) మరోసారి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యూనిసెఫ్) తో చేతులు కలిపింది.
యూనిసెఫ్, ఇఫీ భాగస్వామ్యం తొలిసారిగా 2022లో మొదలైంది. ఇప్పుడు నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ కలయిక సినిమా, సామాజిక బాధ్యతలు కలుసుకునే ఒక అర్థవంతమైన వేదిక. బాలల హక్కుల రంగం, చలనచిత్రోత్సవ ప్రపంచంలోని రెండు సుప్రసిద్ధ సంస్థలు కలసి నిరంతరం ముందుకు సాగడాన్ని ఇది సూచిస్తోంది. ఇఫీ 56వ సంచికలో ఎంపిక చేసిన చిత్రాలు వివిధ సంస్కృతులలో బాలలు ఎదుర్కొంటున్న వాస్తవాలను తెలియజేస్తూనే, వారి ధైర్యం, సృజనాత్మకత, ఆకాంక్షలను ఆవిష్కరిస్తాయి. యూనిసెఫ్ మానవతా దృక్పథాన్ని సినిమాకున్న భావ వ్యక్తీకరణ శక్తితో ఏకం చేయడం ద్వారా, ప్రతి చిన్నారి మెరుగైన ప్రపంచాన్ని పొందే హక్కు కోసం సంఘీభావాన్ని మేల్కొలపడానికి, ఆ దిశగా కార్యాచరణను ప్రేరేపించడానికి సినిమాకున్న శక్తిని ఈ భాగస్వామ్యం మరోసారి చాటనుంది.
ఐదు చిత్రాలు - ఒకే సార్వజనీన కథ
ఈ సంవత్సరం ఎంపిక చేసిన చిత్రాలలో భారత్ సహా కొసావో, దక్షిణ కొరియా, ఈజిప్ట్ వంటి దేశాల నుంచి ఐదు అసాధారణ చిత్రాలు ఉన్నాయి. వీటిలో ప్రతి సినిమా - సొంతమనేదాని కోసం అన్వేషణ, గౌరవం కోసం పోరాటం, ప్రేమ కోసం తపన, స్వేచ్ఛ కోసం కల - వంటి బాల్యంలోని ఒక్కో విభిన్న కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ చిత్రాలన్నీ కలిసి యూనిసెఫ్, ఇఫీల ఉమ్మడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఒక హృద్యమైన చలనచిత్ర సమగ్ర స్వరూపాన్ని అందిస్తాయి. ప్రతి చిన్నారి కోసం మరింత న్యాయబద్ధమైన, కరుణ పూరితమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దడానికి కథల శక్తిపై ఈ రెండు సంస్థలకున్న విశ్వాసానికి ఇది నిదర్శనం.
1. హ్యాపీ బర్త్‌డే (ఈజిప్ట్/ఈజిప్షియన్ అరబిక్ భాష)
ఈజిప్టు దర్శకురాలు సరా గోహర్ తెరకెక్కించిన హృదయాన్ని తాకే తొలి చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’ 2025 ట్రైబెకా చలనచిత్రోత్సవంలో తొలి ప్రదర్శన కాగా, ఈజిప్టు తరఫున ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీగా కూడా ఎంపికైంది. ఈ చిత్రం ఎనిమిదేళ్ల పనిపిల్ల తోహా కథను చెబుతుంది. తన చుట్టూ ప్రపంచం అన్యాయంగా ఉన్నప్పటికీ, తన స్నేహితురాలు నెల్లీకి గుర్తుండి పోయే పరిపూర్ణమైన పుట్టినరోజు వేడుకను జరపాలని ఆమె దృఢ సంకల్పం. ఆధునిక కైరో నేపథ్యంలో సాగే ఈ చిత్రం అసమానతలు, అమాయకత్వం మధ్య ఉండే తీవ్ర విభేదాలను ఆవిష్కరిస్తుంది. పెద్దలు చూడలేని చోట కూడా పిల్లలు మానవత్వాన్ని ఎంత స్పష్టంగా గ్రహిస్తారో ఈ కథ హృద్యంగా చూపిస్తుంది. స్నేహం, అసమానతలను సున్నితంగా చిత్రీకరించడం ద్వారా, 'హ్యాపీ బర్త్‌డే' చిత్రం ప్రతి చిన్నారికి, వారు ఎక్కడ జన్మించినప్పటికీ, గౌరవం, సమానత్వం, అవకాశాలను అందించాలనే యూనిసెఫ్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

2. కడల్ కన్ని (భారతదేశం/తమిళ భాష)
తమిళ దర్శకుడు దినేష్ సెల్వరాజ్ రూపొందించిన కవితాత్మక చిత్రం 'కడల్ కన్ని' అనాథ బాలల సంరక్షణ, ఓదార్పు, బంధానికి చిహ్నాలైన దేవదూతలు, మత్స్యకన్యల గురించి కలలు కనే ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. వాస్తవికత, ఫాంటసీల సమ్మేళనం ద్వారా, ఈ చిత్రం కష్టాలలో కూడా కల్పనా శక్తి పిల్లలను ఎలా ధైర్యంగా ఉంచుతుందో చూపుతుంది. కలలే వారి మనుగడకు తొలి మార్గమని మనకు గుర్తు చేస్తుంది. కవితాత్మకమైన కథనం, కరుణ రసాలతో కడల్ కన్ని చిత్రం యూనిసెఫ్, ఇఫీ భాగస్వామ్యాన్ని అర్ధవంతంగా చాటుతూ, ప్రతి చిన్నారికి కలలు కనే, గుర్తింపు పొందే, ప్రేమ అందుకునే హక్కును వివరిస్తుంది.

3. పుతుల్ (భారతదేశం/హిందీ భాష)
భారతీయ దర్శకుడు రాధేశ్యామ్ పీపల్వా రూపొందించిన 'పుతుల్' చిత్రం, తల్లిదండ్రుల విడాకుల వల్ల ఏర్పడిన భావోద్వేగ తుపాను లో చిక్కుకున్న ఏడేళ్ల బాలిక కథను తెలియచేస్తుంది. బాధతో, గందరగోళానికి గురైన ఆ బాలిక డ్యామేజ్డ్ గ్యాంగ్ అని పిలిచే తన స్నేహితుల బృందం వద్ద, తన ప్రియమైన నానా (అమ్మమ్మ/నాయనమ్మ) వద్ద ఓదార్పు పొందుతుంది. ఆమె అదృశ్యమైనప్పుడు, ఆమె తల్లిదండ్రులు తమ భయాలతో మాత్రమే కాకుండా, తమ హృదయాలలోని బీటలతో కూడా సతమతమవుతారు. మనసులను కదిలించే మానవీయ కోణమున్న ‘పుతుల్‘ చిత్రం విచ్ఛిన్నమైన కుటుంబాలలోని పిల్లల నిశ్శబ్ద ధైర్యాన్ని కళ్ళకు కడుతుంది. పిల్లల మానసిక శ్రేయస్సు, ప్రేమ, అవగాహన, భద్రతతో పెరిగే వారి హక్కు కోసం యూనిసెఫ్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ చిత్రం అద్దం పడుతుంది.

4. ది బీటిల్ ప్రాజెక్ట్ (కొరియా/కొరియన్ భాష)
కొరియన్ దర్శకుడు జిన్ క్వాంగ్-క్యో రూపొందించిన హృదయాన్ని హత్తుకునే చిత్రం 'ది బీటిల్ ప్రాజెక్ట్' ను చికాగో ఏషియన్ పాప్-అప్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ గా ప్రదర్శించారు. ఉత్తర కొరియా నుంచి వచ్చిన ఒక ప్లాస్టిక్ సంచిలోని ఓ బీటిల్ (పెంకుపురుగు) దక్షిణ కొరియా బాలిక చేతికి చేరడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ బీటిల్ కొరియా సరిహద్దుకు ఇరువైపులా ఉన్న పిల్లల మధ్య కుతూహలాన్ని, అనుబంధాన్ని రేకెత్తిస్తుంది. విభజనను అధిగమించే ఉమ్మడి అద్భుతానికి ఇది ఒక చిహ్నంగా మారుతుంది. ప్రేమ, హాస్యంతో కూడిన ఈ చిత్ర కథనం ఉత్సుకత,ఔదార్యం, ఎంత పెద్ద దూరాలనైనా కలిపే అమాయకమైన ఆశను చాటిచెబుతుంది. శాంతి, అవగాహనను పెంపొందించడానికి యువ మనస్సుల్లోని ఊహ, ఔదార్యాన్ని యూనిసెఫ్ విశ్వసించే విధానాన్ని 'ది బీటిల్ ప్రాజెక్ట్' చిత్రం సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది.

5. ది ఒడిస్సీ ఆఫ్ జాయ్ (ఒడిసెజా ఇ గెజిమిట్) (ఫ్రాన్స్, కొసావో/ అల్బేనియన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రోమనీ భాషలు)
కొసోవన్ దర్శకుడు జిగ్జిమ్ టెర్జికి రూపొందించిన, మనసును లోతుగా కదిలించే తొలి చిత్రం 'ఒడిస్సీ ఆఫ్ జాయ్' కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ప్రీమియర్ అయింది. నూతన సహస్రాబ్ది ప్రారంభంలో ఈ కథ ఆవిష్కృతమవుతుంది. యుద్ధంలో తన తండ్రి అదృశ్యమవడంతో, 11 ఏళ్ల లిస్ విషాదం ఎదుగుదల మధ్య తలమునకలై కనిపిస్తాడు. యుద్ధానంతర కొసావో లోని స్థానిక పిల్లలను అలరించడానికి ప్రయాణిస్తున్న ఒక ఫ్రెంచ్ క్లౌన్ బృందంలో కలసి లిస్ నిశ్శబ్దంగా కోలుకునే ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. కోల్పోయిన ఆశను కూడా తిరిగి పొందవచ్చని ఆ ప్రయాణంలో అతను తెలుసుకుంటాడు. సున్నితంగా ఉంటూనే లోతైన భావాన్ని వ్యక్తీకరించే 'ఒడిస్సీ ఆఫ్ జాయ్' చిత్రం, సంఘర్షణల మధ్య బాల్యాన్ని నిర్వచించే పట్టుదల స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. ప్రతి చిన్నారికి ఆనందం, భద్రత, భవిష్యత్తు ఉండే హక్కుపై యూనిసెఫ్ స్థిర విశ్వాసాన్ని ఇది సూచిస్తుంది.
ఈ ఐదు చిత్రాలు కలిసి యూనిసెఫ్, ఇఫీ భాగస్వామ్య లక్ష్యాన్ని ప్రతిబింబిస్తూ, మార్పు తీసుకురాగల సినిమా శక్తిని ఉపయోగించి ప్రపంచంలోని బాలల ఆశలు, భయాలు, విజయాలను ప్రతిధ్వనింపజేస్తాయి. ప్రపంచంలోని చిన్నారుల జీవితాలను చూపించే ఈ శక్తివంతమైన చిత్రాల ప్రదర్శనను చూసే అవకాశాన్ని కోల్పోకండి. యూనిసెఫ్ X ఇఫీ చిత్రాల ప్రదర్శన షెడ్యూల్‌ను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇఫీ గురించి

1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ), దక్షిణ ఆసియాలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద సినిమా ఉత్సవంగా పేరు గాంచింది. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్జీ) సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. పునరుద్ధరించిన పాత సినీ కళాఖండాలు, ఆధునిక ప్రయోగ చిత్రాల ప్రదర్శనతో దిగ్గజ దర్శకులు, మొదటిసారి చిత్రాలు తీసిన కొత్త, సాహసోపేత దర్శకులు ఒకే వేదికను పంచుకునే ఈ ఉత్సవం, అంతర్జాతీయ సినీశక్తి కేంద్రంగా ఎదిగింది. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, నివాళులు ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు, అత్యంత ఉత్సాహభరితమైన 'వేవ్స్ ఫిల్మ్ బజార్' వంటి వైవిధ్యభరిత అంశాల కలయిక ఇఫీని ప్రకాశవంతంగా మార్చాయి. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవా సుందర తీరప్రాంత నేపథ్యంలో జరిగే 56వ ఎడిషన్, భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుతమైన వైవిధ్యాన్ని హామీ ఇస్తోంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను సమగ్రంగా ప్రదర్శించే వేడుక.
***
रिलीज़ आईडी:
2191916
| Visitor Counter:
14