ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహిస్తున్న దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ శిఖరాగ్ర సదస్సు-2025లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
9 కోట్ల మంది రైతులకు రూ. 18,000 కోట్ల 21వ విడత పీఎం-కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి
సేంద్రియ వ్యవసాయంలో ప్రపంచానికి కేంద్రంగా మారుతున్న భారత్
వ్యవసాయాన్ని ఆధునిక, విస్తరించదగిన అవకాశంగా గుర్తిస్తున్న భారత యువత - శక్తిమంతమవుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
సేంద్రియ వ్యవసాయం భారత్ సొంత ఆలోచన
ఇది మన సంప్రదాయాలతో ముడిపడినది - మన పర్యావరణానికి తగినది
‘ఒక ఎకరం, ఒక సీజన్’ - ఒక సీజన్‌లో ఒక ఎకరం భూమిలో సేంద్రియ వ్యవసాయం చేయండి
సేంద్రియ వ్యవసాయాన్ని పూర్తిగా సైన్స్ ఆధారిత ఉద్యమంగా మార్చడం మన లక్ష్యం: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
19 NOV 2025 5:22PM by PIB Hyderabad
తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ రోజు దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ సదస్సు-2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన శ్రీ మోదీ... కోయంబత్తూరు పవిత్ర గడ్డపై మరుధమలై మురుగన్‌కు నమస్కరిస్తూ తన వ్యాఖ్యలను ప్రారంభించారు. కోయంబత్తూరు సంస్కృతి, కరుణ, సృజనాత్మకతకు నిలయంగా... దక్షిణ భారత పారిశ్రామిక శక్తికి కేంద్రంగా ఉందన్నారు. జాతీయ ఆర్థిక వ్యవస్థకు నగర వస్త్ర రంగం ప్రధానంగా దోహదపడుతోందని ఆయన స్పష్టం చేశారు. కోయంబత్తూరుకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతిగా దేశానికి మార్గనిర్దేశం చేస్తున్నందున ఈ నగరానికి మరింత గుర్తింపు లభించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సేంద్రియ వ్యవసాయం తన హృదయానికి చాలా దగ్గరగా ఉన్న అంశమన్న ప్రధానమంత్రి... దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ సదస్సును నిర్వహిస్తున్న తమిళనాడు రైతు సోదరీ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశ్రమ భాగస్వాములు, అంకురసంస్థలు, ఆవిష్కర్తలందరినీ ఆయన హృదయపూర్వకంగా అభినందించారు.
రాబోయే సంవత్సరాల్లో భారత వ్యవసాయ రంగంలో ప్రధాన పరివర్తనలను తాను ఊహించానని ప్రధానమంత్రి తెలిపారు. "భారత్ సేంద్రియ వ్యవసాయంలో ప్రపంచ కేంద్రంగా మారే మార్గంలో ఉంది" అని శ్రీ మోదీ ద్రువీకరించారు. దేశంలో జీవవైవిధ్యం అభివృద్ధి చెందుతోందనీ... యువత ఇప్పుడు వ్యవసాయాన్ని ఆధునిక, విస్తరించదగిన అవకాశంగా చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ మార్పు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తిమంతం చేస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
గత పదకొండు సంవత్సరాలుగా మొత్తం వ్యవసాయ రంగంలో గణనీయ మార్పులు చోటుచేసుకున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. భారత వ్యవసాయ ఎగుమతులు దాదాపు రెట్టింపు అయ్యాయనీ, వ్యవసాయాన్ని ఆధునికీకరించడంలో రైతులకు మద్దతునివ్వడానికి ప్రభుత్వం అన్ని మార్గాలను అందుబాటులో ఉంచిందని ప్రధానమంత్రి తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా ఈ సంవత్సరం రైతులు రూ. 10 లక్షల కోట్లకు పైగా సహాయం పొందారని ఆయన పేర్కొన్నారు. ఏడు సంవత్సరాల కిందట పశు సంవర్ధక, మత్స్య రంగాలకూ కేసీసీ ప్రయోజనాలను విస్తరించినప్పటి నుంచి, ఈ రంగాలకు చెందిన వారూ దాని విస్తృత ప్రయోజనాలను పొందుతున్నారని శ్రీ మోదీ అన్నారు. జీవసంబంధ ఎరువులపై జీఎస్‌టీ తగ్గింపు నిర్ణయం రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చిందని ఆయన తెలిపారు.
కొద్దిసేపటి కిందట ఇదే వేదిక నుంచి ‘ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి’ 21వ విడత నిధులు రూ. 18,000 కోట్లను దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలకు బదిలీ చేశామని ప్రధానమంత్రి తెలిపారు. తమిళనాడులోని లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకీ నిధులు జమ అయ్యాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ. 4 లక్షల కోట్లు చిన్న, సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేశామన్నారు. దీనివల్ల ఆ రైతులు వ్యవసాయ సంబంధిత అవసరాలను తీర్చుకోగలుగుతున్నారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందిన కోట్లాది మంది రైతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
21వ శతాబ్దపు వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయం విస్తరణ అవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇటీవలి సంవత్సరాల్లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా పొలాలు, వివిధ వ్యవసాయ సంబంధిత రంగాల్లో రసాయనాల వాడకం గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం భూ సారాన్ని తగ్గిస్తోందనీ, నేలలోని తేమనూ ప్రభావితం చేస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రతియేటా వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయని అన్నారు. పంటల వైవిధ్యీకరణ, సేంద్రియ వ్యవసాయం ఈ సమస్యకు చక్కని పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు.
భూ సారాన్ని పునరుద్ధరించడానికి, పంటల్లో పోషక విలువలను పెంచడానికి దేశం సేంద్రియ వ్యవసాయ మార్గంలో ముందుకు సాగాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇది ఒక దార్శనికత, అవసరం కూడా అని ఆయన అన్నారు. అప్పుడే భవిష్యత్ తరాల కోసం జీవవైవిధ్యాన్ని మనం కాపాడుకోగలమన్నారు. వాతావరణ మార్పులను, వాతావరణంలో హెచ్చుతగ్గులను ఎదుర్కోవడానికి, మన నేలను ఆరోగ్యంగా ఉంచడానికి, హానికరమైన రసాయనాల నుంచి ప్రజలను రక్షించడానికి సేంద్రియ వ్యవసాయం మనకు సహాయపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ముఖ్యమైన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నేటి కార్యక్రమం ముఖ్యమైన పాత్ర పోషించనుందని ఆయన అన్నారు.
భారత ప్రభుత్వం రైతులను సేంద్రియ వ్యవసాయం దిశగా చురుగ్గా ప్రోత్సహిస్తోందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఒక సంవత్సరం కిందట కేంద్ర ప్రభుత్వం జాతీయ సేంద్రియ వ్యవసాయ మిషన్‌ను ప్రారంభించిందనీ, ఇది ఇప్పటికే లక్షలాది మంది రైతులను అనుసంధానించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమ సానుకూల ప్రభావం దక్షిణ భారతమంతటా ప్రత్యేకంగా కనిపిస్తోందన్నారు. తమిళనాడులోనే దాదాపు 35,000 హెక్టార్ల భూమిలో ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం జరుగుతున్నదని ప్రధానమంత్రి తెలిపారు.
"సేంద్రియ వ్యవసాయం... స్వదేశీ భావన... అంటే భారత్ సొంత ఆలోచన - ఇది వేరే ప్రాంతాల నుంచి దిగుమతి కాలేదు – ఇది భారత సంప్రదాయంతో ముడిపడినది, మన పర్యావరణానికి అనుకూలమైనది" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దక్షిణ భారతంలోని రైతులు పంచగవ్య, జీవామృతం, బీజామృతం, మల్చింగ్ వంటి సాంప్రదాయిక సేంద్రియ వ్యవసాయ పద్ధతులను నిరంతరం అవలంబిస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ పద్ధతులు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయనీ, పంటలను రసాయన రహితంగా ఉంచుతాయని, ఇన్‌పుట్ ఖర్చులనూ తగ్గిస్తాయని శ్రీ మోదీ వివరించారు.
శ్రీ అన్నా - చిరు ధాన్యాల సాగును సేంద్రియ వ్యవసాయంతో అనుసంధానించడం... భూమి తల్లిని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తమిళనాడులో మురుగన్ దేవుడికి తేనె, శ్రీ అన్నాతో చేసిన ‘తేనుమ్ తినై మావుమ్’ వంటకాన్ని నైవేద్యంగా పెడతారని ఆయన ప్రస్తావించారు. తమిళ ప్రాంతాల్లో కంబు, సమాయ్... కేరళ, కర్ణాటకల్లో రాగులు... తెలుగు రాష్ట్రాల్లో సజ్జ, జొన్న వంటి చిరు ధాన్యాలు తరతరాలుగా సాంప్రదాయిక ఆహారంలో భాగంగా ఉన్నాయని శ్రీ మోదీ తెలిపారు.
ఈ సూపర్‌ఫుడ్‌ను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. సేంద్రియ, రసాయన రహిత వ్యవసాయం వాటి అంతర్జాతీయ పరిధిని విస్తరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో అటువంటి ప్రయత్నాలపై తప్పనిసరిగా చర్చించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒకే పంటను సాగు చేయడం కంటే బహుళ పంటల సాగును ప్రోత్సహించాలనే తన విజ్ఞప్తిని పునరుద్ఘాటిస్తూ... దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాలు ఈ విషయంలో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని ప్రధానమంత్రి అంగీకరించారు. కేరళ, కర్ణాటకలోని కొండ ప్రాంతాలు బహుళ పంటల వ్యవసాయానికి ఉదాహరణగాని నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకే పొలంలో కొబ్బరి, వక్కలు, పండ్ల మొక్కలు పండిస్తూ, కింద సుగంధ ద్రవ్యాలు, నల్ల మిరియాలు పండిస్తున్నారని శ్రీ మోదీ తెలిపారు. చిన్న భూముల్లో ఇటువంటి సమగ్ర సాగు... సేంద్రియ వ్యవసాయ ప్రధాన తత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవసాయ నమూనాను దేశ వ్యాప్తంగా ప్రోత్సహించాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పద్ధతులను ఎలా అమలు చేయవచ్చో పరిశీలించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
దక్షిణ భారతం వ్యవసాయానికి విశ్వవిద్యాలయం వంటిదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆనకట్టలకు నిలయంగా ఉందనీ, కళింగరాయణ కాలువను 13వ శతాబ్దంలో ఇక్కడ నిర్మించారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ఆలయ చెరువులు వికేంద్రీకృత నీటి సంరక్షణ వ్యవస్థలకు నమూనాలుగా మారాయని ఆయన తెలిపారు. వేల సంవత్సరాల కిందట వ్యవసాయం కోసం నది నీటిని నియంత్రించడం ద్వారా ఈ భూమి శాస్త్రీయ నీటి ఇంజనీరింగ్‌కు మార్గదర్శకంగా నిలిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయంలో దేశానికి, ప్రపంచానికి నాయకత్వం ఈ ప్రాంతం నుంచే ఉద్భవిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అభివృద్ధి చెందిన భారత్ దార్శనికత కోసం భవిష్యత్ వ్యవసాయ వ్యవస్థను నిర్మించడానికి సమష్టి కృషి అవసరమన్న ప్రధానమంత్రి... "ఒక ఎకరం, ఒక సీజన్" విధానం ద్వారా రైతులు ఒక సీజన్‌లో ఒక ఎకరం పంటను సేంద్రియ వ్యవసాయం ద్వారా సాగు చేస్తూ, గమనించిన ఫలితాల ఆధారంగా ముందుకు సాగాలని కోరారు. సేంద్రియ వ్యవసాయాన్ని వ్యవసాయ పాఠ్యాంశాల్లో ఒక ప్రధాన భాగంగా చేయాలనీ, రైతుల పొలాలను ప్రత్యక్ష ప్రయోగశాలలుగా పరిగణించాలని ఆయన శాస్త్రవేత్తలు, పరిశోధనా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. "సేంద్రియ వ్యవసాయాన్ని పూర్తిగా సైన్స్ ఆధారిత ఉద్యమంగా మార్చడం మన లక్ష్యం" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ఈ ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కీలక పాత్ర పోషించాలని శ్రీ మోదీ సూచించారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో 10,000 ఎఫ్‌పీవోలు ఏర్పాటయినట్లు ఆయన పేర్కొన్నారు. వాటి మద్దతుతో చిన్న, సన్నకారు రైతుల సంఘాలను ఏర్పాటు చేయవచ్చు... శుభ్రపరచడం, ప్యాకేజింగ్, ప్రాసెసింగ్ కోసం సదుపాయాలను పొందవచ్చు... ఇ-నామ్ వంటి ఆన్‌లైన్ మార్కెట్‌లతో నేరుగా రైతులను అనుసంధానించవచ్చని ఆయన వివరించారు. సాంప్రదాయిక విజ్ఞానం, శాస్త్రీయ బలం, ప్రభుత్వ మద్దతు కలిసినప్పుడే రైతులు అభివృద్ధి చెందుతారనీ, భూమి తల్లి ఆరోగ్యంగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ శిఖరాగ్ర సమావేశం దేశంలో సేంద్రియ వ్యవసాయానికి దిశానిర్దేశం చేస్తుందనీ... ఈ వేదిక నుంచి కొత్త ఆలోచనలు, పరిష్కారాలు ఉద్భవిస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్. రవి, కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
ఈ నెల 19 నుంచి 21 వరకు జరుగుతున్న దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ సదస్సు-2025ను తమిళనాడు సేంద్రియ వ్యవసాయ వాటాదారుల వేదిక నిర్వహిస్తోంది. భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు కోసం సుస్థిరమైన, పర్యావరణ అనుకూలమైన, రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం... సేంద్రియ, పునరుత్పాదక వ్యవసాయం దిశగా పరివర్తనను వేగవంతం చేయడం ఈ సదస్సు లక్ష్యం.
రైతు-ఉత్పత్తిదారుల సంస్థలు, గ్రామీణ పారిశ్రామికవేత్తల కోసం మార్కెట్ లింకేజీలను సృష్టించడంపైనా ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. అదే సమయంలో సేంద్రియ ఇన్‌పుట్‌లు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల్లో ఆవిష్కరణలను సదస్సులో ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 50,000 మందికి పైగా రైతులు, సేంద్రియ వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, సేంద్రియ ఇన్‌పుట్ సరఫరాదారులు, విక్రేతలు, వాటాదారులు పాల్గొంటున్నారు.
(रिलीज़ आईडी: 2191862)
आगंतुक पटल : 5