యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
సర్దార్@150 ఐక్యతా మార్చ్ ఐక్య భారత్ హృదయస్పందన
పాదయాత్ర ద్వారా స్వచ్ఛత, స్వదేశీ, స్వయం-సమృద్ధిల సందేశం
సర్దార్ పటేల్ వారసత్వ వేడుకగా... యువ శక్తి జాతీయ ఉద్యమంగా 'ఐక్యతా మార్చ్'
జాతీయ మార్చ్‌కు ముందు దేశవ్యాప్తంగా నిర్వహించిన 842 పాదయాత్రల్లో పాల్గొన్న 10 లక్షలకు పైగా ప్రజలు
నవంబర్ 26 నుంచి ప్రారంభమై డిసెంబర్ 6న ముగియనున్న జాతీయ స్థాయి పాదయాత్ర : డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
प्रविष्टि तिथि:
18 NOV 2025 4:58PM by PIB Hyderabad
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ దేశ గౌరవాన్ని, దేశవ్యాప్తంగా పౌరులు, యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సర్దార్@150 ఐక్యతా మార్చ్ పాదయాత్రను ఎమ్‌వై భారత్ ద్వారా నిర్వహిస్తోంది. సర్దార్ పటేల్ ఆలోచనలు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వికసిత్ భారత్ దార్శనికత స్ఫూర్తిగా ఈ ప్రచారంలో ‘ఏక్ భారత్-ఆత్మనిర్భర్ భారత్’ ప్రధాన ఇతివృత్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
భారత ఉక్కు మనిషి అసమాన కృషి, శాశ్వత వారసత్వాన్ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండేళ్ల వేడుకల్లో (2024–2026) భాగంగా ఈ కార్యక్రమాన్ని 2025, అక్టోబర్ 6న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, యువజన వ్యవహారాలు, క్రీడల సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే ప్రారంభించారు.
డిజిటల్ కార్యకలాపాలతో ప్రారంభమైన ఈ ప్రచారంలో రీల్ పోటీ, వ్యాస రచన, సర్దార్@150 యంగ్ లీడర్స్ క్విజ్ నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో భాగంగా దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో... కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. జాతీయస్థాయి పాదయాత్రకు అనుగుణంగా గుజరాత్‌కు అన్ని జిల్లాల నుంచి జిల్లాస్థాయి ప్రతినిధుల యాత్రనూ నిర్వహిస్తున్నారు. రెండు నెలల పాటు జరిగే ఈ ప్రచార కార్యక్రమం 2025, డిసెంబర్ 6న ముగుస్తుంది.
ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ... ప్రస్తుతం జరుగుతున్న జిల్లా స్థాయి పాదయాత్రల పురోగతిని మీడియాకు వివరించారు. జాతీయస్థాయి పాదయాత్ర ముఖ్యాంశాలను వివరిస్తూ... “కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు... కచ్ నుంచి కోహిమా వరకు... లక్షలాది మంది జాతీయ ఐక్యత కోసం కలిసి నడిచారు. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని గౌరవించే వేడుక. అదే సమయంలో ఇది యువ శక్తిని జాతి నిర్మాణం, వికసిత్ భారత్ లక్ష్యం దిశగా మళ్లించే జాతీయ ఉద్యమం కూడా.” అన్నారు.
"గత కొన్ని నెలలుగా యావత్ దేశం ఒకే స్ఫూర్తితో కదులుతోంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు... తూర్పు నుంచి పడమర వరకు... మొత్తం 842 పాదయాత్రలు జరిగాయి. ఈ సంఖ్య కేవలం గణాంకాలు కాదు... ఐక్య భారత హృదయ స్పందనను సూచిస్తుంది. స్వచ్ఛత, స్వదేశీ, స్వయం-సమృద్ధిల సందేశం పాదయాత్ర ప్రధాన ఇతివృత్తంగా ఉంది" అని ఆయన అన్నారు.
యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే సైతం ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి డాక్టర్ పల్లవి జైన్ గోవిల్ మాట్లాడుతూ... డిజిటల్ దశ ముఖ్యాంశాలు, జిల్లా స్థాయి పాదయాత్రల సమయంలో విస్తృత స్థాయిలో జరిగిన జన సమీకరణను, త్వరలో జరగనున్న జిల్లాస్థాయి ప్రతినిధుల యాత్ర, జాతీయస్థాయి పాదయాత్రల రోడ్‌మ్యాప్‌ను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఇప్పటివరకు నిర్వహించిన జిల్లా-స్థాయి పాదయాత్రల ముఖ్యాంశాలు:
2025 అక్టోబర్ 31న ప్రారంభమైన జిల్లాస్థాయి పాదయాత్రలు దేశవ్యాప్తంగా అశేష జనాదరణతో సాగుతున్నాయి. అన్ని రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల్లో జిల్లా స్థాయి పాదయాత్రలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. 471 జిల్లాలు... 349 లోక్‌సభ... 329 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 842 పాదయాత్రలు (జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో) నిర్వహిస్తున్నారు. 10 లక్షలకు పైగా పౌరులు, 11,000 లకు పైగా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఎన్‌జీవోలు, యువజన సంస్థలు ఉత్సాహంగా ఈ యాత్రల్లో పాల్గొంటున్నాయి.
ఈశాన్య ప్రాంతంలో జరిగిన 96 పాదయాత్రల్లో 70,000 మందికి పైగా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో 14 పాదయాత్రలు నిర్వహించగా 17,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. లదాఖ్ ప్రాంతంలో నిర్వహించిన 3 పాదయాత్రల్లో 2,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. తమిళనాడులో 30, కేరళలో 11 పాదయాత్రలు జరిగాయి.
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ అత్యధిక జనసమీకరణ నమోదైంది. ఢిల్లీ, జునాగఢ్ (గుజరాత్), కియోంఝర్ (ఒడిశా), జైపూర్ (రాజస్థాన్)ల నుంచి వరుసగా 15,000, 12,000, 10,000 మందితో ప్రధాన సమావేశాలు జరిగాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జిల్లా స్థాయి పాదయాత్రతో పాటు అత్యధిక మంది భాగస్వామ్యాన్ని నిర్ధారించడం కోసం అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోనూ పాదయాత్రలు నిర్వహించారు.
పాల్గొన్నవారంతా ఆత్మనిర్భర్ భారత్, నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞలు చేయగా... పాదయాత్ర మార్గాల వెంట ఉంచిన స్వదేశీ ఉత్పత్తుల స్టాళ్లు ఆత్మనిర్భర్ భారత్ ఇతివృత్తాన్ని చాటుతూ స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాయి. సంస్థల స్థాయిలో ముందస్తు కార్యకలాపాలను చేపట్టడం ద్వారా ఎమ్‌వై భారత్ యూనిట్లతో పాటు, ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీ, ఇతర స్థానిక సంస్థలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నాయి.
గుజరాత్‌కు జిల్లాస్థాయి ప్రతినిధుల యాత్ర:
జిల్లా స్థాయిలో పాదయాత్రలు ముగిసిన తర్వాత ఢిల్లీ, జైపూర్, నాగపూర్, ముంబయి నుంచి ప్రారంభమై గంగా, యమునా, నర్మదా, గోదావరి పరివహాక ప్రాంతాల వెంట ప్రతి జిల్లా నుంచి జిల్లా ప్రతినిధులు జాతీయస్థాయి పాదయాత్రతో గుజరాత్ దిశగా సాగుతారు. సంబంధిత పరివాహక ప్రాంతాల పరిధిలోని ప్రతి జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు యాత్రలో చేరతారు. నాలుగు పరివాహక ప్రాంతాల వారు వేర్వేరు రోజుల్లో జాతీయ పాదయాత్రలో పాల్గొంటారు. ఈ దశలో యువత చర్చావేదికలు, శిక్షణా సంస్థల విస్తరణ, మార్కెట్ విస్తరణ, యోగా సెషన్‌లు, చెట్ల పెంపకం డ్రైవ్‌లు, పరిశుభ్రతా కార్యక్రమాల వంటి వరుస బహిరంగ కార్యకలాపాలు నిర్వహిస్తారు.
జాతీయస్థాయి పాదయాత్ర: 2025, నవంబరు 26 నుంచి డిసెంబరు 6 వరకు
ఈ జాతీయస్థాయి పాదయాత్ర నవంబర్ 26న సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ నివాసం అయిన కరమ్‌సద్ నుంచి ప్రారంభమై డిసెంబర్ 6న ఐక్యతా మూర్తి వద్ద ముగుస్తుంది. 11 రోజుల్లో దాదాపు 190 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర సాగుతుంది. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సహాయ మంత్రులు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ప్రతిరోజూ ఈ పాదయాత్రకు నాయకత్వం వహిస్తారు. ఈ దేశవ్యాప్త ఉద్యమంలో భాగం కావాలని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులనూ ఆహ్వానిస్తున్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం, వారసత్వం స్ఫూర్తిగా పది ఇతివృత్తాలను గురించి సర్దార్ సభల ద్వారా ప్రసంగించడానికి ప్రతిరోజూ కేబినెట్ మంత్రులు, ప్రముఖులు, జాతీయ నాయకులు వక్తలుగా పాల్గొంటారు. ప్రతి సాయంత్రం గ్రామసభలు నిర్వహిస్తారు. ఈ సమయంలో గ్రామ సంపర్క్ కార్యకలాపాలు జరుగుతాయి. ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలూ నిర్వహిస్తారు. ఈ పాదయాత్ర పూర్తిగా స్వదేశీ స్ఫూర్తిని, ఏక్ భారత్-ఆత్మనిర్భర్ భారత్ సందేశాన్నీ అందిస్తుంది.
ఈ మార్గంలో సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సమాజ భాగస్వామ్యంతో కూడిన 150 నేపథ్య స్టాప్‌లు ఏర్పాటు చేశారు. సహకార సంస్థలు, బార్దోలీ సత్యాగ్రహం, పరిపాలనా నాయకత్వం, రాజ్యాంగ దృక్పథం, చిన్న రాజ్యాల ఏకీకరణ వంటి ఇతివృత్తాలను 10 ప్రధాన సర్దార్ సభలు కవర్ చేస్తాయి.
పాదయాత్రలో పాల్గొనేవారు ప్రతిరోజూ 15-18 కిలోమీటర్లు నడవడంతో పాటు శాస్త్రీయ, జానపద ప్రదర్శనలు, ఐక్యతా స్ఫూర్తిని చాటే కళలు, సాంప్రదాయిక క్రీడలు, కీలకమైన ప్రభుత్వ పథకాల ప్రదర్శనలను తిలకిస్తారు. పాదయాత్ర మార్గంలోని సమీప గ్రామాల్లో ఎన్ఎస్ఎస్ విభాగాలు పాదయాత్ర సమయంలో సామాజిక అభివృద్ధి, అవగాహన కార్యకలాపాలను నిర్వహిస్తాయి.
రిజిస్ట్రేషన్లు సహా అన్ని కార్యకలాపాల వివరాలు ఎమ్‌వై భారత్ పోర్టల్ (సర్దార్@150 యూనిటీ మార్చ్)లో అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న యువత దైనందిన జీవితాల్లో, పౌర బాధ్యతల్లో ఏక్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ ఆదర్శాలను భాగం చేసుకుంటూ ఈ చరిత్రాత్మక ప్రచారంలో పేరు నమోదు చేసుకుని చురుగ్గా పాల్గొనాలని ప్రోత్సహిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2191485)
आगंतुक पटल : 9