జౌళి మంత్రిత్వ శాఖ
పీఎల్ఐ పథకం కింద 17 కొత్త దరఖాస్తులకు జౌళి శాఖ ఆమోదం
ఎంఎంఎఫ్‌కీ, సాంకేతిక వస్త్ర రంగానికీ దన్ను
Posted On:
18 NOV 2025 3:50PM by PIB Hyderabad
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకంలో భాగంగా మూడో దశలో- 17 కొత్త దరఖాస్తులకు జౌళి శాఖ ఆమోదాన్ని తెలిపింది. ఈ ముఖ్య నిర్ణయం పెట్టుబడిని మరింత ప్రోత్సహించి దేశీయ తయారీకి దన్నుగా నిలవనుంది. చేనేత దుస్తులు, చేనేత వస్త్రాలతో పాటు సాంకేతిక వస్త్ర రంగాల్లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీని ఈ నిర్ణయం బలోపేతం చేస్తుంది.
కొత్తగా ఆమోదం లభించిన సంస్థలు రూ.2,374 కోట్ల పెట్టుబడుల్ని పెట్టడానికి సిద్ధమయ్యాయి. ఆ సంస్థలు ఏర్పాటు చేసే ప్రాజెక్టుల వల్ల రూ.12,893 కోట్ల అమ్మకాలకు అవకాశం ఉండవచ్చనీ, దాదాపు 22,646 మందికి ఉపాధి లభించవచ్చనీ అంచనా.
వస్త్ర పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని, పీఎల్ఐ పథకాన్ని 2021 సెప్టెంబరు 24 నుంచి అమల్లోకి తెచ్చారు. చేనేత దుస్తులు, వస్త్రాలతో పాటు సాంకేతిక వస్త్ర ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడానికి రూ.10,683 కోట్లు ఖర్చు చేసేందుకు సమ్మతిని తెలిపారు. మన దేశ జౌళి పరిశ్రమ అవసరమైనంత మేరకు ఎదగడమే కాక విస్తృత ఫలితాల్ని సాధించి, ప్రపంచ స్థాయిలో పోటీపడగలుగుతూ, తగినంత మందికి ఉద్యోగ అవకాశాల్ని కల్పించాలనేదే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడంలో ముఖ్యోద్దేశం. ఈ పథకం కింద మొదటి రెండు విడతల ఎంపికల్లో 74 దరఖాస్తులకు ఆమోదం తెలిపారు.
పరిశ్రమ భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని ఈ పథకంలో ప్రధాన సవరణలను ఇటీవలే నోటిఫై చేశారు. కొత్త దరఖాస్తుల్ని స్వీకరించడానికి ఆన్‌లైన్ దరఖాస్తు పోర్టల్‌ను ఈ సంవత్సరం డిసెంబరు 31 వరకూ మరో సారి అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఆసక్తి గల కంపెనీలు ఈ పథకంలో పాలుపంచుకోవడానికి https://pli.texmin.gov.in/ లో దరఖాస్తు చేయొచ్చు.
***
(Release ID: 2191278)
Visitor Counter : 4