ప్రధాన మంత్రి కార్యాలయం
రామ్‌నాథ్ గోయెంకా 6వ ఉపన్యాసం ఇచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
అభివృద్ధి చెందిన, స్వావలంబన దేశంగా మారేందుకు భారత్ ఆరాటం: పీఎం
భారత్ కేవలం అభివృద్ధి చెందుతున్న మార్కెట్ మాత్రమే కాదు.. ఇది అభివృద్ధికి నమూనా: పీఎం
ఇవాళ భారత్ అభివృద్ధి నమూనాని నమ్మకమైనదిగా చూస్తున్న ప్రపంచం: పీఎం
ప్రతి లబ్ధిదారుడికీ పథకాల ప్రయోజనాలు... సంపూర్ణత దిశగా నిరంతర కృషి: పీఎం
నూతన జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషల్లో విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత: పీఎం
Posted On:
17 NOV 2025 9:54PM by PIB Hyderabad
ఇవాళ న్యూఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక ‘‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’’ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ… రామ్‌నాథ్ గోయెంకా ఆరో ఉపన్యాసాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ... దేశంలో ప్రజాస్వామ్యం, జర్నలిజం, భావవ్యక్తీకరణ, ప్రజా ఉద్యమాల శక్తిని పెంచిన మహోన్నత వ్యక్తిని గౌరవించడంలో భాగంగా మనమంతా ఇక్కడ సమావేశమైనట్లు తెలిపారు. రామ్‌నాథ్ గోయెంకా.. దార్శనికత కలిగిన వ్యక్తి, సంస్థ స్థాపకుడు, జాతీయవాది, మీడియా నాయకుడని ప్రధానమంత్రి కొనియాడారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థను కేవలం వార్తాపత్రికగా కాకుండా భారత ప్రజల కోసం ఒక యజ్ఞంలా ప్రారంభించారన్నారు. రామ్‌నాథ్ నాయకత్వంలో ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల గొంతుకగా ఈ సంస్థ మారిందని స్పష్టం చేశారు. 21వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన భారత్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, రామ్‌నాథ్ గోయెంకా నిబద్ధత, కృషి, దార్శనికత స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. ఉపన్యాసం ఇచ్చేందుకు తనను ఆహ్వానించిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థకు ధన్యవాదాలు చెప్పిన ప్రధానమంత్రి.. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
భగవద్గీతలోని ఒక శ్లోకం నుంచి రామ్‌నాథ్ గోయెంకా స్ఫూర్తిని పొందారని, దాని ప్రకారం సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, గెలుపోటములను సమానంగా చూస్తూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటమనేవి ఆయన జీవితంలోనూ, పనిలోనూ అంతర్లీనంగా కనిపిస్తాయన్నారు.ఈ సిద్ధాంతాన్ని రామ్‌నాథ్ గోయెంకా జీవితాంతం పాటించారని, అన్నిటికంటే కర్తవ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చారని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన రామ్‌నాథ్ గోయెంకా, తర్వాత జనతా పార్టీలో చేరారని, జనసంఘ్ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేసినట్లు చెప్పారు. ఆయన భావజాలం ఏదైనప్పటికీ, జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చేవారన్నారు. రామ్‌నాథ్ గారితో పనిచేసిన వారు, ఆయన చెప్పిన వాటిని స్మరించుకుంటారని ప్రధానమంత్రి తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో రజాకార్లు దౌర్జన్యం చేసినపుడు సర్దార్ పటేల్‌కు రామ్‌నాథ్ సహకరించిన పరిస్థితుల్ని గుర్తు చేశారు. 1970లో బీహార్ విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం అవసరమైనప్పుడు నానాజీ దేశ్‌ముఖ్‌తో కలిసి శ్రీ జయప్రకాశ్ నారాయణ్‌ను ఉద్యమానికి నాయకత్వం వహించాలని రామ్‌నాథ్ గారు ఒప్పించారని తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో, నాటి ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితులైన మంత్రుల్లో ఒకరు రామ్‌నాథ్ గారిని పిలిపించి జైలు శిక్ష విధిస్తామని బెదిరించినప్పుడు, ఆయన చెప్పిన ధైర్యవంతమైన సమాధానం చరిత్రపుటల్లో రహస్యంగా ఉందన్నారు. ఈ కథనాల్లో కొన్ని బయట ప్రపంచానికి తెలిసినా, మరికొన్ని తెలియకపోయినా, అవన్నీ రామ్‌నాథ్ గారి నిజాయితీని నిలబెట్టాలనే నిబద్ధతను, ఎవరికీ భయపడకుండా తన కర్తవ్యానికి కట్టుబడి ఉండే స్థిర వైఖరిని ప్రతిబింబిస్తాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
రామ్‌నాథ్ గోయెంకాని అసహనంతో ఉండే వ్యక్తిగా వర్ణించేవారని అయితే అది ప్రతికూల కోణంలో కాదని, సానుకూల విధానమని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. మార్పు కోసం అత్యున్నత స్థాయిలో కృషి చేసే అసహనం, స్తంభించిపోయిన నీటిని కూడా కదిలించే అసహనమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఒక పోలికను ప్రస్తావిస్తూ, "నేటి భారతదేశం కూడా అసహనంతో ఉంది… అభివృద్ధి చెందటానికి, స్వయం సమృద్ధి సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది" అని అన్నారు. 21వ శతాబ్దంలో మొదటి ఇరవై ఐదేళ్లు చాలా వేగంగా గడిచిపోయాయని, ఒకదాని తర్వాత మరో సవాలు ఎదురవుతూనే ఉన్నప్పటికీ, అవి భారత్ వృద్ధిని ఆపలేకపోయాయని అన్నారు.
గడిచిన నాలుగైదేళ్లు ప్రపంచం సవాళ్లతో నిండిపోయిందనీ, 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను అస్థిరపరిచి, అనిశ్చితిని సృష్టించిందని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమై జనం అగాధంలోకి పడిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పరిస్థితులు చక్కదిద్దుకుంటున్న సమయంలో, పొరుగు దేశాల్లో సంక్షోభం తలెత్తిందని, ఇన్ని సవాళ్ల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి రేటును సాధించి, స్థిరత్వాన్ని ప్రదర్శించిందని వెల్లడించారు. 2022లో వచ్చిన ఐరోపా సంక్షోభం వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, ఇంధన మార్కెట్లు ప్రభావితం కాగా, మొత్తం ప్రపంచంపై ఈ ప్రభావం పడిందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో 2023లో పరిస్థితులు క్షీణించినప్పటికీ, భారత్ వృద్ధి పథంలో నిలిచిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అశినిశ్చితి ఉన్నప్పటికీ, ఈ ఏడాది కూడా దేశ వృద్ధి రేటు సుమారు 7 శాతంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
"అస్థిర పరిస్థితుల దృష్ట్యా ప్రపంచం జంకుతున్న తరుణంలో, ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది" అని ప్రధానమంత్రి తెలిపారు. "భారత్ కేవలం అభివృద్ధి చెందుతున్న మార్కెట్ మాత్రమే కాదు.. ఇది అభివృద్ధికి నమూనా" అని స్పష్టం చేశారు. ఇవాళ భారత్ అభివృద్ధి నమూనాని విశ్వసనీయమైనదిగా ప్రపంచం చూస్తోందన్నారు.
బలమైన ప్రజాస్వామ్యాన్ని అనేక ప్రమాణాల ఆధారంగా పరీక్షిస్తారని, వాటిలో అత్యంత ముఖ్యమైనది ప్రజల భాగస్వామ్యమని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నమ్మకం, ఆశావాదం ఎన్నికల సమయంలో స్పష్టమవుతుందన్నారు. నవంబర్ 14న ప్రకటించిన ఫలితాలు చరిత్రాత్మకమైనవని, ప్రజల భాగస్వామ్యం పెరగటాన్ని ఏ ప్రజాస్వామ్యమూ నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు. బీహార్ చరిత్రలోనే ఈసారి అత్యధిక ఓటింగ్ నమోదైందని, అందులోనూ మహిళల ఓటింగ్ శాతం పురుషుల కంటే సుమారు తొమ్మిది శాతం ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఇది కూడా ప్రజాస్వామ్య విజయమేనని ఆయన స్పష్టం చేశారు.
బీహార్ ఎన్నికల ఫలితాలు మరోసారి భారత ప్రజల ఉన్నతమైన ఆకాంక్షలను ప్రదర్శించాయని ప్రధానమంత్రి అన్నారు. తమ ఆకాంక్షలను నెరవేర్చడానికి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడానికి నిజాయితీతో పనిచేసే రాజకీయ పార్టీలపైనే నేడు ప్రజలు తమ విశ్వాసాన్ని ఉంచుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వారి భావజాలం - అది అతివాదమైనా, మితవాదమైనా, మధ్యస్తమైనా - బీహార్ ఫలితాల నుంచి పాఠాన్ని గ్రహించాలని ప్రధానమంత్రి కోరారు. ఈ రోజు అందించే పాలనా విధానం, రాబోయే సంవత్సరాల్లో రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. బీహార్ ప్రజలు 15 సంవత్సరాలపాటు ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారని, రాష్ట్ర అభివృద్ధికి గణనీయంగా తోడ్పడే అవకాశం ఉన్నప్పటికీ, వారు ఆటవిక పాలన మార్గాన్ని ఎంచుకున్నారని ఆయన అన్నారు. ఈ నమ్మక ద్రోహాన్ని బీహార్ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వమైనా లేక రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలైనా వాటి అత్యధిక ప్రాధాన్యత అభివృద్ధికి మాత్రమే, కేవలం అభివృద్ధికి మాత్రమే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మెరుగైన పెట్టుబడి వాతావరణం సృష్టించడంలోనూ, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంలోనూ, అభివృద్ధి సూచీలను ముందుకు తీసుకెళ్లడంలోనూ పరస్పరం పోటీపడాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రీ మోదీ పిలుపునిచ్చారు. ఇటువంటి ప్రయత్నాలు ప్రజల విశ్వాసాన్ని చూరగొంటాయని ఆయన తెలిపారు.
బీహార్ ఎన్నికల విజయం తరువాత, తమను సమర్ధించే కొందరు మీడియా ప్రముఖులు సహా కొంతమంది వ్యక్తులు బీహార్ ఎన్నికల విజయం తరువాత, తాము, తమ పార్టీ, నిరంతర ఎన్నికలే అన్నట్లుగా పనిచేస్తున్నామన్నారని శ్రీ మోదీ గుర్తుచేశారు. అయితే ఎన్నికల్లో గెలవడానికి ఎన్నికలే పని అన్నట్లుగా ఉండాల్సిన అవసరం లేదని, నిరంతరం మానసిక భావోద్వేగంలో ఉంటే చాలన్నది తన సమాధానమని ఆయన చెప్పారు. ఒక నిమిషం కూడా వృథా చేయకుండా పేదల కష్టాలను తగ్గించాలని, ఉపాధి కల్పించాలని, ఆరోగ్య సేవల్ని అందించాలని, మధ్యతరగతి ఆకాంక్షలను నెరవేర్చాలని మనసులో తపన ఉన్నప్పుడు నిరంతర శ్రమ సహజంగానే ముందుకు నడిపే శక్తిగా మారుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ భావోద్వేగంతోనూ, నిబద్ధతతోనూ పాలన సాగిస్తే దాని ఫలితాలు ఎన్నికల రోజున, ఇప్పుడు బీహార్‌లో చూసినట్లుగా కనిపిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.
శ్రీ రామనాథ్ గోయెంకా విదిశ నుంచి జనసంఘ్ టికెట్ పొందిన సందర్భంగా జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ, అప్పుడు రామనాథ్, నానాజీ దేశ్‌ముఖ్‌ల మధ్య సంస్థ ముఖ్యమా, వ్యక్తి ముఖ్యమా అనే అనే చర్చ జరిగిందని, నామినేషన్ దాఖలు చేయడానికి, తరువాత విజయ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవడానికి మాత్రమే రామనాథ్ వస్తే చాలని నానాజీ దేశ్‌ముఖ్ ఆయనతో చెప్పారని శ్రీ మోదీ పేర్కొన్నారు.
అనంతరం నానాజీ పార్టీ కార్యకర్తల ద్వారా ప్రచారాన్ని నడిపించి, రామనాథ్ కు గెలుపు అందించారని, ఈ కథను పంచుకోవడంలో తన ఉద్దేశం కేవలం అభ్యర్థులు నామినేషన్లు మాత్రమే దాఖలు చేయాలని సూచించడం కాదని, పార్టీలోని లెక్కలేనంత మంది కార్యకర్తల నిబద్ధతను తెలియజేయడమే అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. లక్షలాది మంది కార్యకర్తలు తమ స్వేదంతో తమ పార్టీలను పోషించారని, ఇప్పటికీ అలాగే చేస్తున్నారని ఆయన చెప్పారు. కేరళ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలలో, వందలాది మంది కార్యకర్తలు పార్టీ కోసం తమ రక్తాన్ని కూడా త్యాగం చేశారని ఆయన తెలిపారు. అంతటి నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీకి కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే లక్ష్యం కాదని, నిరంతర సేవ ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకోవడమే లక్ష్యమని శ్రీ మోదీ పేర్కొన్నారు.
దేశ అభివృద్ధికి దాని ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ చేరడం అత్యవసరమని స్పష్టం చేస్తూ, ప్రభుత్వ పథకాలు దళితులు, అణగారిన వర్గాలు, దోపిడీకి గురైన వారు, వెనుకబడిన వారికి చేరినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ప్రధానమంత్రి అన్నారు. గత దశాబ్దాలలో, సామాజిక న్యాయం పేరుతో, కొన్ని పార్టీలు, కుటుంబాలు తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకున్నాయని ఆయన విమర్శించారు.
సామాజిక న్యాయం వాస్తవ రూపంలోకి మారడాన్ని ఈ రోజు దేశం చూస్తోందని ఆయన సంతృప్తి చేశారు. 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉదాహరణగా పేర్కొంటూ, వీటి వల్ల ఇంతవరకు బహిరంగ ప్రదేశాల్లో విసర్జన చేయాల్సిన పరిస్థితిలో ఉన్న కోట్లాది మందికి గౌరవం లభించిందని చెప్పారు. గత ప్రభుత్వాలు బ్యాంక్ ఖాతాకు కూడా అర్హులుగా పరిగణించని వారికి 57 కోట్ల జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు ఆర్థిక భాగస్వామ్యాన్ని అందించాయని ఆయన పేర్కొన్నారు. 4 కోట్ల పక్కా గృహాలు పేదలకు కొత్త కలలు కనే శక్తిని ఇచ్చాయని, ప్రమాదాలు ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచాయని ఆయన తెలిపారు.
గత 11 సంవత్సరాలలో సామాజిక భద్రతపై చేసిన కృషి అద్భుతమైనదని, దశాబ్దం కిందట కేవలం 25 కోట్ల మంది మాత్రమే సామాజిక భద్రత పరిధిలో ఉండేవారని, అయితే నేడు దాదాపు 94 కోట్ల మంది భారతీయులు ఆ పరిధిలో ఉన్నారని ప్రధానమంత్రి ప్రముఖంగా తెలిపారు. ఇదే నిజమైన సామాజిక న్యాయం అని ఆయన అన్నారు. ప్రభుత్వం సామాజిక భద్రతా పరిధిని విస్తరించడమే కాకుండా, అర్హులైన లబ్ధిదారులలో ఎవరినీ వదలకుండా చూసే 'సంతృప్త' లక్ష్యంతో కూడా పనిచేస్తోందని శ్రీ మోదీ చెప్పారు. ప్రతి లబ్ధిదారుడి వద్దకు చేరే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసినప్పుడు, వివక్షకు ఎటువంటి అవకాశం ఉండదని ఆయన అన్నారు. ఇటువంటి ప్రయత్నాల ఫలితంగా, గత 11 సంవత్సరాలలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారని, ఈ కారణంగానే 'ప్రజాస్వామ్యం ఫలితాలను ఇస్తుంది' అని నేడు ప్రపంచం అంగీకరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మరో ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని అధ్యయనం చేయాలని ఆయన ప్రజలను కోరారు, దేశంలోని 100కు పైగా జిల్లాలను గత ప్రభుత్వాలు వెనుకబడినవిగా ముద్ర వేసి, నిర్లక్ష్యం చేశాయని ఆయన గుర్తు చేశారు. ఈ జిల్లాలను అభివృద్ధి చేయడం చాలా కష్టమని భావించేవారని, అక్కడ నియమితులైన అధికారులను శిక్షకు గురైనవారిగా చూసేవారని ఆయన తెలిపారు. ఈ వెనుకబడిన జిల్లాల్లో 25 కోట్ల మందికి పైగా పౌరులు నివసిస్తున్నారని, ఇది సమ్మిళిత అభివృద్ధి ప్రాముఖ్యతను తెలియచేస్తుందని అన్నారు.
ఈ వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి చెందకుండా ఉండి ఉంటే, భారతదేశం రాబోయే వంద సంవత్సరాలలో కూడా అభివృద్ధిని సాధించలేకపోయేదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అందుకే ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అనుసరించిందని, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములను చేసి, ప్రతి జిల్లా ఏ అభివృద్ధి అంశాలలో వెనుకబడి ఉందో తెలుసుకోవడానికి సమగ్ర అధ్యయనాలు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఈ అధ్యయనాల ఆధారంగా, ప్రతి జిల్లాకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించినట్టు ప్రధాని చెప్పారు. దేశంలో అత్యుత్తమ అధికారులను - మెరుగైన ప్రతిభ, వినూత్న ఆలోచనలు కలిగిన వారిని - ఆయా ప్రాంతాల్లో నియమించామని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ జిల్లాలను ఇక వెనుకబడినవిగా కాకుండా, ఆకాంక్ష జిల్లాలుగా పునర్నిర్వచించారని, నేడు, ఈ జిల్లాల్లో చాలా జిల్లాలు ఆయా రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల కంటే పలు అభివృద్ధి సూచీలలో ముందంజలో నిలుస్తున్నాయని వివరించారు.
చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ను ఉదాహరణగా పేర్కొంటూ, ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి పాత్రికేయులకు ఒకప్పుడు పరిపాలనా అధికారుల నుంచి కంటే ప్రభుత్వేతర సంస్థల నుంచి అనుమతులు ఎక్కువగా అవసరమయ్యేవని శ్రీ మోదీ గుర్తు చేశారు. నేడు, అదే బస్తర్ అభివృద్ధి మార్గంలో పురోగమిస్తోందని, బస్తర్ ఒలింపిక్స్‌కు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఎంత ప్రచారం ఇచ్చిందో సరిగా చెప్పలేను గానీ బస్తర్ యువత ఇప్పుడు ఒలింపిక్స్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరు చూసి శ్రీ రామనాథ్ గోయెంకా చాలా సంతోషించేవారని ఆయన అన్నారు.
బస్తర్ గురించి చర్చించినప్పుడు, నక్సలిజం లేదా మావోయిస్టు తీవ్రవాదం సమస్యను కూడా పరిష్కరించడం అత్యవసరం అని ప్రధానమంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు. నక్సలిజం ప్రభావం దేశవ్యాప్తంగా తగ్గిపోతున్నప్పటికీ, అది ప్రతిపక్ష పార్టీలో సజీవంగా ఉందని ఆయన అన్నారు. గత ఐదు దశాబ్దాలుగా, భారతదేశంలోని దాదాపు ప్రతి ప్రధాన రాష్ట్రం మావోయిస్ట్ తీవ్రవాదంచే ప్రభావితమైందని ఆయన పేర్కొన్నారు.
బస్తర్ గురించి మాట్లాడేటప్పుడు నక్సలిజం అంటే మావోయిస్టు తీవ్రవాదం గురించి ప్రస్తావించడం అవసరమని శ్రీ మోదీ అన్నారు. దేశంలో నక్సలిజం ప్రభావం తగ్గిపోతున్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీలలో మాత్రం అది ఎక్కువగా కనిపిస్తోందని, గత అయిదు దశాబ్దాలుగా భారతదేశంలోని దాదాపు ప్రతి ప్రధాన రాష్ట్రం మావోయిస్టు తీవ్రవాదంతో ప్రభావితమైందని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని తిరస్కరించే మావోయిస్టు తీవ్రవాదాన్ని ప్రతిపక్షం పోషిస్తూనే ఉండటం పట్ల ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. వారు మారుమూల అటవీ ప్రాంతాలలో నక్సలిజాన్ని సమర్థించడమే కాకుండా, పట్టణ కేంద్రాలలో, ప్రధాన సంస్థలలో కూడా అది వేళ్లూనుకోవడానికి సహాయం చేశారని ఆయన తెలిపారు.
10 - 15 సంవత్సరాల కిందటే పట్టణ నక్సల్స్ ప్రతిపక్షంలో లోతుగా పాతుకుపోయారని, నేడు వారు ఆ పార్టీని తాను పేర్కొన్న విధంగా "ముస్లిం లీగ్–మావోయిస్ట్ కాంగ్రెస్" (ఎంఎంసీ) అని మార్చేశారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఎంఎంసీ తన స్వార్థపూరిత ఉద్దేశాల కోసం జాతీయ ప్రయోజనాలను విస్మరించిందని, దేశ ఐక్యతకు ముప్పుగా మారుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో, శ్రీ రామనాథ్ గోయెంకా వారసత్వం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని ప్రధానమంత్రి అన్నారు. బ్రిటిష్ వలస పాలనను ఆయన ఎంత తీవ్రంగా వ్యతిరేకించారో గుర్తు చేస్తూ, "బ్రిటీష్ వారి ఆదేశాలను పాటించే బదులు నేను వార్తాపత్రికను మూసివేస్తాను" అని ఆయన చేసిన సంపాదకీయ ప్రకటనను శ్రీ మోదీ ఉదహరించారు. ఎమర్జెన్సీ సమయంలో, దేశాన్ని మరోసారి బానిసత్వంలోకి నెట్టడానికి ప్రయత్నం జరిగినప్పుడు, రామనాథ్ గారు దృఢంగా నిలబడ్డారని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ సంవత్సరంతో ఎమర్జెన్సీకి యాభై సంవత్సరాలు పూర్తవుతుందని గుర్తు చేస్తూ, అప్పుడు ఖాళీ సంపాదకీయాలతో కూడా ప్రజలను బానిసలుగా చేయాలనుకున్న ఆలోచనను సవాలు చేయగలదని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' నిరూపించిందని ఆయన తెలిపారు.
బానిసత్వ మనస్తత్వం నుంచి భారతదేశాన్ని విముక్తం చేసే అంశంపై తాను వివరంగా మాట్లాడతానని ప్రధానమంత్రి తెలిపారు. దీనికి 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామం కంటే ముందు, 190 సంవత్సరాల వెనుకకు, అంటే 1835 సంవత్సరానికి వెళ్లాలని ఆయన అన్నారు. ఆ సమయంలోనే బ్రిటిష్ ఎంపీ థామస్ బాబింగ్టన్ మెకాలే భారతదేశాన్ని దాని సాంస్కృతిక పునాదుల నుంచి పెకలించడానికి ఒక పెద్ద ప్రచారాన్ని ప్రారంభించారని ఆయన చెప్పారు. భారతీయులుగా కనిపిస్తూ బ్రిటిష్ వారిలా ఆలోచించే భారతీయులను సృష్టించడమే తన ఉద్దేశమని మెకాలే ప్రకటించారని, ఇందుకోసం ఆయన భారత విద్యా వ్యవస్థను కేవలం మార్చడమే కాకుండా దానిని పూర్తిగా నాశనం చేశారని తెలిపారు.
భారతదేశ ప్రాచీన విద్యావ్యవస్థ ఒక అందమైన వృక్షమని, దానిని పెకలించి నాశనం చేశారని మహాత్మాగాంధీ చెప్పిన మాటలను ప్రధానమంత్రి ఉటంకించారు. భారతదేశ సంప్రదాయ విద్యావ్యవస్థ సంస్కృతి పట్ల గర్వాన్నిచ్చిందనీ, విద్యకు, నైపుణ్యాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చిందనీ అంటూ, అయితే మెకాలే దానిని నిర్మూలించడానికి ప్రయత్నించారని, అందులో విజయం కూడా సాధించారని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆ కాలంలో బ్రిటిష్ భాషకు, ఆలోచనకు ఎక్కువ గుర్తింపు లభించేలా మెకాలే చూశారని, తదనంతర శతాబ్దాలలో భారతదేశం దీనికి మూల్యం చెల్లించిందని ఆయన తెలిపారు. మెకాలే భారతదేశ ఆత్మవిశ్వాసాన్ని ఛిద్రం చేశారని, న్యూనతా భావాన్ని నింపివేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఒకే దెబ్బతో, ఆయన వేల సంవత్సరాల భారతదేశ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, కళను, సంస్కృతిని, మొత్తం జీవన విధానాన్ని పక్కన పెట్టారని ఆయన అన్నారు.
విదేశీ పద్ధతుల ద్వారా మాత్రమే పురోగతి, గొప్పతనాన్ని సాధించగలమనే నమ్మకానికి బీజాలు నాటిన క్షణం ఆదేనని చెబుతూ, ఈ మనస్తత్వం స్వాతంత్ర్యం తరువాత మరింత బలపడిందని శ్రీ మోదీ అన్నారు. భారతదేశ విద్య, ఆర్థిక వ్యవస్థ, సామాజిక ఆకాంక్షలు విదేశీ నమూనాలకు మరింత అనుగుణంగా మారాయని ఆయన తెలిపారు. దేశీయ వ్యవస్థలపై గౌరవం తగ్గిపోయిందని, మహాత్మాగాంధీ వేసిన స్వదేశీ పునాది చాలా వరకు మరుగునపడిందని ప్రధానమంత్రి అన్నారు. పాలనా నమూనాలను విదేశాలలో అన్వేషించడం ప్రారంభమైందని, ఆవిష్కరణల కోసం విదేశాల వైపు చూశారని ఆయన పేర్కొన్నారు. ఈ మనస్తత్వం దిగుమతి చేసుకున్న ఆలోచనలు, వస్తువులు, సేవలను ఉన్నతంగా పరిగణించే సామాజిక ధోరణికి దారితీసిందని ఆయన తెలిపారు.
ఒక దేశం తనను తాను గౌరవించుకోనప్పుడు... అది మేడ్ ఇన్ ఇండియా తయారీ వ్యవస్థతో సహా దాని దేశీయ సహజ వ్యవస్థను కూడా తిరస్కరిస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పర్యాటకాన్ని ఒక ఉదాహరణగా పేర్కొంటూ, పర్యాటకం అభివృద్ధి చెందిన ప్రతి దేశంలోనూ, ప్రజలు తమ చారిత్రక వారసత్వం పట్ల గర్వపడుతున్నారని, దీనికి విరుద్ధంగా, స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో తమ సొంత వారసత్వాన్ని తిరస్కరించే ప్రయత్నాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. వారసత్వంపై గర్వం లేకపోతే, దానిని సంరక్షించాలనే ఉద్దేశం కూడా ఉండదని, సంరక్షణ లేకపోతే, అలాంటి వారసత్వం కేవలం ఇటుక, రాతి శిథిలాలకే పరిమితం అవుతుందని ఆయన పేర్కొన్నారు. వారసత్వాన్ని చూసి గర్వపడటం పర్యాటక రంగం వృద్ధికి తప్పనిసరని ఆయన ఉద్ఘాటించారు.
స్థానిక భాషల అంశాన్ని ప్రస్తావిస్తూ, మరే దేశమైనా తన సొంత భాషలను అవమానిస్తోందా అని ప్రధానమంత్రి ప్రశ్నించారు. జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు అనేక పాశ్చాత్య పద్ధతులను అవలంబించినప్పటికీ, తమ మాతృభాషలపై ఎప్పుడూ రాజీ పడలేదని ఆయన గుర్తు చేశారు. అందుకే కొత్త జాతీయ విద్యా విధానం స్థానిక భాషలలో విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని, కానీ భారతీయ భాషలకు గట్టిగా మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.
భారతదేశ సాంస్కృతిక, విద్యా పునాదులకు వ్యతిరేకంగా మెకాలే చేసిన నేరానికి 2035 నాటికి 200 సంవత్సరాలు పూర్తవుతాయని అంటూ, వచ్చే పదేళ్లలో మెకాలే నింపిన బానిసత్వ ఆలోచన నుంచి ముక్తి పొందడానికి దేశ ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. మెకాలే ప్రవేశపెట్టిన దుర్మార్గాలను, సామాజిక బాధలను రాబోయే దశాబ్దంలో పూర్తిగా నిర్మూలించాలని ఆయన ఉద్ఘాటించారు.
అనేక ముఖ్యమైన అంశాలను చర్చించినందున ఇక ఎక్కువ సమయాన్ని తీసుకోనని ప్రధాని అన్నారు. దేశంలో ప్రతి మార్పునకు , అభివృద్ధి కథకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ సాక్షిగా ఉందని ఆయన అభినందించారు. ‘అభివృద్ధి చెందిన దేశం‘ లక్ష్య సాధన దిశగా భారత్ ప్రయాణంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ భాగస్వామ్యాన్ని స్వాగతించారు. రామనాథ్ గోయెంకా ఆదర్శాలను పరిరక్షించడంలో నిబద్ధతతో కృషి చేస్తున్నందుకు 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' బృందాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.
***
MJPS/SR
(Release ID: 2191215)
Visitor Counter : 5