హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఫరీదాబాద్‌లో ఉత్తర ప్రాంతీయ మండలి 32వ సమావేశం


ఢిల్లీలో ఇటీవల జరిగిన కారు బాంబు పేలుడు, జమ్మూ కాశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించిన మంత్రులు, అధికారులు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని మూలాల నుంచి నిర్మూలించేందుకు సామూహిక నిబద్ధతతో ఉండాలి: హోం మంత్రి

ఢిల్లీ బాంబు పేలుడుకు పాల్పడిన దోషులు పాతాళంలో ఉన్న వెలికితీస్తాం: హోం మంత్రి

వారికి సాధ్యమైనంత కఠినమైన శిక్ష పడేలా చూసుకుంటాం

చర్చలు, సహకారం, సమన్వయం, విధాన సమన్వయానికి ప్రాంతీయ మండళ్లు చాలా ముఖ్యం

'బలమైన రాష్ట్రాల ద్వారానే బలమైన దేశం' అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషిస్తోన్న ప్రాంతీయ మండళ్లు

ప్రతి రంగంలోనూ భారత్‌ ప్రపంచ నాయకత్వ స్థానాన్ని పొందటం.. జాతీయ పురోగతితో పాటు ప్రాంతీయ సామర్థ్యాన్ని సాధించటం మన లక్ష్యాలు

2004–14 కాలంతో పోలిస్తే 2014 నుంచి 2025 వరకు దాదాపు రెండున్నర రెట్లు పెరిగిన ప్రాంతీయ మండళ్ల సమావేశాలు

ఇప్పటివరకు 1600 సమస్యలను చర్చించిన ప్రాంతీయ మండళ్ల సమావేశాలు

వీటిలో 1303 సమస్యలు (దాదాపు 81.43 శాతం) పరిష్కారం

మహిళలు, పిల్లల భద్రత మనకు ప్రధానం.. ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల సంఖ్యను మరింతగా పెంచాలి

సహకారం, వ్యవసాయం, మత్స్య సంపద ద్వారా పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు పెంపు జరుగుతోంది: శ్రీ అమిత్ షా

Posted On: 17 NOV 2025 7:08PM by PIB Hyderabad

ఇవాళ హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన 32వ ఉత్తర ప్రాంతీయ మండలి (ఎన్‌జెడ్‌సీ) సమావేశానికి కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ, పంజాబ్ ముఖ్యమంత్రి శ్రీ భగవంత్ మాన్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సుఖ్విందర్ సింగ్ సుఖు, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవీందర్ గుప్తా కూడా హాజరయ్యారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ మంత్రులు, కేంద్ర హోం కార్యదర్శి, అంతర్రాష్ట్ర మండలి కార్యదర్శి, సభ్య రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు- సలహాదారులు.. రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు- విభాగాల సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఢిల్లీలో ఇటీవల జరిగిన కారు బాంబు పేలుడు, జమ్మూ కాశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారికి సమావేశం ప్రారంభంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. కేంద్ర హోం శాఖ మంత్రి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని మూలాల నుంచి నిర్మూలించేందుకు సామూహిక నిబద్ధతతో ఉండాలని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వానికి ఉన్న గత ట్రాక్ రికార్డు ప్రకారమే ఈ సారి కూడా ఢిల్లీ బాంబు పేలుడుకు పాల్పడిన దోషులు పాతాళంలో ఉన్నా వెలికితీసి దేశ న్యాయ వ్యవస్థ ముందు నిలబెట్టి, సాధ్యమైనంత కఠినమైన శిక్ష పడేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు.

బలమైన రాష్ట్రాల ద్వారానే బలమైన దేశం ఏర్పడుతుందని, దీనిని వాస్తవ రూపంలోకి తీసుకురావటంలో ప్రాంతీయ మండళ్లు కీలక పాత్ర పోషిస్తాయన్నది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతని హోం మంత్రి అన్నారు. చర్చలు, సహకారం, సమన్వయం, విధాన సమన్వయానికి ప్రాంతీయ మండళ్లు అత్యంత ముఖ్యమైనవి పేర్కొన్న ఆయన.. వీటి ద్వారా అనేక రకాల సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. మహిళలు- పిల్లలపై జరిగే నేరాల విషయంలో వేగంగా న్యాయాన్ని అందించేందుకు, అలాగే పోషకాహార లోపం- పిల్లలు తగినంత ఎత్తు పెరగకపోవడం వంటి సమస్యలను పూర్తిగా నిర్మూలించేందుకు బహుముఖంగా ప్రయత్నాలను కొనసాగించాలని ఆయన ఉద్ఘాటించారు. మహిళలు, పిల్లలపై జరిగే లైంగిక నేరాలు, అత్యాచారాల కేసులను పోక్సో చట్టం కింద వేగంగా దర్యాప్తు చేయటాన్ని ప్రధానంగా ప్రస్తావించిన శ్రీ అమిత్ షా.. ఇటువంటి హేయమైన నేరాలను ఏ నాగరిక సమాజం అంగీకరించదని అన్నారు. మహిళలు, పిల్లల భద్రత తమకు అగ్ర ప్రాధాన్యతగా ఉందని తెలియజేసిన ఆయన.. దీనికోసం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల (ఎఫ్‌టీఎస్‌సీ) సంఖ్యను పెంచాలని సూచించారు.

పేదరికాన్ని నిర్మూలించేందుకు, ఉపాధిని కల్పించేందుకు సహకారం, వ్యవసాయం, మత్స్య సంపద రంగాలు ముఖ్యమైన సాధనాలుగా మారగలవని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అన్నారు. సహకారం, వ్యవసాయం, మత్స్య సంపద ద్వారా పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాల పెరుగుదల జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంత్రమైన ‘సహకార్ సే సమృద్ధి’ని (సహకారం ద్వారా సమృద్ధి) ప్రస్తావించిన ఆయన.. ఉపాధి కల్పించే విషయంలో సహకార రంగానికి అపారమైన సామర్థ్యం ఉందని అన్నారు. స్థూల దేశీయోత్పత్తితో (జీడీపీ) పాటు ఉపాధిని.. ముఖ్యంగా స్వయం ఉపాధిని పెంచటం ద్వారా మాత్రమే మనం అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను సాకారం చేసుకోగలమని అన్నారు. ఒక దేశ సమృద్ధికి జీడీపీ మాత్రమే సూచిక కాదన్న ఆయన.. ప్రతి ఒక్కరూ పేదరిక రేఖకు దాటినప్పుడే నిజమైన సమృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంలోని సహకార మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 57 రకాల పనులు, కార్యక్రమాలను ప్రారంభించిందని ఆయన తెలిపారు. వీటిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (ప్యాక్స్) కంప్యూటరీకరణ, మూడు కొత్త జాతీయ స్థాయి సహకార సంఘాల ఏర్పాటు, త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం ఏర్పాటు వంటివి ఉన్నాయన్నారు. 

వాస్తవానికి ప్రాంతీయ మండలి పాత్ర సలహాలు ఇవ్వటమే అయినా గత దశాబ్దంలో ఇవి కార్యాచరణ-ఆధారిత వేదికలుగా మారాయన్న శ్రీ అమిత్ షా.. ఇది ఫలితాలను కూడా అందించిందని తెలిపారు. సమస్యలను అనుసరించటం ద్వారా రాష్ట్రాల మధ్య, ప్రాంతాలు- రాష్ట్రాల మధ్య, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమస్యలను అంగీకరించటమే కాకుండా.. వాటిని పరిష్కరించేందుకు నిర్దిష్ట మార్గాలను కూడా రూపొందించినట్లు ఆయన తెలిపారు. జాతీయ పురోగతితో పాటు ప్రాంతీయ సామర్థ్యాన్ని సాధించటం, ప్రతి రంగంలో భారత్‌ ప్రపంచ నాయకత్వ స్థానాన్ని పొందటం అనేవి మనకున్న స్పష్టమైన లక్ష్యాలని తెలియజేసిన ఆయన.. ఇవి మనల్ని గొప్ప భారత్‌ నిర్మాణం దిశగా నడిపిస్తాయని పేర్కొన్నారు. జల వనరుల నిర్వహణ, నీటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు అన్ని రాష్ట్రాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని హోం మంత్రి కోరారు. 

2004–2014 కాలంతో పోలిస్తే 2014 నుంచి 2025 వరకు ప్రాంతీయ మండళ్ల సమావేశాల సంఖ్య దాదాపు రెండున్నర రెట్లు పెరిగిందని, ఈ సమావేశాలను అర్థవంతంగా నిర్వహించినట్లు శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. 2004- 2014 మధ్య ప్రాంతీయ మండళ్లు, స్టాండింగ్ కమిటీల సమావేశాలు 25 మాత్రమే జరిగాయన్న ఆయన.. 2014 నుంచి 2025లో ఇప్పటివరకు 64 సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. సమావేశాల సంఖ్య రెట్టింపు అవటం అనేది ప్రధానమంత్రి మోదీ ‘టీం భారత్’ భావనను తెలియజేస్తోందని అన్నారు. ఈ సమావేశాలలో 1600 సమస్యలను చర్చించగా 1303 సమస్యలు (81.43 శాతం) పరిష్కరమైనట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర మండలి కార్యాలయం చురుకైన పాత్ర పోషించడంతో పాటు.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు- విభాగాల సహకారం వల్ల ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. 

వందేమాతర గేయం 150వ వార్షికోత్సవాన్ని అని గుర్తు చేసిన హోం మంత్రి.. శ్రీ బంకిం చంద్ర చటర్జీ గారి ఈ గొప్ప రచన మన దేశ స్వాతంత్య్రం కోసం ఒక నినాదంగా మారిందని పేర్కొన్నారు. గొప్ప భారతదేశాన్ని నిర్మించేందుకు మరోసారి దీనిని నినాదంగా మార్చేందుకు అన్ని రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని  ఆయన అన్నారు. భారత యువజనుల్లో దేశభక్తి విలువలను నింపేందుకు ఇదొక ప్రయత్నమన్న ఆయన.. వందేమాతర గేయం ద్వారా దేశ యువతలో దేశభక్తి స్ఫూర్తిని రగిలించాలని అమిత్ షా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి చేశారు.

మూడు కొత్త క్రిమినల్ చట్టాల గురించి మాట్లాడిన కేంద్ర హోం మంత్రి.. వీటి అమలు చాలా సానుకూల ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. కొత్త చట్టాల ప్రకారం శిక్షల రేటు దాదాపు 25 నుంచి 40 శాతం వరకు పెరిగిందని, దోషులకు సకాలంలో శిక్ష పడుతోందని చెప్పారు. ఈ చట్టాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దర్యాప్తు, ఫోరెన్సిక్ విశ్లేషణ నుంచి మొదలుకొని కోర్టులను ఆన్‌లైన్‌లో అనుసంధానించే వరకు సాంకేతికతను మెరుగుపరచాలని రాష్ట్రాలన్నింటికి హోం మంత్రి సూచించారు. 

చిరుధాన్యాలను ప్రోత్సహించే విషయంలో రాజస్థాన్ చేసిన కృషిని శ్రీ అమిత్ షా అభినందించారు. అన్ని రాష్ట్రాలు చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచాలని ఆయన కోరారు. ప్రతి నెల పేదలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలను అందించే పథకంలో చిరుధాన్యాలను కూడా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల చిరుధాన్యాల ఉత్పత్తి పెరుగుతుందని, కొత్త తరానికి చిరుధాన్యాలు తినే అలవాటు అవుతుందని, ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో సభ్య రాష్ట్రాల సమస్యలతో పాటు అనేక ముఖ్యమైన జాతీయ సమస్యలను కూడా చర్చించారు. మహిళలు, పిల్లలపై జరిగే అత్యాచార కేసుల త్వరిత దర్యాప్తు, సత్వర పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల (ఎఫ్‌టీఎస్‌సీ) ఏర్పాటు వీటిలో ఉంది. దీనితో పాటు ప్రతి గ్రామానికి నిర్ణీత భౌగోళిక పరిధిలో భౌతిక బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావటం.. జల వనరుల పంపిణీ, పర్యావరణం, ఉన్నత విద్య మొదలైన అంశాలు..  అత్యవసర స్పందన సహాయ వ్యవస్థ (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్- ఈఆర్ఎస్ఎస్- 112).. ప్రాంతీయ స్థాయిలో ఉమ్మడి ఆసక్తి కలిగిన ఇతర అంశాలపై చర్చించారు.

వీటితో పాటు ఎజెండాలో ఆరు అత్యంత ముఖ్యమైన జాతీయ అంశాలు కూడా ఉన్నాయి. అవి- పట్టణ మాస్టర్ ప్లానింగ్, విద్యుత్ సరఫరా వ్యవస్థ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను (ప్యాక్స్) బలోపేతం చేయడం,  ‘పోషణ్ అభియాన్’ ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించడం, పాఠశాల చదువులను ఆపేసే వారి శాతాన్ని తగ్గించడం, ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో ప్రభుత్వ ఆసుపత్రుల భాగస్వామ్యం. 

సూరజ్‌కుండ్‌ కేవలం చారిత్రక ప్రాంతమే కాదని.. ఇదొక సుసంపన్నమైన సాంస్కృతిక- కళాత్మక వారసత్వం, ఆర్థిక చైతన్యానికి సజీవ సాక్ష్యమని శ్రీ అమిత్ ‍షా అన్నారు. సూరజ్‌కుండ్ నేల, సూర్య నారాయణుడు చేసిన భగీరథ ప్రయత్నాలు మనకు స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. సాక్షాత్తు శ్రీ కృష్ణుడే దివ్యమైన నోటితో మొట్టమొదటగా భగవద్గీతను ఇక్కడ ఉపదేశించారని.. సింధు లోయ ప్రాచీన నాగరికతకు సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ లభించాయని ఆయన అన్నారు. గొప్ప సిక్కు గురువుల భూమి హర్యానా, పంజాబ్‌లని అన్న ఆయన.. సిక్కు గురువులు దేశంలో కేవలం ఆధ్యాత్మిక చైతన్యాన్ని బలోపేతం చేయటమే కాకుండా దేశ గౌరవం- స్వాతంత్య్రం కోసం అపారమైన త్యాగాలు కూడా చేశారని అన్నారు. గురు తేగ్ బహదూర్ లేకపోయి ఉంటే ఇవాళ దేశం మౌలికమైన సంప్రదాయాల ఆధారంగా ముందుకు సాగి ఉండేది కాదని అమిష్ షా పేర్కొన్నారు. గురు తేగ్ బహదూర్ చేసిన గొప్ప త్యాగం, పదో గురువు చేసిన త్యాగం దేశానికి గొప్ప బలాన్ని ఇచ్చి, పోరాట మార్గాన్ని చూపాయని ఆయన అన్నారు.

 

***


(Release ID: 2191080) Visitor Counter : 5