ఉప రాష్ట్రపతి సచివాలయం
హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ పురస్కారాలు 2025 ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్
రామోజీరావు దార్శనికత్వం కలిగిన జాతి నిర్మాత: ఉపరాష్ట్రపతి
వికసిత్ భారత్ 2047కు సహకారం అందించాలని మీడియాను కోరిన ఉపరాష్ట్రపతి
అవాస్తవాలు ప్రచారమవుతున్న ఈ సమయంలో నైతిక విలువలతో కూడిన,
విశ్వసనీయ పాత్రికేయానికి ఉపరాష్ట్రపతి పిలుపు
Posted On:
17 NOV 2025 9:09AM by PIB Hyderabad
తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న రామోజీ ఫిలిం సిటిలో నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ పురస్కారాలు 2025 ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు.
ఏడు విభాగాల్లో రామోజీ ఎక్సలెన్స్ పురస్కారాలను అందించారు: గ్రామీణాభివృద్ధిలో శ్రీమతి అమలా అశోక్ రూయా, యూత్ ఐకాన్‌గా శ్రీ శ్రీకాంత్ బొల్లా, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్ మాధవీ లత గాలి, సామాజిక సేవలో శ్రీ ఆకాశ్ టాండన్, కళలు-సంస్కృతిలో ప్రొఫెసర్ సాతుపాటి ప్రసన్న శ్రీ, పాత్రికేయంలో శ్రీ జయదీప్ హార్దికర్, మహిళా సాధికారతలో శ్రీమతి పల్లవీ ఘోష్ అవార్డులు స్వీకరించారు.
రామోజీ గ్రూపు ఫౌండేషన్ డే, శ్రీ రామోజీ రావు జయంతి సందర్భంగా ప్రదానం చేస్తున్న రామోజీ ఎక్సలెన్స్ పురస్కారాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నానని ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ తెలియజేశారు.
ఆలోచనలను సంస్థలుగా, ఆకాంక్షలను వాస్తవాలుగా మలచిన దార్శనికుడు శ్రీ రామోజీ రావు అని ఆయన కొనియాడారు. పాత్రికేయం, సమాచార రంగంలో మార్గదర్శిగా మాత్రమే కాకుండా.. సమాచారం, సృజనాత్మకత, వ్యాపార శక్తిని విశ్వసించిన జాతి నిర్మాత అని అన్నారు.
ఈనాడు నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు, ఈటీవీ సంస్థల నుంచి ఇతర సంస్థల వరకు శ్రీ రామోజీ రావు భారత పాత్రికేయ, వినోద, వ్యాపార రంగాల్లో విప్లవాత్మక కృషి చేశారని ప్రశంసించారు. సత్యం, విలువలు, నైపుణ్యాల విషయంలో ఆయన కనబరిచిన అచంచలమైన నిబద్ధత దేశవ్యాప్తంగా తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఉత్తమ పనితీరును కనబరిచే, ఇతరులకు స్ఫూర్తి కలిగించే, సమాజంలో సానుకూల మార్పును తీసుకు రాగలిగే వ్యక్తులనూ, సంస్థలనూ గౌరవిస్తూ రామోజీ ఎక్సలెన్స్ పురస్కారాల ప్రదానం చేయడం.. ఆయన అందించిన విశిష్ట వారసత్వానికి గొప్ప నివాళి అని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభంగా పిలిచే పాత్రికేయ రంగం ప్రజలకు సమాచారాన్ని అందించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. అవసరానికి మించిన, నకిలీ సమాచార వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో విశ్వసనీయమైన, నైతికమైన, బాధ్యతాయుతమైన పాత్రికేయానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఉపరాష్ట్రపతి వివరించారు.
ప్రధానమంత్రి నిర్దేశించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా భారత్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కథనాలను అందిస్తూ.. దేశ నిర్మాణంలో పాత్రికేయ సంస్థలు భాగం కావాలన్నారు. సత్యం, నిష్పాక్షిక ధోరణి, న్యాయం మీడియా సంస్థలకు ప్రధానాధారాలుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
భారత్‌ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చడంలో పత్రికలు ప్రధాన పాత్ర పోషించాలని, ఏఐ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో వాస్తవమైన, తప్పుదారి పట్టించే వార్తల మధ్య తేడాను గుర్తించడంలో ప్రజలకు సహాయం చేయాలని స్పష్టం చేశారు.
ఈ పురస్కారాలను అందిస్తున్న రామోజీ గ్రూపును ప్రశంసిస్తూ.. ఇవి జ్ఞాపకాన్ని స్ఫూర్తిగా, వారసత్వాన్ని సదుద్దేశంతో కూడిన చర్యగా మార్చాయని ఉపరాష్ట్రపతి అన్నారు.
పురస్కార గ్రహీతలందరినీ అభినందిస్తూ.. వారిని ఉత్తమ పనితీరుకు మార్గదర్శకులుగా వర్ణించారు. వారి విజయాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయనే విశ్వాసం వ్యక్తం చేశారు.
అసాధారణ విజయాలు సాధించిన వారిని సత్కరించడం మాత్రమే కాకుండా.. సామర్థ్యాన్ని నిజాయతీగా, సదుద్దేశంతో వినియోగించినప్పుడు.. అది దేశానికీ, మానవాళికీ మేలు చేస్తుందనే నిత్య సత్యాన్ని ఈ సాయంత్రం తెలియజేస్తుందంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర బొగ్గు, గనుల మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వీ రమణ, రామోజీ గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సీహెచ్ కిరణ్, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2191022)
Visitor Counter : 2