రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్ భవన్‌లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ఛాంపియన్లు ప్రతీకా రావల్, రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ్ రాణా
భారతీయ రైల్వే స్టార్ క్రికెటర్ల స్ఫూర్తిదాయక ప్రయాణం,
మైదానంలో వారి అద్భుత ప్రదర్శనను ప్రశంసించిన కేంద్ర మంత్రి
సాధారణ కుటుంబాల్లోని క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం, ప్రపంచ వేదికపై
రాణించేలా అథ్లెట్లను శక్తిమంతం చేస్తున్న భారతీయ రైల్వే
Posted On:
13 NOV 2025 5:25PM by PIB Hyderabad
ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళా ప్రపంచ కప్-2025లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాటర్ ప్రతీకా రావల్, బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్, ఆల్ రౌండర్ స్నేహ్ రాణాలు ఈ రోజు న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో కేంద్ర రైల్వేలు, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. ఆటలోని ప్రతి కోణానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ముగ్గురు క్రీడాకారిణులు భారత రైల్వేలకు గర్వకారణమైన ఉద్యోగులన్న కేంద్ర మంత్రి... భారత చరిత్రాత్మక ప్రపంచ కప్ విజయం కోసం వారు చేసిన అద్భుత కృషిని అభినందించారు.
ప్రపంచ కప్ గెలిచిన ఛాంపియన్లను కలవడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. భారత మహిళా స్టార్లు తమ ప్రయాణం, మైదానంలో ఎదురైన అనుభవాలను గురించి స్ఫూర్తిదాయకమైన విషయాలను పంచుకున్నారని ఆయన తెలిపారు.
ఢిల్లీకి చెందిన ఓపెనింగ్ బ్యాటర్ ప్రతీకా రావల్ నార్తర్న్ రైల్వేలోని ఢిల్లీ డివిజన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏప్రిల్-2023లో భారతీయ రైల్వేలో చేరారు. ఇటీవలే సీనియర్ క్లర్కుగా పదోన్నతీ పొందారు. ప్రపంచ కప్ లీగ్ దశలో గాయం బారిన పడినప్పటికీ టోర్నమెంట్ ఆసాంతం ఆమె తన సహచరులకు నిరంతరం స్ఫూర్తినిస్తూ మద్దతుగా నిలిచారు. తనదైన శైలి బ్యాటింగ్, కచ్చితత్వంతో ఇన్నింగ్స్‌ను నిర్మించే సామర్థ్యానికి పేరుగాంచిన రావల్... ఆటపై లోతైన అవగాహనతో తన ప్రతిభను మిళితం చేస్తుంది. గత సంవత్సరం చివర్లో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ టోర్నీ ద్వారా అరంగేట్రం చేసినప్పటి నుంచీ... ఆమె ఈ ఫార్మాట్‌లో భారత్ తరపున అత్యంత స్థిరమైన ప్రదర్శన చేసిన వారిలో ఒకరిగా నిలిచారు.
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ నార్తర్న్ రైల్వేలోని అంబాలా డివిజన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిసెంబర్-2020లో భారతీయ రైల్వేలో చేరారు. అప్పటి నుంచి స్థిరమైన మ్యాచ్ విన్నర్‌గా రాణిస్తున్నారు. భారత్ సాధించిన అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇటీవలి ప్రపంచ కప్ సమయంలోనూ కీలకమైన మూడు వికెట్లు తీసుకోవడం ద్వారా భారత్ విజయంలో ఆమె గణనీయమైన ప్రభావం చూపారు. జట్టు చరిత్రాత్మక విజయం తర్వాత భారత తొలి మహిళా ప్రపంచ కప్ విజయంలో ఆమె సహకారాన్ని ప్రశంసిస్తూ తన స్వగ్రామంలో నిర్వహించిన వేడుకల్లో రేణుకను గ్రామస్తులు, స్థానిక అధికారులు ఘనంగా సత్కరించారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన స్నేహ్ రాణా నార్తర్న్ రైల్వేలోని మొరాదాబాద్ డివిజన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 నుంచి భారతీయ రైల్వేతో అనుబంధం కలిగి ఉన్నారు. కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్, నమ్మకమైన మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన ఆమె... టోర్నమెంట్ లీగ్ మ్యాచ్‌లలో కీలక పాత్ర పోషించారు. స్నేహ్ ఆరు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లతో తన ప్రపంచ కప్ పోరును ఘనంగా ముగించారు. ఇందులో తన అత్యుత్తమ గణాంకాలు 2/32 కూడా ఉన్నాయి. బ్యాటింగ్‌తోనూ విలువైన పరుగులు అందించిన రాణా 49.50 సగటుతో 99 పరుగులు సాధించారు.
భారతీయ రైల్వే చాలా కాలంగా దేశంలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించే ప్రధాన కేంద్రంగా ఉంది. భారతీయ రైల్వేకు చెందిన అథ్లెట్లు ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి కీర్తిని తెచ్చిపెడుతున్నారు. రైల్వే క్రీడాకారులు తమ అత్యుత్తమ విజయాలకు గానూ అర్జున అవార్డు, పద్మశ్రీ, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ ద్వారా ప్రపంచ స్థాయి శిక్షణ సౌకర్యాలు, ఉద్యోగ భద్రత, సంస్థాగత మద్దతును భారతీయ రైల్వే అందిస్తోంది. సాధారణ కుటుంబాల్లోని అత్యుత్తమ క్రీడా ప్రతిభను గుర్తించి, ప్రోత్సహిస్తోంది. అర్హులైన క్రీడాకారులు క్రీడల్లో రాణించే అవకాశాన్నీ అందిస్తోంది. స్థిరమైన ఉపాధి, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు, నిరంతర ప్రోత్సాహంతో భారతీయ రైల్వే జాతీయ, ప్రపంచ వేదికలపై రాణించేలా అథ్లెట్లను శక్తిమంతం చేస్తూనే ఉంది.
***
(Release ID: 2190009)
Visitor Counter : 13